25, జూన్ 2006, ఆదివారం
పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ
పెద్దలు, ప్రముఖులు తమ జ్ఞాపకాలను తవ్వుకుంటూ మాట్లాడుతుంటే వినడానికి నాకెంతో ఇష్టం. తాను ఏ పాటలు ఏ సందర్భంలో పాడారో, ఎవరెవరు ఏమన్నారో చక్కగా చెప్పుకూంటూ పోయారు శ్రీనివాస్ గారు. రామారావు, భానుమతి నటించిన ఓ సినిమాలో (పేరు మర్చిపోయాను) పాటలన్నీ భానుమతి గారే పాడారట, ఉన్న ఒకే ఒక్క మగ గొంతు పాట తనదట. సినిమా పేర్లలో నేపథ్య గాయకు"డు" - పీబీశ్రీనివాస్ అని వేసారట - చెప్పుకుంటూ మురిసిపోయారాయన. ఈ పాట గురించే మరో సంగతి చెప్పారు-
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు సినిమాలూ,పాటలూ ఈ వ్యవహారాలంటే పడేవి కాదట. ఆయన కొడుకు విశ్వనాథ పావనిశాస్త్రి ఓసారి శ్రీనివాస్‌తో ఇలా చెప్పారట. ఆ పాట ఎలాగో విశ్వనాథ వారి చెవిలో బడింది. మగవాడు పాడితే అలా ఉండాలిరా, స్వరం నాభిలోంచి రావాలి అంటూ కొడుకుతో మెచ్చుకోలుగా మాట్లాడారట. నాకదో పెద్ద మెప్పు అని చెప్పుకున్నారు శ్రీనివాస్ గారు.
ఇలాగ మరిన్ని విషయాలు చెప్పారు. తన తర్వాత చిత్రరంగానికి వచ్చి ఎంతో ఎదిగిన బాలు గురించి ఎంతో మెచ్చుకోలుగా మాట్లాడారు. లేతమనసులు సినిమా గురించి, ఎనిమిది భాషల్లో తాను చేపట్టిన ఓ కార్యక్రమం గురించి కూడా మాట్లాడారు.
ఇంటర్వ్యూ చేసే వారూ, ఇచ్చేవారు ఇద్దరికీ లయ కుదిరింది. ఆయన అడగడం ఈయన చెప్పడం చక్కగా సాగింది. శ్రీనివాస్ గారికి వినబడ్డం కోసం ఇంటర్వ్యూ చేసిన రఘు పెద్దగా మాట్లాట్టం, వారిద్దరి మధ్యా ఆత్మీయ వాతావరణం ఉన్న భావనను కలిగించింది. రఘు కూడా గాయకుడు కావడం, శ్రీనివాస్ గారి కృషి గురించి బాగా శోధించడం బహుశా దీనికి కారణం కావచ్చు. రఘుకు అభినందనలు.
ఒక చిరు లోపం: కార్యక్రమాన్ని బాగా ఎడిట్ చేసారు. ఇష్టాగోష్ఠిగా జరిగే కార్యక్రమాన్ని యథాతథంగా చూపిస్తే బాగుంటుంది. కత్తిరింపులు తప్పనిసరైనా సాఫీగా గతుకులు లేకుండా ఉండేలా చేస్తే ఇంకా బాగుండేది. మొత్తానికి ఆదివారం నాడు మంచి కార్యక్రమం చూసాను.
ఈ కార్యక్రమం వెనువెంటే పెళ్ళిపుస్తకం పేరుతో దంపతులను ఇంటర్వ్యూ చేసే కార్యక్రమంలో డాక్టరు ఎన్.ఇన్నయ్య, కోమల దంపతుల ఇంటర్వ్యూ వచ్చింది. పర్లేదు, బానే ఉంది.
16, జూన్ 2006, శుక్రవారం
జాబుల జాబితా
- నా గోడు (టీవీ చానెళ్ళు, భాష)
- వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ (రాజకీయాలు)
- కెరటాల కరణాలు (రాజకీయాలు)
- ఎవరికోసమీ శాసనమండలి? (రాజకీయాలు)
- భారతదేశం - SWOT విశ్లేషణ (సమాజం)
- హైకోర్టు ఆదేశాలు (రాజకీయాలు, సమాజం)
- తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ (ప్రజలు)
- సొంతడబ్బా (సమాజం, భాష)
- తెలుగురాష్ట్ర రాజధానిలో తెలుగు (భాష)
- గాయకుడు కారుణ్య (ప్రజలు)
- వీళ్ళు పోలీసులా ?!? (సమాజం)
- చందమామ గురించి (సమాజం)
- తెలుగు అమలు - ఇంటా బయటా (భాష)
- మీరేం చేస్తుంటారు? (సమాజం)
- జయహో ఇస్రో! (సమాజం)
- (పుస్తకాల) పురుగులొస్తున్నాయి జాగ్రత్త! (బ్లాగులు)
- పునరంకితం.. పునః పునరంకితం (రాజకీయాలు)
- బ్లాగు గణాంకాలు (బ్లాగులు)
- చతుర భక్తి, నిష్ఠుర భక్తి, ఎత్తిపొడుపు భక్తి.. (సాహిత్యం)
- ఒంటరిగా మనలేని మాటలు (భాష)
- రిజర్వేషాలు (రాజకీయాలు, సమాజం)
- మత మార్పిడి ఊపు మీద పోపు గారు (రాజకీయాలు, సమాజం)
- బ్లాగు గణాంకాలు - 2 (బ్లాగులు)
- వేగుచుక్క (ప్రజలు)
- టీవీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు తగువైతే.. (టీవీ చానెళ్ళు)
- తెలంగాణ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు.. (రాజకీయాలు)
- వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు (సమాజం)
- బూదరాజు రాధాకృష్ణ అస్తమయం (ప్రజలు)
- వామపక్ష నాటకాలు (రాజకీయాలు)
- వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది (బ్లాగులు)
- గూగుల్ ఎనలిటిక్స్ (సాంకేతికం)
- తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ (సినిమా)
- అవకాశవాదం - తిట్లకు మహదవకాశం (రాజకీయాలు)
- ప్రజా ప్రతినిధులపై ప్రజాసమీక్ష (రాజకీయాలు, సమాజం)
15, జూన్ 2006, గురువారం
ప్రజా ప్రతినిధులపై ప్రజాసమీక్ష
కనీసం ప్రతీ ఆర్నెల్లకోసారన్నా వారి పనితీరుపై సమీక్ష జరగాలి. ప్రజలే సభ్యులుగా గల, రాజ్యాంగ బద్ధత కలిగిన సమీక్షా సంఘం ఈ సమీక్ష చెయ్యాలి. ఈ సంఘ సభ్యులందరూ అదే నియోజకవర్గానికి చెందిన సాధారణ పౌరులై ఉండాలి. సగం మంది ఆడవాళ్ళు ఉండాలి. సభ్యులెవరికీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉండరాదు. వివిధ వనరుల నుండి నివేదికలు తెప్పించుకుని సంఘం సమీక్ష చేస్తుంది. ఎమ్మెల్యేల పనితనపు సమీక్ష ఇలా జరగాలి.
1. శాసనసభలో హాజరు, ప్రవర్తన, అడిగిన ప్రశ్నలు మొదలైన వాటికి సంబంధించి స్పీకరు గారి నివేదిక.
2. ప్రభుత్వ అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు, సమస్యల పరిష్కారానికి వారితో ఎలా సహకరించారనే విషయమై ఎమ్మెల్యే గారి స్వంత జిల్లా కలెక్టరు గారి నివేదిక.
3. ఏమేం పనులు చేసారు, ఏమి చేస్తున్నారు, ఏయే విషయాలపై ప్రస్తుతం పని చేస్తున్నారనే విషయమై స్వయంగా ఆ ఎమ్మెల్యే గారి నివేదిక.
4. పని డైరీ. ప్రతీ రోజూ తాను చేసే పనిని ఎమ్మెల్యే ఒక డైరీలో రాయాలి. ప్రభుత్వం తమకు కల్పిస్తున్న సౌకర్యాలను ఎలా వినియోగించుకుంటున్నారో కూడా ఆ డైరీలో స్పష్టంగా రాయాలి.
5. నియోజక వర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే పనితీరుపై ఫిర్యాదులు ఉంటే వాటిని నిర్దేశిత ఫారములో రాయాలి.
6. తన నియోజక వర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గణాంకాల వివరాలు (ఎందరు పిల్లలు బడికి వెళ్ళడంలేదు, ఎందరు పిల్లలు కూలి పనికి వెళ్తున్నారు, ఎందరు గర్భిణీ స్త్రీలకు సరైన ఆరోగ్య సలహాలు, పోషకాహారం అందుతున్నాయి మొదలైనవి.) వీటన్నిటి తోటి ఒక నివేదికను కలెక్టరు తయారుచెయ్యాలి.
7. పై ఫిర్యాదులు , నివేదికలన్నిటినీ ఆర్నెల్లకోసారి సమీక్షా సంఘానికి సమర్పించాలి.
సంఘం ఈ నివేదికలను, ఫిర్యాదులను పరిశీలించి, ఎమ్మెల్యే పనితీరుకు మార్కులిస్తుంది. కనీసం 50% మార్కులు వస్తేనే ఆయన పాసయినట్లు లెక్క. మార్కులు తక్కువ వచ్చిన ఎమ్మెల్యేలపై తగు చర్యలు ఉండాలి.
తరువాత జరగబోయే ఎన్నికల నాటికి సమీక్షా సంఘం తమ నివేదికలన్నిటినీ కలగలిపి ఒక సమగ్ర నివేదికను తయారుచేసి ఎన్నికల సంఘానికి పంపుతుంది. ఆ నివేదికలో కనీసం 60% మార్కులు వస్తేనే సదరు వ్యక్తి తరువాతి ఎన్నికలలో పాల్గొనవచ్చు. లేదంటే ఎన్నికల సంఘం ఓ ఐదేళ్ళ పాటో, జీవితాంతమూనో ఏ ఎన్నిక లోనూ పోటీ చెయ్యకుండా ఆ వ్యక్తిని నిషేధించాలి.
13, జూన్ 2006, మంగళవారం
అవకాశవాదం - తిట్లకు మహదవకాశం
సీపీఎం ది వ్యభిచారం - దత్తాత్రేయ ఉవాచ, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందుకు
వీరు మొన్నటిదాకా కలిసి తిరిగింది ఆ దేశంతోటే, (అప్పుడు తెలంగాణా ఊసే ఎత్తని వాళ్ళు ఇప్పుడు బాసలు చేస్తున్నారు) మరి దాన్నేమనాలో? వీరు చేస్తే సంసారము, వారు చేస్తే వ్యభిచారమూనా?
చంద్రబాబు పుట్టుకతోనే అవకాశవాది, సీపీఎం ఇప్పుడు అవకాశవాది అయింది. -రాజశేఖరరెడ్డి
ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి రెండో ఎస్సార్సీ అవసరమే లేదు అనే తెరాసతో రెండో ఎస్సార్సీ కావాల్సిందే అనే కాంగ్రెసు పొత్తు పెట్టుకుంది. దాన్నేమంటారు? గురివిందకు తన నలుపు తెలీదు! జూన్ 13 పొద్దున తేజ వార్తా ఛానెల్లో పాత్రికేయుడు నెల్లుట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ.. "1965 ప్రాంతాల్లో అవకాశవాద రాజకీయాలు మొదలెట్టిందే కాంగ్రెసు" అని చెబుతూ అవకాశవాదం ఆ పార్టీ ప్రవృత్తి అనే ధోరణిలో చెప్పుకొచ్చారు.
మాకసలెప్పుడూ ఎవరితోటీ పొత్తు లేదు. ఇది కేవలం సహకారం. గత శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెసుతో మాకు పొత్తు లేదు! -బీవీ రాఘవులు
వామపక్ష సిద్ధాంతమనే కత్తికి రండు వైపులా పదునే! (దానితో భౌతిక విషయాలు దేన్నైనా నిర్వచించవచ్చట.) ఈ సిద్ధాంతం అవకాశవాదాన్నెలా నిర్వచిస్తుందో రాఘవులు గారు మనకు తెలియజేస్తున్నారు.!
కాంగ్రెసు భాజపాలకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తాం - చంద్రబాబు.
కాంగ్రెసును వ్యతిరేకిస్తున్నారు, సరే, బానేఉంది. మరి భాజపాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మొన్నటి దాకా మిత్రులేనే! పక్కన పెద్దగీతలు గీసి మిగతా పార్టీలు బాబు గారి అవకాశవాదాన్ని చిన్నది చేసాయి తప్ప వీరేం తక్కువ తినలేదు.
11, జూన్ 2006, ఆదివారం
తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ
హీరోలు: మన తెలుగు సినిమా హీరోల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. గానుగకు కట్టేసిన ఎద్దు ఎలా తిరుగుతుందో వీళ్ళ సినిమా జీవితాలూ అలాగే అయిపోయాయి. ఇమేజీ అనే గానుగకు కట్టేసిన ఎద్దులు వీళ్ళు. (అయితే తెలుగు సినిమా పరిస్థితి మరింత జాలిగొలుపుతుంది.. అది ఈ గానుగెద్దుల చుట్టూ తిరుగుతోంది) ఎరుపెక్కిన కళ్ళూ, పవర్‌ఫుల్ (చంపుతా, నరుకుతా లాంటి) డైలాగులూ, ఓ నలభై యాభై మంది కండలు తిరిగిన వస్తాదులను ఒంటిచేత్తో నలగ్గొట్టడం, హీరోయిన్ తో చేసే రికార్డు డ్యాన్సులు .. ఇవి ఉంటేనే వాళ్ళ సినిమాలు ఆడతాయి. ఏ మాత్రం సహజత్వం ఉన్నా ఆడవు. (ఈ మధ్య ఎలాంటివైనా ఆడటం లేదులెండి! అదొక మంచి మార్పు.) భుజకీర్తులు, వందిమాగధులు, భట్రాజుల మోతలకు వీళ్ళు దాసోహమైపోయారు. భేషజమనే ముస్తాబు లేకుండా కనబడరు వీళ్ళు. తమను ఇంద్రుడనీ చంద్రుడనీ కీర్తించే వాళ్ళంటే వీళ్ళకు కితకితలు. తమ సినిమాలకు వీళ్ళు చెప్పినవారే దర్శకుడు, సంగీత దర్శకుడు, కథకుడు, ఇతర నటులూ, సాంకేతిక నిపుణులూను. వీళ్ళతో సినిమాలు తీసి, వీళ్ళను పోషిస్తున్న నిర్మాతలకు వీళ్ళకున్న ప్రాముఖ్యతలో శతాంశం కూడా దక్కుతున్నట్టనిపించదు.
హీరోయినులు: తెలుగు సినిమాల్లో హీరోయిను ఓ ఆటబొమ్మ, అంగడి బొమ్మ! హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి జెమినీ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల వ్యాఖ్య చూడండి. మామూలుగా అడిగే తెలివి తక్కువ ప్రశ్నలతో పాటు ఇలా అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. మీ సినిమాల్లో హీరోయినుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకు? అని. అదేం లేదు ప్రత్యేక ప్రాముఖ్యత ఏమీ ఉండదు, మన సినిమాల్లో హీరోయినుకు పాటల్లో తప్ప ఉనికే ఉండదు. నా సినిమాల్లో కాస్త మామూలు ప్రాధాన్యత ఉండేటప్పటికి మీకు అలా అనిపిస్తున్నట్లుంది అన్నారు, శేఖర్.
