30, మే 2006, మంగళవారం

తెలంగాణ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు..

7 కామెంట్‌లు
తెలంగాణ అంశం తెలుగు వారు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ సమస్య. అలాంటి ముఖ్యమైన అంశంపై రెండేళ్ళుగా మన రాజకీయులు ఆడుతున్న నాటకాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.. 'పైకి ఏదో ఒకటి మాట్లాడుతున్నా, లోపల ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో మిగతావారికి తెలుస్తున్నట్లు లేదు' అని. ఈ రాజకీయ నాటకంలో ముఖ్యపాత్రలు ఐదు. సోనియా, కె.సి.ఆర్, నరేంద్ర, రాజశేఖరరెడ్డి, కేశవరావు.


మాయాబజారు సినిమాలోని మాయాదర్శిని వాడి, వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకుందాం.


కె.సి.ఆర్: ఈ సోనియాతో పెద్ద చిక్కొచ్చి పడిందే! ఈమెకా తెలీదు, చెబుదామా అంటే అపాయింటుమెంటివ్వదు. దొరక్క దొరక్క దొరికినప్పుడు గోడు వెళ్ళబోసుకుంటానా.. ఒక్క ముక్క మాట్లాడదు. ఏంటో చిద్విలాసంగా నవ్వుతుంది. "హమ్మయ్య అనుకూలంగానే ఉందీమె" అనుకుని బయటికి వస్తాను. వెంటనే ఈ రాజశేఖరు ఎవరో ఒకర్ని పంపించి ఒద్దని నూరిపోస్తాడు. ఎలాగైనా ఈ మూడేళ్ళూ కనీసం నెలకో సారన్నా సోనియా అపాయింటుమెంటు తీసుకుని తెలంగాణ ఎందుకు కావాలో చెబుతూ ఉండాలి. అప్పటిదాకా మంత్రిపదవి కాపాడుకోవాలి. దిగ్విజయ్‌ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అపాయింటుమెంటు ఎలాగోలా ఏర్పాటు చేస్తాడు. అపాయింటుమెంటు కోసం నేనెంత కష్టపడుతున్నానో ఈ మందడితో ఉన్న మందకు తెలిసి చావడం లేదు.


నరేంద్ర: ఈ కె.సి.ఆర్ ని పట్టుకుని తెలంగాణ గోదావరి ఈదగలనో లేదో గానీ, మంత్రి పదవి మాత్రం దక్కింది. బీజేపీలో ఉంటే ఇది దక్కేదా! రాజీనామా రాజీనామా అంటూ కె.సి.ఆర్ నిజంగానే రాజీనామా చెయ్యమంటాడేమోనని భయంగా ఉంది. ఏదో డెడ్‌లైన్లు పెట్టుకుంటూ నెట్టుకొస్తున్నా, ఇలా ఎన్నాళ్ళో!? ప్రస్తుతానికి మరో డెడ్‌లైన్ ఇచ్చేస్తా!


రాజశేఖరరెడ్డి: మేడంకు ఏమీ తెలవదు కాబట్టి సరిపోయింది, లేకుంటేనా..! ఆమెకేమీ తెలవకుండా కాపాడుకోవాలి. సోనియాను వీళ్ళు కలవకుండా చూసుకుంటే సరిపోద్ది. ఒకవేళ కలిసినా.. దానికి ముందోసారి, వెనకోసారి మనాళ్ళని పంపించి, మేడంను పూర్తిగా అయోమయంలో పెట్టేయాలి. కేశవరావే అందుకు సమర్థుడు.


కేశవరావు: ఏమిటి నా పరిస్థితి ఇట్లా ఐపోయింది!? ముఖ్యమంత్రి ఇలా అనమంటాడు, కె.సి.ఆర్ అలా అనమంటాడు. చచ్చిపోతున్నాను ఏమనాలో తెలీక. లక్కీగా మనమేం మాట్లాడినా ఆమెకేమీ అర్థం కాదు కాబట్టి పర్లేదు. ఎటొచ్చీ విలేకరులతోటే జాగ్రత్తగా ఉండాలి.


సోనియా: ఏంటో వీళ్ళ గోల. రెండేళ్ళైనా ఇంతవరకూ నాకేం అర్థం కాలేదు. "మన సొమ్మేంబోయింది ఇచ్చేస్తే పోలా" అంటే వినరు. విసుగొచ్చేస్తోంది. ఈ ప్రణబ్ ముఖర్జీ ఒకడు.. "ఎటూ తేల్చకూడదు మేడం" అంటాడు. రాజశేఖరేమో "రాష్ట్రం ఇచ్చే ప్రసక్తే లేదం"టాడు. ఇక ఆ కె.సి.ఆర్ చెప్పేది ఒక్క ముక్క అర్థమై చావదు. అర్థం కావడంలేదని చెబుదామంటే అవకాశమివ్వడు! తానే మాట్లాడుతాడు తప్పించి నన్ను నోరెత్తనివ్వడు. నేను నవ్వుతూ తలకాయ ఊపుతుంటే అర్థమైందనుకుంటున్నాడు, పాపం! తలనెప్పొచ్చేస్తోంది. నేనందుకే వీళ్ళను అసలు కలవనని అంటాను. దిగ్విజయ్ వినడు. "ఓసారి కలవండి మేడం, ఒక మూణ్ణెల్ల దాకా పడి ఉంటారు" అంటాడు. ఆ నరేంద్రొకడు, అతణ్ణి చూస్తేనే భయమేస్తుంది. అతడితో వస్తే కలవనని కె.సి.ఆర్ కు ముందే చెప్పడం మంచిదైంది.


ఆ పీసీసీ అధ్యక్షుడి పేరేమిటీ.. ఆఁ.., కేశవ్! చిత్రమైన మనిషి! మాట్లాడేది ఇంగ్లీషైనా ఒక్క ముక్క అర్థం కాకుండా భలే మాట్లాడతాడు. పైగా "మీరు కూడా ఇలాగే మాట్లాడాలి మేడం" అంటాడు.


ప్రధానమంత్రి పదవి రాకపోడమే మంచిదైంది. లేకపోతే ఈ గోలకి పిచ్చెక్కిపోయేది. ఈ యు.పి.ఏ కు కూడా రాజీనామా చేసేసి ఏ ప్రకాష్ కారత్ కో ఇచ్చేస్తాను అంటే దిగ్విజయ్ వినడు.. "ఐదో ఏడు త్యాగం చేద్దురుగాని మేడం, ఎన్నికల్లో పనికొస్తుంది" అంటాడు. అప్పటి దాకా ఎలా భరించాలో వీళ్ళని!!


వీళ్ళంతా నాకు అనుచరులో, ట్యూషను టీచర్లో తెలీడం లేదు. నాకేవీ తెలీదని వీళ్ళంతా నాతో ఆడుకుంటున్నారు. అయినా.., నేనసలు నోరే విప్పను కదా.., మరి, నాకేం తెలవదని వీళ్ళకెలా తెలిసిందబ్బా!!?? అమ్మో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.

*******
మరి కమ్యూనిస్టులూ, చంద్రబాబూ మాటేమిటి.. మాయాబజారు సినిమాలో పాండవుల పాత్రే వీళ్ళదీను.

28, మే 2006, ఆదివారం

టీవీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు తగువైతే..

4 కామెంట్‌లు
సినిమా వాళ్ళకు, టీవీ వాళ్ళకు గట్టిగా తగువైతే చూడాలనుంది. మా సినిమాలు, పాటలు, క్లిప్పింగులు, మీ టీవీల్లో వెయ్యడానికి వీల్లేదని వాళ్ళూ, అసలు మీ సినిమాల గురించి అన్నీ నిజాలే చెబుతామని వీళ్ళూ పంతం పట్టారనుకోండి, మనకెన్ని ఉపయోగాలో చూడండి..
  1. సినిమాల గురించి కార్యక్రమాలేమీ లేకపోయేసరికి టీవీలు 12 గంటల సేపు మూత పడతాయి. (వేరే కార్యక్రమాలా? సర్లెండి, దానికి బుర్ర కావాలి, ఆషామాషీ కాదు!)
  2. సినిమా సమీక్షల్లో (సమీక్షలను సినిమా వాళ్ళు ఆపలేరు కదా!) అబద్ధాలసలుండవు కాబట్టి మంచి సినిమా ఏదో చప్పున తెలిసిపోతుంది మనకు.
  3. వెకిలి చేష్టల లంగర్లు, భాష రాని లంగర్లకు పని ఉండదు కాబట్టి, మళ్ళీ తమతమ పూర్వ వృత్తుల్లోకి పోతారు, పీడా విరగడై పోతుంది. (వాళ్ళలో కొంతమంది తిరునాళ్ళలోని ప్రభల మీద రికార్డు డ్యాన్సులకు తప్ప మరో దానికి పనికిరారు.)
  4. ఈ మకిలంతా పోయిన తరువాత, కాస్త తేటనీరు, కొత్తనీరు వస్తే అప్పుడు మళ్ళీ మనం మంచి కార్యక్రమాలు చూసే అవకాశం ఉండొచ్చు.
టీవీల భాగోతం పై నా బ్లాగోతం చూడండి. నా మొట్ట మొదటి జాబు అదే!

