మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జవాబుదారీతనం లేకుండా పోతోంది. ఒకసారి ఎన్నికైపోయాక ఐదేళ్ళ పాటు జులాయిగా తిరిగినా అదేమని వాళ్ళను అడిగేవారు లేరు. పని చేసే ప్రతీవారికీ ఈ సమాజంలో జవాబుదారీతనం ఉండగా, మన ప్రతినిధులకు మాత్రం ఎందుకు ఉండరాదు? వాళ్ళక్కూడా ఉండాలి. ముఖ్యమంత్రులు వీళ్ళకిచ్చే లక్ష్యాలు కూడా ఎలా ఉంటాయో గమనించారా? "ఎట్టి పరిస్థితుల్లోనూ పురపాలక, పంచాయితీ ఎన్నికల్లో మనదే పైచేయి కావాలి. మీ సర్వశక్తులూ ఒడ్డి ఇది సాధించండి" అంటారే గానీ.. "మీ నియోజకవర్గాల్లో బడికి వెళ్ళని పిల్లలు ఉండటానికి వీలే లేదు. ఈ జూన్ లో పిల్లలంతా బడుల్లో చేరేలా ఊళ్ళలో ఉద్యమాలు చేపట్టండి" అంటూ చెప్పిన దాఖలాలు ఉన్నాయా?
కనీసం ప్రతీ ఆర్నెల్లకోసారన్నా వారి పనితీరుపై సమీక్ష జరగాలి. ప్రజలే సభ్యులుగా గల, రాజ్యాంగ బద్ధత కలిగిన సమీక్షా సంఘం ఈ సమీక్ష చెయ్యాలి. ఈ సంఘ సభ్యులందరూ అదే నియోజకవర్గానికి చెందిన సాధారణ పౌరులై ఉండాలి. సగం మంది ఆడవాళ్ళు ఉండాలి. సభ్యులెవరికీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉండరాదు. వివిధ వనరుల నుండి నివేదికలు తెప్పించుకుని సంఘం సమీక్ష చేస్తుంది. ఎమ్మెల్యేల పనితనపు సమీక్ష ఇలా జరగాలి.
1. శాసనసభలో హాజరు, ప్రవర్తన, అడిగిన ప్రశ్నలు మొదలైన వాటికి సంబంధించి స్పీకరు గారి నివేదిక.
2. ప్రభుత్వ అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు, సమస్యల పరిష్కారానికి వారితో ఎలా సహకరించారనే విషయమై ఎమ్మెల్యే గారి స్వంత జిల్లా కలెక్టరు గారి నివేదిక.
3. ఏమేం పనులు చేసారు, ఏమి చేస్తున్నారు, ఏయే విషయాలపై ప్రస్తుతం పని చేస్తున్నారనే విషయమై స్వయంగా ఆ ఎమ్మెల్యే గారి నివేదిక.
4. పని డైరీ. ప్రతీ రోజూ తాను చేసే పనిని ఎమ్మెల్యే ఒక డైరీలో రాయాలి. ప్రభుత్వం తమకు కల్పిస్తున్న సౌకర్యాలను ఎలా వినియోగించుకుంటున్నారో కూడా ఆ డైరీలో స్పష్టంగా రాయాలి.
5. నియోజక వర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే పనితీరుపై ఫిర్యాదులు ఉంటే వాటిని నిర్దేశిత ఫారములో రాయాలి.
6. తన నియోజక వర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గణాంకాల వివరాలు (ఎందరు పిల్లలు బడికి వెళ్ళడంలేదు, ఎందరు పిల్లలు కూలి పనికి వెళ్తున్నారు, ఎందరు గర్భిణీ స్త్రీలకు సరైన ఆరోగ్య సలహాలు, పోషకాహారం అందుతున్నాయి మొదలైనవి.) వీటన్నిటి తోటి ఒక నివేదికను కలెక్టరు తయారుచెయ్యాలి.
7. పై ఫిర్యాదులు , నివేదికలన్నిటినీ ఆర్నెల్లకోసారి సమీక్షా సంఘానికి సమర్పించాలి.
సంఘం ఈ నివేదికలను, ఫిర్యాదులను పరిశీలించి, ఎమ్మెల్యే పనితీరుకు మార్కులిస్తుంది. కనీసం 50% మార్కులు వస్తేనే ఆయన పాసయినట్లు లెక్క. మార్కులు తక్కువ వచ్చిన ఎమ్మెల్యేలపై తగు చర్యలు ఉండాలి.
తరువాత జరగబోయే ఎన్నికల నాటికి సమీక్షా సంఘం తమ నివేదికలన్నిటినీ కలగలిపి ఒక సమగ్ర నివేదికను తయారుచేసి ఎన్నికల సంఘానికి పంపుతుంది. ఆ నివేదికలో కనీసం 60% మార్కులు వస్తేనే సదరు వ్యక్తి తరువాతి ఎన్నికలలో పాల్గొనవచ్చు. లేదంటే ఎన్నికల సంఘం ఓ ఐదేళ్ళ పాటో, జీవితాంతమూనో ఏ ఎన్నిక లోనూ పోటీ చెయ్యకుండా ఆ వ్యక్తిని నిషేధించాలి.
great idea!
రిప్లయితొలగించండి-- prasAd