కేసీయార్ రాజీనామా అంకాన్ని పూర్తి చేసాడు. కేసీయార్ దృక్కోణం నుండి చూస్తే ఎందుకో నాకిది తార్కికంగా అనిపించలేదు. రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి కాంగ్రెసును వీలయినంత ఇబ్బంది పెట్టేసాడు. తెరముందు తన వాదనను బాగా వినిపించి ప్రజల్లోకి మళ్ళీ దూసుకెళ్ళాడు. తాను పొందాల్సిన లాభాన్ని పొందేసాడు. ఇక ఏదో ఒకటి చెప్పి, రాజీనామా వెనక్కు తీసుకుంటాడనుకున్నాను. కానీ, తెగే దాకా లాగాడెందుకో!? రాజీనామా ఉపసంహరణ కోసం కాంగ్రెసు కొంత ప్రయత్నం చేసింది గానీ, కేసీయార్ 'ఆశించినంత ' చేసినట్లు లేదు. ఒక రకంగా కేసీయార్ కు రాజీనామా వెనక్కు తీసుకోలేని పరిస్థితి కల్పించినట్లయింది. ఇక దృశ్యం కార్యక్షేత్రానికి మారింది.
ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు తెరాసకే ఎక్కువగా ఉన్నప్పటికీ అది నల్లేరు మీద నడకయితే కాదు. తెరాస ఓటమికై కాంగ్రెసు ఎంతకైనా తెగిస్తుందనేది కాదనలేని విషయం. తెలుగు దేశం పుంజుకోవడం తెరాసకు కష్టము, నష్టమూ కలిగించే విషయం.
కాంగ్రెసుకు కరీంనగర్ ఉపఎన్నిక అగ్ని పరీక్షేమీ కాదు. ఓడిపోతే చెప్పుకోడానికి కాంగ్రెసుకు ఒక వంక ఉంది. - ఇప్పటికే తెరాస స్థానమిది. పైగా అధినేత కేసీయార్ స్థానం కూడాను. గెలుపు కోసం కాంగ్రెసు సర్వ సన్నాహాలు చేస్తుంది, సర్వశక్తులూ ఒడ్డుతుంది అనేది సర్వ విదితం. అధికారంలో ఉన్నవారి ఎన్నికల ఆగడాలు మనకు కొత్తేం కాదు. తెరాసకిదో పెద్ద సవాలు
తెరాస గెలిస్తే సరే, గెలవకపోతే మాత్రం అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. మిగతా పార్టిలకంటే కూడా తెరాసకే ఈ ఎన్నిక కీలకం. గెలిస్తే తమ ఉద్యమానికి ఊపు వచ్చేమాట నిజమే. కానీ ఆ ఊపు ఇప్పటికే కొంత వచ్చింది. ఎన్నికలు జరిగి అందులో గెలిస్తే వచ్చే లాభం కొంత ఇప్పటికే వచ్చింది. దాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇతర పద్ధతులను చూసుకోవాల్సింది. ఖర్మకాలి ఈ ఎన్నికల్లో ఓడితే, స్వయానా కేసీయారే చేజేతులా ఉద్యమాన్ని దెబ్బతీసిన వాడవుతాడు. కాబట్టి రాజీనామా తెరాస దృక్కోణంలో అంత తార్కికంగా లేదు!
కేసీయార్ రాజీనామా తార్కికమైనది కాదనేందుకు మరో సాక్ష్యం.. బీజేపీతో సయోధ్య కోసం వారి ప్రయత్నాలు. గెలుపు చేజారకుండేందుకు చెయ్యవలసిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. (అసలు తెరాసదో చిత్రమైన వ్యక్తిత్వం! (పార్టీత్వం అనాలేమో!) ఓ పక్కనుండి ఇష్టమొచ్చినట్లు తిడతారు, మరో పక్కనుండి సాయం కావాలంటారు. పైగా తమకు సాయం చెయ్యడం అవతలవాడి ధర్మమన్నట్లు మాట్లాడతారు.) రాజకీయ పార్టీలకు ఎవరో ఒకరి తోక పట్టుకుని ఈదడం, అవసరం తీరాక తోక జాడించడం కొత్త కాదు కాబట్టి వాళ్ళిద్దరూ కలవవచ్చు. లేని పక్షంలో, బీజేపీ తమ అభ్యర్థిగా విద్యాసాగరావును నిలబెడితే తెరాసకు గడ్డుకాలమే!
ఇక రాజీనామా చెయ్యడంలోని సంబద్ధతనే ప్రశ్నించేవారు ఎలాగూ ఉన్నారు. ఐదేళ్ళపాటు సేవ చెయ్యమని ఆదేశిస్తే తమ పంతాలకోసం మధ్యలోనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టమనడం ఏమిటి? ప్రజలను వంచించడం కాదా? ఇది అనవసరమైన ఖర్చు కాదా? అనేవారు ఉన్నారు. రాజీనామాను వంచనగా ప్రజలు భావిస్తే వోటుచ్చుక్కొడతారు. ఇక ఖర్చంటారా? నిజమే, అది అనవసరమైన ఖర్చే! దాన్ని నివారించే మార్గం రాజ్యాంగంలో ఏర్పరచాలి. ప్రజలు తెరాసకు వోటేస్తారో, వోటుచ్చుక్కొడతారో చూడాలి.
వోటుచ్చుకు కొట్టడమనే జాతీయము చాలా బాగుంది. మీ కల్పనా శక్తికి జోహార్లు. నల్లేరు మీద నడకంటే సులువు అని అర్ధమా? నల్లేరు మీద నడక పళ్లేరు మీద పడక అని చిన్నప్పుడు విన్నట్టుంది కానీ పూర్తి వాక్యము మర్చిపోయా. మీకు తెలిస్తే చెప్పరూ.
రిప్లయితొలగించండివోటుచ్చుకు కొట్టడమనే జాతీయము చాలా బాగుంది. మీ కల్పనా శక్తికి జోహార్లు. నల్లేరు మీద నడకంటే సులువు అని అర్ధమా? నల్లేరు మీద నడక పళ్లేరు మీద పడక అని చిన్నప్పుడు విన్నట్టుంది కానీ పూర్తి వాక్యము మర్చిపోయా. మీకు తెలిస్తే చెప్పరూ.
రిప్లయితొలగించండి'వోటుచ్చుకు కొట్టడం' నిజంగా బాగుంది. వోటుచ్చుకు కొట్టినా, నోటుచ్చుకొని కొట్టినా లేదా సుక్కేసుకొని కొట్టినా చివరకు ప్రజలకు జరిగే మేలు ఏమిటో...
రిప్లయితొలగించండికె.సి.ఆర్. గురించిన మీ టపాలు ఆసక్తి కరంగా ఉన్నప్పటికీ, మీ బ్లాగులో వైవిధ్యం కొరవడుతుంది. మూస రచనల రచయిత ముద్ర పడకుండా వెరే విషయాలపై ధ్యాస మళ్లిచ్చండి. మీ అభిమానిగా మీకు ఈ సూచన చేసే హక్కు నాకు ఉందో లేదో తెలియదు. మనసులో మాట చెప్పా.
రిప్లయితొలగించండిరావు గారూ!
రిప్లయితొలగించండిబ్లాగు కంటే బ్లాగు వ్యాఖ్యలనే ఎక్కువ ఇష్టపడతాను నేను.. "అసలు కంటే కొసరు ముద్దు"! ఇక మీవంటి సద్విమర్శకుల వ్యాఖ్యల గురించి చెప్పేదేముంది!? మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా, నిస్సంశయంగా, రాయండి.