నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అనేది తెలంగాణ కోరుతున్నవారి వాదన. అయితే "తెలంగాణ కావలసింది అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం" అని కేసీయార్ అంటున్నారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఇతరులు కించపరుస్తున్నారు, మాండలికాన్ని హేళన చేస్తున్నారు అనే వాదన ఉంది. బతుకమ్మ, బోనాలు మొదలైన తెలంగాణ పండుగలకు ప్రస్తుతం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నది ఈ వాదనలోని భాగం. తరాలు మారే దశలో, సాంప్రదాయాలు క్రమేణా కనుమరుగు అవుతూ ఉండడం సహజం. దానికి ఇతరులను నిందించడం సరికాదు. ఇప్పటి ప్రభుత్వాలు సంస్కృతీ సాంప్రదాయాలను గాలికి వదిలేసాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విషయంపై శ్రద్ధ వహిస్తే అంతకంటే కావలసిందేమీ లేదు. ఇక మాండలికానికి సంబంధించినంత వరకు ఇది కొంత సహేతుకంగానే కనిపిస్తుంది. తెలంగాణ మాండలికానికి అధికారిక హోదానిచ్చి, గట్టిగా అమలు చేస్తే, కొత్త రాష్ట్రం వలన కలిగే గొప్ప ప్రయోజనం అవుతుందది. తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది. కానీ నిజంగా అది చేస్తారా?
ఇక స్వపరిపాలన .. ఏమిటి స్వపరిపాలన అంటే.. ఇప్పటిది కాదా? ప్రస్తుత పాలన పరాయి పాలన ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి కాకపోతే అది పరాయి పాలనేనా? అయితే పులివెందుల తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? గత ముఖ్యమంత్రి పాలనలో నారావారిపల్లె తప్పించి మిగతా రాష్ట్రమంతా పరాయి పాలనలో ఉన్నట్లేనా? లేక.. కేసీయార్ పాలిస్తే స్వపరిపాలన, లేకుంటే పరాయి పాలన అని అంతరార్థమా?
"ఆంధ్ర ప్రాంతం నుండి తరలివచ్చిన వారు ఇక్కడి పొలాలు కొని బాగుపడ్డారు, ఇక్కడ వ్యాపారాలు చేసి సంపాదించారు, మా ఉద్యోగాలు కొట్టేసి స్థిరపడ్డారు" అని ఈ తెలంగాణవాదులు అంటారు. తెలంగాణ ఏర్పడ్డాక వాళ్ళందరి అస్తులనీ, పొలాలనూ, ఉద్యోగాలను లాక్కుని తరిమేయలేరు కదా! మరి తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడికి ఎలా న్యాయం చేయబోతున్నారు? ఈ విషయమై తాము ఏమేం చెయ్యబోతున్నారో వీళ్ళింతవరకు చెప్పలేదు.
ఏమొచ్చినా రాకున్నా కొత్త రాష్ట్రంలో తప్పనిసరిగా వచ్చేవి కొన్నున్నాయి.. ఓ ముఖ్యమంత్రి, ఓ ఇరవై మంది మంత్రులు, ఓ రెండొందల కొత్త అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు, ఓ రెండువేల కొత్త ఉద్యోగాలు.
నికరంగా తేలేదొకటే.. తెలంగాణ వస్తే బాగుపడేది రాజకీయులే. సామాన్యుడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సామాన్యుడికి కొత్తగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు, కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగావకాశాలు తప్ప. తక్షణ రాజకీయ ప్రయోజనం ఆశించే వారికి మాత్రం ఉపయోగమే!
మీ తెలంగాణా టపాల పరంపర, విశ్లేషణాత్మకంగా బాగుంది. ఇంతకుముందు నా ఆలోచన "తెలంగాణా వస్తే ఏముంది ఇంతకుముందు (ముఖ్యమంత్రి, మంత్రి, శాసనసభ సభ్యుడు మొదలైనవి) కాలేనివాడు ఇప్పుడు అవుతాడు" కే పరిమితమయ్యేది. మిగతా విధాలుగా ముందుకి సాగేదికాదు. మీరు మొన్న సమావేశంలో అన్నపుడే అనుకున్నా ఈ విషయంపై హేతుబద్దమైన అభిప్రాయం ఏర్పరచుకోవడానికి తగిన విశ్లేషణ ఉంటుందని.
రిప్లయితొలగించండిమీరు తెలంగాణా గురించి చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అంత సీనేం లేదు. అది వచ్చేదైతే ఎప్పుడో వచ్చేది. తెలంగాణా ఇస్తే ఇంకో పది, పన్నెండు ప్రత్యేక రాష్ట్రాలు క్యూలో ఉంటాయి. ఇండియా దివాలా ఎత్తడానికి అది చాలు. ఆ సంగతి సోనియాకి తెలుసు. "చిన్న రాష్ట్రాలు" అనే నినాదం బి.జె.పి.దే గాని కాంగ్రెసుది కాదు. కాబట్టి కాంగ్రెస్ తనంతట తాను తెలంగాణా ఇవ్వదు. పైకి ఎన్ని చెప్పినా అద్వానీగారు లోలోపల తెలంగాణాకి వ్యతిరేకం. కాబట్టి బి.జె.పి.కూడా ఇవ్వదు. ఒకవేళ ఏదో దుర్ముహూర్తంలో ఇద్దామనే బుద్ధి పుట్టినా ఇటు తెలంగాణాలో కేసీయార్, అటు ఆంధ్రాలో నాయుడుగారు హీరోలైపోతారు. మొత్తం మీద కాంగ్రెస్‌కైనా బి.జె.పి.కైనా ఒరిగేది గుండుసున్న. కాబట్టి ఏం చేసినా తెలంగాణా రాదు. అందుకనే నేను ఆ అంశం మీద రాయడమే మానుకున్నాను.
రిప్లయితొలగించండి'తెలంగాణ మాండలికానికి అధికారిక హోదానిచ్చి, గట్టిగా అమలు చేస్తే, కొత్త రాష్ట్రం వలన కలిగే గొప్ప ప్రయోజనం అవుతుందది. తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది.'
రిప్లయితొలగించండి-కాదు, భ్రష్టు పడుతుంది.తేట తెనుగు తియ్యదనంలో,వేపచేదు కలిపినట్లుంటుంది.
'నికరంగా తేలేదొకటే.. తెలంగాణ వస్తే బాగుపడేది రాజకీయులే.సామాన్యుడు కాదు.'
-అవును, ఇదే జరిగేది.
అంబానాథ్ గారూ! రెండు విషయాలు..
రిప్లయితొలగించండితెలంగాణ వస్తుందా రాదా అనేది చర్చించడం కాదు నా వ్యాస ఉద్దేశ్యం, ఒకవేళ ఏర్పడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని చర్చిస్తున్నాను.
ఇక "కాబట్టి ఏం చేసినా తెలంగాణా రాదు. అందుకనే నేను ఆ అంశం మీద రాయడమే మానుకున్నాను." అని అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక దేశం ఏర్పాటు గురించే చర్చిస్తున్న వారు మీరు.. తెలంగాణ సంభావ్యతతో పోలిస్తే ప్రత్యేక తెలుగు దేశ సంభావ్యత ఎంత? అయినా మీరు చర్చిస్తున్నారు కదా! (ఆ విషయంపై నా అభిప్రాయం మీదాంతో కలవకున్నా మీ నిబద్ధత నాకు నచ్చింది.)
తెలంగాణపై మీ అభిప్రాయం ఏంటని ఇదివరలో మీ బ్లాగులో నేనడిగిన ప్రశ్నకు మీరు వేరే ఏదో సమాధానం ఇచ్చినట్లు గుర్తు! చూద్దామంటే అది నాకు కనపడలేదు.
రావు గారూ, నా అభిప్రాయం వేరు. ప్రతీ యాసలోను ఒక అందం ఉంది. (నేను గుంటూరు వాణ్ణి అయినా రాయలసీమ యాస నాకు ఎంతో ఇష్టం. బహుశా నేను చదివిన పుస్తకాల ప్రభావమేమో!) యాస గురించి వావిలాల అనుకుంటా ఒక మాట అన్నారు.. 'యాస శ్వాస వంటిది' అని. భాషకు పలు యాసలు సొగసులద్దుతాయి! ఏదైనా ఒక యాస మరుగునపడితే ఆ మేరకు భాష వెనకబడినట్లే అని నా ఉద్దేశ్యం!
ఏదేమైనా మీ వ్యాఖ్యలు రాసినందుకు కృతజ్ఞుణ్ణి.
థాంక్స్, వీవెన్!
రిప్లయితొలగించండిచదువరీ,
రిప్లయితొలగించండిమరో మంచి వ్యాసం రాసి అందర్నీ మంచి చదువరులుగా చేస్తున్నారు, కృతజ్ఞతలు!
ఇక తెలంగాణా విషయానికొస్తే ఇదీ రిజర్వేషన్లలా సున్నితమైన అంశం.ఇప్పటికీ నాకో విషయం అర్థంకానిది ఏంటంటే గోదావరీ పరీవాహక ప్రాంతం అయిన ఈ నేల ఇంతవరకు అభివృద్ధి చెందక పోవడం.
చరిత్ర తెరిచి చూస్తే నిజాం నిరంకుశత్వ పాలనలో ఈ ప్రాంతం అంతా మగ్గితే అర్థర్ కాటన్ వంటి తెల్లవాల్ల వల్ల ప్రయోజనాలు పొందింది కోస్తా. మరి అంతరాలు ఉండమంటే ఉండవా?
బలవంతుడు బలహీనుల పై సవారీ చేయడమే దీనికంతా కారణం.నేను రాయలసీమ వాన్నయినా మేము గుడ్డిలో మెల్ల ఏదో ఆ సుముహూర్తాన ఆ నిజాం నవాబు దత్తత కీయ బట్టి కాస్తో కూస్తో రాజకీయాలను ఒంటబట్టించుకొన్నాం!నేను తెలంగాణా వారి న్యాయసమ్మతమైన కోరికను సమర్థిస్తాను.
రావుగారూ! ఇక యాస విషయానికొస్తే వేప చేదు మీకోమోగానీ మాకు కాదు...ఒక వేల యాస అన్నది వేప అయినా "తినగ తినగ వేప తియ్యనుండు "అన్నాడుగా ప్రజాకవి!మీకూ అలవాటవుతుంది.
అన్ని భాషలకు ప్రామాణిక భాష అంటూ ఒకటుంటుంది నేను అందులోనే రాస్తున్నాను.కానీ అమ్మపాల లోని కమ్మదనం ఇక ఎక్కడైనా రుచి చూడగలమా? ఏందబ్బా ఎట్టాఉండావు, సల్లగుండు నాయనా , రామనాథరెడ్డి బ్లాగులో పెద్దోడు అన్నట్టు "మీ నాయన మీకొసం శానా అగసాట్లు పణ్ణాడు. మీరు ఎట్ట సూసుకుంటారో ఏమో...
నేనొచ్చి సూచ్చా... ఏమన్నా ఏరేగా ఉన్నిందంటే మీ సెయిబట్టుకోని ఇరిశాచ్చా" ఇలా యాస సజీవమైంది దానికీ ఘోరీలు కట్టకండి!
చివరిగా ఈ ప్రశ్న తెలంగాణా అన్న మాట అచ్చతెనుగా లేక ఆంధ్రప్రదేశ్ అన్నదా?
-ఇస్మాయిల్
తెలుగు రిపబ్లిక్ ఏర్పడే సంభావ్యత ప్రత్యేక తెలంగాణా ఏర్పడే సంభావ్యత కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దేశీయ/ప్రపంచ పరిణామాలు ఆ దిశలో వేగంగా కదులుతున్నాయి.దాని గురించి ఎలాంటి ఉద్యమాలూ అవసరం లేదు. (నాకు తెలుసు-ఈ మాట చెబితే మీరు చాలా ఆశ్చర్యపోతారు) కొన్ని విషయాలు నాలుగు గోడల మధ్య మాత్రమే వెల్లడించడం వీలవుతుంది.నేను చేస్తున్నదల్లా అందరినీ దానికి మానసికంగా సిద్ధం చేయ్యడమే. మీరు ప్రత్యేక తెలంగాణా గురించి చర్చించకూడదని నేననలేదు కదా ! ఎవరిష్టం వారిది. నేనెవణ్ణి మధ్యలో ?
రిప్లయితొలగించండిమీ విశ్లేషణలో సూక్ష్మ పరిదులను వదిలేస్తున్నారు.. పులివెందుల కైనా నారా వారి పల్లె కైనా లోకల్ గా పరిపాలన యంత్రంగం ఉండదా.. ఏ పి లో మూడు ప్రాంతాలు అంటే ప్రజల మనస్సులో నిండుకున్న పరిదులు లేవ... ఒరిస్సా పేరు ఒడిస్సా గా.. కాలికట్ పేరు కోల్ కతా గా ఎందుకు మార్చారు... ఎందుకంటే అవి ప్రజల మనస్సులలో నిండి పోయాయి.. ఇక్కడ కూడా మూడు ప్రాంతాల పేర్లు వారి వారి మనస్సులలో నిండి పోయి ఉన్నాయి.. ఇక సామాన్యుడి విషయం అంటారా... జరిగిపోయిన కాలం లో జరిగిన సంగతుల గురించి నిజా నిజాలు తేలాలంటే... ఇక్కడి భూములు కొన్న వారు పరస్పర అంగీకారం తో కొన్నారా .లేక బెదిరించి కొన్నారా అనేవి తెలియాలి... ఇక్కడ స్థిర పడిన వాళ్ళు.. ఇక్కడి వాళ్ళే... వారూ భారతీయులే కదా... ఇప్పుడు జరిగే పోరాటం.. ఇక్కడ ఉన్నవాళ్ళని దెబ్బకొట్టేందుకు కాదు.. జరిగిన అన్యాయాన్ని న్యాయం గా చేసుకునేందుకు కూడా కాదు.. కానీ.. ఇక ముందు ఎలాంటి అన్యాయం జరగ కుండా ఉండడానికే.... భాష పేరు చెప్పి... ఇంక మోసాలు సహించం అని.. చేస్తున్నది కాదా... ప్రత్యక్షం కానిదానికి ఎవరైనా ఎంతవరకు న్యాయం జరిగిందో ఎలా తేలుస్తారు... అందుకే... ఎక్కడ ఉన్నవారికైనా ఎలాంటి భయాలు ఉండొద్దు.. ముందు ముందు జరగ బోయే దాని గురించి ఈ పోరాటాలు తప్ప.. జరిగిన వాటికి న్యాయం ఎంతవరకు చేయగలరో ఎవరు చెప్ప గలరు... 610 జీవొ లాంటి వాటికైతే... ఏమైనా మోక్షం రావచ్చు... ఆ జీవో కి వ్యతిరేకం గా చేసే ఉద్యోగస్తులకు మంగళం పాడి పంపేయొచ్చు... సాక్ష్యం ఉంటే న్యాయం జరుగుద్ది... కానీ.. విడిపోతే మాత్రం... ఎక్కువ న్యాయం జరుగుతుంది...
రిప్లయితొలగించండిcbrao (Bhaskara Rao Chimakurthy) గారికి.... తేట తెలుగు తియ్యదనానికి వేప చేదు కలిపి నట్ట్లుంటుందా... మళ్ళీ నువ్వుండేది హైదరాబాద్ లో... మా భాష గురించి ఇలాంటి వెకిలి మకిలి ఆలోచన ఉన్నవాడివి మా ప్రాంతంలో ఎందుకున్నావ్... వెళ్ళిపో .. మా భాషని గౌరవించేవాడికే మా ప్రాంతంలో చోటు... నీలాంటి ఆవు పాలు తాగి ... దాని డొక్కలో తన్నే వాడికి కాదు...
రిప్లయితొలగించండితెలంగాణకు మంత్రి బొత్సా సత్యనారాయణ ఓకే
రిప్లయితొలగించండిహైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి బొత్స ఓకే అన్నారు. 2014 కల్లా రాష్ట్ర విభజన ఖాయమన్నారు. సమైక్యవాదనలో పసలేదని, తెలుగు వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని బొత్స ప్రశ్నించారు. సమైక్య భావన ఎక్కువ కాలం నిల్చేది కాదని, ఉత్తరాంధ్ర మారుమూల ప్రజలకు హైదరాబాదుతో పనేంటని బొత్స అన్నారు. తన అభిప్రాయాలను కమిటీకి చెబుతానని బొత్స తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొత్తం హైదరాబాదుపైనే పేచీ నడుస్తోందని, దీనికి పెట్టుబడులే కారణమని మంత్రి బొత్స అన్నారు. సూర్య27.2.2010
మీ సీరీస్ లోని మూడు పోస్ట్ లను చదివాను. I must say it was a very good analysis. Raja గారు చెప్పినట్లు మీరు డిటైల్స్ లోకి వెళ్ళలేదు. ఉంటే ఇంకా బాగుండేది. ఏం జరుగుతుందో రాశారు, కానీ ప్రజలు, నాయకులు ఏం చేస్తే బాగుంటుందో రాస్తే మరింత బాగుండేది.
రిప్లయితొలగించండిఏదేమైనప్పటికీ, చక్కటి విశ్లేషణ చేసారు. I liked these posts, particularly the first two.
నేను ఇప్పుడే నోటీస్ చేశాను. ఈ పోస్ట్ లు ఏడేళ్ల క్రిందట రాశారని. How appropriate these are for the present situation! Perfect forecast!!
రిప్లయితొలగించండిMy respect for these posts is doubled now.
(I am the same అజ్ఞాత as above.)