ఈనాడుతో ముఖ్యమంత్రి వ్యవహారం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పత్రికలు అవినీతి ఆరోపణలు చేసినపుడు ప్రభుత్వ వైఖరి రక్షణాత్మకంగా ఉంటుంది. అందునా పేర్లతో సహా వచ్చినపుడు, మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు. అదేదో సూటిగా చెయ్యక వెనకదెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రింగురోడ్డుకు సంబంధించి ఈనాడు ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి సరైన పనే చేసారు. కానీ పత్రికపై ఎదురుదాడి చెయ్యడం, దాన్ని సంకేతంగా తీసుకుని కాంగ్రెసు కార్యకర్తలమని చెప్పుకుంటున్న రౌడీలు పత్రిక కాపీలను తగలబెట్టడం.. ఇవన్నీ ముఖ్యమంత్రి గౌరవాన్ని దిగజార్చేవే గానీ, ప్రభుత్వానికి ఏమాత్రం ఉపకరించవు. రాజశేఖరరెడ్డి అసహనాన్ని సూచిస్తున్నాయి, ఈ చర్యలు. ముఖ్యమంత్రి స్థాయికి తగవీ పనులు.
ముందుగా ఒక విషయం.. సమాజంలో ఎవరు తప్పు చేసినా అరికట్టేందుకు, సరిదిద్దేందుకు ప్రభుత్వం ఉంది. మరి.. పాలకులే తప్పు చేస్తే? మనమెన్నుకున్నవారే మన వెనుక గోతులు తవ్వితే? మన డబ్బు కొల్లగొట్టేస్తే? మనకేమిటి రక్షణ? అందుకోసం వాళ్ళపై ఒక నిఘా ఉండాలి. ప్రతిపక్షాలు ఆ పని చెయ్యాలి. మన ప్రధాన ప్రతిపక్షం అలా చేస్తున్న జాడ లేదు. చెయ్యగలిగిన శక్తియుక్తులూ దానికి ఉన్నట్లు లేవు. కొండొకచో చేసినా, ఈ ప్రభుత్వం లెక్క జేస్తున్నట్లు లేదు. అందుకు ముఖ్య కారణం అందరూ దొంగలే కాబట్టి! మరిక నిఘా ఎవరు పెట్టాలి? పత్రికలే! అవి ఆ పని చేస్తున్నంత కాలం మనం పత్రికలను బలపరచాల్సిందే!
పత్రికలే తప్పు చేస్తే? ఈనాడు రాసింది తప్పైతే? పక్షపాత ధోరణితో రాసి ఉంటే?
రాంగురోడ్డు విషయంలో ఈనాడు పేర్లతో సహా రాసింది తప్పై ఉంటే.. ఈ పాటికి రాసినవాడూ, రాయించినవాడు ఇద్దరిపైనా కోర్టు కేసులు కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి. ఆరోపణల్లో పేర్లున్న వారెవ్వరూ ఇంతవరకూ కేసులెందుకు వెయ్యలేదు? వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఎం రాఘవులు ఆరోపణలు చేస్తే ఆయనకు లాయరు నోటీసు పంపిన విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. (ఇకముందు వేస్తారేమో చూడాలి.)
ఇంకో విషయం ఏమిటంటే పత్రికలు, ఈనాడుతో సహా, చాలా ఆరోపణల్లో తగు సాక్ష్యాధారాలు లేకపోతే గోడ మీది పిల్లివాటంగా రాస్తాయి. ఉదాహరణకు మాదాపూర్లో ఘటకేసర్ ట్రస్టు భూముల్లో "ముఖ్య నేత సోదరుడైన ఎంపీ " గారి అక్రమ కట్టడమంటూ ఈనాడు ముసుగు తొడిగి రాసిన వార్త. కాస్త లోక జ్ఞానం ఉన్నవాడెవడికైనా అది వై యెస్ వివేకానందరెడ్డి గురించని తెలిసిపోతుంది. కానీ తమకు తాముగా పేరు మాత్రం బయట పెట్టలేదు. కానీ రాంగురోడ్డు ఆరోపణలు మాత్రం పేర్లతో సహా రాసింది ఈనాదు. సెప్టెం 29 నాటి మొదటిపేజీ ప్రత్యేక సంపాదకీయంలో రాసింది చూస్తే ఆరోపణలపై తగు ఆధారాలు ఉన్నట్లే తెలుస్తోంది. ఓ పత్రిక బహిరంగంగా ముఖ్యమంత్రికి విసిరిన సవాలు అది; ఫ్రంటల్ ఎటాక్ !
ఈనాడు ఆరోపణలకు కాంగ్రెసు స్పందన ఎలా ఉంది? అవినీతి ఆరోపణలు చేస్తే తెలుగుదేశానికి ఎలా జవాబిస్తుందో అచ్చం అలానే స్పందించింది. 'తెలుగుదేశం బోలెడు తప్పులు చేసినప్పుడు మీరేం మాట్లాడలేదు, మా విషయంలో మాత్రం విరుచుకుపడుతున్నారు. మీ సొంత భూములు పోయాయని మీ ఏడుపు, అందుకే మామీద ఆరోపణలు చేస్తున్నారు ' -ఇదీ వరస!
రామోజీరావో మరొకరో అంటే మనకు ప్రత్యేక అభిమానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వపు తప్పొప్పుల్ని బయట పెడుతున్నపుడు మాత్రం మనం వాళ్ళ వెంటుండాలి.. అది ఈనాడయినా, వార్తయినా! ఒకే ఒక్క విషయం.. ప్రభుత్వంపై నిఘా అనేది ఉండాలి, మనకది అత్యావశ్యకం. ఈ నిఘా ఎవరు పెడితే వాళ్ళను బలపరచాలి.
ప్రభుత్వం తప్పు చెయ్యలేదు, ఈనాడు రాసేదంతా అబద్ధం అనే నిర్ణయానికి ఎవరైనా వచ్చేసి ఉంటే, వాళ్ళు నిక్షేపంగా ఈనాడుని చదవడం మానెయ్యొచ్చు, లేదా ఈనాడును విమర్శించవచ్చు. కానీ ఇతరులు ఈనాడుని చదవకుండా పత్రిక కాపీలను కాల్చెయ్యడం ఏంటి?
మన ప్రస్తుత రాజకీయాల ఆత్మ అలా ఉంది మరి...క్రూరంగా దిష్టి బొమ్మలు తగులపెట్టటం, పాలతో అభిషేకాలు చెయ్యటం, బస్సు అద్దాలు పగలకొట్టటం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించటం...ఈ మహానుభావులందరూ వందేళ్ళ క్రితమే పుట్టి ఉంటే మనకు అప్పుడే స్వాతంత్రం వచ్చి ఉండేది. బ్రిటీషోడు వీళ్ళతో చస్తే చావలేడు :-)
రిప్లయితొలగించండిపనిగట్టుకొని అబద్ధాలు రాయవలసిన అవసరం ఈనాడు కు ఉన్నట్లు కనిపించట్లేదు. అలా రాస్తే కోర్ట్ లో దావా వేస్తారనే విషయం ఈనాడుకు తెలియనిది కాదు. ఉంగరం రహదారి ఇంకెన్ని మలుపులు తిరుగుతోందో?
రిప్లయితొలగించండిమెయిలు ఫార్వర్డును పరీక్షించడం కోసం రాసిన వ్యాఖ్య!
రిప్లయితొలగించండినమస్కారమండి.నాపేరు శ్వేత.నేను వీవెన్ వెబ్ సైటును తరుచూ చూస్తుంటాను.చూడగాచూడగా బ్లాగును క్రియేట్ చెయ్యడం లేఖిని ఉపయోగించి తెలుగులో బ్లాగులు రాయడం వరకూ నేర్చుకున్నాను.కాని నాబ్లాగును కూడలిలో ఎలా వుంచాలో తెలియడంలేదు. మీరు సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిch.swetha
http://swetharamachandra.blogspot.com
ThanQ very much for u r quick response. Now i am able to see my blog in veeven website. anyway thanq once again.
రిప్లయితొలగించండిMay i know why have u gussed that i might know veeven?
ఈనాడు రాసింది అక్షరాల కరక్టే. పత్రికలు ప్రజలకు నిజనిజాలు చెప్పే ప్రచార సాధనాలు, ఎలాగు T.V లో సీరియల్సు, సినిమాలు తప్ప ఇటువంటి విషయాలు చెప్పరు. మంచి article..
రిప్లయితొలగించండి