22, మే 2006, సోమవారం

రిజర్వేషాలు

సామాజిక అసమానతలను తొలగించడం రిజర్వేషన్ల ప్రధానోద్దేశ్యం. సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలకు అనులోమానుపాతంలో ఉంటాయి. ఉన్నవారు, లేనివారు అనే అంతరం సామాజిక అసమానతలను నిర్ణయిస్తుంది. ఈ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచేందుకే రిజర్వేషన్లు పెట్టారు. 50 ఏళ్ళపాటు రిజర్వేషన్లు పెట్టాక కూడా అది జరగలేదని మనకు తెలుస్తూనే ఉంది. ఆర్థిక అసమానతలు పెరిగాయి కానీ తగ్గలేదు. పైగా కులాల ప్రాతిపదికన విద్యార్థులను చీల్చి సంకుల సమరాలకు దార్లు తెరుస్తున్నాయి. రాజకీయ నాయకులు తమ ఎత్తులు, జిత్తులకు రిజర్వేషన్లను సాధనంగా వాడుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

రిజర్వేషను ఇచ్చి కాలేజీల్లో సీట్లు ఇవ్వడం, ఉపాధి కలిగించడమనేవి ఊరికినే కరెంటు ఇవ్వడం, ఉచితంగా బియ్యం ఇవ్వడం.. లాంటివి. కొనుక్కునే వాళ్ళకు, ఊరికినే పొందే వాళ్ళకు కూడా అరకొరగానే అందుతాయి, ఎన్నాళ్ళో సాగవు. బరువు మోయలేని ప్రభుత్వాలు ఎప్పుడో ఒకప్పుడు కాడి పడేస్తాయి. పడేసాయి కూడా! అప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఊరికినే బియ్యం ఇచ్చే బదులు, మార్కెట్టు ధరకే తమక్కావలసిన బియ్యం కొనుక్కునే స్తోమత కలిగించడం మంచిది కదా! అది కష్టమే, కానీ లక్ష్యసాధనకదే మార్గం.

రిజర్వేషన్ల వలన లాభం ఎవరికి?
"
వెనకబడ్డ వర్గాల వారికి" అనేది పూర్తిగా నిజం కాదు. మొత్తం వెనకబడ్డవారి జనాభాలో లాభపడ్డవారి శాతం ఎంత? పది శాతం కంటే తక్కువే ఉండొచ్చు. మరి మిగిలిన వారి సంగతేంటి? వారి జీవితాలను మెరుగుపరచేదెలా? మరి, ఇంత కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే ఈ అంశంపై ఇంత యాగీ ఎందుకు చేస్తున్నారీ రాజకీయులు? ఎందుకంటే..అక్కడ ఓట్లున్నాయి కనుక (రాబందులు కళేబరాల కోసమే చూస్తుంటాయి). ఈ అంశం వలన ఎక్కువ లబ్ది పొందేది రాజకీయులే గాని వాళ్ళు చెబుతున్నట్లు, వెనుకబడిన వర్గాలు కాదు.
మరి, వెనుకబడిన వారికి గరిష్ఠ లాభం కలగాలంటే ఏం చెయ్యాలి? ప్రతిభను పెంపొందిచుకునే అవకాశాలను కల్పించాలి. రిజర్వేషన్లను సంస్కరించాలి!

రిజర్వేషన్ల వలన నష్టం ఎవరికి?
ప్రతిభ ఉన్నవారికి, సమాజానికి, దేశానికి. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ పక్కకు తప్పుకుని కుల, మతాలకు చోటిస్తోంది. అత్తెసరు తెలివితేటలు కలవారు అందలాలెక్కుతున్నారు. అర్హులైన వారు మరుగున పడిపోతున్నారు. అయితే ఇది వాస్తవం కాదంటూ ఓ వాదన ఉంది. ప్రొఫెసరు కంచె ఐలయ్య గారు ఈ మధ్య దక్కను క్రానికిల్ లో ఓ వ్యాసంలో కూడా ఇది రాసారు. టూకీగా ఈ వాదన ఏమిటంటే.. "ఇన్నాళ్ళుగా ఇచ్చిన రిజర్వేషన్ల వలన - ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో - అందలాలెక్కిన వారు అనర్హులే అయితే, ఈ రాష్ట్రాలు సాధించిన ప్రగతి సాధ్యపడేది కాదు "- అని. మరి, రిజర్వేషన్ల వలన ఏ ఇబ్బందీ లేకపోతే, ప్రతిభకు ఢోకా లేకపోయినట్లయితే, ఈ పరీక్షలెందుకు, ఈ మార్కులు, ర్యాంకులు, ఈ తలనెప్పంతా ఎందుకు. హాయిగా కులానికిన్ని అని కేటాయించి ఆ దామాషాలో సీట్లు, ఉద్యోగాలు పంచుకుంటూ పోతే సరిపోతుంది కదా! ఐలయ్య గారి వాదన తప్పు!

