5, డిసెంబర్ 2006, మంగళవారం

సడిసేయకో గాలి సడిసేయబోకే..

జోల పాటలు, లాలి పాటలు, మేలుకొలుపు పాటలూ ఉన్నాయి. ఇది జోలకూ మేలుకొలుపుకూ మధ్య లోని పాట.. మెలకువ రాకుండా పాడే పాట!

సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..

రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..


నాకెంతో ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి; రాజమకుటం సినిమాలోది. అలికిడైతే తన స్వామికి మెలకువ వచ్చేస్తుందేమోనని గాలిని కదలొద్దని అదిలిస్తోందీవిడ! నిదుర చెదరిందంటే నేనూరుకోనే అంటూ హెచ్చరిస్తోంది! "మణి కిరీటము లేని మహరాజు గాకేమి" తరువాత, "పీడ మబ్బుల దాగొ నిదుర తేరాదే" తరువాతా వచ్చే సన్నాయి వాదన.. పాటకెంత సొగసునద్దిందో! మంచి పాట!!


powered by ODEO

6 కామెంట్‌లు:

  1. ఆహా! ఈ పాటంటే నాకూ ఇష్టం. బ్లాగినందుకు కృతజ్ఞతలు. :-)

    రిప్లయితొలగించండి
  2. కలం దేవులపల్లి వారిది. బాగుండకేంజేస్తుంది?
    మీరు బ్లాగిన ప్రతిలో "పీడ మబ్బుల" అన్నట్టు కనిపిస్తోంది. అసలు సాహిత్యం
    "నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే".
    మీరు సన్నాయి వాదన అనుకున్నది క్లారినెట్ (clarionet).
    గొంతు జిక్కి అనుకుంటా.
    సంగీత దర్శకులెవరో తెలీదు, ఎక్కువ వాయిద్యాల హడావుడి లేకుండా పాటంతా ఆహ్లాదకరమైన పిల్ల తెమ్మెరలాగా కూర్చారు.
    ఈ పాటని రాజసులోచన రామారావుల మీద చిత్రీకరించారు.
    ఈ సినిమాలో అలరించే ఇంకో రెండు పాటలు "ఏడనున్నాడో ఎక్కడున్నాడొ", "ఊరేది పేరేది ఓ చందమామా".
    గుమ్మడి, పద్మనాభం, రాజనాల, కన్నాంబ ముఖ్య భూమికలు పోషించిన మంచి జానపద చిత్రం.

    రిప్లయితొలగించండి
  3. వీవెన్, కృతజ్ఞతలు!
    కొత్త పాళీ గారూ, థాంక్సండి. పీడ మబ్బుల గురించి నాకు సందేహం వచ్చింది, చాలా సార్లు విన్నాను దాని కోసం.. కానీ అర్థం కాలేదు. క్లారినెట్, దేవులపల్లి విషయాలు తెలియజేసినందుకు కూడా కృతజ్ఞుణ్ణి. గత జాబులో కూడా ఆ పాట పాడింది, రాసింది ఎవరో రాయమని అడిగారు. నాకు తెలియలేదండి, తెలియగానే రాస్తాను.

    రిప్లయితొలగించండి
  4. ఈ పాట పాడింది పి.లీల. ఆకాశవాణి మదరాసు కేంద్రం స్థాపన తొలినాళ్లనుండి ఈమె పాడిన పాటలు ప్రసిధ్దం. ఈమె ఆంధ్రవనిత కాదంటే నమ్మబుద్ధికాలేదు. మంచి పాట వినిపించారు. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  5. నాకు కూడా ఈ పాటంటే ఇష్టం. ఎందుకో నాకు ఈ పాట వినగానే ఇంకొక పాట గుర్తుకొస్తుంది (ఎప్పుడూ), అదేంటంటే:

    తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు ...

    (పాట పూర్తిగా రాదు :( ). రచన, డా. సి. నారాయణ రెడ్డి గారు అనుకుంటా. మిగిలిన వివరాలు అసలు తెలియవు.

    ~ సూర్యుడు :-)

    రిప్లయితొలగించండి
  6. పాడింది పి. లీల. సంగీతం మాస్టర్ వేణు. కొన్ని పాటలకు మాత్రం సంగీతం సమకూర్చింది రజని (బాలాంత్రపు రజనీకాంతరావు)గారు. ఆయనే వాళ్ళ బావగారి పేరుతో (నాగరాజు) కొన్ని పాటలు కూడ రాసారు. మద్రాసు కేంద్రం తొలినాళ్ళ నుండే
    లీల పాటలు ప్రసిద్ధం అన్నారు. మద్రాసు కేంద్రం 1937 ప్రాంతానికే ఆరంభమయ్యింది. లీల సినిమాల్లో పాడ ప్రారంభించింది 1949 నుండి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు