25, నవంబర్ 2006, శనివారం

కొన్ని హాస్య వార్తలు

నవంబరు 24 న ఓ రెండు హాస్య వార్తలొచ్చాయి. నవ్వు తెప్పించే వార్తలు రోజూ వస్తూనే ఉంటాయి గానీ, అవి ప్రధాన వార్తలు కావడమే ఆనాటి విశేషం .

మన క్రికెట్టు టీము దక్షిణాఫ్రికాతో చిత్తుగా ఓడిపోవడం మన ఎంపీలకు మింగుడు పడలేదు. ఇదివరలో ఇలా భయంకరంగా ఓడిపోయినా ఎంపీలు నోరు మెదిపేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రం తలో మాటా అందుకున్నారు. నోరు తెరిచేందుకు ఒక్కొక్కళ్ళకు ఒక్కో కారణం ఉంది. వాళ్ళేమన్నారో చూద్దాం..

గంగూలీని తీసుకుంటే ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదా అని సీపీఎం గోస. (ఎప్పుడో వచ్చేది కామోసు!)
చాపెల్ రాజీనామా చెయ్యాలి. (ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు ఒక్కడే రాజకీయుడు... అప్పుడు కోచిగా కూడా రాజకీయుడే అవ్వచ్చని వీళ్ళ ఎత్తు!)
శరద్ పవార్ రాజీనామా చెయ్యాలి. (సరే, ఇది మామూలు డైలాగే ననుకోండి)
ఇక ఈ డిమాండ్లన్నిటికీ బాబులాంటిది రాందాస్ అథవలే గారిది.. భారత క్రికెట్టు జట్టులో రిజర్వేషన్లు పెట్టాలి అని
అర్జున్ సింగు పుణ్యమా అని ఆ మధ్య రిజర్వేషన్ల రగడ రేగినపుడు అనేక ఛలోక్తులు, వ్యంగ్య విమర్శలు వచ్చాయి. వాటిలో క్రికెట్టు రిజర్వేషన్లు కూడా ఒకటి. ఆ డిమాండు నిజంగానే చేసి, అథవలే గారు ఆ వ్యంగ్యకారులను వ్వె వ్వె వ్వె అని వెక్కిరించబూనారు. శభాష్ రాందాస్!!

ఇక రెండోది.. ఇక్కడ హీరో మరో రాందాస్. తెలుగు కాంగ్రెసు నాయకులకు వెలిగించకుండానే బీడీతో వాతలు పెట్టాడు. బీడి కట్టల మీద పుర్రె గుర్తు గురించి సానుకూల స్పందన వస్తుందని ఆశించి, కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రాందాసు దగ్గరికి విలేకరులను తీసుకుని వెళ్ళారట పనబాక లక్ష్మి, గిరీష్ సంఘీ, సర్వే సత్యనారాయణ మొదలైన వారు. అక్కడ అన్బుమణి రాందాసు కత్తి రాందాసై పోయి, పుర్రె గుర్తు ఉండి తీరుతుందని వాళ్ళ మాడు పగిలేలా విలేకరులకు చెప్పాడట. (అవును మరి, ఏఐఐఎమ్మెస్ వ్యవహారంలో తెలుగు వాడైన రాజగోపాలుతో పెట్టుకుని రాందాసుకు మాడు పగల్లేదూ మరి! ఆ కసి వీళ్ళ మీద తీర్చుకున్నట్టున్నాడు.)

దానితో బిత్తరపోయిన మనవాళ్ళు, విలేకరులను హడావుడిగా పనబాక లక్ష్మి ఆఫీసుకు తీసుకుపోయి అక్కడో సమావేశం పెట్టారట. బీడిలు సిగరెట్లంత ప్రమాదకరం కాదని వాళ్ళు విలేకరులకు చెప్పబోయేసరికి, అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి, అబ్బెబ్బే అదేంకాదు అన్నీ చెడే, పొగాకు ఎక్కడైనా పొగాకే అని ఎదురు తిరిగారట. వీళ్ళ మాయమాటలను తేటతెల్లం చేసేలా ఆమె ఇంకా చెప్పబోతూంటే ఇంక ఆపమంటూ మల్లు రవి ఆవిడకు దణ్ణం కూడా పెట్టాడట!

మన ఆసిగాళ్ళు (హాస్యగాళ్ళు) ఢిల్లీలో కూచ్చుని చేసే నిర్వాకాలు ఇవి.

4 కామెంట్‌లు:

  1. క్రికెట్ లో కోటాలా ?? భలే భలే !!!

    రందాస్ గారు ఈ డిమాండ్లు కూడా చెయ్యండి
    1) రిజర్వేషన్ ఉన్న ఆటగాడు out అయినా ఇంకొ chance ఇవ్వాలి , మొదటి ఔట్ తూచ్ అన్న మాట !!

    2) అతను 2 పరుగులు కొట్టినా 4 రన్స్ ఇచ్చెయ్యలి !! 4 కొడితే 6 ఇవ్వాలి !! రిజర్వేషన్ ఉంది కదా మరి !!!

    3) రిజర్వేషన ఉన్న ఆట గాడు బటింగ్ చేస్తుంటే ఫీల్డర్లు 5 గురు కంటే ఎక్కువ ఉండకూడదు !!!

    4) బౌలింగ్ చేస్తూ వైడ్లు వస్తే తూచ్ పట్టించుకొవద్దు

    ఇలా బోల్డు చెయ్యొచ్చు !!!

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శ్రీ గారన్న "....కొడుకులసలే మెలగే ఈ లోకంలో తలవంచుకు వెళ్లిపొయావా నేస్తం" గుర్తొస్తుంది నాకు...

    మన క్రికెట్ కోటా ఫలితాలు ఈ రకంగా ఉండవచ్చు...

    01. కేవలం ఎనిమిది మందితో ఆడటం (ఆటగాల్లను పూరించలేక)

    02. కొంతమంది రబ్బరు బంతితో మాత్రమే ఆడుతారు

    03. స్లెడ్జింగును అట్రాసిటి కింద పరిగణించవచ్చు

    04. ఒక వికలాంగ బౌలరు ఉండవచ్చు..

    రిప్లయితొలగించండి
  3. భలే భలే కామెడీ బాగా ముదిరి పాకానబడ్డది.
    వికలాంగులను అవహేలన చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు కానీ చదువులు కాళ్లు, చేతులతో చదువుతారా అని నాదో పిచ్చి ప్రశ్న. ఇలాంటివి వాళ్లకక్కరలేని జాలి, సానుభూతి పెంచుతాయంతే

    రిప్లయితొలగించండి
  4. నాకైతే ఏడుపే వస్తోంది వీళ్ళు చేసే దురగతాలు చూస్తోంటే. వేణుగోపాల్‍గారిని సస్పెండ్ చేసిన విషయం లో ఒకాయన ఈ కింది బ్లాగు వ్రాసాడు, రాందోష్ ని సమర్ధిస్తూ. దానిపై వచ్చిన వ్యాఖ్యలెన్నో తెలుసా? 7769!!!
    http://o3.indiatimes.com/sanjeev_/archive/2006/07/10/983224.aspx?Pending=true

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు