రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా' అనుకున్నారు. 'ఈడు రామారావు కాదు, డ్రామారావు' అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.