విదూషకులు: ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పవర్‌ఫుల్ హీరోలను వెధవాయిలను చేసి ఓ ఆటాడిస్తూ, తమ పబ్బం గడుపుకునే వర్గం ఒకటుంది మన పరిశ్రమలో. దాని పేరు విదూషక వర్గం . కమెడియన్లన్నమాట (అందరూ కాదు.., కానీ చాలామంది)! నటనాశక్తి పరంగా, ప్రతిభ పరంగా వాళ్ళు హీరోలకెందుకూ తీసిపోరు. అసలు వాళ్ళకంటే వీళ్ళే మెరుగు. ఈ విదూషకులు హీరోలను పొగడుతూ మాట్లాడే తీరు చూస్తుంటే మనకాశ్చర్యం వేస్తుంది. ఎందుకు వీళ్ళింతలా పొగుడుతున్నారు, ఏంటి వీళ్ళకీ ఖర్మ అని అనిపిస్తుంది. నిజానికది పొగడ్త కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మామూలు మానవుడెవడైనా అంతటి పొగడ్తలను భరించలేడు. కానీ .. ఈ విదూషకులు వీళ్ళను తమ నాలుకల కొనలమీద నిలబెట్టి ఆటాడిస్తున్నారనీ, పొగడ్తలతో వాళ్ళను సంతోషపెట్టి తమ పనులను చేయించుకుంటున్నారనీ నిదానంగా మనకర్థమవుతుంది . (ఈ హీరోల పవరు పోయిన రోజున తుపుక్కున ఊసేస్తారేమో!)
హీరోభిమానులు: వాళ్ళ పొగడ్తలు నిజమేనని ఆ హీరోలు నమ్ముతారా అంటే.. సందేహమే! హిపోక్రసీకి పరాకాష్ఠ అయిన సినిమా లోకంలో ఎవడి మనసులో ఏముందో మరోడికి తెలీదు. పెదాలపై ఉన్న మాట హృదిలో ఉందని చెప్పలేం. కానీ ఇవి నిజమేనని నమ్మే వర్గం ఒకటుంది.. అదే వీరాభిమానుల వర్గం. చదువూ, సంధ్యల్ని గాలికొదిలేసి, ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఈ హీరోల చుట్టూ తిరిగే వర్గమిది. తమ హీరో కోసం డబ్బులేం ఖర్మ, ప్రాణాలూ ధారపోస్తారు వీళ్ళు. హీరోలు, ఇతర నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, ప్రదర్శకులు, హీరోభిమానులు, మామూలు ప్రేక్షకులు భాగంగా ఉన్న తెలుగు సినిమా వ్యాపార వలయంలో అందరికంటే అమాయకులు హీరోభిమానులే! మామూలు ప్రేక్షకులు టిక్కెట్టు డబ్బులు మాత్రమే పెడతారు, అదీ సినిమా బాగుందంటేనే చూస్తారు. అభిమానులో.. సినిమా ఎంత చెత్తదైనా చూస్తారు (లేకపోతే వాళ్ళేం అభిమానులు?) సినిమాకూ హీరోకూ ప్రచారం కోసం పోస్టర్లూ, కటౌట్లూ, కరపత్రాలూ ఇలాంటివెన్నో! పైగా, సినిమా గురించి తమ తమ సంఘాల్లో చర్చలూ, గోష్ఠులు!
అభిమాన భారం: సినిమా విడుదలైన రోజున ఎగబడి చూసేది ఎవరు? హీరోభిమానులే! విడుదలైన మొదటి రోజుల్లో టిక్కెట్టు డబ్బులు పెంచడం మొదలెట్టారామధ్య, లాభం ఎవరికి? భారం ఎవరిపైన? హీరోభిమానులపై హీరోల అభిమానమిదీ!
8, జూన్ 2006, గురువారం
గూగుల్ ఎనలిటిక్స్
ప్రస్తుతం ఇది పరీక్షల స్థాయిలో ఉంది. ముందు మన పేరును నమోదు చేసుకోవాలి. గూగుల్ తనకు తీరుబడి దొరికినపుడు మనకు అవకాశం ఇస్తూ ఓ మెయిలిస్తుంది (జీమెయిల్ విషయంలో కూడా కొత్తలో అలానే చేసింది). అప్పుడు మనం దాన్ని వాడుకోడం మొదలెట్టొచ్చు.
6, జూన్ 2006, మంగళవారం
వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది
వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదు గామోసు! వర్డ్‌ప్రెస్సు వాడొచ్చి బ్లాగ్‌స్పాటులో బ్లాగుల్ని లాక్కోబోతే వీడూరుకుంటాడా మరి! తన బంగారు పుట్టలో వేలెడితే చీమే ఊరుకోదు!! కాబట్టి, మీరూ ఈ దిగుమతి వ్యవహారం చెయ్యదలిస్తే.. జాగ్రత్త సుమా!
5, జూన్ 2006, సోమవారం
వామపక్ష నాటకాలు
రాష్ట్ర శాసనసభల ఎన్నికలు అలా ఐపోయాయి.. ఇదిగో ఇలా పెట్రోలు రేట్లు పెంచేసారు. ముడి చమురు ధరలు తెగ పెరిగి పోతున్నాయి కాబట్టి ధరలు పెంచక తప్పని పరిస్థితి! ప్రభుత్వ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష బీజేపీ దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుంది.. అది సహజం.
అయితే, వామ పక్షాల నాటకం చూడండి. వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రేట్లు పెంచడం ఇష్టం లేకపోతే.., వీల్లేదని కరాఖండిగా ప్రభుత్వానికి చెప్పేయాలి. రేట్లు పెంచకుండా ఏంచెయ్యాలో కూడా చెప్పాలి. వినకపోతే మెడలు వంచి ఒప్పించాలి. ప్రభుత్వ మనుగడ వీళ్ళ మద్దతు పైనే ఆధారపడి ఉన్నపుడు ఎందుకు వినరు, చచ్చినట్లు వింటారు! ఆ పనులు చెయ్యకుండా.. ఉద్యమాలు చేస్తాం, బందులు చేస్తాం, ఆందోళనలు చేస్తాం అని ఈ అరుపులేమిటి? ఎవరిని అలరించేందుకు ఈ ప్రకటనలు?
రేట్లపెంపు నిజంగా అసమంజసమైతే.. "ప్రభుత్వాన్ని నిలదీయండి. యూ పీ ఏ లో కాంగ్రెసును కడిగేయండి. పెంపును రద్దు చేయించండి. లేదూ.. మాట్లాడకుండా కూర్చోండి. పెరిగిన రేట్లకు ఎలాగూ అలవాటు పడతాం. మళ్ళీ బందులనీ, ఉద్యమాలనీ మమ్మల్ని బాదకండి."
ఒక వేళ.., "మీరు రేట్లు పెంచండి, మేం ఆందోళన చేస్తాం, అపుడు, పెంచిన దానిలో కొంత తగ్గించండి " అని కాంగ్రెసుతో ఒప్పందానికి గానీ రాలేదు కదా!?
4, జూన్ 2006, ఆదివారం
బూదరాజు రాధాకృష్ణ అస్తమయం
రాధాకృష్ణ గారి పుస్తకం మాటలూ-మార్పులూ పుస్తకంలోంచి కొన్ని మచ్చుతునకలు..
- స్మశానం తప్పు శ్మశానం సరైనది.
- రాబందు అనే మాట రామ బంధువు నుండి వచ్చింది. సీతాపహరణ వేళ రాముడికి సాయం చేసి, జటాయువు రామ బంధువై, రాంబంధువైంది. అదే రాబందు అయింది.
- ఋజువు తప్పు, రుజువు సరైనది
3, జూన్ 2006, శనివారం
వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు
- నాగార్జున సాగర్ లో చేపల కూర పెట్టలేదని విద్యుత్తు, సమాచారశాఖ మంత్రి షబ్బీర్ అలీ గోల. ఉద్యోగాల్లోంచి పీకి పారెయ్యండి వాళ్ళను; మంత్రులు ఉన్నదే తినేందుకని తెలియని చవటాయిలకు ఉద్యోగాలు అనవసరం. (సంపాదన లేని మంత్రి పదవీ, చేపల కూర లేని సాగరు భోజనమూ ఎవడిక్కావాలండీ!)
- జర్నలిస్టులపై మరోసారి విరిచుకుపడ్డ జేసీ. కడుపుకు అన్నం తింటున్నారా జర్నలిస్టులసలు? "మీరంటే నాకిష్టం లేదు, నాక్కనపడకండి" అని ఓసారి చెప్పినపుడు వినాలి. ఇక లాభంలేదు, అనంతపురం తడాఖా చూపాల్సిందే!
- దేశంలో 22 నకిలీ విశ్వవిద్యాలయాలు - యూజీసీ వెబ్‌సైట్లో ప్రకటన. మరి వాటిని మూసేసి, వాటి నిర్వాహకులను బొక్కలో తొయ్యలేదెందుకో!?
- లాభసాటి పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల జాబితా, వాటిపై తీసుకున్న చర్యలతో సహా ఎన్నికల కమిషను వెబ్‌సైట్లో ప్రకటన. మరి వీళ్ళపై చర్యలేవీ? పై అంశంలో విశ్వవిద్యాలయాలను ఎందుకు మూయలేదో ఇప్పుడర్థమైంది! (యథా రాజా తథా ప్రజా)
- తనపేరు కూడా లాభసాటి జాబితాలో పెట్టారని లోక్‌సభ స్పీకరు గారు వేదనతో ఇలా అన్నారు - "ఇలా అవమానిస్తే ఇకపై ఇలాంటి పదవులను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రారు." మంచిది మేష్టారూ, అసలా నిబంధన చెప్పేదీ అదే. తప్పుకోండి మీరంతా! ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పూర్తి సమయం పని చేయండి, చాలు. ప్రజలడిగేది అదే! ఇంతటి నిజాయితీ కబుర్లు చెప్పే మీరు వెంటనే శాంతినికేతన్ పదవికి రాజీనామా ఎందుకు చెయ్యలేదు? అసలు మీ అధ్యక్షతలోని SSDAనిర్వాహకత్వం గురించి ది వీక్ లో రాసారు చూసారా? మీకే లాభమూ లేకపోతే ఆ పదవిని పట్టుకుని ఇంకా ఎందుకీ పాకులాట? ఎందుకు దానిపై మీకంత యావ? నిజాయితీ పరుణ్ణి, నీతిమంతుణ్ణీనని మీరు చెప్పుకుంటే సరిపోతుందా. నైతికత పట్ల అంత నిబద్ధత ఉంటే.. గంగూలీని క్రికెటు జట్టు లోంచి తీసేసినపుడు ఎందుకు నిరసన తెలియజేసారు? క్రికెటు టీముకూ లోక్‌సభ స్పీకరుకూ ఏమిటి సంబంధం? అప్పుడేమైంది మీ నిబద్ధత? లోక్‌సభ సమావేశాలను హడావుడిగా, అర్ధంతరంగా ప్రభుత్వం రద్దుపరచినపుడు మీ గొంతు పెగల్లేదే? అప్పుడేమైంది మీ నిబద్ధత? (ఎదటి వారికీ .. చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ..!)
- సింహాచల నరసింహస్వామి క్షేత్రంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, దేహశుద్ధి చేసిన భక్తులు. పోపు గారికిది తెలిసిందనుకోండి, "గుళ్ళో చేసినా, బళ్ళో చేసినా.., ఊళ్ళో చేసినా, ఒళ్ళో చేసినా .. మత ప్రచారం చేసేవారు భగవద్బంధువులు, వారిని కొట్టడం పరమత సహనం లేకపోవడమే" అని నీతులు చెబుతారు, మన ప్రభుత్వానికి. (చెప్పేవాడికి వినేవాడు లోకువ!)