2, సెప్టెంబర్ 2006, శనివారం

సినిమా పాటలూ మన పాట్లూ

శ్రీశ్రీ స్నేహితులతో కలిసి ఒక నాటకం చూస్తున్నారట. నటులు తమ తమ మాటలు, పాటలు, అభినయాలతో శాయశక్తులా బాదేస్తున్నారు. ఒక నటుడు పాతాళ లోకం గురించి పద్యమేదో పాడుతూ.. చెయ్యి పైకెత్తి చూపించాడట. శ్రీశ్రీని స్నేహితుడు అడిగాడు.. "ఏంటండీ, పాతాళం అని పాడుతూ చెయ్యి ఆకాశం కేసి చూపిస్తాడేమిటీ" అని. శ్రీశ్రీ ఇలా జవాబిచ్చారు.. "ఈ ప్రదర్శన స్థాయి పాతాళాని కంటే దిగువకు పడిపోయింది. అందుకే పాతాళం అంటే పైకి చూపిస్తున్నాడు"

మన తెలుగు సినిమా పాటల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అదే!

పాటలెలా ఉండాలి..
మంచి సాహిత్యం ఉండాలి, బూతు కూతలు కాదు
విన సొంపుగా ఉండాలి, వాయిద్యాల హోరు కాదు
కథలో భాగంగా ఉండాలి, అతికినట్లుగా కాదు
నటులేసే గెంతుల కోసం కాదు, నటుల అభినయం కోసం ఉండాలి

పాటలెలా ఉన్నాయి:
గోల గోలగా ఉన్నాయి, భాషను చంపుతూ ఉన్నాయి.
చాలా పాటల్లో వాయిద్యాల మోతల మధ్య సాహిత్యం వినబడదు.
రచయితలు చేస్తున్న భాషా హత్యను సంగీత దర్శకులు ఇలా మోతల మాటున దాస్తున్నారా!?
ఇక గాయకులు.. ఘంటసాల, బాలు, సుశీల, జానకి లాగా చక్కగా పాడేవారేరీ? ఒకడు ముక్కుతో పాడతాడు, ఇంకోడు చెవుల్తో పాడతాడు. శ పలకమంటే ష అంటారు. అసలు తెలుగే రాదాయె, ఇవెలా వస్తాయి. "రామా చిలకమ్మ" అని రాస్తే "రామ్మా చిలకమ్మా" అని పాడేసాడో ముక్కు తిమ్మన! శ్రీ రామదాసు సినిమాలో ఓ పాటలో తండ్రీ అనమంటే తన్రీ అని పాడిందొక గాయనీమణి. ఫ్యాషననుకుందేమో మరి! మన దిగ్దర్శకులకు ఇలాంటివి ఎలా నచ్చుతాయో!?
ఎందుకిలా ఉన్నాయి:

బాగా రాసేవారు, రాయగలిగే వారు లేక కాదు.. రాయించుకునే వారు లేక! సినిమా వాళ్ళు నలిగిన బాటలో నడిచేందుకు ఇష్టపడతారు. ఓ సినిమా బాగా ఆడితే, పేరు దగ్గర్నుండి, ప్రతీ విషయంలోనూ దాన్ని అనుకరిస్తారు, విజయం తెస్తుందన్న నమ్మకంతో! అంచేతే, స్వతహాగా సృజనాత్మక మాధ్యమమైన సినిమా కేవలం చవకబారు వినోద సాధనంగా అయిపోయింది. మహా అయితే సాంకేతిక నైపుణ్య ప్రదర్శనలా ఉంటోంది. సృజనాత్మకతాలేమికి మొదటగా బలయ్యేవి మాటలూ, పాటలే!

ఎక్కడో తమ సృజనాత్మక శక్తిపై నమ్మకం ఉన్నవారి నుండి మాత్రం చక్కటి సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో పాటలు కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది.