26, మే 2006, శుక్రవారం

వేగుచుక్క

1 కామెంట్‌లు
(ఈనాడులో వార్త ఆధారంగా)
కొందరుంటారు, ఒకటనుకుంటే అది సాధించేదాకా వదలరు. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తిరగరు. మిన్నూ మన్నూ ఏకం చేసైనా తామనుకున్నది సాధిస్తారు. చుట్టూ ఉన్నవారికి వేగుచుక్క లాగా నిలుస్తారు.

అదుగో అటువంటి వ్యక్తే .. పాతికేళ్ళ శిష్టా (శిష్ట్లా?) వివేక్ విక్రమ్‌.పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు ఈయన సొంతూరు.
ఇంటరు చదివేటపుడే ప్రమాదంలో తండ్రి మరణం..
అదే ప్రమాదంలో తనకు తగిలిన గాయాల కారణంగా 9 నెలలు పడక.
ఇంటరులో ఫస్టుక్లాసు
తండ్రి ఛీఫ్ మేనేజరుగా పనిచేసిన బ్యాంకులోనే దాదాపు ప్యూను స్థాయి ఉద్యోగంలో చేరిక
ఉద్యోగం చేస్తూనే బీకాం చదివి, ఇప్పుడు ఐ.ఐ.ఎం కలకత్తాలో చేరబోతున్నాడు

తన పెదనాన్న గారి అబ్బాయి లక్నో ఐ.ఐ.ఎం లో పట్టా తీసుకోడం చూసి అనుకున్నాడట, తనూ ఐ.ఐ.ఎం లో చదవాలని! అప్పుడు.. డిగ్రీ చదవడం మొదలెట్టి సాధించాడు! వివరాలను మే 26 నాటి ఈనాడులో చూడండి
ఐ.ఐ.ఎం లో సీటు రావడం కంటే.. ఇంటరు పూర్తి చెయ్యడమే తనకు మరపురానిది అని అంటున్నాడు, వివేక్

శభాష్ వివేక్!!

25, మే 2006, గురువారం

బ్లాగు గణాంకాలు - 2

6 కామెంట్‌లు
మన బ్లాగును ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోడం బానే ఉంటుంది. అయితే, దీనితో ఓ సమస్య కూడా ఉంది.. మన బ్లాగును పెద్దగా ఎవరూ చూడటం లేదని కూడా తెలుస్తుంది. దానితో నీరసం వచ్చే అవకాశమూ ఉంది. చూస్తే చూస్తారు, లేపోతే లేదు, నాకేంటి.. నా రాతలు నే రాస్తాను, నా కూతలు నే కూస్తాను అనుకునే నాబోంట్లకు ఇదో లెక్కలోది కాదనుకోండి.

స్టాట్‌కౌంటరు అనే గణాంకాల సైటు పెర్ఫార్మెన్సింగు కంటే బాగుంది. ఇదీ ఉచితమే, ఇదీ అదృశ్యంగానే పనిచేస్తుంది.

24, మే 2006, బుధవారం

మత మార్పిడి ఊపు మీద పోపు గారు

4 కామెంట్‌లు
భారత్‌లో మత మార్పిడులు కూడదంటూ చట్టాలు చెయ్యడం ఒప్పనంటున్నారు పోపు గారు. మత స్వేచ్ఛకు అది భంగమట! వంద కోట్ల జనాభా (95 శాతం మంది క్రైస్తవేతరులు), పేదరికం (దుప్పట్లిచ్చి మతం మార్చెయ్యొచ్చు), పరమత సహనంతో ఉండే ప్రజలు (వాళ్ళ పడగ్గదిలోకి వెళ్ళి ప్రచారం చేసినా ఏమీ అనుకోరు), లౌకిక తత్వం (అనగా పెద్ద మతానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుంది), అనుకూలమైన చట్టాలు (లేకపోయినా మార్చుకోవచ్చు).. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే గాల్లో తేలివచ్చే విత్తనాల్లాగా వచ్చి, ఇక్కడ చేరి మొలకలెత్తాలని ప్రయత్నాలు చేసారు, చేస్తున్నారు. పళ్ళ చెట్టుకే గదా రాళ్ళదెబ్బలు!

ఈ దేశం వాళ్ళకి ప్రచారం చేసుకోండి పోండని చెప్పింది. ఇంటి పెరట్లో ఆడుకోండని పక్క వీధి పిల్లలకు చనువిస్తే పెరడంతా పీకి పందిరి వేయబూనినట్లుగా అయింది మన పరిస్థితి. ఎవరో ఒక్కరిద్దరు మతం మారితే అది మారే వాళ్ళిష్టం. మందలుగా, మూకుమ్మడిగా మారితే అది మార్చే వాళ్ళిష్ట ప్రకారం జరుగుతున్నదని అర్థం. ముస్లిము పాలకుల కాలంలో మత మార్పిడులు తెగ జరిగాయి, ఎందుకు? ఇస్లాంపై ప్రేమతోనా? లేక హైందవంపై మొహం మొత్తా? బలవంత మత మార్పిడి మధ్య యుగ సంస్కృతి. ప్రస్తుత సంస్కృతి ఏమిటంటే.. దుప్పట్లిద్దాం, మందులిద్దాం, ఆపై మతం మారుద్దాం. అడ్డుకుంటే, పరమత సహనం లేదంటూ నిందిద్దాం, మతస్వేచ్ఛ గురించి బోధిద్దాం.

మత సంస్కారం, పరమత సహనం అంటే ఏంటో ప్రపంచానికి నేర్పిన ఆధ్యాత్మిక శిఖరానికి పోపు గారు నీతులు చెబుతున్నారు.., ఎంత తెంపరితనం!!

22, మే 2006, సోమవారం

రిజర్వేషాలు

8 కామెంట్‌లు
సామాజిక అసమానతలను తొలగించడం రిజర్వేషన్ల ప్రధానోద్దేశ్యం. సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలకు అనులోమానుపాతంలో ఉంటాయి. ఉన్నవారు, లేనివారు అనే అంతరం సామాజిక అసమానతలను నిర్ణయిస్తుంది. ఈ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచేందుకే రిజర్వేషన్లు పెట్టారు. 50 ఏళ్ళపాటు రిజర్వేషన్లు పెట్టాక కూడా అది జరగలేదని మనకు తెలుస్తూనే ఉంది. ఆర్థిక అసమానతలు పెరిగాయి కానీ తగ్గలేదు. పైగా కులాల ప్రాతిపదికన విద్యార్థులను చీల్చి సంకుల సమరాలకు దార్లు తెరుస్తున్నాయి. రాజకీయ నాయకులు తమ ఎత్తులు, జిత్తులకు రిజర్వేషన్లను సాధనంగా వాడుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

రిజర్వేషను ఇచ్చి కాలేజీల్లో సీట్లు ఇవ్వడం, ఉపాధి కలిగించడమనేవి ఊరికినే కరెంటు ఇవ్వడం, ఉచితంగా బియ్యం ఇవ్వడం.. లాంటివి. కొనుక్కునే వాళ్ళకు, ఊరికినే పొందే వాళ్ళకు కూడా అరకొరగానే అందుతాయి, ఎన్నాళ్ళో సాగవు. బరువు మోయలేని ప్రభుత్వాలు ఎప్పుడో ఒకప్పుడు కాడి పడేస్తాయి. పడేసాయి కూడా! అప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఊరికినే బియ్యం ఇచ్చే బదులు, మార్కెట్టు ధరకే తమక్కావలసిన బియ్యం కొనుక్కునే స్తోమత కలిగించడం మంచిది కదా! అది కష్టమే, కానీ లక్ష్యసాధనకదే మార్గం.

రిజర్వేషన్ల వలన లాభం ఎవరికి?
"
వెనకబడ్డ వర్గాల వారికి" అనేది పూర్తిగా నిజం కాదు. మొత్తం వెనకబడ్డవారి జనాభాలో లాభపడ్డవారి శాతం ఎంత? పది శాతం కంటే తక్కువే ఉండొచ్చు. మరి మిగిలిన వారి సంగతేంటి? వారి జీవితాలను మెరుగుపరచేదెలా? మరి, ఇంత కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే ఈ అంశంపై ఇంత యాగీ ఎందుకు చేస్తున్నారీ రాజకీయులు? ఎందుకంటే..అక్కడ ఓట్లున్నాయి కనుక (రాబందులు కళేబరాల కోసమే చూస్తుంటాయి). ఈ అంశం వలన ఎక్కువ లబ్ది పొందేది రాజకీయులే గాని వాళ్ళు చెబుతున్నట్లు, వెనుకబడిన వర్గాలు కాదు.
మరి, వెనుకబడిన వారికి గరిష్ఠ లాభం కలగాలంటే ఏం చెయ్యాలి? ప్రతిభను పెంపొందిచుకునే అవకాశాలను కల్పించాలి. రిజర్వేషన్లను సంస్కరించాలి!

రిజర్వేషన్ల వలన నష్టం ఎవరికి?
ప్రతిభ ఉన్నవారికి, సమాజానికి, దేశానికి. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ పక్కకు తప్పుకుని కుల, మతాలకు చోటిస్తోంది. అత్తెసరు తెలివితేటలు కలవారు అందలాలెక్కుతున్నారు. అర్హులైన వారు మరుగున పడిపోతున్నారు. అయితే ఇది వాస్తవం కాదంటూ ఓ వాదన ఉంది. ప్రొఫెసరు కంచె ఐలయ్య గారు ఈ మధ్య దక్కను క్రానికిల్ లో ఓ వ్యాసంలో కూడా ఇది రాసారు. టూకీగా ఈ వాదన ఏమిటంటే.. "ఇన్నాళ్ళుగా ఇచ్చిన రిజర్వేషన్ల వలన - ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో - అందలాలెక్కిన వారు అనర్హులే అయితే, ఈ రాష్ట్రాలు సాధించిన ప్రగతి సాధ్యపడేది కాదు "- అని. మరి, రిజర్వేషన్ల వలన ఏ ఇబ్బందీ లేకపోతే, ప్రతిభకు ఢోకా లేకపోయినట్లయితే, ఈ పరీక్షలెందుకు, ఈ మార్కులు, ర్యాంకులు, ఈ తలనెప్పంతా ఎందుకు. హాయిగా కులానికిన్ని అని కేటాయించి ఆ దామాషాలో సీట్లు, ఉద్యోగాలు పంచుకుంటూ పోతే సరిపోతుంది కదా! ఐలయ్య గారి వాదన తప్పు!

ఎలా సంస్కరించాలి?
1. ప్రస్తుత రిజర్వేషను విధానాన్ని ఎత్తివేయాలి. ప్రతిభ ప్రకారమే అవకాశాలు దొరకాలి.
2. తెలివితేటలు పుట్టుకను బట్టీ, కులాన్ని బట్టీ ఉండవు. పెంపొందించుకోవాలి. సమాజంలోని అన్నివర్గాల వారికీ - ఉన్నవారైనా, లేనివారైనా - చదువుకునే అవకాశాలు సమానంగా ఉండాలి. ప్రతిభను పెంపొందించుకునే అవకాశాలు కుల, మత, వర్గాలకు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకు అతీతంగా అందరికీ సమానంగా ఉండాలి.
3. ముందు విద్యను సంస్కరించాలి.. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదువుకోగలిగే వీలు కలిగించాలి. చదువులో సమానావకాశాలు ఇవ్వాలి. ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం, సత్తా కలిగించాలి.

డబ్బున్నవాడు 50 వేలు కట్టి ఇంటరు చదివి ఐ.ఐ.టి సీటు తెచ్చుకుంటున్నాడు, లేనివాడికి ఆ అవకాశం లేదు. ఇక్కడ డబ్బే ముఖ్యాంశం గానీ, కులం కాదు. మరి ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఈ స్థాయి చదువు చెప్పించి ఆ విద్యార్థులనూ మెరికల్లా తయారు చెయ్యవచ్చు గదా? పదేళ్ళ కిందటి వరకు సాగర్, కొడిగెనహళ్ళి ప్రభుత్వ కళాశాలలకే గదా మొదటి ర్యాంకులు, మరి ఇప్పుడా పరిస్థితి లేదేం? ప్రమాణాలు పడిపోతున్నాయెందుకు? ఆ ప్రమాణాలను ఉద్ధరిస్తే ఆర్థిక పరిస్థితులకు అతీతంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివేవారు కూడా అవకాశాల కోసం పోటీ పడతారు కదా! ఇది చెయ్యాలంటే ప్రభుత్వం పని చెయ్యాలి, శ్రద్ధ వహించాలి, అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయులు ప్రైవేటు కాలేజీల నుండి దొంగ డబ్బుకు కక్కుర్తి పడకూడదు.. ఒకటా రెండా, ఇన్నున్నాయి. ఇన్ని చేసే బదులు, రిజర్వేషన్లు పెట్టేస్తే పోతుంది కదా, ఒక్క సంతకంతో పనైపోతుంది. ఆపై వాళ్ళు చేసే పని ఏమీ లేదు, పైగా వోట్లూ నొల్లుకోవచ్చు. ఏది తేలికైతే అది చేసేద్దాం అనే ఆలోచన!! పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్!

ఇవి రిజర్వేషన్లు కావు, రాజకీయుల రిజర్వేషాలు!

17, మే 2006, బుధవారం

ఒంటరిగా మనలేని మాటలు

11 కామెంట్‌లు
తెలుగులో మనక్కొన్ని పదాలున్నాయి.. ఒంటరిగా పెద్ద గుర్తింపు లేనివి.. మళ్ళీ అదే పదంతో జతయితే అర్థవంతమౌతాయి. అలాంటివి కొన్ని ఇక్కడ, సరదాగా.. (ఇది కవిత కాదు!)

చతుర భక్తి, నిష్ఠుర భక్తి, ఎత్తిపొడుపు భక్తి..

1 కామెంట్‌లు
ఆధ్యాత్మిక రచనలతో తెలుగు సాహిత్యం పరిపుష్టమయింది. దేవుణ్ణి కీర్తిస్తూ చేసిన రచనలు ఎన్నో కాగా, కొన్ని మాత్రం భిన్నమైనవి. భగవంతుణ్ణి మాయజేసో, బుట్టలోవేసో, ఎత్తిపొడిచో, నిష్ఠురాలాడో తమ పనులు నెరవేర్చుకున్న కార్యసాథకులైన భక్తుల గురించిన రచనలు ఇవి.

16, మే 2006, మంగళవారం

బ్లాగు గణాంకాలు

3 కామెంట్‌లు
మీ బ్లాగుకు ఎంతమంది వస్తున్నారు, కొత్తవాళ్ళెందరు, మళ్ళీ మళ్ళీ వచ్చేదెంతమంది, ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు.. ఇట్లాంటి విషయాలు తెలియాలంటే http://performancing.com/చూడండి.

ఇది ఉచితం, బ్లాగు పేజీలో ఎక్కడా ఏమీ కనపడదు, మీ గణాంకాలు మీకే పరిమితం! ఓ చూపు చూడొచ్చు.., వాడొచ్చు. నేను వాడుతున్నాను.

15, మే 2006, సోమవారం

పునరంకితం.. పునః పునరంకితం

3 కామెంట్‌లు
రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పునరంకిత సభలు పెట్టింది. ఈ పునరంకితం అవడం ఏంటి? అధికారం స్వీకరించగానే అంకితమయ్యారుగదా! ఈ రెండేళ్ళలో ఎప్పుడు అనంకితమయ్యారు? ప్రజాసేవ నుండి ఎప్పుడు బయటపడ్డారు? భలే చడీచప్పుడు కాకుండా తప్పుకున్నారే! నేనింకా వీళ్ళు ప్రజాసేవలోనే ఉన్నారనుకుంటున్నా!! మరి.. అప్పటి నుండి వీళ్ళేంచేస్తున్నట్లు?

ఏదేమైనా ఈ పునరంకిత తిరునాళ్ళ సందర్భంగా రాజు, మంత్రులూ, విదూషకులు, భట్రాజులూ అందరికీ ఓ విన్నపం.. ఎప్పుడు అనంకితమౌతున్నారో మాకు చెప్పండి. మళ్ళీ చివరి ఏడాది పునరంకితమప్పుడు ఆశ్చర్యపోయే అగత్యం మాకుండదు. లేదా.., అంకితమైనప్పుడు, అనంకితమైనప్పుడు, పునరంకితమైనప్పుడు పరిస్థితుల్లో కాస్తో కూస్తో తేడా ఉండేలా చూడండి.

(పుస్తకాల) పురుగులొస్తున్నాయి జాగ్రత్త!

3 కామెంట్‌లు
(పుస్తకాల) పురుగులొస్తున్నాయి జాగ్రత్త! మిమ్మల్ని పుస్తకాల పురుగు కుట్టింది! ఇంతకుముందు నన్నూ కుట్టిందిలెండి!!

ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు చదివిన ఏదో ఒక పుస్తకం గురించి మీ బ్లాగులో తెలుగులో రాయాలి. రాసారా సరే సరి, లేదో.. కాయతొలుచు పురుగు, వేరు తొలుచు పురుగుల్లాగా ఇది మెదడు తొలుచు పురుగై ఓ రాత్రివేళ మీ మెదడును తొలిచేస్తుంది.., మీ ఇష్టం!

అంచేత, వెంటనే ఏదైనా పుస్తకం గురించి రాసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చావా కిరణ్, స్వాతి కుమారి నన్ను కుట్టించారు.. నేను మిమ్మల్ని కుట్టిస్తున్నాను. మీరో ఇద్దర్ని కుట్టించండి.

తెలుగువారిచేత చక్కటి తెలుగు పుస్తకాలు చదివించడమే కాక వాటి గురించి చక్కటి బ్లాగులు రాయించే సదాశయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగు బ్లాగుల ప్రపంచ వేదిక. మీరూ దీనిలో పాలుపంచుకోండి. చక్కటి తెలుగు పుస్తకాలు చదవండి. ఆపై ఆ పుస్తకం గురించి తేటతెలుగులో రాయండి, మిగతావారిచే చదివించండి.
-- * --

ఇకపోతే.. నేనీమధ్య చదివిన పుస్తకాలు..ఇంక్రెడిబుల్ గాడెస్ (పేరు ఇంగ్లీషైనా అచ్చ తెలుగు పుస్తకం, నేనింకా చదువుతూనే ఉన్నాను.) డా.కేశవరెడ్డి గారు రాసిన ఈ పుస్తకం ఏకబిగిన ఒక్క ఊపులో చదవాలంటే కష్టం! పచ్చిక మీద టైరుబండిలా కుశాలగా, మెత్తగా, కుదుపులేకుండా సాగిపోతూ ఉన్న కథలోకి అకస్మాత్తుగా చొరబడిన బీభత్సం, కథానాయకుడైన కూలివాని బతుకులోకి చొరబడ్డ విషాదం చదువరి మనసును కలచివేస్తాయి (ఈ చదువరీ అంతే!) . గుండెల్లో తడి ఉన్నవారికి కళ్ళు చెమర్చక మానవు.

కత్తులూ, వేటకొడవళ్ళూ, సుమోలు, బాంబులూ లేకుండా కేవలం పాత్రల మధ్య మామూలుగా జరిగే సాదాసీదా సంభాషణల్తో, యథాలాపంగా జరిగినట్లనిపించే సంఘటనల్తో రసపోషణ చేస్తారు కేశవరెడ్డి. అతడు అడవిని జయించాడు, రాముడుండాడు రాజివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరిగుడిసె ఆయన రాసినవాటిలో నే చదివినవి. ప్రతిదీ ఓ ఆణిముత్యమే. రాయలసీమ యాసలో ఆయన చేసే చిత్రణలో సామాజిక వ్యవస్థ, బడుగుల అవస్థ పాఠకునికి కళ్ళకు కడతాయి.

ఈ పుస్తకం గురించి సంక్షిప్త వివరణ త్వరలో రాస్తాను!

11, మే 2006, గురువారం

జయహో ఇస్రో!

5 కామెంట్‌లు
ఇస్రో - భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. స్వాతంత్ర్యం వచ్చాక భారత్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి.

బ్రిటిషు వాళ్ళు మనదేశాన్ని పీల్చి పిప్పి చేసి వదిలాక, దేశ, జాతి పునర్నిర్మాణంలో ఎన్నో ఘనతలు.. వీటిలో ముందువరుసలో ఎత్తు పీటపై ఉండేది, మన అంతరిక్ష పరిశోధన. ఈ రంగంలో ఇవ్వాళ మనం ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉన్నామంటే, ఈ ఘనత పూర్తిగా ఇస్రోదే. దాదాపు పూర్తిగా సొంత తెలివితెటల్తో, సొంత సాంకేతికతతో, కొద్దిపాటి వనరులతో మనవాళ్ళు రచించిన విజయగాధ ఇస్రో.

