ప్రభుత్వంలో పలుకుబడి కలిగినవారు, మాన్యులు తమ ఇష్టం వచ్చినట్లు రింగురోడ్డును మెలికెలు తిప్పినపుడు సామాన్యులు మొదటిసారి నష్టపోయారు. ఆగస్టు 30 న శాసనసభలో అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి వాళ్ళని మరోమారు దెబ్బకొట్టారు. శాసనసభలో భూసేకరణ విషయమై చర్చలో పాల్గొన్న తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ మంచి మంచి పాయింట్లు లేవనెత్తుతూ, ప్రభుత్వం, అధికారులు కలిసి సామాన్యుడిని ఎలా వంచించారో గణాంకాలతో సహా వివరిస్తూ ఉన్నారు. ఒక అరగంట పాటు సాగిన ఆ ప్రసంగం చూసిన వారికెవరికైనా అనిపిస్తుంది.. శాసనసభలో ఈ మధ్య కాలంలో జరిగిన అర్థవంతమైన ప్రసంగాల్లో ఇది ఒకటి అని. ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు ఉన్నాయి ఆయన ప్రసంగంలో!
ఇక అప్పుడు మొదలైంది రభస! స్పీకరిచ్చిన అవకాశంతో, మైకందుకుని మాట్లాడే వారిని మాట్లాడనివ్వకుండా అడ్డగోలుగా అడ్డుతగిలే రకాలు రెండు పక్షాల్లోను ఉన్నారు. కాంగ్రెసు సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి దేవేందర్ గౌడ్‌ను 'నువ్వు అక్రమంగా భూములు సంపాదించావు', 'చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెబుతావేంటీ' అంటూ మాట్లాడారు. చిరాకొచ్చిన గౌడ్, ఆవేశంతో 'ఏఁ, మాకు సంపాదించుకునే హక్కు లేదా' 'మేమేమీ మీలాగా గూండా గిరీ, రౌడీయిజం చేసి సంపాదించలేదే' అంటూ ఊగిపోయారు. ఇక గోల మొదలు. నన్ను వ్యక్తిగతంగా దూషించారు, క్షమాపణ చెప్పాలంటూ రామకృష్ణారెడ్డి డిమాండు. దానికి వంత పాడుతూ కాంగ్రెసు ఛీఫ్ విప్పు కిరణ్ కుమార్‌రెడ్డి అడ్డు తగలడం. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడడం తప్పని అనడం.. ఇలా సాగింది ఒక గంట. ఈలోగా రోశయ్య గారు లేచి, సభను కాస్సేపు వాయిదా వేసి, అసలు గౌడ్ ఏమన్నారో రికార్డుల్లో పరిశీలించి, ఆపై నిర్ణయం తీసుకొమ్మని స్పీకరుకు సూచించాడు. రోశయ్య అన్న మాటతో స్పష్టమైపోయింది, ప్రభుత్వానికి ఈ విషయంపై చర్చించడం ఇష్టం లేదని, అందుకే వాయిదా కోరుతున్నారని. చిత్రమేమిటంటే, అదే రోశయ్య గారు (శాసనసభా వ్యవహారాల మంత్రి) రెండు నిమిషాల్లోనే ఆ రికార్డును ప్రింటు తీయించి మరీ చదివారు, గౌడ్ ఏమన్నారో. ఈ మాత్రం దానికి సభను వాయిదా వెయ్యమని అడిగాడా పెద్దమనిషి!
పోనీ, కాంగ్రెసు చర్చను పక్కదారి పట్టిస్తోందనే జ్ఞానం ఉందా ప్రతిపక్షానికీ? ఎబ్బే.. అదేఉంటే వెంటనే సారీ చెప్పి చర్చను కొనసాగించి ఉండే వారే కదా! సారీ ఎందుకు చెప్పాలని వాళ్ళ పట్టుదల. అనవసరమైన పట్టుదలకు పోకుండా చర్చను ముందుకు నడిపి ఉంటే, బాధితుల గోడు కనీసం సభలో వినిపించి ఉండేది. దాదాపు పన్నెండింటికి మొదలైన రభస, ఒకటిన్నర దాకా సాగింది. ఇక స్పీకరుకు చిరాకొచ్చి, నాలుగ్గంటలదాకా సభను వాయిదా వేసారు.
ఇలాగ, శాసనసభ్యులకు మనం అప్పజెప్పిన పనిని మళ్ళీ ఎగ్గొట్టారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం అనే ఆటను తమలో తాము ఆడుకుంటూ రాజకీయులు, ప్రజల్ని మరీ ముఖ్యంగా రింగురోడ్డు బాధితుల్ని మరోసారి ఓడించారు.
చాలా బాగుంది ప్రస్తుత విషయాల మీద మీ వ్యాసం
రిప్లయితొలగించండి---బుజ్జిది
యథా ప్రజా: తథా రాజ: - ప్రజాస్వామ్యం
రిప్లయితొలగించండి