ఎలా సంస్కరించాలి?
1. ప్రస్తుత రిజర్వేషను విధానాన్ని ఎత్తివేయాలి. ప్రతిభ ప్రకారమే అవకాశాలు దొరకాలి.
2. తెలివితేటలు పుట్టుకను బట్టీ, కులాన్ని బట్టీ ఉండవు. పెంపొందించుకోవాలి. సమాజంలోని అన్నివర్గాల వారికీ - ఉన్నవారైనా, లేనివారైనా - చదువుకునే అవకాశాలు సమానంగా ఉండాలి. ప్రతిభను పెంపొందించుకునే అవకాశాలు కుల, మత, వర్గాలకు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకు అతీతంగా అందరికీ సమానంగా ఉండాలి.
3. ముందు విద్యను సంస్కరించాలి.. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదువుకోగలిగే వీలు కలిగించాలి. చదువులో సమానావకాశాలు ఇవ్వాలి. ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం, సత్తా కలిగించాలి.

డబ్బున్నవాడు 50 వేలు కట్టి ఇంటరు చదివి ఐ.ఐ.టి సీటు తెచ్చుకుంటున్నాడు, లేనివాడికి ఆ అవకాశం లేదు. ఇక్కడ డబ్బే ముఖ్యాంశం గానీ, కులం కాదు. మరి ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఈ స్థాయి చదువు చెప్పించి ఆ విద్యార్థులనూ మెరికల్లా తయారు చెయ్యవచ్చు గదా? పదేళ్ళ కిందటి వరకు సాగర్, కొడిగెనహళ్ళి ప్రభుత్వ కళాశాలలకే గదా మొదటి ర్యాంకులు, మరి ఇప్పుడా పరిస్థితి లేదేం? ప్రమాణాలు పడిపోతున్నాయెందుకు? ఆ ప్రమాణాలను ఉద్ధరిస్తే ఆర్థిక పరిస్థితులకు అతీతంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివేవారు కూడా అవకాశాల కోసం పోటీ పడతారు కదా! ఇది చెయ్యాలంటే ప్రభుత్వం పని చెయ్యాలి, శ్రద్ధ వహించాలి, అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయులు ప్రైవేటు కాలేజీల నుండి దొంగ డబ్బుకు కక్కుర్తి పడకూడదు.. ఒకటా రెండా, ఇన్నున్నాయి. ఇన్ని చేసే బదులు, రిజర్వేషన్లు పెట్టేస్తే పోతుంది కదా, ఒక్క సంతకంతో పనైపోతుంది. ఆపై వాళ్ళు చేసే పని ఏమీ లేదు, పైగా వోట్లూ నొల్లుకోవచ్చు. ఏది తేలికైతే అది చేసేద్దాం అనే ఆలోచన!! పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్!

ఇవి రిజర్వేషన్లు కావు, రాజకీయుల రిజర్వేషాలు!

8 కామెంట్‌లు:

  1. guru gAru...naa blAgulo EdO samasya vacci nEnu vraasinadi pOyindi...mallI peTTAnu cooDandi

    రిప్లయితొలగించండి
  2. చదువరి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది.కానీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వెనుకబడిన తరగతుల వారు కానీ,ఇతర నిమ్న కులాల వారు కానీ గడుపుతున్న జీవితాల ను గమనించారా!ఈ ప్రపంచీకరణ యుగం లో వారు కూడా పాలుపంచు కోవాలంటే ఈ రిజర్వేషన్లు కొంత వరకు అవసరమేననిపిస్తుంది.మన దేశంలోనే కాక ప్రతి చోట అణగారిన వర్గాలకు కొంతవరకు ఈ"necessary evil"సహాయం చేస్తుందనడంలో సందేహం లేదు.
    -ఇస్మాయిల్ పెనుకొండ
    http://epaper.andhrajyothy.com/default.aspx?selPg=31663&page=23_05_2006_002.jpg&ed=172

    రిప్లయితొలగించండి
  3. మీ జాబు బాగుంది. ఐలయ్య ఆర్టికల్ కు ఇంకా సమాధానాలు రాలేదా? ఎవరైనా సోషియాలజీ విద్యార్థులు ఇలాంటి అంశాన్నెంచుకొని పరిశోధన చేయవచ్చు. ఉద్యోగాల్లో చేరాక కూడా రిజర్వేషన్లు అవసరమా? ఇలాంటి విషయాల్ని గురించి కూడా రాయండి. -బు.

    రిప్లయితొలగించండి
  4. చక్కటి విషయాలు చెప్పారు. అద్భుతమైన విశ్లేషణ! చింతు గారూ! రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లోని పేదవారికి ఎక్కువ నష్టం కలిగిస్తున్న విషయం విస్మరించకూడదు. అలాగే ప్రజల్లో కులం పట్ల స్పృహను పెంచి కులవివక్షకు ఈ రిజర్వేషన్లు దోహదం చేస్తున్నాయి. స్కూలు భవనం లేని ఒక గ్రామంలో దేవాలయంలో నడుస్తున్న పాఠశాలలోకి దళితుడైన ఉపాధ్యాయుణ్ణి అగ్రవర్ణాల వారు అడుగుపెట్టనివ్వకపోతే రిజర్వేషన్లు సామాజిక సమానత్వాన్ని సాధించినట్లా? సాధించనట్లా?

    రిప్లయితొలగించండి
  5. చింతు గారూ! రిజర్వేషన్లు పూర్తిగా వ్యర్థమని నేనూ అననండి. కానీ వాటి వల్ల సమాజానికి కలిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎకువని నా అభిప్రాయం. ఒకటి నుండి ఇంటరు దాకా చదువులో తేడాల్లేకుండా అందరూ చదువుకునే అవకాశం ఉంది కదండీ.., మరి నిమ్న కులాల జనాభాలో ఎంత శాతం అక్కడిదాకా చదువుతున్నారు!? చదవకపోడానికి కారణం ఆర్థికమే! మరి వాళ్ళని చదివించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది?

    అభివృద్ధిలో ఒక స్థాయికి వచ్చిన వారికే (ఇంటర్మీడియెట్ దాటిన వారికి) చేయందిస్తామంటే మరి ఆ స్థాయికి కూడా రానివారి గురించిన ఆలోచన ఏమిటి? అసలు ఆలోచించాల్సింది వాళ్ళ గురించే! పోనీ ఆ స్థాయికి వచ్చిన వారికైనా సరైన విధానముందా..? "ఓ పది మార్కులు తక్కువొచ్చినా పర్లేదు, మేం పాసు చేస్తాం. ఓ పదివేల ర్యాంకులు వెనకున్నా పర్లేదు, సీటు మేమిస్తాం.." ఇది కాదు ప్రభుత్వం అనాల్సింది. "ఓ పదివేలు ఖర్చయినా పర్లేదు.. బాగా చదువుకో, డబ్బులు మేమిస్తాం" అనాలి.

    రిప్లయితొలగించండి
  6. నాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థించడానికీ, విమర్శించడనికీ బోలెడంత సరుకుందని. కావాలనే ఈ విషయం మీద నా బ్లాగుని నాంచాను. (వీవెన్ గారు లేఖినిలో nAncAnu ఎలా రాయాలో చెప్పాలి.) ఇదిగో నా బ్లాగు. కందిరీగల పెట్టెను కదిలిస్తున్నా.
    -- ప్రసాద్

    రిప్లయితొలగించండి
  7. నా బ్లాగు లింకు ఇవ్వడం మర్చిపోయా.
    http://charasala.wordpress.com
    -- ప్రసాద్

    రిప్లయితొలగించండి
  8. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు (వార్షికాదాయం 50 వేలు లోపు ఉన్నవాళ్ళకి) ఇస్తే నేను రిజర్వేషన్ల విధానాన్ని సపోర్ట్ చేస్తాను. కుల రిజర్వేషన్ల వల్ల కులతత్వం తగ్గలేదు. మీ కులానికి ఇంత శాతం రిజర్వేషన్లు ఇచ్చాం కనుక మా పార్టీకి వోట్ వెయ్యండి అని రాజకీయ నాయకులు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు