30, ఆగస్టు 2008, శనివారం

కందానికో నూలుపోగు

17 కామెంట్‌లు
ఏ యుగంలోనైనా అందం నాలుగు పాదాల మీదా నడిచే పద్యం, కందం. ఈ మధ్య బ్లాగుల్లో మళ్ళీ కంద పద్యం కాంతులీనింది -ముఖ్యంగా రెండు బ్లాగుల కారణంగా. కందపద్యం ఎలా చెప్పాలో రాకేశ్వరరావు సచిత్రంగా సోదాహరణంగా వివరించారు. కందపు గ్లామరును, గ్రామరునూ వివరిస్తూ చంద్రిమలో ఓ చక్కని జాబు వచ్చింది. ఈ రెండు చోట్లా బహు చక్కని వ్యాఖ్యలూ, వాటిలో అందమైన ఆశుకందాలూ వచ్చాయి. ఓపక్క అక్కడ వ్యాఖ్యలు రాస్తూనే రానారె తన బ్లాగులో ఒక సర్వలఘు కందాన్ని రాసారు. ఈ పద్యసంరంభం చూసాక నాకూ రాద్దామని ఉత్సాహం వచ్చింది. సూదీ దారం తీసుకుని పద్యాలు కుట్టేద్దామని కూచున్నా.. ఇదిగో ఇప్పటికయ్యింది. సరే, రాసిన రెండూ పద్యాలూ నా బ్లాగులోనే పెట్టేసుకుందామని, ఇదిగో ఇలా..

28, ఆగస్టు 2008, గురువారం

ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు

24 కామెంట్‌లు
ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.

18, ఆగస్టు 2008, సోమవారం

అన్నయ్యల పోటీ

8 కామెంట్‌లు
రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా' అనుకున్నారు. 'ఈడు రామారావు కాదు, డ్రామారావు' అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.

17, ఆగస్టు 2008, ఆదివారం

చిరంజీవి చెప్పిందేమీ లేదు, అంతా బహిరంగ సభలోనే నట!

19 కామెంట్‌లు
చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో!

తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల ప్రశ్నలు కూడా చాలావరకు అనుకున్నవే వచ్చాయి. వాటికి కూడా తయారై వచ్చాడు. మొదట్లో కొద్దిగా నెర్వస్‌గా కనబడ్డాడు గానీ, తరవాత బానే నడిపించాడు. అన్నీ తనకనుకూలమైన ప్రశ్నలు, తాననుకున్న ప్రశ్నలే. ఉదాహరణకు 'రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు?' అని ఎవరో అడిగితే, దానికి 'నాకు రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయో తెలీదు. సమయానికి రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని మాత్రం తెలుసు. అలాగే...' అంటూ చక్కగా చెప్పాడు.

ఎక్కడో ఒకచోట ఒక ప్రశ్న ఎదురైంది. అది విని కాస్త కోపగించుకున్నట్టు కనబడింది. ఎటొచ్చీ సమావేశమంతా గందరగోళంగా ఉండడంతో ఆ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు వినబడలేదు. చిరంజీవే సమాధానం చెప్పేముందు ఫలానా వాళ్ళు ఫలానా ప్రశ్న అడిగారు, దానికి నా సమాధానం ఇది అంటూ చెప్పాడు.

డబ్బులెక్కడినుండి వస్తాయి, రాజకీయాలల్లో మీకు స్ఫూర్తి ఎవరు, లాంటి కొన్ని ప్రశ్నలకు "ప్రజలే" అంటూ సమాధానం చెప్పాడు. ఇలాటి గ్యాలరీ సమాధానాలు చాలానే ఉన్నాయి. బంధువులు రాజకీయాల్లోకి రావచ్చా అనే ప్రశ్నకు 'సత్తా, ఆసక్తి, శక్తి ఉంటే రావచ్చు, అర్హత ఉంటే పదవులూ అలంకరించవచ్చు' అని అన్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ ప్రశ్న, సమాధానం అనిపించింది.

ప్రజాసమస్యలపై తన అవగాహన గురించి ప్రశ్న వచ్చింది. దానికి, 'సమస్యల గురించి చెప్పేందుకు మీరున్నారు గదా' అని అన్నాడు. చాలా హాస్యాస్పదమైన సమాధానం అది. సమస్యలపైన అవగాహన లేకుండా రాజకీయాల్లోకి దిగుతున్నాడా ఏంటి అనిపిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనేది విలేకరులు చెబితేనే తెలుసుకుంటాడా!!