విక్రం సారాభాయీ సతీష్ ధావను
బెంగుళూరు, హైదరాబాదు,
తుంబా, శ్రీహరికోట
ఎస్సెల్వీ, ఏఎస్సెల్వీ,
పీఎస్సెల్వీ, జీఎస్సెల్వీ..
ఆర్యభట్ట, భాస్కర,
ఇన్‌శాటు, అయ్యారెస్సు..
ఎన్నో ఘనతలు, ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు. జాతికి కీర్తి తెచ్చేవి, తరతరాలకు స్ఫూర్తినిచ్చేవి. ఒక్కో రాకెట్టు నింగికెగుస్తూంటే ఒక్కో రికార్డు నేల రాలుతుంది! జాతిగౌరవం మరో కక్ష్య ఎగబాకుతుంది! ఇప్పుడు చంద్రయాన్! కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యలను దాటి మన అసలు సిసలు ఉపగ్రహం కక్ష్య వైపు చూపు! (చందమామా.. వస్తున్నాం!)

ఐదో తరగతి కసుగాయలకు షోలే గురించి పాఠం చెప్పించే అయ్యలారా!
ఇస్రో గురించి కూడా చెప్పించండి.. అది మన కీర్తి, మన పిల్లలకు స్ఫూర్తి!

సున్నా, సంస్కృతం, వేదాలు, భగవద్గీత, యోగసాధన, హైందవ ధర్మం, చదరంగం, బుద్ధుడు, అశోక చక్రవర్తి, గాంధీ.. మన కీర్తి కిరీటాలు. ఈ వరసలోదే.. ఇస్రో!

జయహో! ఇస్రో!! (-చదువరి తెలుగు బ్లాగు)

7, మే 2006, ఆదివారం

మీరేం చేస్తుంటారు?

0 కామెంట్‌లు
మనమెవరినైనా కొత్తవారిని కలిస్తే సాధారణంగా ఓ ప్రశ్న అడుగుతాం.. మీరేం చేస్తూ ఉంటారు? అని.
దానికి మన సమాజంలో కొన్ని వృత్తుల, వర్గాల వారు ఎలా జవాబిస్తారో చూద్దాం!
  1. రైతులు: వ్యవసాయం చేస్తాను
  2. వృత్తి పనుల వారు: ఫలానా వృత్తి చేస్తాను.
  3. కూలీలు: ఫలానా కూలీ పని చేస్తాను.
  4. పంతుళ్ళు: ఫలానా బడిలో పంతులుగా పని చేస్తున్నాను.
  5. గృహిణులు: ఇంటి పనులు చేస్తాను.
  6. ప్రభుత్వోద్యోగులు: ఫలానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను.
  7. ప్రైవేటు ఉద్యోగులు: ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను.
  8. వ్యాపారులు: ఫలానా వ్యాపారం చేస్తున్నాను.
  9. పాత్రికేయులు: ఫలానా పత్రికలో ఫలానా పని చేస్తున్నాను.
  10. కళాకారులు: ఫలానా కళను ప్రదర్శిస్తూ ఉంటాను. (బొమ్మలు గీస్తుంటాను, నటిస్తుంటాను, పాటలు పాడతాను .. ఇలా)
  11. నిరుద్యోగులు: పని కోసం వెతుక్కుంటున్నాను
  12. బడికెళ్ళే పిల్లలు: ఫలానా బడిలో ఫలానా తరగతి చదువుతున్నాను
  13. బడికెళ్ళని పిల్లకాయలు: ఆడుకుంటాను!?
  14. అడుక్కునే వాళ్ళు: అడుక్కుంటాను.
  15. రాజకీయులు: (ఏదన్నా అధికార పదవి ఉంటే అది చెబుతారు. లేదంటే..)??...!!...ఊ..??..ఆ!.. రాజకీయాల్లో ఉన్నాను..అంటే.. రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాను. (ఫలానా పని చేస్తాను అని చెప్పలేరు)
  16. రౌడీలు, గూండాలు: ??..ఆ!!, రాజకీయాల్లో తిరుగుదామనుకుంటున్నాను. (లేదా) ఫలానా రాజకీయ నాయకుడి దగ్గర ఉంటున్నాను

2, మే 2006, మంగళవారం

తెలుగు అమలు - ఇంటా బయటా

4 కామెంట్‌లు
(నేను దీన్ని నా తెలుగు రాతలు బ్లాగు నుండి సేకరించాను. నేనేమాత్రం ఆచరిస్తున్నానో, నేనసలేమనుకుంటున్నానో బ్రాకెట్లలో రాసాను. త్యాగ గారూ, మంచి లింకిది, థాంక్స్)
ఇంటింటా తెలుగు దివ్వె
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ Courtesy: ఈనాడు

సంబంధిత టపాలు