11, డిసెంబర్ 2006, సోమవారం

సీతాకోక చిలుక ప్యూపా దశకు పోతూంది

8 కామెంట్‌లు
దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉందట. హఠాత్తుగా దీన్ని ఎలా కనుకున్నాడో తెలియదు గానీ, చాలా గొప్ప సూత్రాన్ని ప్రజల్లోకి వదిలాడు, మన ప్రధానమంత్రి. రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసారో ఏంటో తెలీదు గానీ, ఇంతకు ముందెవరూ చెప్పని కొత్త విషయమిది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలో రానుండడం, అక్కడ ముస్లిము వోట్లు ఎక్కువగా ఉండడం ఈ ప్రకటనకు ముఖ్య కారణమని ప్రతిపక్షాల గోల. రాజకీయుడి గుట్టుమట్లు రాజకీయుడికి ఎరుకే గదా!


పిల్లగా ఉన్నపుడు గాడిద అందంగానే ఉంటుందట. పెద్దయ్యాకే.. వంకరకాళ్ళు, బానపొట్ట, ఇంతబారు చెవులు, చెవులదిరే స్వరమూ వస్తాయట. వంకర మాటలు, వోటుబ్యాంకు రాజకీయాల లాంటివాటిని వంటబట్టించుకుని మన ప్రధాని ఆర్థికవేత్త నుండి పూర్తిస్థాయి రాజకీయుడిగా మారినట్లే కనిపిస్తోంది.

9, డిసెంబర్ 2006, శనివారం

తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు = కరీంనగర్

4 కామెంట్‌లు
కరీంనగర్లో తెరాస గెలుపు కారణంగా తెలంగాణ వస్తుందో రాదో తెలీదు గానీ, తెలంగాణ కావాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారనేది మాత్రం తేటతెల్లమై పోయింది.
కాంగ్రెసు మోసాన్ని, కుటిలనీతిని, మాటలు మార్చే తత్వాన్ని ప్రజలు గ్రహించారు, ఆగ్రహించారు. వారి ధర్మాగ్రహమే నేటి తెరాస విజయం.
కేసీయారు పై ప్రజలకు వల్లమాలిన అభిమానం ఉందో లేదో గానీ, తెలంగాణ కాంక్షించి మాత్రం ఆయనకీ మెజారిటీ ఇచ్చారనేది సుస్పష్టం.
బీజేపీపై అపనమ్మక ముందో లేదో గానీ, తెరాస గెలవకపోతే తెలంగాణ ఏర్పాటు కష్టమౌతుందని బీజేపీని మూలన కూచ్చోబెట్టారు.

గత ఎన్నికల తరువాత కేసీయారు ఏం చేసాడయ్యా అంటే..
- రెండేళ్ళపాటు మంత్రి పదవిలో ఉండి ప్రజలనేమాత్రం పట్టించుకోలేదు
- ఇదుగో తెలంగాణ అదుగో తెలంగాణ అంటూ గడువులూ తేదీలు పెట్టి చివరికి పెదవి విరిచాడు
- నిరాహారదీక్ష అంటూ ప్రహసనం చేసాడు
పత్రికల్లో, టీవీల్లో ఒక్కరికి కూడా కేసీయారుపై సానుకూలత లేదు
ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత గత స్థానిక ఎన్నికల్లోనే తెలిసింది.

మరి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా కేసీయారు ఇంత అద్భుతంగా ఎలా గెలిచాడు?
కేసీయారుకు వోటెయ్యకపోతే తెలంగాణ కు వ్యతిరేక వోటు అవుతుందని ప్రజలు తలచారు. కేసీయారే కాదు, ఇంకెవరినైనా ఇలాగే గెలిపించేవారేమో!!
ప్రజల విజయమిది. తెలంగాణ కావాలని ప్రజలింత గట్టిగా గత ఎన్నికలలో కూడా అడగలేదు!

కరీంనగరే యావత్తెలంగాణా అభిప్రాయానికి కొలబద్దా అనే ప్రశ్నకు.. కరీంనగర్లో ప్రజలనుకుంటున్నది మిగతా తెలంగాణలోనూ అనుకోవడంలో అసహజమేముంది? కొన్ని ప్రాంతాల్లో ఇంత బలంగా అనుకోకపోవచ్చు, కొన్ని చోట్ల ఇంతకంటే బలవత్తరంగా కాంక్షించనూ వచ్చు. ఏదేమైనా, ఈ ఎన్నిక ఫలితం ప్రజల్లో తెలంగాణ కావాలన్న కోరికను మరింతగా పెంచుతుందనేది మాత్రం సత్యం.

తెరాస తెలంగాణ తెస్తామని అంటోంది, అదొక్కటే మా ఎజెండా అని అంటోంది. మంచిదే!
తెలుగుదేశం, కమ్యూనిస్టులు తెలంగాణకు వ్యతిరేకమంటున్నారు. ఆచరణలోనూ చేస్తున్నారు. తమ విధానం ఇదీ అని బయటికి చెప్పేస్తున్నారు, బానే ఉంది !
కానీ కాంగ్రెసో..?
తెలంగాణ కావాలంటోంది, కానీ ఇవ్వడంలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు కలిసిరావడం లేదంటూ దొంగమాటలు చెప్పింది. వాళ్ళసలు కలిసివస్తామని ఎప్పుడు చెప్పారు? కలుస్తానంటున్న బీజేపీని కాదంటోంది. ఇప్పుడు, కరీంనగర్లో కన్ను లొట్టబోయాక, దిగ్విజయ్ ఏమంటున్నాడు.. తెలంగాణ కావాలంటే రెండో ఎస్సార్సీ వెయ్యాల్సిందే. (నిజానికి 2004 ఎన్నికలకు ముందు వాళ్ళు తెరాసతో చేసుకున్న ఒప్పందమిదే, కానీ ఇంత గట్టిగా ఎప్పుడూ చెప్పలేదు, నానుస్తూనే ఉండేవారు) పైగా ఎస్సార్సీ వెయ్యాలన్నా ఏకాభిప్రాయం కావాలని అంటున్నాడు!

కాంగ్రెసు ఏనాడూ నమ్మదగ్గ పార్టీ కాదు. జవహర్‌లాల్ నెహ్రూ గురించి తెరాస నాయకులు ఓ విషయం చెబుతూ ఉంటారు.. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేటపుడే నెహ్రూ ఇలా అన్నాడట, "గడుసు ఆంధ్రకు అమాయక తెలంగాణను ఇచ్చి పెళ్ళి చేస్తున్నాను, ఎప్పుడు నచ్చకున్నా తెలంగాణ విడాకులు తీసుకోవచ్చు" అని. అది నిజమో కాదో తెలీదు (ఎందుకంటే, ఉద్యమ ప్రస్థానంలో తెరాస నాయకులూ, వారి వంతగాళ్ళూ ఎన్నో అబద్ధాలను వ్యాపింపజేసారు) నిజమే అయితే..
పెళ్ళి రోజే, స్వయానా పెళ్ళి పెద్దే విడాకుల దీవెనలిస్తాడా? అసలదేం నీతి? బ్రిటిషు వాళ్ళు దేశాన్ని చీల్చి వెళ్తే, ఈయన రాష్ట్రాన్ని చీల్చదలచిన వారికి ఓ కారణాన్ని ఇచ్చిపోయాడు. అసమానతలు ఏర్పడకుండా ఖచ్చితమైన నిబంధనలు ఏర్పాటు చెయ్యొచ్చు కదా. చెయ్యాల్సిన బాధ్యత, చెయ్యగల అధికారమూ గల పదవిలోనే ఉన్నాడు కదా. రాష్ట్రం ఏర్పడ్డాక, ఎనిమిదేళ్ళ పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆ నిబంధనలు సరిగా అమలు జరిగేటట్లు చూడొచ్చు కదా. పైగా ఇక్కడ ప్రభుత్వం చెలాయిస్తున్నది ఆయన పార్టీయే! అయినా కూడా, సంయుక్త రాష్ట్ర తొలిముఖ్యమంత్రే ఉప ముఖ్యమంత్రిని నియమించక, పెద్దమనుషుల ఒప్పందాన్ని అతిక్రమించినపుడు ప్రధానమంత్రిగా ఉండీ, ఆయనేం చేస్తున్నట్లు?

నెహ్రూ గురించి ఎందుకు చెబుతున్నానంటే, కాంగ్రెసు నాయకుల సంగతులిలా ఉంటాయని చెప్పేందుకే. మోసం వారి నైజం. గత రెండున్నరేళ్ళుగా వాళ్ళు తెలంగాణకు, తెరాసకు చేసిందిదే! ప్రజలకీ మోసం కళ్ళక్కట్టింది. కోపగించారు. తెలంగాణ సెంటిమెంటు ఎంతుందో యాంటీ కాంగ్రెసు సెంటిమెంటూ అంతుంది! కాంగ్రెసు వాళ్ళీ రకంగా పచ్చి మోసం చెయ్యకపోయి ఉంటే కేసీయారు నేడింత అద్భుతంగా గెలిచి ఉండే వాడు కాదు.

7, డిసెంబర్ 2006, గురువారం

మార్గదర్శి

4 కామెంట్‌లు
మార్గదర్శిది తప్పని రిజర్వు బ్యాంకు తేల్చేసింది. అందులో డబ్బు పెట్టిన వారికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేం లేకపోవచ్చు. కానీ, మార్గదర్శి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినట్లుగా ఋజువైంది. ఒకటీ రెండూ కాదు, 2200 కోట్ల రూపాయలు ప్రజల దగ్గరి నుండి సేకరించింది. నిబంధనలకు వ్యతిరేకంగా చెయ్యడం అనైతికతే కాదు, నేరం కూడా.

సేకరించిన డబ్బులను సకాలంలో తీర్చెయ్యాలని ఆదేశించింది, బానే ఉంది. కానీ అసలు సేకరించడం తప్పు గదా, దానిపై చర్యలేం తీసుకుంటుందో చూడాలి. అసలిన్నాళ్ళుగా ఈ విషయం బ్యాంకు దృష్టికి రాకపోవడమే ఆశ్చర్యం. ఇదివరలో ఒకాయనెవరో ఫిర్యాదు చేసారట కూడాను. అయినా చర్యలేం తీసుకోలేదు. అప్పుడెందుకు తీసుకోలేదు? అంతా మాయ, రాజకీయ మాయ.

ఒకటి మాత్రం వాస్తవం, మార్గదర్శి మన దగ్గరి నుండి డబ్బులు తీసుకోకూడదు. కానీ తీసుకున్నారు, తప్పు చేసారు. ఇంత ఇరకాటపు పరిస్థితుల్లో కూడా మార్గదర్శులు జోకులేసి, కామెడీ చేసారు చూడండి..
  • రిజర్వు బ్యాంకు వాళ్ళు 'ఏమయ్యా మీరు ఇలా డబ్బులు తీసుకోకూడదు కదా, ఎందుకు తీసుకున్నారు' అని అంటే 'సారీ, మాకు తెలియక చేసాం' అని అన్నారట. (మార్గదర్శికి మార్గం తెలియలేదు!!)
  • రిజర్వు బ్యాంకు మమ్మల్ని డిపాజిట్లు తీసుకోవద్దని ఆదేశించలేదు, సూచించారంతే అని అంటోంది మార్గదర్శి (దానికి బ్యాంకు వాళ్ళు.. సూచనో ఆదేశమో ఎలా అనుకుంటారో వాళ్ళిష్టం. దాన్ని మాత్రం పాటించాల్సిందే అని అన్నారట)

తన ఉద్దేశ్యం ఏదైనా, ఉండవల్లి చేసిన పని వలన ఒక తప్పు బయట పడింది. లేకపోతే బహుశా రిజర్వు బ్యాంకు రిజర్వుడు గానే ఉండి పోయేదేమో!

మరి, ఈనాడును నియంత్రించాలన్న కాంగీయుల కాంక్ష నెరవేరేనా!? అనుమానమే, రామోజీ గ్రూపు బయటి పెట్టుబడులను తీసుకోబోతోందని దట్స్ తెలుగు అంటోంది.

సామాన్యుడి కాంక్ష.. ఈటీవీలో సుమనోత్సాహాన్ని కూడా నియంత్రించే సంస్థ ఒకటుంటే బాగుంటుంది.

5, డిసెంబర్ 2006, మంగళవారం

సడిసేయకో గాలి సడిసేయబోకే..

6 కామెంట్‌లు
జోల పాటలు, లాలి పాటలు, మేలుకొలుపు పాటలూ ఉన్నాయి. ఇది జోలకూ మేలుకొలుపుకూ మధ్య లోని పాట.. మెలకువ రాకుండా పాడే పాట!

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..

రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..


నాకెంతో ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి; రాజమకుటం సినిమాలోది. అలికిడైతే తన స్వామికి మెలకువ వచ్చేస్తుందేమోనని గాలిని కదలొద్దని అదిలిస్తోందీవిడ! నిదుర చెదరిందంటే నేనూరుకోనే అంటూ హెచ్చరిస్తోంది! "మణి కిరీటము లేని మహరాజు గాకేమి" తరువాత, "పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే" తరువాతా వచ్చే సన్నాయి వాదన.. పాటకెంత సొగసునద్దిందో! మంచి పాట!!


powered by ODEO

26, నవంబర్ 2006, ఆదివారం

వినుడు వినుడు వీనుల విందుగా..

11 కామెంట్‌లు
ఇక నా బ్లాగును చదవడమే కాదు, విననూ వచ్చు. దీని గురించి తెలియజెప్పి నేర్పించిన శోధన సుధాకర్, అమెరికా నుండి.. వైజాసత్య కు కృతజ్ఞతలతో.. వాళ్ళ లింకుల్లో ఈ ఆడియో బ్లాగు ఎలా పెట్టాలో చాలా వివరంగా ఉంది. అవి చదువుకుని ఎవర్నీ అడక్కుండా మనమే మోత మోగించవచ్చు.

ఇదిగో నా మొదటి పాట. మరిన్ని పాటలు త్వరలో.. (మీరు వినాలే గానీ ప్రస్తుతం రాసేదంతా మాట్లాడి, ఆడియో బ్లాగుగా పెట్టేయనూ!?)

powered by ODEO

మీరూ మోగించండి, మరి!

25, నవంబర్ 2006, శనివారం

కొన్ని హాస్య వార్తలు

4 కామెంట్‌లు

నవంబరు 24 న ఓ రెండు హాస్య వార్తలొచ్చాయి. నవ్వు తెప్పించే వార్తలు రోజూ వస్తూనే ఉంటాయి గానీ, అవి ప్రధాన వార్తలు కావడమే ఆనాటి విశేషం .

మన క్రికెట్టు టీము దక్షిణాఫ్రికాతో చిత్తుగా ఓడిపోవడం మన ఎంపీలకు మింగుడు పడలేదు. ఇదివరలో ఇలా భయంకరంగా ఓడిపోయినా ఎంపీలు నోరు మెదిపేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రం తలో మాటా అందుకున్నారు. నోరు తెరిచేందుకు ఒక్కొక్కళ్ళకు ఒక్కో కారణం ఉంది. వాళ్ళేమన్నారో చూద్దాం..

గంగూలీని తీసుకుంటే ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదా అని సీపీఎం గోస. (ఎప్పుడో వచ్చేది కామోసు!)
చాపెల్ రాజీనామా చెయ్యాలి. (ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు ఒక్కడే రాజకీయుడు... అప్పుడు కోచిగా కూడా రాజకీయుడే అవ్వచ్చని వీళ్ళ ఎత్తు!)
శరద్ పవార్ రాజీనామా చెయ్యాలి. (సరే, ఇది మామూలు డైలాగే ననుకోండి)
ఇక ఈ డిమాండ్లన్నిటికీ బాబులాంటిది రాందాస్ అథవలే గారిది.. భారత క్రికెట్టు జట్టులో రిజర్వేషన్లు పెట్టాలి అని
అర్జున్ సింగు పుణ్యమా అని ఆ మధ్య రిజర్వేషన్ల రగడ రేగినపుడు అనేక ఛలోక్తులు, వ్యంగ్య విమర్శలు వచ్చాయి. వాటిలో క్రికెట్టు రిజర్వేషన్లు కూడా ఒకటి. ఆ డిమాండు నిజంగానే చేసి, అథవలే గారు ఆ వ్యంగ్యకారులను వ్వె వ్వె వ్వె అని వెక్కిరించబూనారు. శభాష్ రాందాస్!!

ఇక రెండోది.. ఇక్కడ హీరో మరో రాందాస్. తెలుగు కాంగ్రెసు నాయకులకు వెలిగించకుండానే బీడీతో వాతలు పెట్టాడు. బీడి కట్టల మీద పుర్రె గుర్తు గురించి సానుకూల స్పందన వస్తుందని ఆశించి, కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రాందాసు దగ్గరికి విలేకరులను తీసుకుని వెళ్ళారట పనబాక లక్ష్మి, గిరీష్ సంఘీ, సర్వే సత్యనారాయణ మొదలైన వారు. అక్కడ అన్బుమణి రాందాసు కత్తి రాందాసై పోయి, పుర్రె గుర్తు ఉండి తీరుతుందని వాళ్ళ మాడు పగిలేలా విలేకరులకు చెప్పాడట. (అవును మరి, ఏఐఐఎమ్మెస్ వ్యవహారంలో తెలుగు వాడైన రాజగోపాలుతో పెట్టుకుని రాందాసుకు మాడు పగల్లేదూ మరి! ఆ కసి వీళ్ళ మీద తీర్చుకున్నట్టున్నాడు.)

దానితో బిత్తరపోయిన మనవాళ్ళు, విలేకరులను హడావుడిగా పనబాక లక్ష్మి ఆఫీసుకు తీసుకుపోయి అక్కడో సమావేశం పెట్టారట. బీడిలు సిగరెట్లంత ప్రమాదకరం కాదని వాళ్ళు విలేకరులకు చెప్పబోయేసరికి, అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి, అబ్బెబ్బే అదేంకాదు అన్నీ చెడే, పొగాకు ఎక్కడైనా పొగాకే అని ఎదురు తిరిగారట. వీళ్ళ మాయమాటలను తేటతెల్లం చేసేలా ఆమె ఇంకా చెప్పబోతూంటే ఇంక ఆపమంటూ మల్లు రవి ఆవిడకు దణ్ణం కూడా పెట్టాడట!

మన ఆసిగాళ్ళు (హాస్యగాళ్ళు) ఢిల్లీలో కూచ్చుని చేసే నిర్వాకాలు ఇవి.

23, నవంబర్ 2006, గురువారం

ప్చ్..

2 కామెంట్‌లు
ఏంటో ఈ రాజకీయులు..
"చెప్పింది చెయ్యకపోతే మమ్మల్ని కొట్టండి, చంపండి" అంటారు..
కానీ ఎప్పుడు చూసినా చుట్టూ పోలీసులూ, భద్రతాను!
మరి కొట్టేదెట్లా, చంపేదెట్లా!?
ఏంటో ఈ రాజకీయులు.. వాళ్ళ పని వాళ్ళు చెయ్యరు, మన పని మనల్ని చెయ్యనివ్వరు!

20, నవంబర్ 2006, సోమవారం

బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం

11 కామెంట్‌లు
మన ఎన్నికలలో మామూలు విషయాలకు కూడా కొత్త అర్థాలు వస్తూంటాయి. ఏ ప్రాముఖ్యతా లేని మామూలు విషయాలను మన రాజకీయులు పెద్దవి చేసి ప్రజల సానుభూతిని, తద్వారా ఓట్లను కొల్లగొట్టే ఆలోచనలు చేస్తుంటారు. కరీంనగరు, బొబ్బిలి ఎన్నికల్లో కూడా ఇలాంటి రెండు విషయాలు పైకి తేలాయి.

కరీంనగరు ఎన్నికకు వస్తే... వెంటనే గ్రహించేసి ఉంటారు - బీడీల గురించి అని. ఈ ప్రాంతంలో బీడీ ఆకు (తునికాకు) ఏరుకుని బీడీలు చుట్టి అమ్ముకునే కార్మికులు ఎక్కువ. బీడీ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరికగా బీడీ కట్టపై పుర్రె బొమ్మను ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయోజనం శూన్యమైనా, మనకీ నిర్ణయంలో తప్పైతే ఏమీ కనబడదు. (మీక్కనబడితే ఏమిటో వ్యాఖ్యలో రాయగలరు.)

మన ముఖ్యమంత్రి కరీంనగరు పర్యటనకు వెళ్ళినపుడు దీని ప్రస్తావన తెచ్చి, కేసీయారు కార్మిక మంత్రిగా ఉంటూ కూడా దీన్ని ఆపలేదు, అసలు దీనికి ఆయనే కారణం అంటూ విమర్శించి, బీడీని ఎన్నికలలో ప్రచారాంశం చేసేసాడు. అందుకు కేసీయారు ఊరుకుంటాడా!? మీరే దీనికి కారణం, మీ మంత్రి పనబాక లక్ష్మియే దీనికి కారణం అంటూ ఎదురుదాడి చేసాడు. ఇక ఒకరి తరువాత ఒకరు రంగంలోకి దిగి యథాశక్తి తిట్టుకోడం మొదలుపెట్టారు. పాపం బీడీ కార్మికులు అప్పటిదాకా దాన్ని పట్టించుకున్నారో లేదో గానీ ఆ తరువాత మాత్రం ప్రచారానికొచ్చిన రాజకీయులను ప్రశ్నించడం మొదలెట్టారు. ఇదెలా తయారయిందంటే కేంద్రం చేసిన ఈ నిర్ణయం తప్పని చివరకు కాంగ్రెసు, తెరాస కూడా అంటున్నాయి. వెచ్చగా తాగుదామని బీడీ వెలిగించుకుంటే, అది చకచకా కాలి, చూసుకునే లోగానే మొదలంటా కాలి వేళ్ళను చుర్రుమనిపించినట్లయింది, కాంగ్రెసు, తెరాస పరిస్థితి. అప్పనంగా బీడీ దొరికింది గదాని, తెదేపా కూడా బీడీ తాగడానికి ఉత్సాహపడుతోంది.

కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం తప్పని స్వయంగా అదే పార్టీకి చెందిన (అందునా కాంగ్రెసు పార్టీ) ముఖ్యమంత్రే బహిరంగంగా అన్న ఘటన, స్వయంగా ఆ కేంద్ర మంత్రివర్గంలోనే సభ్యురాలైన మంత్రి కూడా అన్న ఘటన మనమెప్పుడు చూసాం? ఈ బీడీ వార్తలు చదూకోడానికి సరదాగా ఉన్నాయి. పనబాక లక్ష్మి అప్పజెప్పిన ఓ డైలాగు మాత్రం ఈ నాటకానికంతటికీ హైలైటు.. నాలాంటి దళితనేతపై దొర చేస్తున్న అహంకార పూరిత విమర్శ అంటూ కేసీయార్ విమర్శ గురించి ఆమె వాపోయింది. సానుభూతి కోసం వాడే ఈ డైలాగు ఎవరుబడితే వారు తెగ వాడడంతో మరీ అరిగి, చిరిగి పోయింది.

ఇక బొబ్బిలిలో.. వోక్సు వాగను ఇక రానట్లే నంటూ ఈనాడులో వార్త రావడం బొత్స సత్యనారాయణకు కాస్త తలనెప్పి అయింది. వోక్సు రానందుకు కాదు.. ఎవరో తెలీని వాడికి డబ్బులిచ్చారు కదా -అందుకు, జర్మనీకి తన తమ్ముడిని తీసుకెళ్ళాడు కదా -అందుకు, మరిప్పుడేమో బొబ్బిలిలో నిలబెట్టింది స్వయానా తన భార్యనే కదా - అందుకు, మొత్తం తన వాళ్ళతోటే జిల్లా రాజకీయాలను నింపేస్తున్నాడనీ, అందరూ కలిసి దోచుకుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తారు కదా- అందుకు. ఈ వ్యవహారంలో బొత్స సత్యనారాయణ గారి పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించి ఎన్నికలలో లాభం పొందాలని తెదేపా భావిస్తుంటే బొత్స దాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ఎత్తెత్తాడు. ఈనాడులో ఆ వార్త రాగానే ఆ పేపరుపై దాడికి దిగి, తన భాషను, తన యాసను గేలి చేస్తూ రాసింది, ఇది ఆ ప్రాంత ప్రజలను వారి యాసను అవమానించడమే నంటూ ప్రాంతీయ సెంటిమెంటును గిల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

గాల్లోంచి శివలింగాలను సృష్టించే వాళ్ళు కొందరైతే ఆ గాలి కూడా లేని శూన్యంలోంచి కూడా ఎన్నికల ప్రచారాంశాలను సృష్టించగలరు మనవాళ్ళు. మనమీ ఐటీలు, ఐఐటీల ద్వారా ప్రపంచంలో వెలుగులోకి రాకముందు, పాశ్చాత్య దేశాల్లో భారతదేశమంటే పాములాడించేవాళ్ళే మదిలో మెదిలే వారంట.. ఆయా దేశాల్లో కూడా రాజకీయులు కొద్దో గొప్పో మనవాళ్ళ స్థాయిలోనే ఉంటారు కాబట్టి గానీ, లేకపోతే పాములాళ్ళ స్థానాన్ని వీళ్ళెప్పుడో ఆక్రమించేవాళ్ళు.

19, నవంబర్ 2006, ఆదివారం

వోక్సూ పోనాదండి

2 కామెంట్‌లు
ఇక తేలిపోయింది. వోక్సువాగను పోయింది. వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీకిచ్చిన 11 కోట్లూ పోయాయి.

రాష్ట్రానికి అప్రదిష్ట మిగిలింది, బొత్స సత్యనారాయణ మిగిలాడు. ఆయనకు మంత్రి పదవి మిగిలింది. తమ్ముడితో కలిసి ఆయన చేసిన జర్మనీ పర్యటన మిగిలింది. ఆయనకి ఇంకా ఏమేం మిగిలాయో తెలీదు. ఆ 11 కోట్లూ ప్రభుత్వం ఎవరికిచ్చిందో గానీ, ఐపూ అజా లేవు.

ఈ వోక్సు వాళ్ళ పద్ధతేమి బాగాలేదు. కర్మాగారం పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చుట్టూ తిప్పుకుని చివరికి మొహం చాటేసారు. కొందరు అధికారులు, అనధికారులు, మంత్రులు, అమంత్రులు వ్యవహారాన్ని సరిగా నిర్వహించలేదు గానీ మొత్తమ్మీద రాష్ట్రం దీనికోసం ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నమ్మకం లేని కంపెనీల కోసం రాష్ట్రాలు తమలో తాము పోటీ పడితే వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీలకు దూరంగా ఉంటే మంచిదేమో!

అయితే ఇక్కడో చిక్కుంది. ఇలాంటి వ్యవహారాలు లేకపోతే తమ్ముళ్ళనీ, బామ్మర్దులనీ విదేశాలకు పంపడం కుదరదు. పైగా 11 కోట్లు ఎవరికో ఇచ్చేసి, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట అని అడిగే అవకాశమూ ఉండదు.

సొమ్ములు పోనాయండి, వోక్సూ పోనాదండి!

17, నవంబర్ 2006, శుక్రవారం

గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం

3 కామెంట్‌లు
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలదే రాజ్యం అయిపోయింది. అక్కడ హీరో మేరునగధీరుడు. మిగతా వారంతా పిపీలికాలే.. చివరకు వాళ్ళకు తిండి పెట్టే నిర్మాతతో సహా! ఈ విషయంపై ఓ పెద్దమనిషి నోరు విప్పాడు. తెలుగు సినిమా దిగ్గజమూ, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతా అయిన గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏదో టీవీకి చెప్పిన మాటలను దట్స్ తెలుగు వెబ్సైట్లో పెట్టారు. దాన్ని ఇక్కడ చూడొచ్చు: http://thatstelugu.oneindia.in/cinema/avi/spb-on-telugu-heroes.html

బాలు చేసిన కొన్ని వ్యాఖ్యలు: "నిర్మాత తర్వాతే ఎవ్వరైనా అనే స్ప­ృహ పోయిందిప్పుడు. సినిమా కేవలం హీరోల మాధ్యమమే కాదు. ఒక లైటుబాయ్ లేకపోయినా ఆ రోజు షూటింగ్ నడవదు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుంది. కేవలం తమ వల్లనే సినిమాలు ఆడుతున్నాయి అని ఈ హీరోలు అనుకుంటే అది భ్రమే అవుతుంది."

బాలు ఇంకా ఇలా అన్నారు: "అక్షరం ముక్క రాయలేని వారు సైతం రచయితలు అయిపోతున్నారు. ఉచ్చారణ లేనివాళ్లు నటులవుతున్నారు. భాష తెలియని వారు, పరభాషా నటీనటులు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేస్తున్నారు. సరిగమలు రానివారు సంగీత దర్శకులైపోతున్నారు. శ్రుతి శుద్ధి లేనివారు గాయకులవుతున్నారు.''

తామేం చెయ్యాలో తెలియని వారేం కాదు మన నిర్మాతలు; చెయ్యరంతే! డబ్బింగు సినిమాలను నిషేధిస్తేనో, సినిమా ఎలా ఉన్నా చూసి చావాల్సిందేనని నిర్బంధిస్తేనో సినిమాలు ఆడవు. మంచి సినిమాలు తీసేందుకు మంచి రచయితలు, దర్శకులు, సాంకేతికులు, కళాకారులు కావాలి.. స్టారులు, రత్నాలు, సామ్రాట్టులూ కాదు. మన నిర్మాతలు ఎప్పుడు ఆచరిస్తారో!


శభాష్ బాలూ! హిపోక్రసీకి నెలవైన సినీపరిశ్రమలో ఈ మాత్రం మాట్టాడ్డమంటే ఓ రకంగా సాహసమే!

16, నవంబర్ 2006, గురువారం

అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా...

7 కామెంట్‌లు
జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో కావాలని, మంచి ప్రణాళికాబద్ధంగా చేసినట్లుగా ఉంటాయి. కొన్ని సంతోషంతో గుండె ఝల్లుమనిపిస్తాయి, మరికొన్ని చెంప ఛెళ్ళుమనిపిస్తాయి. ఈ రెండో రకం యాదృచ్ఛికాలు బహు ప్రమాదకరమైనవి. ఏదో కాకతాళీయంగా జరిగాయిలే అని అనుకోకపోతే నిదరపట్టదు మనకు..

నా బ్లాగులోదే ఒక ఉదాహరణ రాస్తానిక్కడ..

"తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు" అనే నా గత జాబుకు కొన్ని స్పందనలు వచ్చాయి. వాటిలో మొదటి రెంటినీ చూద్దాం..
మొదటిది..
"చాలా బాగా వ్రాశారు, ఈ రచనతో కనకదుర్గ గారు మూర్ఖత్వానికి ఒక ఉదాహరణ అయ్యారు. అయినా ఆంధ్రజ్యోతి సంపాదకులు యధవలు కాబట్టె ఇలాంటి మూర్ఖుల రచనలు ప్రచురిస్తున్నారు."

ఇక రెండో వ్యాఖ్య చూడండి.

"అంధ్ర జ్యోతికి పంపండి. ఈ ప్రతిస్పందనను తప్పక అచ్చేసుకొంటారు." :-((

ఈ రెండు వ్యాఖ్యల్నీ ఒక్కసారే చూసాను. మొదటిది చూసాక సహజంగానే సమ్మగా అనిపించింది. రెండోది చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ రెండు స్పందనల మధ్య తేడా కేవలం రెండే నిమిషాలు కాబట్టి అవి కాకతాళీయంగా రాసిన వ్యాఖ్యలేనన్న విషయం అర్థమై, ఉపశమనం కలిగింది.

అందుకే నిదురపోగలిగాను రాత్రి.

14, నవంబర్ 2006, మంగళవారం

తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు

16 కామెంట్‌లు
ఆంధ్రజ్యోతిలో కనకదుర్గ దంటు గారు రాసిన వ్యాసం చదివి నేనీ స్పందనను రాస్తున్నాను. ఆ వ్యాసంలో ఆమె చాలా అవాస్తవాలను రాసుకు పోయారు. తెలుగు అనే మాట తెలంగాణ వాళ్ళదనీ, ఆంధ్ర ప్రాంతం వారికి దానితో అసలు సంబంధమే లేదనీ ఆవిడ వాదించారు. ఇంత పరమ మూర్ఖపు వాదనను చదివాక నా స్పందనను రాయకుండా ఉండ లేకపోతున్నాను. ఇక ఆంధ్ర అనేమాటను ఆమె కోస్తా, రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వాడారు. నా దృష్టిలో అది తప్పైనా, వాదన కోసం నేనూ అదే వాడాను.

11, నవంబర్ 2006, శనివారం

తెలుగు సినిమాలను ఆడించేందుకు కొన్ని చిట్కాలు

2 కామెంట్‌లు
డబ్బింగు సినిమాలు తియ్యకూడదట! తెలుగు సినిమా నిర్మాతలు ఆంక్షలు పెడుతున్నారు. పాపం వీళ్ళు తీసే అద్భుత చిత్ర రాజాలు దిక్కు లేకుండా పోతున్నాయట! మీరొప్పుకోరేమో గానీ నేను మాత్రం వాళ్ళతో ఏకీభవిస్తాను. ఎందుకంటే మురికి వెధవలైనా, గబ్బు కొడుతున్నా మనవాళ్ళన్నాక మనం వాటేసుకోవాలి మరి. మనమే వద్దనుకుంటే అనాధలై పోరూ పాపం!

అంచేత తెలుగు సినిమా నిర్మాతలూ! తెలుగు జనం మీ ముష్టి సినిమాలు తప్ప మరోటి చూసే అవకాశమే లేకుండా చెయ్యడానికి నేను మరికొన్ని ఉపాయాలు చెబుతాను, హాయిగా కాపీ కొట్టుకోండి. (మీకలవాటేగా!) డబ్బింగు నిషేధం డిమాండు కూడా కాపీయే కదా - కన్నడిగులు పరభాషా సినిమాలు వద్దని ఒకప్పుడు గోల చేసారు, దాన్నే కాపీ కొట్టి, మరింత ముందుకు తీసుకుపోతున్నారు, మీరు. భేషో! ఇక నా అవిడియాలు..

  1. ఈ తమిళ, మలయాళ సినిమాల వాళ్ళని "మీరిలా మంచి సినిమాలు తీస్తే కుదరదు, మాలా అణాకానీ సినిమాలే తియ్యాల"ని డిమాండు చెయ్యండి. లేకపోతే తగువేసుకోండి. తప్పేంలేదు, మన ప్రయోజనాలు మనకు ముఖ్యంగానీ, ఎవ్వడేమనుకుంటే మనకెందుకు?
  2. ప్రతి తెలుగు వాడూ కనీసం వారానికో తెలుగు సినిమా చూసి తీరాలని డిమాండు చెయ్యండి.
  3. ఎవరైనా "తీరిక లేని పనుల్లో ఉన్నాను", లేక "సినిమా చూసి తలనెప్పి తెచ్చుకోలేను, వదిలెయ్యండ"ని సిగ్గువిడిచి బతిమాలుకున్నా, వదలొద్దు. అలాంటి వారి కోసం రోడ్ల కూడళ్ళ వద్ద చందా డబ్బాలుపెట్టండి.. టిక్కెట్టు డబ్బులు అందులో వేసిపోతారు. తీరిగ్గా అది మీరంతా పంచుకోవచ్చు. తప్పేం లేదు.., వినాయకచవితి చందాల దందా లాంటిదే ఇదీను.
కొంత మంది ఉచిత సలహాలు పారేస్తా ఉంటారు.. "మీరూ మంచి సినిమాలు తియ్యొచ్చు కదా" అని, అదేదో తేలికయినట్లు. అలాంటివేమీ పట్టించుకోకండి. అయినా మంచి మంచి సినిమాలనే కదా మీరు కాపీ కొడుతున్నది? కాకపోతే మన ఫార్ములాలోకి మారుస్తున్నారు, అంతే. అవి జనానికి నచ్చకపోతే మీరేం చేస్తారు?

మనలో మనమాట! కొందరు రంధ్రాన్వేషకులుంటారు.. మీరు తీసే సినిమాల్లో కూడా హీరోయినూ, విలనూ (కొండొకచో హీరో కూడా) తెలుగు రాని వాళ్ళేగా. వాళ్ళ కోసం డబ్బింగు చెప్పిస్తున్నారు, మరి ఈ లెక్కన మీవీ సగం డబ్బింగు సినిమాలే కదా అని అడగొచ్చు. మీరలాంటివేమీ పట్టించుకోవద్దు. మంచి పనులు చేసుకునేవాళ్ళకి అడ్డంకులు ఎక్కడైనా ఉంటాయి, వెనకాడకూడదు!

రామోజీరావు x రాజశేఖరరెడ్డి

7 కామెంట్‌లు
ఈనాడుపై వ్యతిరేకతను ముఖ్యమంత్రి ఓ మెట్టు పైకెక్కించారు. ఈ సారి తన అనుంగు అనుచరులను రంగంలోకి దింపి పత్రిక ఆయువుపట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు. ఈ దాడి వెనుక అసలు కారణం లీలగా కాదు, స్పష్టంగానే తెలుస్తూ ఉంది. తమపై వస్తున్న విమర్శలకు జవాబివ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు వాళ్ళేనాడో నిర్ణయించేసుకున్నారు, అమలూ జరుపుతున్నారు. విమర్శించేవాళ్ళ నోరు మూయించడమే వాళ్ళ లక్ష్యం. తమవాళ్ళే విమర్శిస్తే క్రమశిక్షణా రాహిత్యం అంటారు. తెలుగుదేశం విమర్శిస్తే.. ఏం మీరేమన్నా తక్కువ తిన్నారా అని అంటారు. పత్రికలు విమర్శిస్తే.. కక్ష, పక్షపాతం, అసహనం, ఇలాంటివి అంటగడతారు. ఈనాడు-మార్గదర్శిది సరికొత్త అంకం. ఇందులో ఎవరి పాత్ర ఎంత..

ముందుగా మార్గదర్శి: దీన్ని ప్రతిదాడిగా భావించక ప్రజా ప్రయోజనాలను ఆశించి సదుద్దేశంతోటే చేసారనుకుంటే, ఈ ఆరోపణల్లో మనం గ్రహించాల్సిన విషయాలు కొన్నున్నాయి.
  1. మార్గదర్శి ఫైనాన్సు నష్టాల్లో ఉందని వాళ్ళే చెబుతున్నారు.. అయితే ప్రజల డబ్బుకు భరోసా ఏమిటి? నాదీ పూచీ అని రామోజీరావు అంటే సరిపోదు, ఆ అప్పులు తీర్చగలిగినంత ఆస్తి (నెట్‌వర్తు) తనకుందని ఆయన చూపించాలి. అది ఇంకా చెయ్యలేదు.
  2. ఇక, అసలాయన జనం దగ్గర అప్పులు తీసుకోవచ్చా, లేదా అనే విషయం - ఇది రిజర్వు బ్యాంకే తేల్చాలి.
  3. సర్వసాధారణంగా తలెత్తే సందేహం.. అసలే లోపమూ లేకపోతే కాంగ్రెసు వాళ్ళు ఇంత యాగీ చెయ్యరు, నిప్పు లేందే పొగ రాదు కదా. ఈ సందేహాన్ని పటాపంచలు చెయ్యవలసిన బాధ్యత మార్గదర్శిదే.

కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి, ఆయన అంతేవాసులు:
  1. తమ అక్రమాల లీలల గురించి, ప్రాజెక్టుల అవినీతి గురించి, భూభోజనాల గురించి ఈనాడులో వస్తున్న విమర్శలను తట్టుకోలేక, పత్రికను కట్టడి చెయ్యడంలో భాగమే ఈ దాడి అని తెలిసిపోతూనే ఉంది. విమర్శలను ఎదుర్కోవడానికి సరైన మార్గం తప్పులు చెయ్యకపోవడమే. అయితే తప్పులు చెయ్యకుండా ఉండడం వీళ్ళ వల్ల కాదని మరోసారి తెలియజెప్పారు.
  2. ముఖ్యమంత్రి అసహనానికి ఇది మరో సూచిక. విమర్శించే పత్రికల పట్ల కూడా ప్రతిపక్షాల పట్ల వ్యవహరించినట్లే ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. నేనా పత్రికను (ఆంధ్రజ్యోతి) అసలు చదవనే చదవనని అలిగిన వ్యక్తి ఆయన. తనవారిని కాపాడుకునేందుకు (ఉదా:సూరి), కానివారిని కాలరాచేందుకు (ఉదా:కోట్ల విజయభాస్కరరెడ్డి వర్గం) ఏ స్థాయికైనా వెళ్ళగల వ్యక్తి. ఈ వ్యవహారం మొత్తంలో ఆయన చెయ్యి లేదంటే నమ్మశక్యం కాదు.
  3. అవినీతిని వాసన పసిగట్టే కుక్కలు మరి రాంగురోడ్డు విషయంలోను, కాందిశీకుల భూమి విషయంలోను, ఘటకేసర్ భూమి విషయంలోను మొరగలేదేంటి? భూభోక్తలు బిస్కట్లేసారా? లేక, భూభోజనాల బంతిలో తమకూ కాసిని ఎంగిలి విస్తర్లు దొరికాయా?
  4. రాంగురోడ్డుపైన, ఘటకేసరు ట్రస్టు స్థలంలో ఇంటిపైన, కాందిశీకుల భూములపైన, ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి పైన, ఇంటి ముందు స్థలాన్ని కాజేసిన వైనంపైనా ఈనాడు తమపై విమర్శలు చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల ఆస్తుల రక్షణకు నడుం కట్టేవారేనా వీళ్ళు?
రామోజీరావుపై ఆరోపణలు చేసే అత్యుత్సాహంలో వీళ్ళో సంగతిని పక్కన పెట్టారు - ప్రజలు వీళ్ళ ఆరోపణల్ని నమ్మి, డబ్బు వెనక్కిమ్మంటూ అడిగితే ఏం జరుగుతుంది? తీసుకున్న డబ్బులను పెట్టుబడులుగా పెడతారు కాబట్టి, ఆ డబ్బులను ఇప్పటికిప్పుడు వెనక్కిచ్చియ్యాలంటే ఎంత గొప్ప సంస్థకైనా సాధ్యం కాదు. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని తెలిస్తే ప్రజలు మరింత ఎగబడతారు, తమ డబ్బుల కోసం. అప్పుడు ప్రజల్లో కల్లోలం రేగదా? వీళ్ళాశించింది అదేనా?

మార్గదర్శి ప్రజల దగ్గరి నుండి డబ్బులు సేకరించకూడని పక్షంలో ఇన్నాళ్ళూ నియంత్రణ సంస్థలు ఏంచేస్తున్నట్లు?

ఏదేమైనా, స్వార్థ రాజకీయులు ఆడుతున్న ఈ నాటకంలో ప్రజలు బలి కాకుండా ఉండాలని కోరుకుందాం.

హరికథలో పిట్టకథల్లాగా ఈ జాబులో రెండు పిట్ట జాబులు:

మార్గదర్శి మీద రాజకీయుల దాడి ఇది మొదటిది కాదు. గతంలో నాదెండ్ల భాస్కరరావనే పెద్దమనిషి (నెల రాజు), రామారావును ముఖ్యమంత్రిగా పడదోయక మునుపు ఆయన మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉండేవాడు. (అప్పట్లో ఆయన కోపైలట్ లెండి, రామారావేమో పైలట్! ఆ సంగతీ భాస్కరరావే చెప్పుకున్నాడు.) ఆయన మార్గదర్శి చిట్‌ఫండు పై శాసనసభలో దుమారం లేపి కొన్నాళ్ళు హడావుడి చేసాడు. అయితే అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు చిట్‌ఫండు, ఇప్పుడేమో ఫైనాన్సు! అప్పుడు కోపైలట్టు.., ఇప్పుడేమో పైలట్టు, ఎయిర్‌హోస్టెస్సులు, స్టీవార్డులూ!

ఇక రామోజీరావు కూడా తక్కువవాడేం కాదు. ఆయనకు శత్రువులు కొల్లలుగా ఉన్నట్లున్నారు! (పత్రికాధిపతికి తప్పదేమో!!) రామారావు రాకముందు కాంగ్రెసు హయాంలోనే శాసనమండలి లో (అప్పట్లో ఉండేది! పెద్దలసభ అని గౌరవంగా అనేవారు, సభ్యులు 'చిన్న'వాళ్ళైనా) జరిగిన ఒక 'చర్చ' గురించి "పెద్దల సభలో గలభా" అని ఈనాడులో శీర్షిక పెట్టి రాసారు. గలభా అనేమాట పెద్దలకు చిన్నతనంగా అనిపించి ఆయన్ను మందలించేందుకు, అరెస్టు చేసి సభకు తెమ్మని పోలీసు కమిషనరును పంపారు. (ఆ కమిషనరు మరెవరో కాదు, మొన్నటి తెదే ప్రభుత్వంలో మంత్రిగా చేసిన విజయరామారావట!) రామోజీరావు ముందే బెయిలు తెచ్చుకున్నాడు. ఆ తరువాత, ఆ శీర్షికలో తప్పేమీ లేదని తీర్పు వచ్చింది. మొత్తమ్మీద మండలి బోనెక్కలేదు ఆయన.

అవీ పిట్టకథలు! శ్రీమద్రమారమణ గోవిందో.. హారి!

5, నవంబర్ 2006, ఆదివారం

నీటి బొట్టు పెరిగిపోతె సంద్రమే!

3 కామెంట్‌లు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సముద్రాలయ్యాయి. ఇప్పుడు కురిసినంత వాన ఈ మధ్య కాలంలో కురవలేదని అంటున్నారు. తుపానుల చరిత్రలో 1977 తుపాను ఓ మైలురాయి. ఆనాడు కూడా ఇంత వాన లేదని మా నాన్న అన్నారు. పొలాలెలాగూ మునిగిపోయాయి, ప్రజల జీవన పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. పల్లపు ప్రాంతాల్లో జనం శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రజలకు సరైన ఆహారం, గొడ్లకు మేతా దొరకని పరిస్థితి. దుర్భరమనిపించే పరిస్థితులు. కోస్తాలో తుపానుల గురించి గుర్నాం సింగ్ భల్లా గారి బ్లాగు చూడండి.

తుపానుల్లో జరిగే తక్షణ నష్టాన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా, అ తరువాత జరిగే నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వానిది గణనీయమైన పాత్ర. రోగాలు రాకుండా చర్యలు తీసుకోవడం, సాధారణ పరిస్థితి వచ్చేవరకు బాధితులకు బస, ఆహారం, గొడ్లకు మేత అందించడం మొదలైనవి సరిగా చేస్తే ఈ నష్టాన్ని అరికట్టవచ్చు. ఈ పనులు సరిగా జరగడం లేదని పేపర్లలో ఆరోపణలు మొదలయ్యాయి.

మామూలుగానే రాజకీయాలు కూడా మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలు బహిష్కరించైనా న్యాయం చేస్తామని బాబు అంటే (సమావేశాలను బహిష్కరించడమంటే బాగా పనిచేసినట్లని ఈయన అనుకుంటున్నాడు), ఆయన రాజకీయం చేస్తున్నాడని కాంగ్రెసు విసురు. శాసనసభలోనే ఉండి నెత్తీ నోరూ కొట్టుకుని గోలపెట్టినా దిక్కులేదు, మరి సమావేశాలు బహిష్కరిస్తే న్యాయం ఎలా జరుగుతుంది బాబూ?

3, నవంబర్ 2006, శుక్రవారం

కొత్త వెస్టిండియనులు, అదే పాత ఇండియనులు

0 కామెంట్‌లు
క్రికెట్టులో మనవాళ్ళు, విండీసు వాళ్ళు ఒకే రకంగా అనిపిస్తారు, నాకు. ప్రొఫెషనలిజము లేదు... అయితే ఉద్వేగ భరితంగా ఉంటారు లేదంటే నిర్వేదంగా ఆడతారు. ఉత్సాహంలో ఉంటే ఎంతటి వాణ్ణైనా కొట్టేస్తారు. (మన కామెంటేటర్ల పడికట్టు పదాల్లో దీని పేరు "తమదైన రోజున") లేదో.. బుర్కినాఫాసో చేతిలో కూడా ఓడిపోతారు. అందులకును ఇందులకును వారు సమర్థులే! ప్రొఫెషనలిజము కొలబద్ద మీద అత్యున్నతంగా ఆస్ట్రేలియా, న్యూజీలాండు ఉంటే అట్టడుగున విండీసు, ఇండీసు ఉంటారు. ఈ ఏటి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనవాళ్ళు తుచ తప్పకుండా తమపద్ధతిలోనే వెళ్ళారు గానీ, విండీసు మాత్రం కాస్త పద్ధతి మార్చినట్లుగా అనిపిస్తోంది.

ఏదేమైనా నాకు ఇండీసు, విండీసే అభిమాన జట్లు!

1, నవంబర్ 2006, బుధవారం

సోయం బాపూరావు అనగా రాజా జయచంద్ర

0 కామెంట్‌లు
గత నవంబరులో తెరాసలో మొదటి తిరుగుబాటు జరిగినపుడు, అసంతుష్టుల జట్టులో మొదట సోయం బాపూరావు కూడా ఉన్నారు. అయితే తరువాత మాట మార్చి, మిగతా వారికి షాకిచ్చి, అసంతుష్టులపై పెద్ద పెద్ద ఆరోపణలు చేసారు. వాళ్ళు ముఖ్యమంత్రితో కుమ్మక్కయ్యారని, కేవీపీ రామచంద్రరావు నుండి డబ్బులు తీసుకున్నారని, తనకూ ఇవ్వజూపారని ఇలా బోలెడన్ని ఆరోపణలు చేసారు. వికీపీడియాలో ఈ పేజీలో నవంబరు విభాగంలో ఈయనగారి ఆరోపణలు చూడొచ్చు.

ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటుదారు అవతారమెత్తారు! అసలేం జరుగుతోంది? అప్పుడు కేవీపీ ఇచ్చిన డబ్బులు చాలక వెనక్కి వెళ్ళారా? లేక తెరాస మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటే తిరిగి వెనక్కి వెళ్ళారా? లేక ఇప్పుడు కాంగ్రెసు మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటే మళ్ళీ తిరుగుబాటు పాటందుకున్నారా?

ఆనాడు నారాయణరావు పటేల్, మందడి వంటి వారిని అప్రదిష్ట పాల్జేసేందుకు చేసిన కుట్రగానీ కాదుగదా, ఈయన ఆరోపణలు?

ఇలాంటి జయచంద్రులతో అందరూ జాగ్రత్తగా ఉండాలి - తెరాస అయినా కాంగ్రెసైనా! మనం మాత్రం మొత్తం రాజకీయులందరితోటీ జాగ్రత్తగా ఉండాలి.

తెలుగుతల్లి

6 కామెంట్‌లు
పేరు కోసం, పదవి కోసం
అడ్డదారిన వచ్చిపడే
కలిమి కోసం బలిమి కోసం
తమ స్వార్థ యజ్ఞపు హోమగుండంలో
తల్లినైనా సమిధ లాగా వ్రేల్చగలిగిన
కుటిల జీవుల, రాజకీయుల గెలుపు కోసం
జరుగుతున్న ఈ బందును నిరసిస్తున్నా

జనం కోసం, బతుకు కోసం
నిజాయితీగా ఉద్యమించే వారి కోసం నిరీక్షిస్తున్నా

ఈ మదోన్మాదుల, పదవోన్మత్తుల
కొంగ జపాలు, నక్కజిత్తులు
తేటతెల్లమయ్యే రోజు కోసం,
వీళ్ళ బతుకులు నడిబజార్లో బట్టబయలయ్యే రోజుకోసం,
నడమంత్రపు సిరి కోసం అమ్మనైనా తిట్టగలిగిన
వీళ్ళ నోళ్ళు పడిపొయ్యే రోజు కోసం
నిరీక్షిస్తున్నా

మెరుపును చూపించి దీపంగా నమ్మించి,
ఎండమావుల వెంట పరిగెత్తించే నికృష్ట రాజకీయులారా

వేరు కుంపటి ఉపయోగపడేది కాకున్నా,
అడిగే హక్కు మీకుంది. కానీ..
అందుకోసం అమ్మను తిట్టడం ఘోరపాపం

తల్లిని నిందించిన మీ పాపం ఊరక పోదు
అది మిమ్మల్ని కట్టి కుడిపే రోజు రాకపోదు

------

తెలుగు తల్లికి వందనం
తెలుగు జాతికి జయం
తెలుగు నేలకు శుభం

5, అక్టోబర్ 2006, గురువారం

ఈనాడు x ముఖ్యమంత్రి

6 కామెంట్‌లు
ఈనాడుతో ముఖ్యమంత్రి వ్యవహారం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పత్రికలు అవినీతి ఆరోపణలు చేసినపుడు ప్రభుత్వ వైఖరి రక్షణాత్మకంగా ఉంటుంది. అందునా పేర్లతో సహా వచ్చినపుడు, మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు. అదేదో సూటిగా చెయ్యక వెనకదెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రింగురోడ్డుకు సంబంధించి ఈనాడు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి సరైన పనే చేసారు. కానీ పత్రికపై ఎదురుదాడి చెయ్యడం, దాన్ని సంకేతంగా తీసుకుని కాంగ్రెసు కార్యకర్తలమని చెప్పుకుంటున్న రౌడీలు పత్రిక కాపీలను తగలబెట్టడం.. ఇవన్నీ ముఖ్యమంత్రి గౌరవాన్ని దిగజార్చేవే గానీ, ప్రభుత్వానికి ఏమాత్రం ఉపకరించవు. రాజశేఖరరెడ్డి అసహనాన్ని సూచిస్తున్నాయి, ఈ చర్యలు. ముఖ్యమంత్రి స్థాయికి తగవీ పనులు.


ముందుగా ఒక విషయం.. సమాజంలో ఎవరు తప్పు చేసినా అరికట్టేందుకు, సరిదిద్దేందుకు ప్రభుత్వం ఉంది. మరి.. పాలకులే తప్పు చేస్తే? మనమెన్నుకున్నవారే మన వెనుక గోతులు తవ్వితే? మన డబ్బు కొల్లగొట్టేస్తే? మనకేమిటి రక్షణ? అందుకోసం వాళ్ళపై ఒక నిఘా ఉండాలి. ప్రతిపక్షాలు ఆ పని చెయ్యాలి. మన ప్రధాన ప్రతిపక్షం అలా చేస్తున్న జాడ లేదు. చెయ్యగలిగిన శక్తియుక్తులూ దానికి ఉన్నట్లు లేవు. కొండొకచో చేసినా, ఈ ప్రభుత్వం లెక్క జేస్తున్నట్లు లేదు. అందుకు ముఖ్య కారణం అందరూ దొంగలే కాబట్టి! మరిక నిఘా ఎవరు పెట్టాలి? పత్రికలే! అవి ఆ పని చేస్తున్నంత కాలం మనం పత్రికలను బలపరచాల్సిందే!

పత్రికలే తప్పు చేస్తే? ఈనాడు రాసింది తప్పైతే? పక్షపాత ధోరణితో రాసి ఉంటే?
రాంగురోడ్డు విషయంలో ఈనాడు పేర్లతో సహా రాసింది తప్పై ఉంటే.. ఈ పాటికి రాసినవాడూ, రాయించినవాడు ఇద్దరిపైనా కోర్టు కేసులు కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి. ఆరోపణల్లో పేర్లున్న వారెవ్వరూ ఇంతవరకూ కేసులెందుకు వెయ్యలేదు? వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఎం రాఘవులు ఆరోపణలు చేస్తే ఆయనకు లాయరు నోటీసు పంపిన విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. (ఇకముందు వేస్తారేమో చూడాలి.)

ఇంకో విషయం ఏమిటంటే పత్రికలు, ఈనాడుతో సహా, చాలా ఆరోపణల్లో తగు సాక్ష్యాధారాలు లేకపోతే గోడ మీది పిల్లివాటంగా రాస్తాయి. ఉదాహరణకు మాదాపూర్లో ఘటకేసర్ ట్రస్టు భూముల్లో "ముఖ్య నేత సోదరుడైన ఎంపీ " గారి అక్రమ కట్టడమంటూ ఈనాడు ముసుగు తొడిగి రాసిన వార్త. కాస్త లోక జ్ఞానం ఉన్నవాడెవడికైనా అది వై యెస్ వివేకానందరెడ్డి గురించని తెలిసిపోతుంది. కానీ తమకు తాముగా పేరు మాత్రం బయట పెట్టలేదు. కానీ రాంగురోడ్డు ఆరోపణలు మాత్రం పేర్లతో సహా రాసింది ఈనాదు. సెప్టెం 29 నాటి మొదటిపేజీ ప్రత్యేక సంపాదకీయంలో రాసింది చూస్తే ఆరోపణలపై తగు ఆధారాలు ఉన్నట్లే తెలుస్తోంది. ఓ పత్రిక బహిరంగంగా ముఖ్యమంత్రికి విసిరిన సవాలు అది; ఫ్రంటల్ ఎటాక్ !

ఈనాడు ఆరోపణలకు కాంగ్రెసు స్పందన ఎలా ఉంది? అవినీతి ఆరోపణలు చేస్తే తెలుగుదేశానికి ఎలా జవాబిస్తుందో అచ్చం అలానే స్పందించింది. 'తెలుగుదేశం బోలెడు తప్పులు చేసినప్పుడు మీరేం మాట్లాడలేదు, మా విషయంలో మాత్రం విరుచుకుపడుతున్నారు. మీ సొంత భూములు పోయాయని మీ ఏడుపు, అందుకే మామీద ఆరోపణలు చేస్తున్నారు ' -ఇదీ వరస!

రామోజీరావో మరొకరో అంటే మనకు ప్రత్యేక అభిమానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వపు తప్పొప్పుల్ని బయట పెడుతున్నపుడు మాత్రం మనం వాళ్ళ వెంటుండాలి.. అది ఈనాడయినా, వార్తయినా! ఒకే ఒక్క విషయం.. ప్రభుత్వంపై నిఘా అనేది ఉండాలి, మనకది అత్యావశ్యకం. ఈ నిఘా ఎవరు పెడితే వాళ్ళను బలపరచాలి.

ప్రభుత్వం తప్పు చెయ్యలేదు, ఈనాడు రాసేదంతా అబద్ధం అనే నిర్ణయానికి ఎవరైనా వచ్చేసి ఉంటే, వాళ్ళు నిక్షేపంగా ఈనాడుని చదవడం మానెయ్యొచ్చు, లేదా ఈనాడును విమర్శించవచ్చు. కానీ ఇతరులు ఈనాడుని చదవకుండా పత్రిక కాపీలను కాల్చెయ్యడం ఏంటి?

4, అక్టోబర్ 2006, బుధవారం

గురజాడపై విమర్శ

0 కామెంట్‌లు
గురజాడ గురించి గొప్పగా వింటూ వచ్చాం! విమర్శ చాలా అరుదు. కానీ ఈ లింకు చూడండి, ఎంత తీవ్ర విమర్శ ఉందో! కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ రాయనే లేదనే సుప్రసిద్ధ విమర్శలో కూడా దాన్ని ఆయన రాయలేదని అన్న్నారే గానీ, (దాన్ని ఆయన ఇంగ్లీషులో రాస్తే ఆయన స్నేహితుడు తెనిగించారనే వాదన ఉంది. పెద్ద చర్చే జరిగింది. ఇదంతా గురజాడ చనిపోయాకే!) ఇంత ఘోరంగా విమర్శించలేదు. నిజానిజాలు దేవునికెరుక! రచయిత నవరసాల అట.

అదే పేజీలో ఒక "సవర" కవి తెలుగులో రాసిన కవిత చూడండి, బాగుంది. 'వెన్నెముక లేని జంతువుల'ను తరిమేసి 'అకశేరుకాల'ను తెచ్చుకున్నారు అంటూ, సంస్కృత భాషపై మన మోజును కలమెత్తి చూపిస్తున్నాడు.

2, అక్టోబర్ 2006, సోమవారం

కేసీయార్ రాజీనామా తార్కికమైనదేనా!

5 కామెంట్‌లు
కేసీయార్ రాజీనామా అంకాన్ని పూర్తి చేసాడు. కేసీయార్ దృక్కోణం నుండి చూస్తే ఎందుకో నాకిది తార్కికంగా అనిపించలేదు. రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి కాంగ్రెసును వీలయినంత ఇబ్బంది పెట్టేసాడు. తెరముందు తన వాదనను బాగా వినిపించి ప్రజల్లోకి మళ్ళీ దూసుకెళ్ళాడు. తాను పొందాల్సిన లాభాన్ని పొందేసాడు. ఇక ఏదో ఒకటి చెప్పి, రాజీనామా వెనక్కు తీసుకుంటాడనుకున్నాను. కానీ, తెగే దాకా లాగాడెందుకో!? రాజీనామా ఉపసంహరణ కోసం కాంగ్రెసు కొంత ప్రయత్నం చేసింది గానీ, కేసీయార్ 'ఆశించినంత ' చేసినట్లు లేదు. ఒక రకంగా కేసీయార్ కు రాజీనామా వెనక్కు తీసుకోలేని పరిస్థితి కల్పించినట్లయింది. ఇక దృశ్యం కార్యక్షేత్రానికి మారింది.

ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు తెరాసకే ఎక్కువగా ఉన్నప్పటికీ అది నల్లేరు మీద నడకయితే కాదు. తెరాస ఓటమికై కాంగ్రెసు ఎంతకైనా తెగిస్తుందనేది కాదనలేని విషయం. తెలుగు దేశం పుంజుకోవడం తెరాసకు కష్టము, నష్టమూ కలిగించే విషయం.

కాంగ్రెసుకు కరీంనగర్ ఉపఎన్నిక అగ్ని పరీక్షేమీ కాదు. ఓడిపోతే చెప్పుకోడానికి కాంగ్రెసుకు ఒక వంక ఉంది. - ఇప్పటికే తెరాస స్థానమిది. పైగా అధినేత కేసీయార్ స్థానం కూడాను. గెలుపు కోసం కాంగ్రెసు సర్వ సన్నాహాలు చేస్తుంది, సర్వశక్తులూ ఒడ్డుతుంది అనేది సర్వ విదితం. అధికారంలో ఉన్నవారి ఎన్నికల ఆగడాలు మనకు కొత్తేం కాదు. తెరాసకిదో పెద్ద సవాలు

తెరాస గెలిస్తే సరే, గెలవకపోతే మాత్రం అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. మిగతా పార్టిలకంటే కూడా తెరాసకే ఈ ఎన్నిక కీలకం. గెలిస్తే తమ ఉద్యమానికి ఊపు వచ్చేమాట నిజమే. కానీ ఆ ఊపు ఇప్పటికే కొంత వచ్చింది. ఎన్నికలు జరిగి అందులో గెలిస్తే వచ్చే లాభం కొంత ఇప్పటికే వచ్చింది. దాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇతర పద్ధతులను చూసుకోవాల్సింది. ఖర్మకాలి ఈ ఎన్నికల్లో ఓడితే, స్వయానా కేసీయారే చేజేతులా ఉద్యమాన్ని దెబ్బతీసిన వాడవుతాడు. కాబట్టి రాజీనామా తెరాస దృక్కోణంలో అంత తార్కికంగా లేదు!

కేసీయార్ రాజీనామా తార్కికమైనది కాదనేందుకు మరో సాక్ష్యం.. బీజేపీతో సయోధ్య కోసం వారి ప్రయత్నాలు. గెలుపు చేజారకుండేందుకు చెయ్యవలసిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. (అసలు తెరాసదో చిత్రమైన వ్యక్తిత్వం! (పార్టీత్వం అనాలేమో!) ఓ పక్కనుండి ఇష్టమొచ్చినట్లు తిడతారు, మరో పక్కనుండి సాయం కావాలంటారు. పైగా తమకు సాయం చెయ్యడం అవతలవాడి ధర్మమన్నట్లు మాట్లాడతారు.) రాజకీయ పార్టీలకు ఎవరో ఒకరి తోక పట్టుకుని ఈదడం, అవసరం తీరాక తోక జాడించడం కొత్త కాదు కాబట్టి వాళ్ళిద్దరూ కలవవచ్చు. లేని పక్షంలో, బీజేపీ తమ అభ్యర్థిగా విద్యాసాగరావును నిలబెడితే తెరాసకు గడ్డుకాలమే!

ఇక రాజీనామా చెయ్యడంలోని సంబద్ధతనే ప్రశ్నించేవారు ఎలాగూ ఉన్నారు. ఐదేళ్ళపాటు సేవ చెయ్యమని ఆదేశిస్తే తమ పంతాలకోసం మధ్యలోనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టమనడం ఏమిటి? ప్రజలను వంచించడం కాదా? ఇది అనవసరమైన ఖర్చు కాదా? అనేవారు ఉన్నారు. రాజీనామాను వంచనగా ప్రజలు భావిస్తే వోటుచ్చుక్కొడతారు. ఇక ఖర్చంటారా? నిజమే, అది అనవసరమైన ఖర్చే! దాన్ని నివారించే మార్గం రాజ్యాంగంలో ఏర్పరచాలి. ప్రజలు తెరాసకు వోటేస్తారో, వోటుచ్చుక్కొడతారో చూడాలి.

25, సెప్టెంబర్ 2006, సోమవారం

స్వపరిపాలన కోసం తెలంగాణ

12 కామెంట్‌లు

నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అనేది తెలంగాణ కోరుతున్నవారి వాదన. అయితే "తెలంగాణ కావలసింది అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం" అని కేసీయార్ అంటున్నారు.


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఇతరులు కించపరుస్తున్నారు, మాండలికాన్ని హేళన చేస్తున్నారు అనే వాదన ఉంది. బతుకమ్మ, బోనాలు మొదలైన తెలంగాణ పండుగలకు ప్రస్తుతం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నది ఈ వాదనలోని భాగం. తరాలు మారే దశలో, సాంప్రదాయాలు క్రమేణా కనుమరుగు అవుతూ ఉండడం సహజం. దానికి ఇతరులను నిందించడం సరికాదు. ఇప్పటి ప్రభుత్వాలు సంస్కృతీ సాంప్రదాయాలను గాలికి వదిలేసాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విషయంపై శ్రద్ధ వహిస్తే అంతకంటే కావలసిందేమీ లేదు. ఇక మాండలికానికి సంబంధించినంత వరకు ఇది కొంత సహేతుకంగానే కనిపిస్తుంది. తెలంగాణ మాండలికానికి అధికారిక హోదానిచ్చి, గట్టిగా అమలు చేస్తే, కొత్త రాష్ట్రం వలన కలిగే గొప్ప ప్రయోజనం అవుతుందది. తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది. కానీ నిజంగా అది చేస్తారా?



ఇక స్వపరిపాలన .. ఏమిటి స్వపరిపాలన అంటే.. ఇప్పటిది కాదా? ప్రస్తుత పాలన పరాయి పాలన ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి కాకపోతే అది పరాయి పాలనేనా? అయితే పులివెందుల తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? గత ముఖ్యమంత్రి పాలనలో నారావారిపల్లె తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? లేక.. కేసీయార్ పాలిస్తే స్వపరిపాలన, లేకుంటే పరాయి పాలన అని అంతరార్థమా?

"ఆంధ్ర ప్రాంతం నుండి తరలివచ్చిన వారు ఇక్కడి పొలాలు కొని బాగుపడ్డారు, ఇక్కడ వ్యాపారాలు చేసి సంపాదించారు, మా ఉద్యోగాలు కొట్టేసి స్థిరపడ్డారు" అని ఈ తెలంగాణవాదులు అంటారు. తెలంగాణ ఏర్పడ్డాక వాళ్ళందరి అస్తులనీ, పొలాలనూ, ఉద్యోగాలను లాక్కుని తరిమేయలేరు కదా! మరి తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడికి ఎలా న్యాయం చేయబోతున్నారు? ఈ విషయమై తాము ఏమేం చెయ్యబోతున్నారో వీళ్ళింతవరకు చెప్పలేదు.

ఏమొచ్చినా రాకున్నా కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా వచ్చేవి కొన్నున్నాయి.. ఓ ముఖ్యమంత్రి, ఓ ఇరవై మంది మంత్రులు, ఓ రెండొందల కొత్త అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు, ఓ రెండువేల కొత్త ఉద్యోగాలు.



నికరంగా తేలేదొకటే.. తెలంగాణ వస్తే బాగుపడేది రాజకీయులే. సామాన్యుడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సామాన్యుడికి కొత్తగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు, కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగావకాశాలు తప్ప. తక్షణ రాజకీయ ప్రయోజనం ఆశించే వారికి మాత్రం ఉపయోగమే!

23, సెప్టెంబర్ 2006, శనివారం

ఉరుకుల పరుగుల వికీపీడియా

0 కామెంట్‌లు
ఆన్‌లైనులో విజ్ఞాన వనరులలో వికీపీడియా మొదటి స్థానం ఆక్రమించింది. ఇప్పటికే పాతుకుపోయిన విజ్ఞాన గనుల్ని వెనక్కు నెట్టేసి ప్రజాదరణలో చాలా ముందుకు దూసుకుపోయింది. లక్షలాది మంది స్వచ్ఛందంగా అక్కడ కృషి చేస్తారు. వీరు కొత్త కొత్త వ్యాసాలు రాస్తూ, ఉన్నవాటికి మెరుగులు పెడుతూ ఉంటారు కాబట్టే లక్షలాది పేజీల, వందల గిగాబైట్ల సమాచారం ఉంది అక్కడ. క్షణక్షణానికీ పెరిగిపోతున్న విజ్ఞాన సర్వస్వమిది, నిరంతరం మెరుగుపడుతూ ఉంటుంది.

వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు. ఒకరు రాసినదాన్ని ఎవరైనా మార్చవచ్చు. అక్కడ ఉన్న విషయాన్ని ఎవరైనా తమ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా 38 లక్షల పైచిలుకు సభ్యులు, 229 భాషల్లో రాసిన వ్యాసాలెన్నో తెలుసా! 52 లక్షల 37 వేలు!!
ఆ 229 భాషల్లో మన తెలుగూ ఒకటి
ఆ 38 లక్షల మందిలో మనమూ ఓ 600 మందిమి ఉన్నాం
వ్యాసాల్లో మన వాటా 10 వేలు!
ఇది రాసే సమయానికి వ్యాసాల సంఖ్యలో భారతీయ భాషల్లోకెల్లా మనమే ముందంజలో ఉన్నాం. ఈ గణాంకాల పూర్తి వివరాలు చూడండి. కంప్యూటరు తెలుగు నేర్చుకున్న తరువాత నెట్లో ఎన్నో తెలుగు సైట్లు వచ్చాయి. వాటిలో కూడా వికీపీడియా మొదటి వరుసలో ఉంటుంది!

కానీ సభ్యుల సంఖ్య విషయంలో మనం వెనకబడే ఉన్నాం. తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల వికీపీడియాలలో సభ్యుల సంఖ్య మనకంటే ఎక్కువగా ఉంది. సభ్యుల్లో చురుగ్గా పాల్గొనే వారి సంఖ్య కూడా తక్కువే!

తెలుగు వికీపీడియాలో వస్తున్న వ్యాసాలు ప్రధానంగా తెలుగువారికి సంబంధించినవి గానే ఉంటున్నాయి. ఇది సహజం. వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలు వస్తూ ఉన్నాయి. మంచి మంచి వ్యాసాలు చాలా వచ్చాయి. ప్రతిఒక్కరూ తమతమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యాసాలను రాయవచ్చు. చరిత్ర, గ్రామాలు, పట్టణాలు, సినిమాలు, ప్రసిద్ధులు, పుణ్యక్షేత్రాలు, కంప్యూటర్లు, జలవనరులు, రాజ్యాంగ వ్యవస్థ, భాష, సామెతలు, నుడికారాలు.. ఇలా ఎన్నో రకాల వ్యాసాలపై పని చెయ్యవచ్చు.

మీరూ మీ అభిరుచి మేరకు అక్కడ రచనలు చెయ్యండి. ఓ మొక్క నాటడం ఎలాగో వికీపీడియాలో రచనలు చెయ్యడమూ అంతే! మీరు నాటిన మొక్క ఫలాలు మీ బిడ్డలకు, వారి బిడ్డలకు ఉపయోగపడతాయి. అలాగే వికీలో మీరు రాసిన వ్యాసం మీ బిడ్డలకు, మా బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు, తరతరాలకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక మీకూ కింది విధంగా ఉపయోగపడుతుంది.
1. వ్యాసం రాయడానికి మీరు వికీకి వచ్చినపుడు ఇతర వ్యాసాలు చదివి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
2. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నపుడో, లేక డబ్బులకోసం నాన్నకు ఉత్తరం రాసినపుడో రాసిన తెలుగు.. దానికి మెరుగులు పెట్టి, మీ కలానికి పదును పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు తెలుగు నేర్పేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు.

'అయ్యో నాకు తెలుగు రాయడం సరిగా రాదు కదా.. తప్పులు పోతాయి కదా ఎలాగా' అని అనుకోవద్దు, సిగ్గుపడొద్దు, వెనకాడొద్దు. భాషా దోషాలు సహజం.. వాటిని సరిదిద్దేందుకు ఇతర సభ్యులు ఎలాగూ ఉంటారు. రాస్తూ ఉంటే క్రమంగా మీ దోషాలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక సంవత్సరంగా వికీపీడియాలో రచనలు చేస్తూ నేనేంతో నేర్చుకున్నాను. నా తెలుగు ఎంతో మెరుగు పడింది. మీరూ రాయండి. మీ ఊరి గురించి రాయడంతో మొదలు పెట్టండి. జరుగుతున్న చరిత్రను రాయండి (ప్రస్తుత ఘటనలు). మీకు నచ్చిన సినిమా గురించి రాయండి. మీరభిమానించే ప్రసిద్ధ వ్యక్తి గురించి రాయండి.

కంప్యూటర్లో తెలుగు విప్లవానికి కొలబద్ద, వికీపీడియా!

21, సెప్టెంబర్ 2006, గురువారం

రాష్ట్ర విభజనతో నీళ్ళూ, నియామకాలు వస్తాయా?

3 కామెంట్‌లు

నిధుల కోసం తెలంగాణ, నీళ్ళ కోసం తెలంగాణ, నియామకాల కోసం తెలంగాణ అని అంటారు తెలంగాణ వాదులు. తెలంగాణ ఏర్పడితే నీళ్ళు, నియామకాలు విరివిగా వస్తాయా? చూద్దాం...



ముందుగా నియామకాలు:

ఎక్కడినుండి వస్తాయి కొత్త ఉద్యోగాలు? రాష్ట్రానికి అవసరమైన ఉద్యోగులు ముందే ఉన్నారు కదా! కొత్తగా అవసరమైన నాలుగైదు వేల మంది ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఐదు వేల ఉద్యోగాల కోసమేనా, తెలంగాణ? ఒకవేళ తెలంగాణ ఏర్పడితే, జీవో 610 ప్రకారం వెనక్కు పంపాల్సిన ఇతర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపిస్తారా? పంపిస్తే మరో 20 వేల కొత్త ఖాళీలు వస్తాయి. కానీ..



రాష్ట్ర విభజన అంటే భౌగోళిక విభజనా, లేక ప్రజలూ, ఉద్యోగుల విభజనా? విభజన సమయంలో ఇదో వివాదం కానుంది. అసలు ఆస్తి పంపకమంటేనే వివాదాల పుట్ట. బోలెడన్ని షరతులు, సర్దుబాట్లతో కూడిన వ్యవహారం! విభజన ఇష్టపడని వాళ్ళు బెట్టుగా ఉన్నా.., అది కోరుతున్నవారు సర్దుబాటుకు ముందుకు వస్తారు, అది సహజం. పంపకాల రోజున.. ఇదుగో రాష్ట్ర పంపకం ఎలాగూ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగుల ప్రస్తుత స్థితిని కొనసాగించాల్సిందే ఎవర్నీ వెనక్కి పంపరాదు అని షరతు పెడితే, ఈ వేర్పాటు వాదులు ఒప్పుకోరా? రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉన్నవారికి అది ఒక చిన్న సర్దుబాటు! ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి.. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యే క్రమంలో ఆంధ్రులు మద్రాసును వదులుకోవాల్సి వచ్చింది. మద్రాసు పేరెత్తకపోతేనే ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచిస్తామని అప్పటి నాయకులు అన్నారు ( http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82_%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81#), మనవారు విన్నారు. ప్రత్యేక రాష్ట్రమనే పెద్ద లక్ష్యం ముందు, మద్రాసు చిన్నదిగా కనిపించింది, వదులుకున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ అనే పెద్ద లక్ష్యంకోసం ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అంచేత, ఈ సర్దుబాట్ల క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, ఒక్క ఉద్యోగి కూడా వెనక్కి పోరు, ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటే తప్ప! కాబట్టి కొత్తగా నియామకాలు వచ్చే అవకాశం తక్కువ. వచ్చే కాసిని అవకాశాల కోసం పంపకాలు అవసరమా? నియామకాల విషయంలో మరో కోణం -తెలంగాణలో ఏర్పడే కొద్దో గొప్పో ఖాళీలను కూడా ఆంధ్రులే ఆక్రమించుకుంటున్నారనే వాదన ఉంది. ప్రత్యేక రాష్ట్రంలో ఆ అవకాశం ఉండదు కాబట్టి ఆ మేరకు కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ప్రస్తుత ప్రైవేటీకరణ యుగంలో కొత్తగా ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశాలెన్ని? ప్రైవేటు రంగంలో వచ్చే అవకాశాలను తెలంగాణేతరులు అందిపుచ్చుకోకుండా అడ్డుకుంటారా కొత్త రాష్ట్ర నేతలు?



ఇక నీళ్ళు.. తెలంగాణ ఏర్పడే వేళ.. చాలా పెద్ద వివాదం కాబోతున్నది ఇదే! హైదరాబాదు కంటే పెద్ద వివాదం అవుతుంది. మూడు ప్రాంతాలు కూడా గట్టిగా పట్టుబట్టేది ఈ విషయంలోనే.. హైదరాబాదు విషయంలో కాదు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు జరిగింది ఆంధ్ర ప్రదేశ్ కే గాని, అందులోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన రోజున దీన్ని ఇదమిత్థంగా తేల్చుకోవాలి. మూడు ప్రాంతాలు తమతమ నీళ్ళ కేటాయింపులను కట్టుదిట్టంగా పరిరక్షించుకున్న తరువాతే రాష్ట్రం వేరు పడుతుంది. ఇది అంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదు. నీటి పంపకాల్లో ఒక సార్వత్రిక నియమం ఉంది.., అంతర్జాతీయంగా పాటిస్తారు దీన్ని - "ఇప్పటికే ఏర్పాటైన అయకట్టును పరిరక్షిస్తూ, మిగిలిన నీటినే కొత్తగా పంపకం చేయాలి". కృష్ణ నీటిని తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన 811 టీఎంసీ నీటిని ఇప్పటికే వాడిన భాగం పోగా మిగిలిన నీటినే పంపకం చెయ్యాలి. ఇప్పటికే ఏర్పడ్డ ఆయకట్టును పరిర్తక్షిస్తూ నీటి పంపకం చేస్తే, తెలంగాణకు వచ్చే వాటా ఎంత? రాష్ట్ర విభజన సమయానికి కృష్ణ ప్రాజెక్టులలో ఎవరెవరి భాగం ఎంత, నిర్వహించేది ఎవరు, ఎవరెవరు ఎంతెంత నీటిని వాడుకోవాలి, వాడుకోవాల్సింది నికర జలాలనా లేక వరద నీళ్ళనా.. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఇలాగే గోదావరి నీళ్ళు.. ('అన్నదమ్ముల్లాగా విడిపోదామ'ని అంటున్న రాజకీయులు తెలుసుకోవాల్సింది ఒకటుంది.. వేర్లు పడ్డాక, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య సంగతేమో కానీ నీళ్ళ దగ్గర కొట్లాటలు రాకుండా ఉంటాయా అనేది సందేహమే!)


ఇలాంటి వేర్పాటు వివాదాల్లో కాస్తో కూస్తో సర్దుబాటుకు ముందుకొచ్చేది, సహజంగానే వేర్పాటు కావాలని గొడవ చేస్తున్న వారు! కాబట్టి నికరంగా నష్టపోయేది తెలంగాణాయే! రాజకీయులు రాష్ట్రం కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. కానీ మేథోవర్గం దానికి ఒప్పదు. తెలంగాణ కోరుతున్న రాజకీయులు, మేథావుల మధ్య ఈ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు.

ఏదేమైనా మూడు ప్రాంతాల ప్రజలూ గట్టిగా వత్తిడి చెయ్యాల్సింది ఒకటుంది.. "విభజన సమయంలో మీరు ఏమేం ఒప్పందాలు చేసుకుంటున్నారో బహిరంగ పరచాలి. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెసు, తెరాస చేసుకున్న ఒప్పందం లాంటి దొంగ వేషాలు కుదరవు" అని. లేకపోతే ఈ రాజకీయులు మనల్ని ముంచి పారేస్తారు, పాతరేస్తారు!

మొత్తమ్మీద రాష్ట్ర విభజన జరిగితే నీళ్ళు, నియామకాల విషయంలో కూడా తెలంగాణ పరిస్థితి మెరుగుపడేదేమీ ఉండదనిపిస్తోంది. మరెందుకీ విభజన? ఎవరికోసం ఈ విభజన? కేసీయార్ కొత్త కారణాలు రెండు మూడు చెబుతున్నారు.. "ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ" అని. వాటి సంగతి కూడా చూద్దాం!

20, సెప్టెంబర్ 2006, బుధవారం

రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?

6 కామెంట్‌లు

రాష్ట్ర విభజన విషయమైఈ జాబు రాస్తున్నాను. తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా అనే విషయం జోలికి పోవడం లేదు. రాష్ట్రం విడిపోవాలా లేదా అనే విషయం జోలికీ పోవడం లేదు. అవన్నీ అధికారం కోసం ఆవురావురంటున్న వారు, తహతహలాడుతున్నవారు చెప్పాలి, మనం వినాలి. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడితే వీళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయా అనేది ఆలోచిస్తున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పడే పక్షంలో ఏం జరుగుతుంది అనే నా ఊహకు రూపమే ఈ వ్యాసం. (కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్ర అనడం రివాజుగా వస్తూంది. అది అంత సబబు కాకున్నా నేనూ ఇక్కడ అలాగే వాడుతున్నాను.)

తెలంగాణ ఎందుకు కావాలంటే.. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం అని తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ అంటున్నారు. ఇది నిజాయితీతో కూడిన కోరిక. కేసీయార్ దాన్ని కాస్త విస్తరిస్తూ, తెలంగాణ కేవలం అభివృద్ధి కోసమే కాదు.., ఆత్మ గౌరవం కోసం, స్వయంపాలన కోసం అని కూడా అన్నారు. ఆమధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం ఫోనాఫోనీ కార్యక్రమం లో కూడా ఇదేమాట చెప్పారాయన.

నిధులూ, నీళ్ళు, నియామకాల సంగతి చూస్తే, ప్రత్యేకరాష్ట్రంలో ఈ మూడు 'న'కారాలూ నకారం కాబోతున్నాయి. ముందుగా నిధుల సంగతి చూద్దాం.



రాష్ట్ర విభజన అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పడడమా? కాదు! తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలు ఏర్పడడం. రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ఏ గొడవలూ లేనట్లే! మొట్ట మొదటి గొడవ రాజధాని విషయంలోనే! హైదరాబాదు ఇద్దరికీ కావాల్సిందే అని ఆంధ్ర నాయకులు అడుగుతారు. కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడంలేదు. కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే అలా ఉండొచ్చు. (ఎవరి రాజధాని వాళ్ళకు ఉంటేనే దీర్ఘకాలంలో మంచిది. విభజన సమయంలో బేరసారాలకు ఒక ఆయుధంగా ఆంధ్ర నాయకులు హైదరాబాదును వాడుకుంటారు.) తెలంగాణ రాజధాని ఉన్నచోటే ఉంటుంది. ఆంధ్రకు మాత్రం కొత్తగా ఓ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాష్ట్రానికి మౌలికంగా ఏం కావాలి? శాసనసభ కావాలి, సచివాలయం కావాలి, హైకోర్టు కావాలి, రాష్ట్ర స్థాయి పరిపాలనా యంత్రాంగం కావాలి. డైరెక్టరేట్లు కావాలి, కేంద్ర పోలీసు వ్యవస్థ కావాలి. మొత్తమ్మీద ఓ పరిపాలనా వ్యవస్థతో కూడిన రాజధాని కావాలి. తెలంగాణకు హైదరాబాదు ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఆంధ్రకే! ఆంధ్రకు ఓ కొత్త రాజధాని నిర్మాణం కావాలి. దానికి నిధులు కావాలి. ఇప్పుడు చెప్పండి.. రాష్ట్ర విభజన జరిగితే నిధులెవరికి కావాలి? ఇప్పటికే ఇవన్నీ ఉన్న తెలంగాణకా? అసలేమీ లేని ఆంధ్రకా? ఆంధ్రకే!

పైగా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందిన హైదరాబాదును వదులుకున్నందుకు, అక్కడి నుండి వస్తున్న ఆదాయాన్ని వదులుకున్నందుకు బదులుగా, సాపేక్షికంగా తమ నగరాలను అభివృద్ధి చేసుకునేందుకు కూడా కోస్తా, రాయలసీమలు నిధులు అడుగుతాయి. ఇదంతా కొత్త ఖర్చే కదా. విభజన జరక్కపోతే ఆ నిధులను ఇతరేతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టొచ్చు. కాబట్టి ఆ దామాషాలో తెలంగాణకు వచ్చే నిధులు తగ్గినట్లే!

పైగా కొత్త రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేస్తే రాయలసీమవాళ్ళు, రాయలసీమలో ఏర్పాటు చేస్తే కోస్తా వాళ్ళు తగు రక్షణలు కోరుతారు. రక్షణలంటే మరోటేమీ కాదు.., నిధులు, మౌలిక వసతులు! నిజానికి ఇది అవసరం కూడా.. ఎందుకంటే మళ్ళీ మరో విభజన జరిగి, ఇప్పుడు హైదరాబాదును వదిలి పోవాల్సి వచ్చినట్లే రేపు ఒక ప్రాంతం వాళ్ళు రాజధానిని వదులుకోవాల్సి వస్తే ఇప్పటి వ్యథ మళ్ళీ లేకుండా ఉండేందుకు. దురాశాపరులైన రాజకీయులు అన్నికాలాల్లోను, అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు.

ఇక్కడొక విషయం గమనించాలి.. తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రతో పోల్చి చూసేటపుడు తెలంగాణ నాయకులు హైదరాబాదును పరిగణనలోకి తీసుకోరు. 'హైదరాబాదు అందరిదీ, దాన్ని వదలి, మిగతా తెలంగాణలో అభివృద్ధిని చూడండి' అని అంటూంటారు. మరి రాష్ట్ర విభజన జరిగాక, హైదరాబాదు పూర్తిగా తెలంగాణకే చెందాక, అప్పుడు అభివృద్ధిని పోల్చి చూస్తే..! ఇప్పటి తేడా అప్పుడు ఉండదు, పోలిక తిరగబడొచ్చు కూడా! కోస్తా రాయలసీమలకు మరిన్ని నిధులివ్వాల్సింది అందుకు కూడా!

కాబట్టి రాష్ట్ర విభజన జరిగితే నిధులు కావలసింది ఆంధ్రకే గాని, తెలంగాణకు కాదు. తెలంగాణకు అదనపు నిధులు దొరకడం కష్టం! హైదరాబాదు నుండి వచ్చే ఆదాయం మాత్రం పూర్తిగా తెలంగాణకే చెందుతుంది కనుక, ఆ మేరకు తెలంగాణకు అదనపు నిధులు వచ్చినట్లే! ఆంధ్రకు ఆ మేరకు నష్టం జరిగినట్లే!

నిధుల సంగతిది. ఇక నీళ్ళు, నియామకాల సంగతి..

19, సెప్టెంబర్ 2006, మంగళవారం

ఆదివారం టీవీ కార్యక్రమాలు

2 కామెంట్‌లు
మామూలు రోజుల్లో లాగానే ఆదివారం నాడు కూడా టీవీల్లో సినిమాల గురించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త సినిమాల నటులు, దర్శకులు, నిర్మాతలతో ఇంటర్వ్యూలు పెట్టి వాటికి ప్రచారాలు కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. జెమినీలో జోకర్ల లాంటి ఇద్దరు లంగర్లు (మనుషులు బాగానే ఉంటారు, వాళ్ళ ప్రవర్తనే.. జోకర్లలాగా ఉంటుంది. ఒకరి పేరు సత్తెన్న.. ఇంకోళ్ళెవరో గుర్తు లేదు) కొత్త సినిమా జనుల ఇళ్ళలో లంగరు దించి, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ఈ మధ్య వస్తున్నట్లు లేదు (మరో పిచ్చి కార్యక్రమమేదో పెట్టి ఉంటారు!).

18, సెప్టెంబర్ 2006, సోమవారం

వేడెక్కుతోన్న వాతావరణం

0 కామెంట్‌లు
  • కేకేపై అధిష్టానం సీరియస్
  • ఎమ్మెస్సార్‌పై మండిపడ్డ అధిష్టానం
  • దిగ్విజయ్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం
  • కేకేపై చిర్రుబుర్రులాడిన దిగ్విజయ్
  • చిన్నారెడ్డిపై మధుగౌడ్ చురకలు
  • మధుగౌడ్ వ్యాఖ్యలపై చిన్నబుచ్చుకున్న చిన్నా
  • కేకేపై తెలంగాణ నాయకుల కోపం
  • కేకేను తప్పుబట్టిన పాల్వాయి
  • మధుగౌడ్, సర్వే సత్యనారాయణలకు చురకలేసిన లగడపాటి
  • ఖబడ్దార్ లగడపాటీ అన్న సర్వే
  • తెలంగాణ ఎంపీలు నోరిప్పకూడదా అంటూ లగడపాటిని విమర్శించిన కేసీయార్
  • మధుగౌడ్‌ను విమర్శించిన రేణుకాచౌదరి
  • ఆమె మర్యాదగా మాట్లాడాలి అని ప్రతి విమర్శ చేసిన మధు గౌడ్
  • లగడపాటిని ఘెరావ్ చేసి, కొట్టిన తెలంగాణ విద్యార్థి సంఘ సభ్యులు
మాటలు పదునెక్కుతున్నాయి, "సెంటిమెంటు" చిక్కనవుతోంది, చేతలు చేతులు దాటుతున్నాయి. కాంగ్రెసులో పగుళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. అయినా, అధిష్టానవర్గం పెదవి విప్పలేదు. సమస్య సమస్యగా ఉన్నప్పుడే పరిష్కరించాలి. అది ముదిరి సంక్షోభంగా మారకముందే బాధ్యత కలిగిన వాళ్ళు, బాధ్యత తెలిసిన వాళ్ళు మేలుకోవాలి.

17, సెప్టెంబర్ 2006, ఆదివారం

పోపు గారు.. క్షమించ గోరారు

1 కామెంట్‌లు
మతమార్పిడులపై పోపుగారు ఈసారి మాట మార్చారు.

13 వ శతాబ్దంలో మహమ్మదు ప్రవక్తపై బైజాంటైన్ రాజు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని, బయటికి తీసి, ఓ వివాదాన్ని సృష్టించారు.
మధ్యయుగాల్లో ముస్లిములు జరిపిన బలవంతపు మత మార్పిళ్ళపైనే పోపుగారి ప్రస్తుత విమర్శల జోరు.

కొన్ని నెల్ల కిందట ఇదే బలవంతపు మతమార్పిళ్ళపైనే పోపుగారు మనపైనా కొన్ని విసుర్లు విసిరారు .
అయితే ఆనాటి వారి వాదన వేరు.
మూకుమ్మడి మతమార్పిడులకు వ్యతిరేకంగా భారత్‌లో చట్టాలు చేయరాదని అప్పుడు వారు మనకు చెప్పారు.
(అప్పటి వారి విమర్శలపై ఈ పేజీల్లోనే వచ్చిన నా పాత జాబు ఇది.)
మరి ఇప్పుడేమో ఇలా చెబుతున్నారు.

మధ్యయుగాల్లో కత్తి చూపి మతమార్పిడి చేయించారు,
అది ఆ కాలం తీరు.
ఇప్పుడేమో ప్రచారం తెగ చేసి, ఎరవేసి, ఆశలు చూపి, మొహమాటపెట్టి మూకుమ్మడిగా చేస్తున్నారు,
ఇది ఇప్పటి తీరు.
చేసే పని మాత్రం అదే.., బలవంతపు మతమార్పిడే! తీరే వేరు.
అయితే పోపుగారు మాత్రం..
"ఇప్పుడు మేం చేసేది ఒప్పు, దాన్ని అడ్డుకోరాదు, అప్పుడు ముస్లిములు చేసింది తప్పు, దాన్ని మర్చిపోరాదు" .. అని అంటున్నారు.

ముస్లిములపై మాట మీరారు, చివరికి క్షమించ గోరారు!

15, సెప్టెంబర్ 2006, శుక్రవారం

నక్సలైట్లు, రాకెట్లు, పౌరహక్కుల సంఘాలు

3 కామెంట్‌లు
తపంచాలు, తుపాకులు, మిషను గన్లు దాటేసి, ఇపుడు రాకెట్లూ, వాటి లాంచర్ల వరకు వచ్చారు, నక్సలైట్లు. పోలీసుల కూంబింగులు, దాడులు సరైనవేనని రుజువు చేస్తోంది ఈ ఆయుధాల సేకరణ. ఈ రాకెట్టును చాలా దూరంనుండి ప్రయోగించవచ్చు. 20 దాకా ప్రాణాలను తీయవచ్చు.

పౌరహక్కుల నాయకులు ఇప్పుడేమంటారో? ఎన్‌కౌంటర్లను ఖండించడం తప్పుగాదు. నక్సలైట్లు పోలీసులను చంపేసినపుడు గొంతు పెగలకపోవడం మాత్రం తప్పే! జనహననం కోసం రాకెట్లు, లాంచర్లు పోగు చేసుకునే వాళ్లను ఏం చెయ్యాలో వీళ్ళిపుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి పారేస్తున్నారని గోల చేస్తున్నారు.. మర తుపాకి పట్టుకు తిరిగేవాణ్ణి పట్టుకోవడానికి, సంకెళ్ళు ఊపుకుంటూ వెళ్తారా? వెళ్ళినా.., 'దా నన్ను బంధించు' అంటూ సంకెళ్ళ కోసం చేతులు చాపుతాడా? కాల్చి అవతల పారేస్తాడు! వాణ్ణి ఎదుర్కొనేందుకు మర తుపాకే కావాలి. తుపాకులున్నది కాల్చేందుకే! ముల్లును ముల్లు తోటే తీయాలి.

నక్సలైట్లు పోలీసులనే కాక, ఎంతో మంది మామూలు పౌరులను కూడా ఇంటి దగ్గరనుండి పట్టుకుపోయి, హింసించి, కాల్చి చంపారు- ఇన్‌ఫార్మర్లనో, కోవర్టులనో, మరో పేరుతోటో. మరి అలా పట్టుకుని చంపడం రైటా? పోలీసులను మాటేసి, మైనేసి చంపుతున్నారు కదా, అది ఒప్పేనా? ఇవి జరిగినపుడు నోరు విప్పని వాళ్ళు ఎన్‌కౌంటరు అనగానే మాత్రం గోల చేసేస్తారు. పోలీసులు అసలు తప్పే చేయరని ఎవరూ అనరు, కానీ తప్పు రెండువైపులా జరుగుతున్నపుడు ఒకర్నే నిందించడం ఏమిటి?

13, సెప్టెంబర్ 2006, బుధవారం

నిరుత్తర కుమారులు

3 కామెంట్‌లు
గాజుగదిలో కూర్చుని బయటివాడిపై రాయేస్తే ఏమవుతుంది?
నిరాయుధుడు కదా అని చేతిలో కర్రొకటి పట్టుకుని కవ్విస్తూ పోగా, వాడు ఏకే47 బయటికి తీసి గురిపెడితే ఎలా ఉంటుంది?

కాంగ్రెసు పరిస్థితి ఇదీ! రాజీనామా చేసి చూసుకుందాం రా అని ఎమ్మెస్ అన్నాడు. బానే ఉంది, రాజకీయాల్లో అది మామూలే! కేశవరావు చూడండి, కేసీయార్‌ను రాజీనామా చెయ్యమనండి, నేను నెల రోజుల్లో ఎన్నికలు పెట్టిస్తాను అంటూ ఎగదోసాడు. అయితే, అవతలి వ్యక్తి వ్యూహ నిపుణతను కేకే అంచనా కట్టలేక పోయాడు. (అసలు అవతలి వాళ్ళ మాటలను, చేతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు కేకేలాగా లొడలొడా మాట్లాడడు.) అంది వచ్చిన అవకాశాన్ని కేసీయార్ భలే చక్కగా వాడుకున్నాడు.. ప్రతి సవాలు విసర్లేదు, ఏకంగా రాజీనామా విసిరేసి, రా తేల్చుకుందాం అని తొడ గొట్టాడు.

ఇంత జరిగింతరవాత, వీళ్ళేంచేస్తున్నారు? దాక్కునేందుకు స్థలాలు వెదుక్కుంటున్నారు! ఏదో అంటూ ఉంటాం, అలాగే నేనూ ఏదో అన్నాను, అంత పట్టించుకోనక్కరలేదు అని కేకే అంటున్నాడు. సవాళ్ళు విసరడం చపలత్వం అయితే, అబ్బే నేనేదో చెతురుకన్నాను, పట్టించుకోనక్కరలేదు అని అనడం చవటత్వం!

తెరాస:అన్నీ అనుకూలాలే!అనూహ్యమైన ఎత్తేసి, కేసీయార్ ఉత్తర కుమారులను నిరుత్తరుల్ని చేసాడు. సిద్ధిపేట సభతో జడత్వాన్ని కాస్త వదుల్చుకున్న తెరాసకు ఈ రాజీనామా వ్యవహారం ఒక ఊపు నిస్తుందనడంలో సందేహమేమీ లేదు. వ్యక్తిగతంగా కేసీయార్ పరపతి బాగా పెరుగుతుంది. ఈ సంఘటనతో కేసీయార్ కు అన్నీ ఉపయోగాలే! రాజీనామా చేసిపారేసి, తెలంగాణ పట్ల నిబద్ధుణ్ణనే సందేశమిచ్చాడు. ప్రజల్లో తనపట్లా, తెరాస పట్లా విశ్వసనీయతను మరింత పెంచుకున్నాడు. రాజీనామాను స్పీకరు ఎలాగూ ఒప్పుకోడు కాబట్టి (ఫాక్సుల్లోనూ, ఫోనుల్లోను టాటా చెబితే కుదరదట, స్వయంగా కలిసే చెప్పాలట! ఈయన పోడు, ఆయన ఒప్పుకోడు), తన లోక్‌సభ సభ్యత్వానికి ఢోకా ఏమీ లేదు. లోక్‌సభ అడిగింది కాబట్టి నిరాహారదీక్ష విరమించిన వాడికి, స్పీకరు కుదరదన్నాడు కాబట్టి రాజీనామా వెనక్కి తీసుకోడంలో కష్టమేముంది! ఈలోగా ఎలాగూ కాంగ్రెసు వెనక్కి తగ్గుతుంది కాబట్టి, నైతిక విజయం సాధించినట్లే! కేసీయార్‌కి అన్నీ ప్లస్సులే! ఒకవేళ స్పీకరు రాజీనామాను ఒప్పుకున్నా పోయేదేమీ లేదు, అది ఆయనకు మరింత లాభమే!

కాంగ్రెసు: దిమ్మెరపోయింది అనే మాట కాంగ్రెసుకు బాగా సరిపోతుంది. స్వయంగా కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడే ఇవ్వాళ కాంగ్రెసు పార్టీని చిన్నబుచ్చాడు.
  • ఎమ్మెస్: రాజీనామా సవాలు విసరడంలో తప్పేమీ లేదు. ఎటొచ్చీ ఊహించని జవాబుతో తల బొప్పి కట్టింది. అయినా గంభీరంగానే రాజీనామాకు సిద్ధపడ్డాడు. కాస్త పరువు నిలబెట్టుకున్నాడు.
  • ఇక కేకే.. లొడలొడా మాట్లాడ్డమే తప్ప ఆలోచించడం ఉండదు. (ఇంటర్వ్యూలిచ్చేటపుడు చూడండి.. అడిగేవాణ్ణి ప్రశ్న పూర్తిగా అడగనివ్వడు, సగంలోనే అందుకుని సమాధానం ఇచ్చేస్తాడు. ఆ మధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం సాయంత్రపు ఫోనాఫోనీ కార్యక్రమంలోనైతే, ప్రశ్నలడిగేవాళ్ళపై ఎదురుదాడి చేసాడు! విషయ పరిజ్ఞానం ఉన్నవాడు అలా చెయ్యడు.)
మొత్తమ్మీద, కాంగ్రెసు తనకు తానుగా అంటించుకున్న ఈ బురదను కడుక్కున్నా, మరక పోదు. చొక్కాను మార్చేసి వేరేది తొడుక్కుంటారా? కావచ్చు!

12, సెప్టెంబర్ 2006, మంగళవారం

అరాచకీయుడిని ఎదిరిద్దాం!

0 కామెంట్‌లు
పుట్టపర్తి వారి విగ్రహానికి ఓ అరాచకీయుడు చేసిన అపచారంపై ఈ పిటిషన్ను (http://www.petitiononline.com/Puttapar/petition.html) చూసారా? చూసి, మీ వోటు వెయ్యండి. మీ స్నేహితులకు చెప్పండి.

10, సెప్టెంబర్ 2006, ఆదివారం

ఆత్మ లేని బతుకులు

5 కామెంట్‌లు
  • ప్ర ముఖ రచయిత, సాహిత్యకారుడు, శివతాండవం గ్రంథకర్త దివంగత పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహ స్థానంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నట్లు శాసనససభ్యుడు వరదరాజులరెడ్డి చేసిన ప్రకటన విమర్శకు తెరలేపింది. ఈనాడు
  • ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం కూడలిలో ఉన్న సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం రాత్రి11.15 గంటల సమయంలో తొలగించారు. ఆంధ్ర జ్యోతి
  • ఈ విషయాన్ని తెలుగు బ్లాగులోకపు దృష్టికి తెచ్చిన త్రివిక్రమ్ గారి బ్లాగు,
  • క్రిస్పీన్యూస్

కొందరు.. కొత్తబాటలు వేసుకుంటూ తమ వెనకున్న వారికి మార్గదర్శనం చేసే దార్శనికులు
మరికొందరు.. తప్పో ఒప్పో.. ముందు నడిచే వారి అడుగుజాడల్లోనే నడుస్తూ వెళ్ళే అనుచరులు.
ఇంకొందరు.. తమ ముందు నడిచిన వారి అడుగుల జాడలు చెరిపేసుకుంటూ వెళ్తారు.
ఈ మూడో రకానికి చెందిన వారే ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని తొలగింపజేసిన వాళ్ళు. తాలిబన్లు అని వీళ్ళకో పేరు కూడా ఉంది.

డబ్బే ప్రధానం, అధికారమే పరమావధిగా ఏదైనా చేసే నేలబారుతనం
నాయకుడి చల్లని చూపుల కోసం గడ్డి కరిచేందుకు కూడా వెనకాడని చవకబారుతనం
కుర్చీ కోసం పై కుర్చీలోని అయ్యనో, అమ్మనో మెప్పించేందుకు వాళ్ళ చెప్పులు నెత్తినెట్టుకుని ఊరేగే చవటతనం
తల తెల్లగా ముగ్గుబుట్టైనా, దాని లోపల లేశమైనా లేని జ్ఞానకోశం
మనవాళ్ళపై మనకుండాల్సిన కనీస అభిమానం కరవైన ఆత్మాభిమానం లేని బతుకులు
ఆత్మను అమ్ముకున్న బతుకులు
అసలు ఆత్మే లేని బతుకులు

కలిసి చేసిందే..
ప్రొద్దుటూరులో సరస్వతీపుత్రుని స్మృతి చిహ్నానికి జరిగిన అపచారం, ఆంధ్ర సరస్వతికి జరిగిన అవమానం


ఏమాశించి వీళ్ళీ పని చేసారో, అది నెరవేరకుండుగాక!

9, సెప్టెంబర్ 2006, శనివారం

శంఖారావం - తెలంగాణ కాంగ్రెసు నాయకులెక్కడ? ఎక్కడ??

2 కామెంట్‌లు
తెరాస తన ఉద్యమ మూడో దశను ఉరుములు మెరుపులతో మొదలెట్టింది. మొదటి దశ 2001 నుండి, 2004 మే వరకు జరిగింది. తెరాస శరవేగంగా ఎదిగిన దశ అది. 2004 మే నుండి మొన్నటి రాజీనామాల దాకా జరిగినది రెండో దశ, సుషుప్తి దశ. ఢిల్లీలో ఏం చేసారో తెలీదు గానీ, ఉద్యమం అచేతనంగా కనిపించింది. కేసీయార్ దీన్ని వ్యూహాత్మక మౌనం అంటారు. కావచ్చు! ఇప్పుడిక మూడో దశ ఆర్భాటంగా మొదలైంది. మూడో దశ ఎలా మొదలెట్టాలని తెరాస ఆశించిందో సరిగ్గా అలాగే చేసింది. నిరాహారదీక్షపై వచ్చిన విమర్శలను తిప్పిగొడుతూ జరిగిన ఈ సభ తెరాసకు, కేసీయార్‌కూ చాలా కీలకమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇదో మేలిమలుపు. ఈ సభలో కేసీయార్ ధోరణిలో కొద్ది తేడా వచ్చినట్లుగా కనిపించింది. ముఖ్యంగా గమనించినవి ఇవి.

  1. తెలంగాణ పట్ల తన నిబద్ధతను ప్రజలకు చెప్పాడు.
  2. పూర్తిగా తెలంగాణ కాంగ్రెసు నాయకుల పైనా, వైయెస్ పైనే ఆయన గురి. సోనియాను పల్లెత్తి మాట అనలేదు. కేంద్రం త్వరలోనే తెలంగాణ అనుకూల ప్రకటన చేస్తుందని తెరాస ఆలోచిస్తున్నట్లు దీన్ని బట్టి అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ రాదు అని వాళ్ళకు ఖచ్చితంగా తెలిస్తే, బహుశా సోనియానూ వదిలేవారు కాదు.
  3. కేసీయార్ ప్రసంగం ఇదివరకటిలా కాక, సంయమనంగా ఉన్నట్లు అనిపించింది. ఇదివరలో ఉన్న ధోరణి వలన తెలంగాణ వ్యతిరేకుల సంఖ్య పెరగడం తప్ప వేరే ప్రయోజనం లేదని గ్రహించినట్లున్నారు. నరేంద్ర ప్రసంగం గురించి ఎప్పట్లాగానే పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.
మొత్తమ్మీద సిద్ధిపేట శంఖారావంలో మనకు వినబడేవి ఇవి:
  1. తెరాసకు ప్రజల మద్దతు ఉంది.
  2. తెరాసకు కేసీయార్ తిరుగులేని నాయకుడు.
  3. మేథోవర్గం తెరాస వెన్నంటే ఉంది.
  4. కాంగ్రెసుకు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఇక కష్టాలే.
  5. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదో కాంగ్రెసు జవాబు చెప్పుకు తీరాల్సిన పరిస్థితి కల్పించబోతున్నారు. 'సోనియాకు వదిలేసాం, ఏ సంగతీ ఆమె తేల్చి చెప్పేదాకా మేమేం మాట్లాడం' లాంటి సొల్లు కబుర్లు కాంగ్రెసు వాళ్ళకిక కుదరక పోవచ్చు. దసరా తరువాత తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియా వద్దకు బారులు తీరవచ్చు.
  6. పాపం, తెరాస తిరుగుబాటు నేతలది దిక్కుతోచని స్థితి

మలిమలుపు: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తరువాతి మలుపు, మంత్రివర్గ విస్తరణ. దసరాకు జరగొచ్చంటున్నారు. విస్తరణలో పదవులు దొరికిన తెలంగాణ కాంగ్రెసు నాయకులు పదవీ వ్యామోహ విముక్తులవుతారు, దొరకనివారు పదవీ విరక్తులవుతారు. ఇప్పటి మంత్రులు కొందరు పదవీ విముక్తులైనా కావచ్చు! పదవులు దొరికిన వారికి పెదవులు ఎలాగూ విడివడవు, పదవీ విరక్తులను వైఎస్ ఎలా కాపాడుకుంటారో చూడాలి.

ఇక, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు వివాదంపై వైఎస్ ఏదో ఒకటి చెయ్యకుంటే, అది పుంజుకునే అవకాశం కనబడుతోంది. తెరాసకు అదో అస్త్రం కాబోతోంది. అలాగే ఇతర ప్రాజెక్టులు కూడా.

తెలంగాణ వస్తుందా రాదా అనేది ఎప్పటిలానే శేషప్రశ్నే! కానీ ఒకటి మాత్రం విస్పష్టం.. తెలంగాణ వస్తే మా ద్వారానే రావాలి అనే కాంగ్రెసు కోరిక ఇక తీరదు. ఆ అవకాశం తెరాస కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడే ఉండేది. ఇకపై తెలంగాణ అంటూ వస్తే అది తెరాస ఘనతే!

7, సెప్టెంబర్ 2006, గురువారం

భావ దారిద్ర్యం, భావ దాస్యం - మలి పర్వం

6 కామెంట్‌లు
భావదాస్యంపై నా గత జాబుకు కొనసాగింపు ఇది.

మన భావ దాస్యానికి మరో గుర్తు మన ప్రజా సదుపాయాలకు మనం పెట్టుకున్న పేర్లు. చాలావాటికి జాతీయ నాయకుల పేర్లే. అక్కడక్కడా, పెద్దగా ప్రాముఖ్యం లేని వాటికి మాత్రమే తెలుగువారి పేర్లు పెట్టుకుంటాం. జాతీయ నాయకులపై నాకేమీ చిన్న చూపు కాదు. 'ఏఁ, మనకాపాటి నాయకులు లేరా' అని బాధ అంతే! జాతీయ స్థాయి కెదిగిన మన వారన్నా మనకు అలక్ష్యమే! ప్రతీ దానికీ గాంధీలు, నెహ్రూల పేర్లేనా? పీవీలు, ప్రకాశాలు, సంజీవ రెడ్డిలు, బూర్గుల, సురవరం, పట్టాభిలు కనపడరే?
ఇందిరా సాగరు, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, రాజీవ్ రహదారి, లాల్ బహదూర్ స్టేడియం, నెహ్రూ జూలాజికల్ పార్కు, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు, రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం, రాజీవ్ పల్లెబాట, మహాత్మా గాంధీ బస్సు స్టేషను, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను అని పేర్లు పెట్టుకున్నాం.
నెల్లూరు జిల్లాకు అమరజీవి పేరు పెట్టే విషయమై కొట్టుకు చచ్చారు మనవాళ్ళు. చివరికి అరవ్వాళ్ళు పెట్టుకున్నట్లు వింతగా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టాలని తీర్మానించినట్లున్నారు. అదే ఏ ఎల్లయ్యగాంధీ అనో పుల్లయ్యనెహ్రూ అనో ఫలానాపటేల్ అనో పెడదామంటే చంకలెగరేసుకుంటూ సరే సరే అనేవాళ్ళే!
అల్లూరి సీతారామరాజు పేరిట ఏమన్నా ఉన్నాయేమో గమనించారా ? కన్నెగంటి హనుమంతు, కొమరం భీము, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య.. అందరూ విస్మృత వీరులే! కందుకూరి, చిలకమర్తి, గురజాడ, గిడుగు, సురవరం వంటివారు మనకు ఆనరు. రవీంద్ర భారతి పెట్టిన మనవారికి వేమన, కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గుర్తు రాలేదు. (నన్నయ విశ్వవిద్యాలయం పెట్టడం సంతోషించదగ్గ విషయం). తమిళులు సుబ్రహ్మణ్య భారతి పేరిట విశ్వవిద్యాలయం పెట్టుకున్నారు. వాళ్ళ శిలప్పాదికారం గురించి, తిరుక్కురళ్ గురించి మామూలు తెలుగువాణ్ణైన నాకూ తెలిసింది. మరి మన కళాపూర్ణోదయం గురించి, వేదసమానమైన వేమన పద్యాల గురించి వాళ్ళకు తెలుసా? (మనకే సరిగ్గా తెలీదు!) తలగుడ్డతో, మెలిదిరిగిన మీసాలతో ఉండే సుబ్రహ్మణ్య భారతి బొమ్మ మనకు సుపరిచితమే. తెలుగు గురించి ఆయన చెప్పిన తమిళ మాటలు మనకు వచ్చు కూడాను. మరి మన శ్రీశ్రీ , గురజాడల బొమ్మలు వాళ్ళకు తెలుసా? వాళ్ళకు తమవాడి గురించి చెప్పుకోడం తెలుసు, మనకు తెలవదు. మనవాళ్ళంటే మరీ చులకన, పైవాడంటే పరమ గౌరవం. అంతే!
ఇక్కడో విషయం.. ఆకలిరాజ్యం సినిమా తీసేటపుడు బాలచందర్‌కు వాడీ వేడీ కలిగిన కవితలు అవసరమయ్యాయి, హీరో నోట పలికించేందుకు. అదేదో తమిళ సినిమాలో (తమిళ ఆకలిరాజ్యమేమో మరి) భారతి పాటలు పెట్టుకున్నాడట, ఆ స్థాయిలో ఉండే పాటలు కావాలి అని ఆయన వెతుకులాట! శ్రీశ్రీ కవితలు విన్నాక పరవశించి పోయాడట. (ఏమాటకామాటే.. ఆ కవితలకు కమలాసనుడు న్యాయం చెయ్యలేకపోయాడు, గొంతు కుదరలేదు!)

మనవాళ్ళంటే మనకెంత నిర్లక్ష్యమంటే - "మాకొద్దీ తెల్లదొరతనము" అని పాడిన గరిమెళ్ళ అవసానదశలో దుర్భరమైన జీవితం గడిపాడట. ప్రభుత్వం ఆయనకు సాయం చెయ్యలేదు. పూట గడవని దయనీయమైన స్థితిలో అడుక్కున్నాడట.

మన పరాధీన మనస్తత్వానికి, చిన్నదే, మరో నిదర్శనం..
ఓం ఎలా రాస్తాం? సంస్కృతంలో రాస్తాము తప్ప అచ్చ తెలుగున ఓం అని రాయడం బహు అరుదు! అయ్యప్ప భక్తి మన రాష్ట్రాన ప్రబలినాక, సంస్కృత ఓం తో పాటు మలయాళ ఓం కూడా చూస్తున్నాం.

భగత్ సింగు, చంద్రశేఖరు ఆజాదుల గురించి తెలీని తెలుగు వాడుండడు. రాష్ట్ర సరిహద్దుల బయట మన అల్లూరి సీతారామరాజు గురించి ఎందరికి తెలుసు? అనుమానమే! (ఇహ కన్నెగంటి హనుమంతును గురించి, పుల్లరి సత్యాగ్రహం గురించైతే మనకే సరిగ్గా తెలీదు.) చదువూ సంధ్యల్లేని ప్రజలతో చిన్నపాటి సైన్యాన్నే ఏర్పాటు చేసి, ఓ రెండేళ్ళ పాటు తెల్లవాడితో అల్లూరి స్థాయిలో సాయుధ పోరాటం చేసిన మొనగాడు భారత స్వాతంత్ర్య చరిత్రలో బోసు కాక మరొకరున్నారా? తానొక్కడే పోరాడడం కాదు, వందలాది మంది గిరిజనులతో చెయ్యీ చెయ్యీ కలిపి వాళ్ళ చేత పోరాటం చేయించాడు. రెండేళ్ళ పాటు తెల్లోణ్ణి అల్లాడించాడు. అదీ అల్లూరి గొప్పదనం! పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు పెట్టే విషయం కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నలుగుతూ ఉంది. ఇదే అల్లూరి ఏ సింగో, బోసో అయ్యుంటే దేశం మొత్తం కళ్ళకద్దుకుని పూజించి ఉండేది కాదా? అప్పుడు మనమూ అల్లూరిని నెత్తినెట్టుకుని ఊరేగేవాళ్ళమే!

6, సెప్టెంబర్ 2006, బుధవారం

వందేమాతరం!

5 కామెంట్‌లు
మహాత్మా గాంధీ తర్వాత అంత ప్రజాదరణ పొందినది, వందేమాతరం.
స్వాతంత్ర్య రథానికి చోదక శక్తి, వందేమాతరం!
స్వాతంత్ర్య యోధుల దేహాలపై తెల్ల లాఠీలు చేసిన గాయాలకు మందు, వందేమాతరం!
తుపాకుల తోటీ, ఉరితాళ్ళతోటి తెల్లవాడు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నవేళ వారి చివరి కేక, వందేమాతరం!
మన జాతీయ గేయం, వందేమాతరం!

జాతీయ గేయం పాడననడం హేయం!
వందేమాతరం ను పాడమని చెబుతూ తోటి భారతీయుల మనసుల నుండి దూరం జరిగిపోతున్నామన్నది గ్రహిస్తున్నట్లు లేదు, వీళ్ళు.

పాడకపోవడాన్ని సమర్ధించడం ద్రోహం!
రేపు మరో మతస్తుడు 'నేను జాతీయ జండాను ఎగరెయ్యను, అది మా మతాచారాలకు విరుద్ధం. లేదా మా మతజండా కంటే తక్కువ ఎత్తులో మాత్రమే ఎగరేస్తాను' అంటే కూడా సమర్ధిస్తారేమో ఈ ద్రోహులు.

అవున్లే, సమర్ధించడం సమర్ధించకపోవడం అన్నది ఆ మతస్తులకు ఎన్ని వోట్లు ఉన్నాయనేదాన్ని బట్టి ఉంటుంది కదా!

5, సెప్టెంబర్ 2006, మంగళవారం

లోక్‌సత్తా పార్టీ అవసరమా?

6 కామెంట్‌లు
అవసరమే!

లోక్ సత్తా పార్టీ ఏర్పడబోతోంది. పార్టీ పెట్టే విషయంపై రకరకాల అభిప్రాయాలు వినవచ్చాయి. నాకూ నా అభిప్రాయం రాయాలనిపించింది. ఓటేసే ప్రతీ ఒక్కరికీ ఈ విషయంపై అభిప్రాయం ఉండి తీరుతుందని నా ఉద్దేశ్యం.

లోక్ సత్తాకు వ్యతిరేకంగా వినవచ్చిన అభిప్రాయాలు : (నీలాలు నా వ్యాఖ్యలు)
  1. సంఘ సేవ అంటూ మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగడం ఏంటి? పైకి కబుర్లు చెబుతున్నారు గానీ, వీళ్ళు పైనుంచి దిగివచ్చిన వారేం కాదు. నిజమే సంఘసేవ అంటూ మొదలెట్టారు. కాని వాళ్ళ కార్యక్షేత్రం మాత్రం మొదట్నుండీ రాజకీయాలే గదా! అయినా.. సంఘసేవ చేస్తామని మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగితే తప్పేంటి?
  2. జయప్రకాశ్ నారాయణా, ఆయన చుట్టూ ఉన్నవారు అంతా ఒక కులానికే చెందిన వారు. ఇది ఒక కుల పిచ్చి పార్టీ కాబోతోంది. జయప్రకాశ్ నారాయణ చుట్టూ ఉన్నవారు ఆయన కులస్తులే అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆ పార్టీ నడవడికను గమనించేందుకు, వారి విధానాలను పరిశీలించేందుకు ఆపై నిర్ణయం చేసుకునేందుకు మనకింకా దాదాపు మూడేళ్ళు సమయముంది. చూద్దాం ఎలా ఉండబోతున్నారో! ఇప్పుడే వద్దనడమెందుకు?
  3. డబ్బు లేని రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, నేర మరకలు లేని రాజకీయాలు అంటూ ఉపదేశాలు చెప్పిన వాళ్ళు వీళ్ళు. నిజంగా అలాగే రాజకీయాలు నడపబోయినపుడు, వీళ్ళకు తెలిసి వస్తుంది, అవి లేకుండా రాజకీయాలు నడపడం ఈ రోజుల్లో కుదరదని. నిజమే, కష్టమే! కానీ నడుపుతానంటున్నాడు గదా, ఎలా చేస్తాడో చూద్దాం. చేస్తే అంతకంటే కావలసిందేముంది? చెయ్యలేకపోతే మనకు పోయేదేమీ లేదు కదా!
  4. రామారావు లాంటి సమ్మోహకుడు ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ జయప్రదం అయింది. అంతటి ప్రజానాయకుడు లోక్ సత్తాకు లేరు కాబట్టి అది విఫలమౌతుంది. అది లోటే! కానీ అంతమాత్రాన రాజకీయాలకు పనికిరారని కాదు గదా!
  5. ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకు సామాన్యుల బాధలు తెలవ్వు ఇలాంటి వ్యాఖ్య ఒకే ఒక్కరు చెయ్యగా విన్నాను. ఆయన పీసీసీ అధ్యక్షుడు. మరెవరూ ఇటువంటి విమర్శ చెయ్యగా నేను వినలేదు. (అందుకే ఆయన కేశవరావు అయ్యారు.) దీని గురించి మాట్లాడ వలసిన అవసరం లేదు. ఇదొక పసలేని వాదన.
  6. స్వయంగా తనే రాజకీయాల్లోకి దిగి, జయప్రకాశ్ నారాయణ తన విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నాడు. "రాజకీయాలనేవి మంచివారు ఉండదగినవి కావు, అదో మురుగ్గుంట, పందులకు మాత్రమే అనుకూలం" అనే భావనతో మనమున్నాం. అంచేతే ఈ విశ్వసనీయత విషయం తలెత్తింది.
నా ఉద్దేశ్యంలో అన్నిటి కంటే ముఖ్యమైన అంశం ఒకటుంది..
ప్రస్తుతం మనకు రెండే శక్తులున్నాయి.. అయితే కాంగ్రెసు, లేదంటే తెలుగుదేశం. విధానాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి అవలక్షణాల్లొ ఈ రెంటికీ పెద్ద తేడా లేదు. ఇక కాస్తో కూస్తో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు బలమైన శక్తి కాదు. ఈ పరిస్థితుల్లో మనకు ఒక మూడో శక్తి కావాలి. మూడో పార్టీ కాదు, ఒక శక్తి కావాలి. ఓటేసేందుకు మనకు మరో వికల్పం కావాలి.

నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని ఒకపక్షమంటే, ఏఁ, నువ్వు చెయ్యలేదా అని రెండోది అంటున్న రోజులివి. కాదు అని ఖండించాల్సిన అవసరం కూడా వాళ్ళకు కనిపించడం లేదు. అంతలా బరితెగించి పోయారు. వీళ్ళకు ప్రజలంటే లెఖ్ఖేలేదు. 'ఈ ఐదేళ్ళ తరువాత మనమెలాగూ ఉండము, ఆపై ఐదేళ్ళ తరువాత ఎలాగూ తిరిగి వస్తాము' అనే ధీమా అధికార పక్షానిది కాగా, ఈ ఐదేళ్ళ తరువాత మనదే రాజ్యం అనేది ప్రతిపక్షం ధీమా! మూడో శక్తి ఉంటే ఆ ధీమా ఉండదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

లోక్‌సత్తా చెబుతున్న సిద్ధాంతాలను ఆచరణలో పెడితే అది మూడో శక్తి కాగలదనే నా నమ్మకం. అప్పుడు మన రాజకీయాలు మంచికి మళ్ళుతాయి. చూద్దాం, లోక్‌సత్తా మూడో శక్తిగా ఏర్పడుతుందేమో!

2, సెప్టెంబర్ 2006, శనివారం

సినిమా పాటలూ మన పాట్లూ

5 కామెంట్‌లు
శ్రీశ్రీ స్నేహితులతో కలిసి ఒక నాటకం చూస్తున్నారట. నటులు తమ తమ మాటలు, పాటలు, అభినయాలతో శాయశక్తులా బాదేస్తున్నారు. ఒక నటుడు పాతాళ లోకం గురించి పద్యమేదో పాడుతూ.. చెయ్యి పైకెత్తి చూపించాడట. శ్రీశ్రీని స్నేహితుడు అడిగాడు.. "ఏంటండీ, పాతాళం అని పాడుతూ చెయ్యి ఆకాశం కేసి చూపిస్తాడేమిటీ" అని. శ్రీశ్రీ ఇలా జవాబిచ్చారు.. "ఈ ప్రదర్శన స్థాయి పాతాళాని కంటే దిగువకు పడిపోయింది. అందుకే పాతాళం అంటే పైకి చూపిస్తున్నాడు"

మన తెలుగు సినిమా పాటల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అదే!

పాటలెలా ఉండాలి..
మంచి సాహిత్యం ఉండాలి, బూతు కూతలు కాదు
విన సొంపుగా ఉండాలి, వాయిద్యాల హోరు కాదు
కథలో భాగంగా ఉండాలి, అతికినట్లుగా కాదు
నటులేసే గెంతుల కోసం కాదు, నటుల అభినయం కోసం ఉండాలి

పాటలెలా ఉన్నాయి:
గోల గోలగా ఉన్నాయి, భాషను చంపుతూ ఉన్నాయి.
చాలా పాటల్లో వాయిద్యాల మోతల మధ్య సాహిత్యం వినబడదు.
రచయితలు చేస్తున్న భాషా హత్యను సంగీత దర్శకులు ఇలా మోతల మాటున దాస్తున్నారా!?
ఇక గాయకులు.. ఘంటసాల, బాలు, సుశీల, జానకి లాగా చక్కగా పాడేవారేరీ? ఒకడు ముక్కుతో పాడతాడు, ఇంకోడు చెవుల్తో పాడతాడు. శ పలకమంటే ష అంటారు. అసలు తెలుగే రాదాయె, ఇవెలా వస్తాయి. "రామా చిలకమ్మ" అని రాస్తే "రామ్మా చిలకమ్మా" అని పాడేసాడో ముక్కు తిమ్మన! శ్రీ రామదాసు సినిమాలో ఓ పాటలో తండ్రీ అనమంటే తన్రీ అని పాడిందొక గాయనీమణి. ఫ్యాషననుకుందేమో మరి! మన దిగ్దర్శకులకు ఇలాంటివి ఎలా నచ్చుతాయో!?
ఎందుకిలా ఉన్నాయి:

బాగా రాసేవారు, రాయగలిగే వారు లేక కాదు.. రాయించుకునే వారు లేక! సినిమా వాళ్ళు నలిగిన బాటలో నడిచేందుకు ఇష్టపడతారు. ఓ సినిమా బాగా ఆడితే, పేరు దగ్గర్నుండి, ప్రతీ విషయంలోనూ దాన్ని అనుకరిస్తారు, విజయం తెస్తుందన్న నమ్మకంతో! అంచేతే, స్వతహాగా సృజనాత్మక మాధ్యమమైన సినిమా కేవలం చవకబారు వినోద సాధనంగా అయిపోయింది. మహా అయితే సాంకేతిక నైపుణ్య ప్రదర్శనలా ఉంటోంది. సృజనాత్మకతాలేమికి మొదటగా బలయ్యేవి మాటలూ, పాటలే!

ఎక్కడో తమ సృజనాత్మక శక్తిపై నమ్మకం ఉన్నవారి నుండి మాత్రం చక్కటి సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో పాటలు కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది.

చెత్త పాటలకు మరో కారణం.. మన హీరోలు తమ చుట్టూ కట్టుకున్న మిధ్యా లోకం. ఇమేజీ అనే సంకెళ్ళు తగిలించుకున్న వీళ్ళ సినిమాల్లో పాటలు వాటి కథల్లాగే అదే చచ్చు పుచ్చు ధోరణిలో సాగుతాయి కాబట్టి, అవి అలాగే నేలబారుగా ఉంటాయి.

(ఇలాంటి పాటలు ఎందుకు పెడుతున్నారయ్యా అంటే, కొందరు చవటాయిలు "ప్రేక్షకులు అవే కోరుతున్నారు, మేమూ అవే ఇస్తున్నాము" అని అంటారు.)

ఇక..
నా ఇష్టాయిష్టాలను రాస్తానిక్కడ. సినిమా పాటల్లో మంచి సాహిత్య విలువలు కలిగినవెన్నో ఉన్నాయి. పాటల్లో నేనిష్టపడే అంశాలివి, ప్రాధాన్యతానుసారం..
  1. భావం అందంగా, హృద్యంగా, గిలిగింతలు పెట్టేలా ఉండాలి: "నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట.. నా నావ మీద కాలుపెడితే ఏటౌతాదో తంట" ఇలాంటి భావాలు గుండెకు హత్తుకుంటాయి. "తికమక మకతిక పరుగులు ఎటుకేసీ".. శ్రీ ఆంజనేయం లోని పాట ఇది. ఈ పాటలోని "శ్రీరామ చందురుణ్ణీ.. కోవెల్లొ ఖైదు చేసీ, రాకాసి రావణుణ్ణీ గుండెల్లొ కొలువు జేసీ.." అనేది నాకు బాగా నచ్చిన వాక్యం.
  2. పదాలతో చమత్కారాలు నచ్చుతాయి: ఇందులో వేటూరి ఉద్దండుడు. "శంకరా నాద శరీరా పరా.." పాట రెండో చరణంలో 'గంగ' తో ఆయన ఆడుకున్న అంత్య ప్రాసల ఆటలాంటివి నాకు బాగా ఇష్టం. అదిక్కడ రాసి నా ముచ్చట తీర్చుకుంటాను..

    పరవశాన శిరసూగంగ
    ధరకు జారెనా శివగంగ
    నా గానలహరి నువు మునుగంగ
    ఆనంద వృష్టి నే తడవంగ

  3. పద గాంభీర్యం నచ్చుతుంది: "చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన.." పాట, పద గాంభీర్యతకు ఓ మచ్చు తునక. నాకు నచ్చినది.
  4. సంగీతం: వీటి తరువాతి స్థానం సంగీతానిది.
ఏ రకమైన పాటలు నాకిష్టం..
భక్తి పాటలు: సినిమా పాటలే కాక కీర్తనలు, పదాలు కూడా ఇందులో చేరాయి. కొన్ని పాటలుంటాయి.. దేవుడి అనేకానేక పేర్లను ఒక పద్ధతిలో కూర్చి పాటగా రాసేస్తారు. నాకలాంటివి నచ్చవు. నాకు బాగా నచ్చిన పాటలు చాలానే ఉన్నాయి గానీ, ఇక్కడ ఒక్క రామదాసు కీర్తనను ఉదహరిస్తాను.. " ఓ రఘువీరా.. యని నే పిలిచిన, ఓహో యనరాదా" బాలమురళీకృష్ణ పాడిన ఈ కీర్తన (శ్రీ రామదాసు ప్రాజెక్టు, ఖమ్మం వారి విడుదల) నాకమిత ఇష్టం. ఇక ఘంటసాల భగవద్గీత గురించి చెప్పేదేముంది.. నారాయణుడు చెప్పగా విని, నరుడు తరించి పోయాడు. ఘంటసాల బోధించగా విని నరులు తరించి పోతున్నారు. ప్రస్తుతం సురులను తరింప జేస్తున్నాడాయన! గీతను ఇంతకంటే బాగా ఎవరూ పాడలేరేమో! అలాగే, ఎమ్మెస్ రామారావు గారు మనయెద పలికించిన సుందరకాండము నాకు ఎంతో ఇష్టమైన గేయ కావ్యం. శ్రీకృష్ణుడు ఘంటసాల చేత భగవద్గీత చెప్పించాడు, హనుమంతుడు రామారావు గారి చేత సుందరకాండను చెప్పించాడు. తెలుగువారి లంకె బిందెలివి.

శృంగార పాటలు (దుష్ట సమాసమేమో గానీ, నాకు అలా అనడమే ఇష్టంగా ఉంది): సున్నితమైన శృంగారంతో కూడిన పాటలు ఇష్టం. "ఎంతటి రసికుడవో తెలిసెరా.." లాంటి పాటలు ఇష్టం. గుంభనంగా లేకున్నా.., వెకిలిగా లేని శృంగార రసమూ ఇష్టమే! ఉదాహరణకు.. "మన్నేల తింటివిరా కృష్ణా.." అంటూ స్మిత పాడే పాట. ఛత్రపతి సినిమా అనుకుంటాను. సినిమా చూడలేదు, పాటను మాత్రం యాదృచ్ఛికంగా విని, దానికి అభిమానినైపోయాను.

తాత్విక, విషాద గీతాలు: వీటిలో ముందు వరుసలో ఉండేవి బాలమురళీకృష్ణ తత్వాలే! వాటిలో "గూడు.. చిన్నబోయెరా!" నాకెంతో ఇష్టమైనది. "యాతమేసి తోడినా ఏరు ఎండదు" - జాలాదిని చిరస్మరణీయుడిని చేసిన ఈపాట నాకు బాగా ఇష్టం.

చివరగా..
మంచి మంచి పాటలు వినడం కంటే ఇష్టమైనది నాకొకటుంది. అది..
ఆ పాటలు పాడుకోవడం! పాడుకుంటుంటే ఉండే తృప్తి వింటే రాదు.

1, సెప్టెంబర్ 2006, శుక్రవారం

భేష్, రాష్ట్ర ప్రభుత్వం

0 కామెంట్‌లు
మేకల రాజ్యలక్ష్మి! కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక. ఎమ్సెట్ పరీక్షలో ర్యాంకు తెచ్చుకుని, మెడికల్ కాలేజీలో సీటూ పొందింది. దురదృష్టం.. అంత చదువులు చదివే ఆర్థిక తాహతు లేదీమెకు. (ఒకరోజు టీవీలో చూపించారు, ఆమె పొలంలో పనిచేసుకుంటూండగా!) సీటు కోసం తపించే వాళ్ళు, సీటు రాక లక్షలూ కోట్లూ పోసి చదివే వాళ్ళు, చైనాలు, జపానులూ వెళ్ళి మరీ చదువుకునే వాళ్ళు ఉన్న కాలమిది. మన రాష్ట్రంలోనే సీటొచ్చీ.., చేరలేని నిస్సహాయత తలుచుకుంటే ఏ సంబంధమూ లేని మనలాంటి వారికి కూడా ఉసూరనిపించక మానదు. అలాంటిది, ఇక ఆమె వేదన ఊహించరానిదేమీ కాదు.

సరైన సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆదుకుంది. "
ఆమె డాక్టర్‌ కావాల్సిందే. స్టెతస్కోప్‌ పట్టాల్సిందే. ఆమె సేవలు సమాజానికి ఉపయోగపడాల్సిందే'" అని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారట. ఆమెలాంటి వారికి సహాయం అందించేందుకు ఏదో పథకాన్ని కూడా తయారు చేస్తారట.

ఇంత మంచి పని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు!

30, ఆగస్టు 2006, బుధవారం

రాంగురోడ్డు బాధితులు

2 కామెంట్‌లు
ప్రభుత్వంలో పలుకుబడి కలిగినవారు, మాన్యులు తమ ఇష్టం వచ్చినట్లు రింగురోడ్డును మెలికెలు తిప్పినపుడు సామాన్యులు మొదటిసారి నష్టపోయారు. ఆగస్టు 30 న శాసనసభలో అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి వాళ్ళని మరోమారు దెబ్బకొట్టారు. శాసనసభలో భూసేకరణ విషయమై చర్చలో పాల్గొన్న తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ మంచి మంచి పాయింట్లు లేవనెత్తుతూ, ప్రభుత్వం, అధికారులు కలిసి సామాన్యుడిని ఎలా వంచించారో గణాంకాలతో సహా వివరిస్తూ ఉన్నారు. ఒక అరగంట పాటు సాగిన ఆ ప్రసంగం చూసిన వారికెవరికైనా అనిపిస్తుంది.. శాసనసభలో ఈ మధ్య కాలంలో జరిగిన అర్థవంతమైన ప్రసంగాల్లో ఇది ఒకటి అని. ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు ఉన్నాయి ఆయన ప్రసంగంలో!

ఇక అప్పుడు మొదలైంది రభస! స్పీకరిచ్చిన అవకాశంతో, మైకందుకుని మాట్లాడే వారిని మాట్లాడనివ్వకుండా అడ్డగోలుగా అడ్డుతగిలే రకాలు రెండు పక్షాల్లోను ఉన్నారు. కాంగ్రెసు సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి దేవేందర్ గౌడ్‌ను 'నువ్వు అక్రమంగా భూములు సంపాదించావు', 'చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెబుతావేంటీ' అంటూ మాట్లాడారు. చిరాకొచ్చిన గౌడ్, ఆవేశంతో 'ఏఁ, మాకు సంపాదించుకునే హక్కు లేదా' 'మేమేమీ మీలాగా గూండా గిరీ, రౌడీయిజం చేసి సంపాదించలేదే' అంటూ ఊగిపోయారు. ఇక గోల మొదలు. నన్ను వ్యక్తిగతంగా దూషించారు, క్షమాపణ చెప్పాలంటూ రామకృష్ణారెడ్డి డిమాండు. దానికి వంత పాడుతూ కాంగ్రెసు ఛీఫ్ విప్పు కిరణ్ కుమార్‌రెడ్డి అడ్డు తగలడం. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడడం తప్పని అనడం.. ఇలా సాగింది ఒక గంట. ఈలోగా రోశయ్య గారు లేచి, సభను కాస్సేపు వాయిదా వేసి, అసలు గౌడ్ ఏమన్నారో రికార్డుల్లో పరిశీలించి, ఆపై నిర్ణయం తీసుకొమ్మని స్పీకరుకు సూచించాడు. రోశయ్య అన్న మాటతో స్పష్టమైపోయింది, ప్రభుత్వానికి ఈ విషయంపై చర్చించడం ఇష్టం లేదని, అందుకే వాయిదా కోరుతున్నారని. చిత్రమేమిటంటే, అదే రోశయ్య గారు (శాసనసభా వ్యవహారాల మంత్రి) రెండు నిమిషాల్లోనే ఆ రికార్డును ప్రింటు తీయించి మరీ చదివారు, గౌడ్ ఏమన్నారో. ఈ మాత్రం దానికి సభను వాయిదా వెయ్యమని అడిగాడా పెద్దమనిషి!

పోనీ, కాంగ్రెసు చర్చను పక్కదారి పట్టిస్తోందనే జ్ఞానం ఉందా ప్రతిపక్షానికీ? ఎబ్బే.. అదేఉంటే వెంటనే సారీ చెప్పి చర్చను కొనసాగించి ఉండే వారే కదా! సారీ ఎందుకు చెప్పాలని వాళ్ళ పట్టుదల. అనవసరమైన పట్టుదలకు పోకుండా చర్చను ముందుకు నడిపి ఉంటే, బాధితుల గోడు కనీసం సభలో వినిపించి ఉండేది. దాదాపు పన్నెండింటికి మొదలైన రభస, ఒకటిన్నర దాకా సాగింది. ఇక స్పీకరుకు చిరాకొచ్చి, నాలుగ్గంటలదాకా సభను వాయిదా వేసారు.

ఇలాగ, శాసనసభ్యులకు మనం అప్పజెప్పిన పనిని మళ్ళీ ఎగ్గొట్టారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం అనే ఆటను తమలో తాము ఆడుకుంటూ రాజకీయులు, ప్రజల్ని మరీ ముఖ్యంగా రింగురోడ్డు బాధితుల్ని మరోసారి ఓడించారు.

26, ఆగస్టు 2006, శనివారం

వీరేశలింగం పంతులుగారి వారసత్వం

2 కామెంట్‌లు
వీరేశలింగం పంతులు గారి గురించి, ఆయన సంఘ సంస్కరణ గురించి, సాహిత్య సేవ గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. కానీ కొత్తగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆయన వారసత్వాన్ని మనమెలా కాపాడుకుంటున్నామనే దాని గురించి.

ఆగస్టు 26 మధ్యాహ్నం టీవీ9 వార్తల్లో దీని గురించి ఒక ప్రత్యేక వార్త చూసాను. ఆయన ఇల్లు ప్రస్తుతం ఒక ట్రస్టు అధీనంలో ఉంది. ప్రస్తుతం అది ఒక పేకాట గృహంగా మారిపోయిందట (టీవీ9 కెమెరాలో పడకుండా ఆ పేకాటరాయుళ్ళు ముఖాలు దాచుకోడం చూస్తే నవ్వొచ్చింది). ట్రస్టు అధిపతి మాత్రం ఇలా చెబుతున్నాడు..అక్కడ ఆటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, ఆ ఇంటి బాగోగులకే ఖర్చు పెడుతున్నారు. వీరేశలింగం పంతులుగారు కూడా పేకాట ఆడేవారు. - ఇలా చెప్పుకుంటూ పోయాడా పెద్దమనిషి. (ఏమిటో ఆసికాలు!)

ఇక మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే.. పంతులుగారు రాసిన ఎన్నో రచనలు ఓ మూలెక్కడో ఉన్నాయట. వాటి ఆలనా పాలనా చూసేవారు లేక పడి ఉన్నాయట. మన సాహిత్యాభిమానులు, నెట్లో తెలుగు బ్లాగరులూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.. ఔత్సాహికులు పూనుకుని, వాటిని యూనికోడు లోకి ఎక్కిస్తే,, మనమో మంచి పని చేసినవారమౌతాం. మహాభారతం లాగానే ఇదీ ఓ మహత్కార్యం కాగలదు. ఏమంటారు?

ప్లూటో హోదా ఏమిటి?

2 కామెంట్‌లు
ఈ మధ్య గ్రహాల సంఖ్య ఒకటి తగ్గి ఎనిమిదే అయినట్లుగా తేల్చారని పేపర్లలో వచ్చింది. ఇకనుండీ ప్లూటో గ్రహం కాదట. ఎందుకని? అది గ్రహం కాకున్నా గ్రహమని పొరబడుతూ వచ్చామా? అంతర్జాతీయ ఖగోళ సంఘం వాళ్ళ వెబ్‌సైటు చూస్తే మనక్కొన్ని విషయాలు తెలుస్తున్నాయి..
ఇప్పుడు గ్రహపు నిర్వచనాన్ని మార్చారు. కొత్త నిర్వచనం ప్రకారం ప్లూటో గ్రహం కాకుండా పోయింది. ప్లూటో గ్రహం కాకపోతే మరేంటి? మరుగుజ్జు గ్రహమట!

ఖగోళ సంఘం వాళ్ళు కొత్త నిర్వచనాలను ఇలా ఇచ్చారు.. ఈ నిర్వచనాల తయారీకి వాదనలూ, తర్జన భర్జనలూ జరిగాయట! (వారి డెఫినిషన్లకు ఇవి నిర్వచనాలు, అంతే!)

1. గ్రహం

  • సూర్యుడి చుట్టూ తిరిగేది
  • గోళాకారాన్ని నిలబెట్టుకునేందుకు కావలసినంత గురుత్వ శక్తి కలిగిఉండడం కోసం అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేది.
  • దాని కక్ష్య యొక్క ఇరుగు పొరుగులను ఖండించకుండా ఉండేది.

2. మరుగుజ్జు గ్రహం/బుల్లి గ్రహం
  • సూర్యుడి చుట్టూ తిరిగేది
  • గోళాకారాన్ని నిలబెట్టుకునేందుకు కావలసినంత గురుత్వ శక్తి కలిగిఉండడం కోసం అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేది.
  • దాని కక్ష్య తన ఇరుగు పొరుగు కక్ష్యలను ఖండిస్తూ ఉండేది.
  • ఉపగ్రహం కానిది
(ప్లూటో కక్ష్య కొంత మేర నెప్ట్యూన్ కక్ష్యను ఖండిస్తూ ఉంటుంది, అందుకే పాపం దాని హోదా తగ్గిపోయింది.)

3. ఇతర సౌర వ్యవస్థా వస్తువులు
  • సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కాని మిగతా వస్తువులన్నిటినీ కలిపి ఇతర సౌర వ్యవస్థా వస్తువులు అంటారు. ఏస్టెరాయిడ్లూ, తోకచుక్కలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
ఇక్కడ కొద్ది సందిగ్ధత.. కొత్తగా ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ అనే ఖగోళ వస్తువులను మూడో వర్గంలోకి చేర్చారు. దాని నిర్వచనం ప్రకారం ప్లూటో ఇందులోకి కూడా వస్తుంది. ఏదేమైనా ప్లూటో ప్రస్తుతం గ్రహం కాదు. కానీ హిందూ నవగ్రహాలకు మాత్రం ఏ ఢోకా లేదనుకుంటాను.

25, ఆగస్టు 2006, శుక్రవారం

తెలంగాణ ధ్వనులు

2 కామెంట్‌లు
తెలంగాణ ధ్వనులు ఇలా వినవస్తూ ఉన్నాయి:
చిన్నారెడ్డి: టీఆర్‌సీసీసీ ఏర్పాటులో ఈయనది ప్రముఖపాత్ర. ఒకప్పుడు వైఎస్‌కు సన్నిహితుడైనా, తెలంగాణ అంశంపై ఆయనతో విభేదించిన వ్యక్తి. (ఒక సందర్భంలో అప్పటి సీఎల్పీ నాయకుడు వైఎస్ తో చిన్నారెడ్డి ముభావంగా ఉంటే, ఆయనే "ఏంటి చిన్నా, నాపై కోపమా?" అని అడిగారు వైఎస్.) అలాంటి 'చిన్నా' ఇప్పుడు 'తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోంది, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదన్నట్లు'గా అభిప్రాయపడుతున్నారు. అధికార వ్యామోహం ఎన్ని పిల్లిగంతులైనా వేయిస్తుంది! రాబోయే విస్తరణలో చిన్నారెడ్డికి మంత్రిత్వం వచ్చినట్లేననుకుంటాను.
ప్రణబ్‌ముఖర్జీ: తెలంగాణపై ఏర్పాటైన కమిటీకి నాయకుడీయన. యాభై ఏళ్ళుగా రాని తెలంగాణ ఆర్నెల్లలో వస్తుందా అని అడుగుతున్నారు. ఈ ఆలోచన మనసులో పెట్టుకుని తెరాసతో ఇన్నాళ్ళుగా వ్యవహారం నడిపారంటే, ఆశ్చర్యం కలుగుతుంది. నిన్నటి దాకా ఇదుగో అదుగో అన్నారు కదా, అలా అనకుండా ఇదేమాట అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. కాంగ్రెసు పైపై కబుర్లు చెబుతూ కాలం నెట్టుకొచ్చింది. తెరాస పైపై కబుర్లు వింటూ (అవి నిజమని నమ్మినట్లు మనల్ని నమ్మిస్తూ) కాలం నెట్టింది.
టీవీ9: చత్తీస్‌గఢ్ ఏర్పాటయ్యాక అక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారయిందో చూపిస్తూ ఒక విశేష వార్తను ప్రసారం చేసారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అక్కడ నక్సలైటు పేట్రేగిపోయినట్లే తెలంగాణ ఏర్పడ్డాక కూడా అలాగే కావచ్చని భయప(పె)డుతున్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు ఎడాపెడా చెప్పేస్తున్నారు.

24, ఆగస్టు 2006, గురువారం

వాయిదా వెయ్యడమెందుకు?

7 కామెంట్‌లు
తెలంగాణపై తెరాసకు మొడిచెయ్యి చూపించినందుకు గాను వాళ్ళు రెండు రోజులుగా శాసనసభను పనిచెయ్యనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేస్తోందిదీ..

పొద్దున్నే వాయిదా తీర్మానానికై నోటీసు ఇస్తారు. వాయిదా తీర్మానమంటే - ముందనుకున్న పనిని ఆపేసి, వీళ్ళడిగిన అతి ముఖ్యమైన వ్యవహారాన్ని చర్చించాలి అని. స్పీకరు గారు దానికి ఒప్పుకోరు. దాంతో గోల చేస్తారు. సభను కాస్సేపు వాయిదా వేస్తారు. మళ్ళీ గోల చేస్తారు. మళ్ళీ వాయిదా.. ఈసారి మరుసటి రోజుకు.

ఏ పనీ చెయ్యకుండా సభను వాయిదా వేసేబదులు, వాళ్ళడిగిన విషయాన్ని చర్చిస్తే పోతుంది కదా! కనీసం దాని గురించిన చర్చన్నా జరుగుతుంది. స్పీకరు గారు ఎందుకలా చెయ్యడం లేదు? అసలేపనీ చెయ్యకుండా సభను వాయిదా వెయ్యడం ఎందుకు? శాసనసభ నిబంధనలు తద్విరుద్ధంగా ఉన్నాయా?

23, ఆగస్టు 2006, బుధవారం

రావోయీ అనుకోని అతిథీ!

1 కామెంట్‌లు
ఒక విషయం గమనించారా? బ్లాగుస్పాటులో పైన లింకుల పట్టీలో చివరన ఉన్న NEXT BLOG అనే లింకును చూసారా? అది నొక్కితే అప్పుడే తాజాకరించిన బ్లాగు మనకు కనిపిస్తుంది. నేను స్టాటుకౌంటరు గణాంకాల్లో చూస్తూ ఉంటాను, ఏ సంబంధమూ లేని బ్లాగుల నుండి నా బ్లాగుకు లింకులు వస్తూ ఉంటాయి. గమనించగా తేలిందిది.. నా బ్లాగులో నేను కొత్త జాబు పెట్టీ పెట్టగానే వచ్చిన ఈ అనుకోని అతిథులు (తిథి లేకుండా వచ్చేవారే కదా అతిథులు) ఆ లింకు ద్వారానే వచ్చారని! వాళ్ళు తమ బ్లాగుల్లో NEXT BLOG నొక్కిన సమయానికి నేను నా బ్లాగును తాజాకరించి ఉంటాను. ఏదేమైనా మన బ్లాగుకు ట్రాఫిక్కు పెరుగుతోంది, సంతోషమే కదా!

అనుకోని అతిథీ! స్వాగతం!!

ఏంటి, మీకీ సంగతి తెలుసా!? అయినా పర్లేదు, నే రాస్తాను. నేను వికీపీడియా వాడిని.. ఏదీ చిన్న విషయం కాదు, తెలుసు కాబట్టి మనకది చిన్నది, తెలియని వారికి.. అది పెద్దదే, తెలుసుకోవలసిన విషయమే.

22, ఆగస్టు 2006, మంగళవారం

రాజీనామా ఎందుకు చేసారబ్బా!?

2 కామెంట్‌లు
తెరాస కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చేసింది

ఏదో ఒక రోజున జరగాల్సిందే! కాస్త ముందు జరిగినట్లు అనిపిస్తోంది. ఇప్పుడెందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చింది? కారణాలు వెతకగలమా!?.

1. ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం: ఇది కారణం అని అనిపించడం లేదు. నమ్మకం సడలుతున్న మాట వాస్తవమే గానీ అది కేవలం తాత్కాలికం. తెలంగాణను కాగితాల మీద నుండి వాస్తవ రూపానికి తెచ్చే క్రమంలో విజయానికి అతి చేరువగా వచ్చింది, తెరాస. పైగా తెలంగాణ కోరుతున్న నాయకుల్లో కె.సి.ఆర్ అంతటి వాగ్ధాటి, ప్రజాదరణ, రాజకీయ చాతుర్యం ఉన్న నాయకుడు మరొకరు లేరు. ఈ ఎరుక ప్రజలకు ఉంది.

2. మేథోవర్గం వత్తిడి: కేసీఆర్‌కు ఇప్పటి వరకు వెన్నుదన్నుగా ఉన్న మేథోవర్గం ఆయన్ను వీడి, ప్రత్యేకంగా ఉద్యమించే అవకాశాలు కనిపించి ఉండొచ్చు. వాళ్ళు ప్రజానాయకులు కాకపోవచ్చు గానీ, ప్రజల్లో గౌరవం ఉన్నవారు! మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లోనూ, ఎన్నారైలలోను మద్దతు కూడాగట్టడంలో వీరు ప్రముఖ పాత్రే పోషించారు. ఈ సైద్ధాంతిక బలాన్ని తెరాస వదులుకోజాలదు. ఇది ఒక కారణం కావచ్చు.

3. కాంగ్రెసు తెరాసను వదిలించుకునే సూచనలు: దీనికి అవకాశం లేదు. బలహీనపడిన తెరాసను వదిలించుకోవాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెసుకు ఇలాంటి పనులు ఆత్మహత్యా సదృశమే!

4. కేంద్రానికి మధ్యంతర ఎన్నికల సూచనలు: ఒకవేళ అటువంటి సూచనలే గనక కనిపించి ఉంటే, కేసీఆర్ ప్రాప్తకాలజ్ఞతతో ఈ పని చేసినట్లే! ఇప్పటికే స్థానిక ఎన్నికలలో తగిలిన దెబ్బలకు బొప్పి కట్టిన తెరాస మరో ఎన్నికలకు కాంగ్రెసుతో కలిసి పోజాలదు. తప్పనిసరిగా సొంత బలంపైనే ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ.. 'మధ్యంతర' సూచనలు ఏమీ కనిపించలేదే! ఒక్క ఆ సర్వే తప్ప (మధ్యంతర ఎన్నికలు పెడితే కాంగ్రెసు లాభపడుతుందని ఓ సర్వే తెలిపింది)

5. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో తెరాస మద్దతుకు గండి కొడుతోంది: "తెలంగాణ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేసి, కాంగ్రెసు ప్రజల అభిమానాన్ని పొంది ప్రజలను పూర్తిగా తనవైపు తిప్పుకుంటోంది. దాంతో తెరాస ప్రాబల్యం తీవ్రంగా దెబ్బతింటోంది." ఈ వాదనను కాంగ్రెసు వాళ్ళు కూడా నమ్మరు. కేసీఆర్ నమ్మే ప్రశ్నే లేదు.

6. తెలుగు దేశం బలపడుతోంది: నిజమే, ఆందోళన చెందవలసిన విషయమే! ఆందోళన చెందాల్సింది ఇప్పటికే జరిగిన దాని గురించి కాదు, ముందు ముందు దేశం మరింత బలపడటం గురించి. ముందే మేలుకుని ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించుకోక పోతే దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇది ఒక కారణం కావచ్చు.

7. ఎన్నికల సమాయత్తం: మధ్యంతర ఎన్నికలు వచ్చి ఎన్నికలు ముందుకు జరిగితే తప్ప, హడావుడి పడాల్సిన పనిలేదు. మరో రెండున్నర ఏళ్ళ పాటు ఉద్యమాన్ని నడపాలంటే మాటలు కాదు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే నమ్మకం ఉంటే తప్ప ఇది కారణం కాబోదు.

8. జయప్రకాశ్ నారాయణ కొత్త పార్టీ: ప్రస్తుతానికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. పైగా అది తెలంగాణేతరుల పార్టీ కాదని ప్రజలు నమ్మాలంటే ప్రముఖ తెలంగాణా వాదులు అందులో చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడప్పుడే దాని గురించిన భయం లేదు.

ఇప్పుడేం చేస్తారు: మరి తెరాస ఇప్పుడేం చెయ్యబోతోంది? హింసాత్మక ఉద్యమమా? లేక ఇదివరకటిలా శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్మించుకు రావడమా? రెండోదే చేస్తారని అనిపిస్తోంది. హింసాత్మక ఉద్యమం తాటాకు మంట లాంటిదే ననీ, ఎక్కువ కాలం మనజాలదనీ కేసీఆర్ కు తెలియనిది కాదు.


సవాళ్ళు
:
  • రాబోయే మూడు నాలుగు నెలలు కేసీఆర్‌కు చాలా కీలకం. ప్రజల్లో తనకున్న ఆదరణను మళ్ళీ ఈ కాలంలో నిరూపించుకోలేకపోతే, పార్టీ నాయకులను తన వెనక నడిపించుకోవడం చాలా కష్టం. పైగా తెరాసను ముక్కలు చేసేందుకు కాంగ్రెసుకు ఇక ఏ అడ్డూ లేదు. ఇది కేసీఆర్ కు అతిపెద్ద సవాలు.
  • ఎన్నికలు మామూలు సమయానికే జరిగితే, అప్పటి దాకా ఉద్యమాన్ని నిర్వహించడం మరో సవాలు.
  • తమకూ కాంగ్రెసుకూ మధ్య ఒప్పందం వివరాలేమిటో చెప్పి కాంగ్రెసు మోసం చేసిందని, తన తప్పేమీ లేదనీ, ప్రజలకు తెలియజెప్పాలి. ఇది ఒక చిన్న సవాలు.
  • ప్రస్తుతం కేసీఆర్ బలం తగ్గింది, నరేంద్ర బలం పెరిగింది (సాపేక్షికంగా). నరేంద్రను జాగ్రత్తగా సమర్ధించుకుంటూ వెళ్ళాలి... మరీ ముఖ్యంగా పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో! అదీ ఓ సవాలే! అధికారం లేని వేళ అది పెద్ద సవాలు!! అయితే ప్రజల్లో తనకున్న ఆదరణను నిరూపించుకుంటే అదోపెద్ద సమస్య కాకపోవచ్చు.
మొత్తమ్మీద ఎన్నికల వేళ కుదిరిన ఒప్పందం విషయంలో కాంగ్రెసు మనకోమాట, తెరాసకోమాట చెప్పిందనిపిస్తోంది. లేదా కనీసం "అశ్వత్థామ హతః కుంజరః" అని తెరాసతో అని ఉండాలి. ఈ సంగతి తెలిసి కూడా తెరాస ఇన్నాళ్ళు మిన్నకుండి ఉండాలి. ఈ విషయాలు త్వరలో తెలవొచ్చు. లేదూ, సోనియా గాంధీ ప్రధానమంత్రి ఎందుకు కాలేదో ఇప్పటికీ తెలియనట్లే ఇది కూడా తెలీకపోవచ్చు.

ఏదేమైనా రాబోయేది కేసీఆర్ కే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా గడ్డుకాలమే! మాధ్యమాలకు బోల్డంత సరుకు!

20, ఆగస్టు 2006, ఆదివారం

వికీపీడియా ఎందుకు చూడాలి?

0 కామెంట్‌లు
అష్టవిధ వివాహాలు ఏమేంటో మీకు తెలుసా?
దశావతారాలేమేంటి?
"చూపితివట నీనోటను.., బాపురే! పదునాల్గు భువనభాండంబుల.." పాట వినని తెలుగువాడుండడు. ఏమిటా 14 భువనాలు?
పంచభక్ష్యాలతో, షడ్రసోపేతమైన భోజనం గురించి విన్నాం, తిన్నాం. ఏమిటా పంచ భక్ష్యాలు, షడ్రసాలు?

వీటన్నిటి గురించి తెలుసుకోవడం ఇప్పుడిక బహు తేలిక! తెలుగు వికీపీడియా చూడండి. ఏకోనారాయణ దగ్గరనుండి, అష్టాదశపురాణాల దాకా, ఎనలేనివి ఎన్నదగినవీ అయిన వ్యాసాలెన్నో ఉన్నాయి అక్కడ. ఆ వ్యాసాలు చూడండి, మీకు తెలిసిన విషయాలు రాయండి. వికీ యజ్ఞంలో పాలుపంచుకోండి.

ఈ వ్యాసాలకు కర్తలు త్రివిక్రమ్ , వైఙాసత్య , కాసుబాబు లకు అభినందనలు. ఓ చెయ్యేసిన ఇతర వికీజీవులకూ అభినందనలు. వీరంతా వికీపీడియా ప్రాముఖ్యతను మరో మెట్టు ఎక్కించారు. శభాష్!

పదాలు, దపాలు

5 కామెంట్‌లు
ఓ పదం.. ఆ పదంలోని హల్లులను అటూఇటూ మారిస్తే మరో అర్థవంతమైన పదం. హల్లులు స్థానాలు మారతాయి గానీ, గుణింతం మాత్రం యథాస్థానంలోనే ఉంటుంది. దాంతో ఆ రెండు పదాలను పలికే తీరు (శబ్దం) ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకు మోహము, హోమము. రెండింటిలోని హల్లులు - మ, హ, మ - అటూ ఇటూ అయ్యాయి. గుణింతం మాత్రం స్థానం మారలేదు. (ఇంగ్లీషులో అనాగ్రం అనే పదముంది. ఒక పదంలోని అక్షరాలన్నిటితో కూర్చిన మరో పదం లేదా పదబంధాన్ని అనాగ్రం అంటారు.) కానీ ఈ పదాల్లో హల్లుకు ఉండే గుణింతం మారిపోతుంది. అంచేత ఇవి అనాగ్రం లు కావు. వీటినేమనాలో!!? (అనాగ్రంలు కానివి - అగ్రంలు :-) ) అయితే ఈ పదాల RTS స్పెల్లింగు (hOmamu - mOhamu) మాత్రం అనాగ్రమే!

15, ఆగస్టు 2006, మంగళవారం

వెంటాడే జ్ఞాపకాలు

3 కామెంట్‌లు
కొన్ని విషయాలుంటాయి. ఎప్పుడో ఓసారి యథాలాపంగా వాటి గురించి తెలుసుకుంటాం. అప్పటికి వాటిని వదిలేస్తాం. కానీ, తరువాత ఆ విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ ఓసారి వాటి గురించి తెలుసుకుందామని అనుకుంటాం గానీ తెలుసుకోలేం. ఎక్కడా వాటి గురించిన సమాచారం దొరకదు. దాంతో అవి తెలుసుకోవాలన్న యావ పెరిగిపోతుంది. అలాంటిది నాకు ఒకటుంది.

ఎప్పుడో కనీసం ఓ పాతికేళ్ళ కిందటి విషయమై ఉంటుంది. రేడియోలో ఓ పాట విన్నాను. సినిమా పాట కాదు. ముసలి , నిరుపేద దంపతులు తమ కొడుకును తలుచుకుంటూ అతన్ని ఉద్దేశించి పాడే పాట అది. ఆరుగాలం శ్రమించి కొడుకును పెద్ద చదువులు చదివిస్తే, అతడు 'పెద్దవాడై' వీళ్ళను పట్టించుకోడు. ఆ బాధతో వాళ్ళు పాడే పాట అది. గుండెను మెలిదిప్పే పాట. ఓ రెండు వాక్యాలు మాత్రం గుర్తున్నాయి -

"కళ్ళజోడూ పెట్టుకోనీ నల్ల బూడుసు తొడుక్కోని,
కొడుకో బంగారు తండ్రీ... నిను కలకటేరు అనుకుంటిరో"

ఇలా సాగుతుంది, ఆపాట.

ఇలాంటిదే ఇంకో పాటుంది.. తన సొంత ఊరి గురించి ఒకతను పాడుకునే పాట అది.. చాలా బాగుంటుంది. అక్కడక్కడా ఓ రెండు పాదాలు గుర్తున్నాయి.

ఏటి గట్టు మీద ఉంది మాఊరు..
...
...
మాఊరు ఒకసారి వెళ్ళి రావాలి.

ఈ పాటలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే నాకో ముక్క రాయండి, నేనూ కొనుక్కుంటాను. నాకు తెలిస్తే ఇక్కడ రాస్తాను. (ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోవు.)
మీకూ ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా?

సంబంధిత టపాలు