ఇక, ఒకటి రెండు రొడ్డకొట్టుడు సమాధానాలు..
తెలంగాణ వంటి వివిధ సమస్యలపై మీ విధానాలు ఏమిటి అని అడిగినపుడు, అందరితోటీ చర్చింది, తగు సమయంలో, అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, ఇలాంటి సున్నిత సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకుపోయాడు. ప్రస్తుతానికైతే 'విధానం లేకపోవడమే ఆయన విధానం' లాగా అనిపించింది.

అవినీతి రహితమైన పార్టీ అంటున్నారు కదా.. ఇతర పార్టీల నుండి అవినీతి చరితులను ఎందుకు రానిస్తున్నారు అనే ప్రశ్నకు, 'తమ తమ పార్టీల్లో తామనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదని భావించినపుడు, మా విధానాలు నచ్చితే మావద్దకు రావచ్చు' అని అన్నాడు. 'ఇతర పార్టీల్లో కూడా నీతిమంతులు ఉటారు గదా' అనీ అన్నాడు.

అందరితోటీ మంచిగా ఉంటాను అంటూ తను ఎప్పుడూ చెప్పుకుంటూండే ధోరణిలోనే ఇప్పుడూ మాట్టాడాడు. విలేకరులతో స్నేహం చేసుకునే ధోరణిలో వ్యవహరించాడు. మాటలూ అలాగే చెప్పాడు, శరీర భావాలూ అలాగే ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ప్రత్యర్థులెవరు అని అడిగితే నాకు శత్రువులు, ప్రత్యర్థులు లేరు. నాకు శత్రువులల్లా సమస్యలే, పేదరికమే అంటూ చెప్పాడు. గ్యాలరీ సమాధానాల్లో ఇదొకటి.

మొత్తం మీద ఈ సమావేశం ద్వారా చిరంజీవి అసలు విషయం గురించి చెప్పింది తక్కువ, చెప్పనిది ఎక్కువ అనిపించింది.
తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ఒక్క మాట మాత్రం చెప్పాడు. రాజకీయాల్లోకి కొత్తదనం ఏదైనా తేదలచుకున్నాడో లేదో గానీ, సమావేశ ప్రసంగంలోగానీ, విలేకరుల ప్రశ్నలకిచ్చిన సమాధానాల్లోగానీ కొత్తదనమేమీ లేదు.

13, ఆగస్టు 2008, బుధవారం

శతకోటికొక్కడు !

4 కామెంట్‌లు
2012 ఒలింపిక్ పోటీల్లో మువ్వన్నెల జండాని చేబట్టి భారత జట్టుకు ముందు నడిచేదెవరో తేలిపోయింది. అతడే, వందకోట్ల మందిలో అతనొక్కడే -అభినవ్ భింద్రా!

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడి ఒలింపిక్సుకు ముందు "అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని ఆశలు పెట్టుకోకండి." అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో మన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకొచ్చిన అభినవ్ భింద్రా మాత్రం అద్భుతమే సాధించాడు. అతనికి నా అభినందనలు కూడా!

వందకోట్ల మంది ఉన్న దేశంలో బంగారాన్ని గెలుచుకు రాగల మొనగాడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి బంగారం తెచ్చుకోడానికి వందేళ్ళు పట్టింది. కానీ.. జనాభాకీ ఆటల్లో పతకాలకీ సంబంధం ఉందా అనేది ప్రశ్న. లేదని కొన్ని వాస్తవాలను చూస్తే అనిపిస్తోంది. జనసంఖ్యలో మనతో పోలిస్తే పిపీలికాలనిపించుకునే దేశాలకు కూడా బోలెడన్ని పతకాలు వస్తూంటాయి. అర్మేనియాలు, అజర్బైజాన్లూ, బుర్కినాఫాసోలు, ఇంకా బోలెడు పేర్లు వినని దేశాలు కూడా బంగారు, వెండి పతకాలు పట్టుకుపోతూ ఉంటాయి. బయటి దేశాల సంగతే ఎందుకు.. మన దేశంలోనే జాతీయ ఆటల పోటీలు పెడితే కేరళ, హర్యానా, పంజాబులే ముందు! ఇంకా విశేషమేంటంటే మణిపూరు, అసోంలు, వాటి మిగతా సోదరీమణులు కూడా కొన్నిసార్లు మనకంటే ముందే ఉంటాయి. (చంద్రబాబు హయాంలో జరిగిన జాతీయ ఆటల పోటీల్లో బయటి రాష్ట్రాల నుండి ఆటగాళ్ళను పట్టుకొచ్చి, మనల్ని బాగా ముందుకు తీసుకుపోయాడు, అది వేరే విషయం!) అంచేత..

తేడా జనాభాలో లేదు, మరెక్కడో ఉంది.

ఆటలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. మనం హాకీలో వెనకబడిపోవడానికి ఒక ముఖ్య కారణం చాన్నాళ్ళపాటు మనకు ఏస్ట్రో టర్ఫు లేకపోవడమేనని చెబుతారు (తరవాత్తరవాత గిల్లుడు కూడా కారణమని తేల్చారనుకోండి). అలాగే ఆటగాళ్ళకు ఆటమీద ఏకదీక్ష, తాదాత్మ్యం ఉండాలంటే వాళ్లకు జీవిక గురించిన చింత ఉండకూడదు. రేపెలా గడుస్తుందా అనే ఆలోచన ఉంటే ఆటలేం ఆడతారు!? వాళ్లకు అలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామా? ఉద్యోగాలిచ్చినా, మరోటిచ్చినా.. మన ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలన్నీ ఆటల్లో ఒక స్థాయికి వచ్చినవారికే! తగు చేయూతనిస్తే ఆ స్థాయికి చేరగలవాళ్ళు అనేకమంది ఉంటారు. తన స్మృతి బ్లాగులో ప్రవీణ్ ఇదేమాట చెప్పారు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను చేరదీసి, ఆటగాళ్ళుగా తీర్చిదిద్దే ప్రణాళికలుండాలి. వాళ్ళకు జీవన భద్రత కల్పించాలి. ఆటల సంస్కృతి ఒకటి అవసరం మనకు!

ఆటల్లో రాజకీయుల ప్రత్యక్ష జోక్యం ఉండకూడదు. ఎంతటి గొప్ప సంస్థనైనా తెల్లారేలోగా గబ్బు పట్టించగల సామర్థ్యం వాళ్ళ సొత్తు. వాళ్ళు లేకపోతే ఈ సంస్థల్లో రాజకీయాలు కూడా తగ్గుతాయి. (రాజకీయాలు అసలే లేకుండా ఉండవనుకోండి).
ఇంతటితో ఈ జాబును ముగించి..


---------------------------------------

పతకాలపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దన్న సురేష్ కల్మాడి గురించి రెండు ముక్కలు.. అతడో కాంగ్రెసు ఎంపీ! ఎన్నేళ్ళుగా ఉంటున్నాడో తెలీదుగానీ చాన్నాళ్ళుగా - కొన్ని ఒలింపిక్కులుగా - అతడే భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు. ఆటల పేరెత్తగానే గుర్తొచ్చేది గడ్డం పెంచుకున్న కల్మాడియే! అతని అర్హతలేమిటో తెలీదుగానీ, ఆటల పోటీలంటే చాలు ఆ పేరే వినిపిస్తుంది. ఒలింపిక్, కామన్‌వెల్త్, ఏషియన్, ఆఫ్రో ఏషియన్,ఏషియో ఆఫ్రికన్, ఏషియో అమెరికన్, అమెరికో ఏషియన్, ఏషియో ఆర్కిటిక్, ఆర్కిటికో ఏషియన్,.. ఇలా ఎన్ని రకాల ఆటలుంటే అన్నిట్లోనూ అతడే! (ఒకవేళ నేనిక్కడ రాసిన ఆటల పోటీలు లేకపోతే.. వాటిని మొదలుపెట్టినపుడు మాత్రం అధ్యక్షుడుగా అతడే ఉంటాడని చెప్పగలను) భారత అథ్లెటిక్ సమాఖ్యకు అతడు జీవితకాల అధ్యక్షుడు కూడా! 2010లో కామన్‌వెల్తు ఆటలు జరుగుతాయట.. దానికీ నేత ఆయనే! ఇన్నేళ్ళుగా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు చెప్పేమాట ఏంటంటే.. "ఓ.. పతకాలు వచ్చేస్తాయనీ, అద్భుతాలు జరిగిపోతాయనీ భ్రమ పడకండి" అని. ఇదీ ఇతగాడి నిర్వాకం! ఇలాంటివాడే క్రికెట్టుకి జయవంత్ యశ్వంత్ లెలే అని ఉండేవాడు. మనాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళేముందు "చిత్తుగా ఓడిపోయి తిరిగొస్తారు" అని అన్నాడు. ఇలా ఉన్నారు మన ఆటల నిర్వాహకులు!

11, ఆగస్టు 2008, సోమవారం

అమరనాథ దేవాలయ స్థల వివాదం

10 కామెంట్‌లు
సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే..

ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.

ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది...

సంబంధిత టపాలు