31, ఆగస్టు 2007, శుక్రవారం

కంప్యూటర్ ఎరా చూసారా?

1 కామెంట్‌లు
..చూడకపోతే చూడండి. మీరు గీకువీరులైనా చూడండి. మీకు తెలీని విశేషాలు కూడా అక్కడ దొరకొచ్చు.

పత్రికంటే ఓ యాభై కాగితాలు కాదు, యాభై పేజీల విశేషాలు. రాసే వ్యక్తికి తెలిసిన విషయాలు రాస్తే కాదు.., చదువరికి తెలియని కబుర్లు రాయాలి. అప్పుడే పత్రికను కొనుక్కున్న పాఠకుడికి తృప్తి కలుగుతుంది. ఈ పత్రిక ఖచ్చితంగా డబ్బుకు తగ్గ విలువ ఇస్తుంది. ఒకే ఒక్క వ్యక్తి, నెలనెలా, అంతంత సమాచారాన్ని, అన్నన్ని విశేషాల్ని, ఒంటిచేత్తో ఇస్తూ వస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గారికి అభినందనలు.

పత్రికను మీరూ చదవండి.. మీ సూచనలు, సలహాలను శ్రీధర్ గారికి పంపండి.

సెప్టెంబరు సంచికలో 'జాలంలో తెలుగు వెలుగుల' కబుర్లు కూడా వచ్చాయి. వలబోజు జ్యోతి గారి చలవ అది. మంచి వ్యాసం రాసారు.
----

ఓ పాఠకుడిగా తప్ప, నాకు కంప్యూటర్ ఎరాతో వేరే ఏ అనుబంధమూ లేదు. :)

28, ఆగస్టు 2007, మంగళవారం

ఉగ్రవాదము, మతమూ

22 కామెంట్‌లు
హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరగ్గానే "అన్ని మతాల వాళ్ళూ చనిపోయారు ఒక మతంపై ప్రత్యేకించి చేసిన దాడి కాదు" అని వ్యాఖ్యానాలు వచ్చాయి. సహజంగానే ప్రజలు కూడా ఈ పేలుళ్ళను అలా భావించలేదు. మత పరమైన పర్యవసానాలేమీ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది. అయితే బాధితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. కానీ ఈ ఉగ్రవాదులెవరు? ఈ సంఘటనకు కారకులు ఎవరో ఇంకా తెలీక పోయినా, గత అనుభవాలను బట్టి ఇస్లామిక ఉగ్రవాదులని అనుమానాలు పోతాయి, సహజంగా. కానీ ఉగ్రవాదులకీ మతానికీ ముడిపెట్టకూడదని ఓ... తెగ చెప్పేస్తున్నారు, కొందరు. కానీ అలా కుదురుతుందా?

26, ఆగస్టు 2007, ఆదివారం

బాంబుల మధ్య మనం

1 కామెంట్‌లు
హైదరాబాదులో మళ్ళీ బాంబులు పేలాయి. గుంపులుగా చేరిన ప్రజల మధ్య పేలాయి. 42 మందిని పొట్టన బెట్టుకున్నాయి. వారాంతపు సాయంత్రం సరదాగా గడిపేందుకు వెళ్ళిన అమాయకులు.. పాపం, మృత్యువును వెదుక్కుంటూ వెళ్ళినట్టైంది. ట్రాఫిక్కు సమస్య కారణంగా సమయానికి అంబులెన్సులు చేరుకోలేని పరిస్థితి. సమయానికి అవి చేరుకుని ఉంటే కనీసం ఒక్కరినైనా కాపాడగలిగే వారేనేమో! ప్చ్!

ఏ ప్రకృతి బీభత్సానికో ప్రజలు చనిపోతే శోకం, బాధ కలుగుతాయి, మనసుక్కష్టం కలుగుతుంది. కానీ ఇలాంటి దురాగతాలకు బలవుతుంటే ఆక్రోశం, క్రోధమూ కలుగుతాయి. మున్నెన్నడూ ఎరగని సంఘటనలేమీ కావివి. మనకెన్నడూ అనుభవం లోకి రానివేమీ కావీ ఘటనలు. ఇంతకు ముందు జరిగాయి, పైగా ఇలాంటివి ఇంకా జరగొచ్చని అనుమానాలూ ఉన్నాయి. అయినా ఎలా జరిగాయి?

ఎందుకిలా జరిగాయి? మే 18 నాటి మసీదు బాంబు పేలుడు నాటి నుండీ, మళ్ళీ అలాంటివి జరగొచ్చేమోనని పేపర్లలో వార్తలు చూస్తూనే ఉన్నాం. నిఘా సంస్థలకు వీటిపై సమాచారముందట. అయినా ఎలా జరిగాయీ పేలుళ్ళు? ఎందుకు వీటిని ఆపలేకపోయారు? ఇంత పెద్ద నగరంలో బాంబులెక్కడున్నాయో కనిపెట్టడం గడ్డి వామిలో సూది కోసం వెతికినట్టే కావచ్చు! కానీ మసీదు బాంబు తరవాత, ఇంకా అలాంటివి జరగొచ్చని తెలిసింతరవాత కూడా ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదెందుకని? ఒక్క అనుమానితుడిని కూడా పట్టుకోలేక పోయారేఁ? ఆర్డీయెక్సులు, బాంబుల తయారీ స్థలాలూ, దాచిన స్థలాలూ ఎందుకు దొరకలేదు? అసలు చర్యలేం తీసుకున్నారు? ఎంతమందిని అరెస్టు చేసారు? 42 ప్రాణాలు బలయ్యాక.., ఇకనైనా చెబుతారా? మమ్మల్ని సంయమనంతో ఉండమని చెవటం కాదు, మా రక్షణ కోసం మీరేం చేసారో, ఏం చేస్తున్నారో చెప్పండి.

ఒక్కటి మాత్రం బలపడుతోంది.. పొద్దుట బయటికి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ రాత్రికి క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది కేవలం మన అదృష్టం, అంతే.. వ్యవస్థ మనకు కల్పిస్తున్న రక్షణ వలన మాత్రం కాదు! ప్రభుత్వాలు, వాటి విధానాలు చేతకానివి కావడంతో మనం మూల్యం చెల్లిస్తున్నాం. వాళ్ళకు ఓట్లిచ్చాం, పాలించే హక్కిచ్చాం, చివరికిలా ప్రాణాలూ వాళ్ళ ఎదాన పోస్తున్నాం.

25, ఆగస్టు 2007, శనివారం

ప్రాణాలు తీసేవాడు, ప్రాణాలు పోసేవారు

5 కామెంట్‌లు
రాజస్థానులో ఏడెనిమిదేళ్ళ కిందట కృష్ణజింకను వేటాడినందుకుగాను ఒక హిందీ సినిమా హీరోకు ఐదేళ్ళ జైలు శిక్ష వేసారు -అదీ ఏడాది కిందట. అతడు ఇంకా జైలుకు వెళ్ళలేదు. ఈ కోర్టు, ఆ కోర్టు అంటూ తిరుగుతున్నాడు. తాజాగా అతడికేసిన శిక్షను ధృవీకరించింది పైకోర్టు. దానిపై, దాని పైకోర్టుకెళతాడంట. 2007 ఆగస్టు 25 న పేపర్లలో ఈ వార్త చాలా ప్రముఖంగా వచ్చింది. గతంలోను ఈ కేసు గురించి పేపర్లలో బాగానే వచ్చింది. అతడు కారు దిగే ఫోటో, ఎక్కే ఫోటో... ఇలా.

ఇతడి వార్త వచ్చిన ఆగస్టు 25నే మరో వార్త కూడా వచ్చింది. అంతరించి పోతున్న కృష్ణజింక జాతిని
(అతడు చంపేసిన జింక జాతి) కాపాడేందుకు హైదరాబాదులోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ - మక్కికి మక్కి అనువాదం చేస్తే.. కణ, కణజాల జీవశాస్త్ర కేంద్రం) నడుం బిగించింది. కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక జింక పిల్లను భూమి మీదకు తెచ్చారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మనోజ్‌పాటిల్, సదానంద్, ఉమాపతి దీనిపై కృషిచేసారు. వీరు అయిదు మగ కృష్ణజింకల నుంచి 85 వీర్యనమూనాలను సేకరించారు. వీటిని మూడు జింకల్లో కృత్రిమ విధానంలో గర్భధారణ చేయించగా ఒకటి విజయవంతం అయిందని సీసీఎంబీ సంచాలకులు లాల్జీసింగ్ చెప్పారు. [2007 ఆగస్టు 25 నాటి ఈనాడు వార్త -ఈ లింకు ఎన్నాళ్ళో పనిచెయ్యదు]

శభాష్, శాస్త్రవేత్తలూ!

సీసీఎమ్‌బీ,
మూలకణాలపై (స్టెమ్‌సెల్స్) పరిశోధనలు చేస్తున్న ఏకైక భారతీయ సంస్థే కాకుండా, ప్రపంచంలోని అతి కొద్ది సంస్థల్లో ఇది ఒకటని కూడా చదివిన గుర్తు. మొదలుపెట్టినకొత్తలో దాని గురించి ప్రముఖంగా వార్త వచ్చింది, అది ఎంత బాగుందో, దాని పరిసరాలెంత బాగున్నాయో అంటూ! అప్పటి సంచాలకుడు (భార్గవ అనుకుంటా) మారి, లాల్జీసింగు వచ్చాక ఆయన జీవిత విశేషాలను గురించిన వార్త వచ్చింది.
----- -x- -----

కొసమెరుపు: ఆ సినిమా హీరో ప్రాణాలు తీస్తే, శాస్త్రవేత్తలు ప్రాణాలు పోసారు. ఈనాడులో అతడి వార్త మొదటి పేజీలో ఫోటోతో సహా ప్రముఖంగా వచ్చింది, వీరి వార్త ఐదో పేజీలో వేసారు; ఫోటోలా!? భలేవారే!!

22, ఆగస్టు 2007, బుధవారం

బీసీసీఐ నిర్వాకం

5 కామెంట్‌లు
భారత్ లో క్రికెట్టు నియంత్రణ కోసం బీసీసీఐ ఉంది. కానీ..

బీసీసీఐ నియంత్రించేది క్రికెట్టును కాదు, దానిలో వచ్చిపడుతున్న డబ్బులను.
ఏ పోటీ ఐనా, ఎక్కడ జరిగినా మన జట్టంటూ పాల్గొంటే చాలు.. డబ్బులే డబ్బులు!
మనం ఓడినా, గెలిచినా మన జట్టు ఆడే మాచిల ప్రసార హక్కులు కోట్లు కురిపిస్తాయి.
- అంచేత జట్టును ఆడించడమే ముఖ్యం.. గెలుపు కాదు.
- అంచేత జట్టును ఎంపిక చేస్తే చాలు.. మంచి జట్టే కానక్కర్లేదు.
- అంచేత ఆటగాళ్ళంటూ ఉంటే చాలు.. మంచి ఆటగాళ్ళను తయారు చెయ్యాల్సిన పని లేదు.

బీసీసీఐ ఎక్కువగా తప్పుడు విషయాలకే వార్తల్లో ఉంటుంది. ఇవిగో ఇలాంటి వాటికి.
  • ఆటగాళ్ళ లోగోల గోల
  • ఆటగాళ్ళతో ఒప్పందాల పేచీ
  • ప్రసార హక్కుల గొడవ
  • ఎన్నికల రాజకీయాలు
  • ఐసీసీతో తగువులు
చాలా సులువుగా చెయ్యాల్సిన పనుల్ని కూడా కంపు చేస్తూ ఉంటారు వీళ్ళు, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు లాగా! మన జట్టుకు కోచిని నియమించడంలో బయటపడింది కదా వీళ్ళ తెలివితక్కువతనం. ఒక్కడు కాదు ముగ్గురి చేతుల్లో వెధవలయ్యారు. గతంలో వీళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషనుతో కూడా పేచీ పెట్టుకున్నారు. కామన్వెల్తు ఆటలకు క్రికెట్టు జట్టును మా ద్వారానే పంపాలని ఐ.ఓ.ఏ చెబితే, మీద్వారా ఎందుకు, మేమే నేరుగా పంపిస్తాం అని గొడవ పెట్టుకున్నారు. ఐసీసీతో కూడ గొడవ పడ్డారా మధ్య. (ఐసీసీ కూడా తక్కువదేమీ కాదనుకోండి.)

బీసీసీఐ నిర్వాహకులు భలేగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లేడు గానీ ఇదివరకు జయవంత్ లెలే అని ఒకాయనుండే వాడు, కార్యదర్శిగా.. మనవాళ్ళు ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడి వస్తారని పత్రికల వాళ్ళకి చెప్పాడోసారి; తరవాత దాన్ని ఖండించాడు లెండి!

పైగా బీసీసీఐ పేరెత్తితే చాలు, రాజకీయాల గబ్బు. పోయిన దాల్మియా పతాకస్థాయికి తీసుకెళ్ళాడు దాన్ని. దాల్మియాలు, నాయర్లు, భింద్రాలు.. వీళ్ళకు రాజకీయాల తోటే సరిపోయేది. వీళ్ళు రాబందుల్లాగా తయారయ్యారనుకుంటే.. ఏకంగా గుంట నక్కలు, తోడేళ్ళే రంగంలోకి దిగిపొయ్యాయి, తరవాత. మాంసం వాసనను ఈ జంతువులెలా పసిగడతాయో, రాజకీయ జంతువులు డబ్బు వాసన్నలా పసిగడతాయి.

అసలు రాజకీయులు బీసీసీఐ లోకి దిగడం ఎప్పుడో మొదలైంది. ఎన్.కె.పి.సాల్వే అధ్యక్షుడిగా చేసాడిదివరలో. తరవాత్తరవాత మాధవ్‌రావ్ సిందియా, అరుణ్ జైట్లీ, శరద్ పవార్.. ఇలా అందరూ చేరి దాన్నో రొచ్చుగుంట చేసారు. లాలూ బీహారు సంఘంలో అడుగెట్టాడు, తరువాతి మజిలీ బీసీసీఐ య్యే! (ఇతర ఏ రంగం నుండైనా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు గానీ రాజకీయులు వేరే ఏ ఇతర రంగంలోకీ అడుగుపెట్టరాదని ఓ చట్టం చేస్తే బాగుండు. దివాలా తీసినవాడు ఇక ఎందుకూ పనికిరాడని తేల్చినట్టుగా నన్నమాట!)

ఒక్క బీసీసీఐ మాత్రమేనా.., దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ సంఘాలూ ఇట్టాగే ఏడుస్తున్నట్టున్నాయి. భారత క్రికెట్టు సామ్రాజ్యానికి బీసీసీఐ చక్రవర్తి, స్థానిక సంఘాలు సామంత రాజులూను. మన హైదరాబాదు సంఘం చూడండి.. రాజకీయాలకు నెలవది. శివలాల్ యాదవ్ తన కొడుక్కోసం తిరుపతి రాయుణ్ణి బలిపెట్టాడని చదివాం. ఆంధ్ర సంఘానికి ఈ మధ్య ఎన్నికలు జరిగితే బెజవాడ ఎంపీ దూరబోయాడు.. ఎలాగో బెడిసికొట్టింది. బెంగాల్లో ఓ సీపీఎమ్ నాయకుడూ ఓ పోలీసోడు పోటీ పడ్డారు అధ్యక్ష పదవి కోసం. అప్పుడు ఎవడికి మద్దతివ్వాలనే విషయమై ముఖ్యమంత్రికి చిక్కొచ్చిపడిందట! మన పేపర్ల దాకా వచ్చిందా విషయం.


ఇండియన్ క్రికెట్ లీగ్ - ఐసీయెల్ - భారత క్రికెట్లోకి మంచి మార్పులు తెస్తుందా?
తెస్తుంది. పోటీ వస్తుంది. బీసీసీఐ క్రికెట్ గురించి కూడా ఆలోచించేలా చేస్తుంది. పెద్దల అండలేని ఆటగాళ్ళ ప్రతిభా ప్రదర్శనకు వేదిక అవుతుంది. ఐసీయెల్ క్రికెట్టుకు సేవ చేసేందుకు వచ్చిందని నేననడం లేదు.. వాళ్ళకూ డబ్బు కావాలి. కానీ క్రికెట్టును పక్కనెట్టి రాజకీయాల్లో మునిగితేలరు, బీసీసీఐ లాగా.

ఐసీయెల్ లాగా మరి కొన్ని లీగులు రావాలి. అన్ని లీగుల్లోంచి ఉత్తమంగా ముందుకొచ్చేవారికి జాతీయ జట్టులో స్థానాలు కల్పించాలి. అదే బీసీసీఐకి తగిన మందు.

ఐసీయెల్ కు స్వాగతం! సుభాష్ చంద్రకు, కపిల్ దేవ్ కు శుభాకాంక్షలు.

తా.క: బీసీసీఐ వెబ్ సైటు చూస్తే, వాళ్ళకు క్రికెట్టు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకర్థం అవుతుంది. అసలు దాని వెబ్ అడ్రసేంటో చెప్పుకోండి చూద్దాం!

సంబంధిత టపాలు