మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..
అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?
మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.
ఐదో తరగతి దాకా చదువు తెలుగులో చెప్పకుండా, పరాయిభాషలో చదువు చెప్పడం వాళ్ళకు వేస్తున్న అసలు శిక్ష అనేది మనం గమనించాలి. దానికితోడు తెలుగులో మాట్టాడినందుకు ఈ శిక్ష!
ఓ సంగతి చూడండి.. సాఫ్టువేరు ఉద్యోగాలు చేసే మన కుర్రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతలేదన్నా కనీసం ఓ మూణ్ణాలుగు లక్షల మందైనా ఉంటారు. "మన కుర్రాళ్ళు" అంటే 20-30 సంవత్సరాల మధ్య ఉండే తెలుగు వాళ్ళు! దాదాపుగా అంతా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళే! ప్రతీ రోజూ కనీసం ఏడెనిమిది గంటలు జాలంలో ఉంటారు. ఇంతమంది తెలుగువాళ్ళు జాలంలో తిరుగుతూంటే తెలుగు బ్లాగులను చూసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి? ఏనాడన్నా మీ బ్లాగుకు వెయ్యి మంది వచ్చారా? బ్లాగులకు సందర్శకులను సరఫరా చేసే కూడళ్ళకు కూడా వెయ్యిమంది రారు నా ఉద్దేశంలో! ఈ కుర్రాళ్ళలో బ్లాగులున్నాయని తెలవనివాళ్ళు, బ్లాగులంటే ఆసక్తి లేనివాళ్ళు కొంతమంది పోయినా, కనీసం ఒక్..క శాతం కూడా బ్లాగులను చదవడం లేదెందుకు?
తెలుగు చదవడం, రాయడం రాకే! ఇంగ్లీషు మీడియమ్ చదువులు వీళ్ళకు తెలుగును నేర్పనివ్వకుండా చేసాయి. (ఇప్పుడు బ్లాగులు చదివేవాళ్ళలో కూడా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళు బాగా తక్కువ మంది ఉండొచ్చు.) చిన్నప్పుడు తెలుగులో చదవడం, పెద్దయ్యాక (కనీసం ఇంటరుదాకా) తెలుగు చదవడం - ఈ రెండు పనులు చేస్తే తెలుగు చదవలేక/రాయలేకపోవడం అనేది ఉండదు.
తెలుగులో మాట్టాడితేనే తప్పయ్యే పరిస్థితి బడుల్లో ఉంటే, మన పిల్లలకు తెలుగు చదవడం రాయడం వస్తుందా? వాళ్ళ పిల్లలకు మాట్టాడ్డం వస్తుందా? అంచేతే.. ఐదు దాకా పిల్లలకు చదువు తెలుగులోనే చెప్పాలి. పునాదిలో తెలుగుంటే ఆ పైన ఏ భాషలో చదివినా నెగ్గుకొస్తారు. ఆరో తరగతి నుంచి ఇంటరు దాకా ఏ భాషలో చదివినా, తెలుగు సబ్జెక్టు మాత్రం చదివి తీరాలి. ఈ పనులు చేసిన ముఖ్యమంత్రి మరో రాయలే!
పెద్దలు కొందరు (మేధావులు) అసలు సంగతిని పక్కనబెట్టి, దీనికి సామాజిక కోణాన్ని ఆపాదిస్తూంటారు. కులాన్ని, మతాన్ని సమస్యలోకి లాక్కొస్తారు. లాక్కొస్తున్నారు కూడా. 'పిల్లలకు శిక్ష వెయ్యడమనేది అసలు సమస్య. అంతేగానీ, తెలుగులో మాట్లాడొద్దనడం కాదు' అంటూ ఉపదేశాలిస్తున్నారు. ఆ శిక్ష వేసినవాళ్ళకు తగు శిక్ష విధించాలి అని వాదిస్తున్నారు. నిజమే ఆ పంతుళ్ళను బడినీ శిక్షించాల్సిందే, అందులో మరో అభిప్రాయం ఉండటానికి లేదు. కానీ, అదేనా పరిష్కారం?
కంచె అయిలయ్య ఇంకా ఏమన్నాడో చూడండి..
తెలుగు భాష మాట్లాడొద్దని అన్నందుకు, ఆ ప్రిన్సిపల్‌ను పిలిచి అఫిషియల్సు ఎంత హ్యుమిలియేట్ చేస్తున్నారో చూడండి. పిల్లలకు ఆహారం లేకపోతే అఫిషియల్సు పట్టించుకోట్లేదు, మీడియా పట్టించుకోట్లేదు, సోషల్ వెల్ఫేరు స్కూల్స్ నడవకపోతే పట్టించుకోట్లేదు. బోర్డులు కట్టారనే కారణంతో ఇం..త పెద్ద నన్‌ను, ప్రిన్సిపల్‌ను హెరాస్ చేసే ప్రక్రియ మనం చేస్తున్నామే!
అని బాధపడిపోయాడాయన!
ఇంకోమాట కూడా .. ఇదేదో పెద్ద నేరమైనట్టు ఆ బడిమీద చర్య తీసుకోవడం లాంటివి చెయ్యకూడదు. పిలిచి ఓమాట చెప్పి వదిలేస్తే సరిపోద్ది అని అన్నాడు. ఆయన ప్రాథమ్యాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తోంది గదా! మరికొందరు మేధావులు కూడా ఇలాగే సమస్యను ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.
ఇంతకీ.. అయిలయ్య ఈ సమస్యకో పరిష్కారం చూపించాడు.. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటరు దాకా పిల్లలందరికీ మూడు సబ్జెక్టులు మాతృభాషలోను, మూడు ఇంగ్లీషులోను చెప్పాలంట. అలాగైతే రెండు భాషలూ వస్తాయంట. ఉన్న సబ్జెక్టులు ఆరు - తెలుగు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్సు, సోషలు - ఇవేగా?
అందులో మూడు తెలుగులో చెప్పమంటున్నాడు. మాతృభాషలో చదువు చెప్పడమంటే అదే కదా ! -లెక్కలు, సైన్సు, సోషలు తెలుగులో చెబుతారు. ఈయన లెక్కేంటో అర్థం కాలేదు అని అనుకుంటూండగా, ఇంకో ముక్క అన్నాడు..
- 'సగం సిలబస్సు మాతృభాషలోను, సగం ఇంగ్లీషులోను చెప్పాలి, ఆ దెబ్బతో రెండు వచ్చేస్తాయం'ట. ఇంకోటేంటంటే.. ఇలా చదివిన పిల్లకాయలు దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా చక్కగా చదివెయ్యగలరంట !!!
అయిలయ్య చెప్పినది ఇలా ఉండగా..
ఏ తికమకా లేకుండా కొందరు పెద్దలు ఇలా చెబుతున్నారు..
"ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు చదువు ప్రవేశించి, తెలుగును మరణశయ్య మీదకి ఎక్కిస్తోంది" ఈ ముక్క ఎవరన్నారో తెలుసా.. రంగనాయకమ్మ!
"అధికార భాషగా తెలుగును అమలుచెయ్యని ప్రభుత్వానికి తెలుగు ప్రాచీనతను అడిగే నైతిక హక్కు లేదు." జ్వాలాముఖి
"గత ఇరవై యేళ్ళుగా ఇంగ్లీషు మాధ్యమ చదువులు విపరీతంగా పెరిగాయి. దాదాపు రెండు తరాల విద్యార్థులు తెలుగు రాకుండానే తెలుగును నామమాత్రంగ చదువుతూనో, అసలు చదవకుండానో పాఠశాల చదువులు, కాలేజీ చదువులూ వెలగబెట్టారు. డాక్టర్లు, ఇంజనీర్లూ అయ్యారు. వీళ్ళంతా పరభాషా సంస్కృతులకు పరాయీకరణం చెంది ఇంట్లో తెలుగు పత్రికను కనబడనీయరు, కనబడ్డా ముట్టరు. వీళ్ళు తెలుగుకు దూరమైతే వీళ్ళ పిల్లలకు రానిస్తారా? ఇలా మరో రెండు తరాలు గడిస్తే వీళ్ళంతా తెలుగు మాటకు కూడా దూరమవుతారు. ఓ సమాజంలో 20 శాతం మంది ఆ భాషను చదవకుండా చదువు ముగిస్తే ఆ భాష మృతభాష అయ్యే ప్రమాదముంది అని యునెస్కో హెచ్చరించింది."- కాలువ మల్లయ్య. ఈయన రాసిన వ్యాసం పూర్తిగా చదివి తీరాలి. మనం చూస్తున్న కొందరు ఇంగ్లీషు భక్తుల నైజాన్ని ఆ పేజీల్లో పరిచాడాయన.
వీళ్ళే కాదు, వేలమంది పెద్దలు - విద్యావేత్తలు, భాషావేత్తలు, రచయితలు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు - తెలుగులో బోధన చెయ్యాలనీ, తెలుగును విధిగా నేర్పాలనీ చెబుతున్నారు. వీళ్ళు మనకు రాజకీయ నాయకులు కాకపోవచ్చు, కానీ నాయకులే -సాంస్కృతిక నాయకులు!
మనమంతా కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసి, పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంపై పొద్దులో జరుగుతున్న చర్చ చూడండి. Read more...