చెత్త పాటలకు మరో కారణం.. మన హీరోలు తమ చుట్టూ కట్టుకున్న మిధ్యా లోకం. ఇమేజీ అనే సంకెళ్ళు తగిలించుకున్న వీళ్ళ సినిమాల్లో పాటలు వాటి కథల్లాగే అదే చచ్చు పుచ్చు ధోరణిలో సాగుతాయి కాబట్టి, అవి అలాగే నేలబారుగా ఉంటాయి.

(ఇలాంటి పాటలు ఎందుకు పెడుతున్నారయ్యా అంటే, కొందరు చవటాయిలు "ప్రేక్షకులు అవే కోరుతున్నారు, మేమూ అవే ఇస్తున్నాము" అని అంటారు.)

ఇక..
నా ఇష్టాయిష్టాలను రాస్తానిక్కడ. సినిమా పాటల్లో మంచి సాహిత్య విలువలు కలిగినవెన్నో ఉన్నాయి. పాటల్లో నేనిష్టపడే అంశాలివి, ప్రాధాన్యతానుసారం..
 1. భావం అందంగా, హృద్యంగా, గిలిగింతలు పెట్టేలా ఉండాలి: "నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట.. నా నావ మీద కాలుపెడితే ఏటౌతాదో తంట" ఇలాంటి భావాలు గుండెకు హత్తుకుంటాయి. "తికమక మకతిక పరుగులు ఎటుకేసీ".. శ్రీ ఆంజనేయం లోని పాట ఇది. ఈ పాటలోని "శ్రీరామ చందురుణ్ణీ.. కోవెల్లొ ఖైదు చేసీ, రాకాసి రావణుణ్ణీ గుండెల్లొ కొలువు జేసీ.." అనేది నాకు బాగా నచ్చిన వాక్యం.
 2. పదాలతో చమత్కారాలు నచ్చుతాయి: ఇందులో వేటూరి ఉద్దండుడు. "శంకరా నాద శరీరా పరా.." పాట రెండో చరణంలో 'గంగ' తో ఆయన ఆడుకున్న అంత్య ప్రాసల ఆటలాంటివి నాకు బాగా ఇష్టం. అదిక్కడ రాసి నా ముచ్చట తీర్చుకుంటాను..

  పరవశాన శిరసూగంగ
  ధరకు జారెనా శివగంగ
  నా గానలహరి నువు మునుగంగ
  ఆనంద వృష్టి నే తడవంగ

 3. పద గాంభీర్యం నచ్చుతుంది: "చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన.." పాట, పద గాంభీర్యతకు ఓ మచ్చు తునక. నాకు నచ్చినది.
 4. సంగీతం: వీటి తరువాతి స్థానం సంగీతానిది.
ఏ రకమైన పాటలు నాకిష్టం..
భక్తి పాటలు: సినిమా పాటలే కాక కీర్తనలు, పదాలు కూడా ఇందులో చేరాయి. కొన్ని పాటలుంటాయి.. దేవుడి అనేకానేక పేర్లను ఒక పద్ధతిలో కూర్చి పాటగా రాసేస్తారు. నాకలాంటివి నచ్చవు. నాకు బాగా నచ్చిన పాటలు చాలానే ఉన్నాయి గానీ, ఇక్కడ ఒక్క రామదాసు కీర్తనను ఉదహరిస్తాను.. " ఓ రఘువీరా.. యని నే పిలిచిన, ఓహో యనరాదా" బాలమురళీకృష్ణ పాడిన ఈ కీర్తన (శ్రీ రామదాసు ప్రాజెక్టు, ఖమ్మం వారి విడుదల) నాకమిత ఇష్టం. ఇక ఘంటసాల భగవద్గీత గురించి చెప్పేదేముంది.. నారాయణుడు చెప్పగా విని, నరుడు తరించి పోయాడు. ఘంటసాల బోధించగా విని నరులు తరించి పోతున్నారు. ప్రస్తుతం సురులను తరింప జేస్తున్నాడాయన! గీతను ఇంతకంటే బాగా ఎవరూ పాడలేరేమో! అలాగే, ఎమ్మెస్ రామారావు గారు మనయెద పలికించిన సుందరకాండము నాకు ఎంతో ఇష్టమైన గేయ కావ్యం. శ్రీకృష్ణుడు ఘంటసాల చేత భగవద్గీత చెప్పించాడు, హనుమంతుడు రామారావు గారి చేత సుందరకాండను చెప్పించాడు. తెలుగువారి లంకె బిందెలివి.

శృంగార పాటలు (దుష్ట సమాసమేమో గానీ, నాకు అలా అనడమే ఇష్టంగా ఉంది): సున్నితమైన శృంగారంతో కూడిన పాటలు ఇష్టం. "ఎంతటి రసికుడవో తెలిసెరా.." లాంటి పాటలు ఇష్టం. గుంభనంగా లేకున్నా.., వెకిలిగా లేని శృంగార రసమూ ఇష్టమే! ఉదాహరణకు.. "మన్నేల తింటివిరా కృష్ణా.." అంటూ స్మిత పాడే పాట. ఛత్రపతి సినిమా అనుకుంటాను. సినిమా చూడలేదు, పాటను మాత్రం యాదృచ్ఛికంగా విని, దానికి అభిమానినైపోయాను.

తాత్విక, విషాద గీతాలు: వీటిలో ముందు వరుసలో ఉండేవి బాలమురళీకృష్ణ తత్వాలే! వాటిలో "గూడు.. చిన్నబోయెరా!" నాకెంతో ఇష్టమైనది. "యాతమేసి తోడినా ఏరు ఎండదు" - జాలాదిని చిరస్మరణీయుడిని చేసిన ఈపాట నాకు బాగా ఇష్టం.

చివరగా..
మంచి మంచి పాటలు వినడం కంటే ఇష్టమైనది నాకొకటుంది. అది..
ఆ పాటలు పాడుకోవడం! పాడుకుంటుంటే ఉండే తృప్తి వింటే రాదు.

5 కామెంట్‌లు:

 1. అన్నీ తెలుగు పాటలుగురించే ఉంది వ్యాసంలో. సంగీతానికి బాషా ఎల్లలు లేవు. రాసింది నచ్చింది. రాయంది నచ్చలేదు.

  రిప్లయితొలగించండి
 2. రావుగారూ, నాకున్నాయి, ఎల్లలు. :-) మీ వ్యాఖ్యకు థాంక్స్!

  రిప్లయితొలగించండి
 3. చదువరి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సంగీతం వేరు, పాట వేరు. సంగీతానికి ఎల్లలు లేవు. కాని పాటలకి ఎల్లలు తప్పనిసరిగా ఉన్నాయి. కొన్ని భాషల్లో కొన్నిరకాల సంగీతాలు మాత్రమే సాధ్యపడతాయి. అలాగే అన్ని భాషలవారూ అన్ని రకాల సంగీతాల్నీ ఆస్వాదించలేరు.సంగీతంలో భాష ప్రాధాన్యం 60 శాతం కంటే ఎక్కువేనని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 4. మీ అభిరుచి బాగుంది.

  శృంగారాత్మక సినిమా జానపదం -
  ఆకులు పోకలు ఇవ్వొద్దు నా నోరు ఎర్రగ సెయ్యొద్దు
  ఆశలు నాలో రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు
  ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి పాడిన యుగళ గీతం.

  ఎమ్మెస్ పాట -
  హరహర మహా దేవా శంకర ...
  హిమాలయాలకు రాలేనయ్యా ...
  - చిన్నప్పుడు రేడియోలో విన్నదే. మళ్లీ విన్లేదు.

  తాత్వికాల్లో బాలమురళి పాట -
  మౌనమె నీ భాష ఓ మూగ మనసా...
  తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
  కల్లలు కాగానె కన్నీరౌతావు ...

  ఇంకా ఎన్నెన్నో.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు