19, నవంబర్ 2005, శనివారం

నా గోడు

తెలుగునాట టీ.వీ.ఛానెళ్ళు స్థూలంగా రెండు రకాలు - టీవీ9, ఈటీవీ2, తేజ న్యూస్ వంటి వార్తా ఛానెళ్ళు, ఈటీవీ, జెమిని, తేజ, మా, జీ వంటి సినిమా ఛానెళ్ళు. మర్చిపోయా, డీడీ8 ఉంది కదా, ఇది ''అదో'' టైపు. ప్రస్తుతానికి దాన్నో పక్కన పెడదాం. ఈ ఛానెళ్ళ తీరుతెన్నులపై ఒక సామాన్యుడి వేదన ఇది.., నా గోడు. (Telugu Blog)

సినిమా ఛానెళ్ళు
ముందుగా సినిమా ఛానెళ్ళ గురించి. వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలా అయితే, ఎందుకిలా పూనుకుని, పూసుకుని మరీ రాస్తున్నావని మీరు నన్నడగవచ్చు. అత్తకి విషం పెట్టి చంపించే కోడళ్ళు, కోడలిని రౌడీలతో రేప్ చేయించే మామలు, చచ్చిపోయిందనుకుంటున్న భార్య ఓ ప్ఫదేళ్ళ తరువాత తిరిగి వస్తే, ఆవిడ్నా, కొత్త పెళ్ళాన్నా.. ఎవర్నేలుకోవాలో తెలీక నాలుగైదు ఎపిసోడ్లు బాధపడే భర్త.. ఇలాంటివన్నీ చూసి మనసు వికలమైపోయిందండీ. "చూడ్డవెందుకూ, బాధపడ్డవెందుకు" అని మీరడగవచ్చు. ఏంచెయ్యమంటారు, అన్ని ఛానెళ్ళవాళ్ళూ కూడబలుక్కుని ఈ కార్యక్రమాలేస్తుంటే, అప్పుడప్పుడూ బుక్కవక తప్పటం లేదు. అసలు వీటిని సినిమా ఛానెళ్ళని ఎందుకంటున్నానంటే - వీటి కార్యక్రమాల్లో 70 శాతం సినిమాల గురించే !25 శాతం సీరియళ్ళు. కాస్తో, కూస్తో సమయం మిగిలితే, వార్తలో, భక్తో, మరోటో, ఇంకోటో ఉంటుంది. సినిమాలు ఈ ఛానెళ్ళకు జీవాధారం! అవి లేకపోతే వీళ్ళకి "టైము" గడవదు. ఎడ్వర్టైజ్‌మెంట్లూ రావు. అందుకే ప్రతీ సినిమా సూపర్‌హిట్టేనంటారు. హీరోలని, నిజజీవితంలో కూడా వాళ్ళేదో దేవతలన్నట్లుగా - అభిమానులలాగా - వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మెగాస్టారు, యువరత్న, యువసామ్రాట్.. ఇలా వాళ్ళని కీర్తించడం. వాళ్ళు ఏది చేసినా, ఏం మాట్లాడినా అదో గొప్ప విషయమన్నట్లు సంబరపడిపోవడం..ఇక కొత్త సినిమా విడుదలరోజున ప్రేక్షకుల స్పందన.. ఆంధ్రదేశంలో ఒక్ఖడు కూడా.. సినిమా బాలేదనేవాడే వీళ్ళకి కనపడడు..ఛి..చ్ఛీ..దరిద్రం.

లంగర్లు
ఇక యాంకర్లనబడే లంగర్లు. వీళ్ళ వెకిలివేషాలను పక్కన పెడితే.. (పక్కన ఎందుకుపెట్టాలంటారా..? నా నోటికీ, చేతికి కూడా బూతులు వస్తున్నాయండి, సభ్యత కాదని రాయడం లేదు.) ..పక్కనపెడితే.., వాళ్ళ భాష వింటే, తెలుగును ఎంత ఛండాలంగా మాట్లాడాలో, ఎలా చంపి పాతరెయ్యాలో వాళ్ళకు తెలిసినంతగా మరెవరికీ తెలీదని స్పష్టమైపోతుంది. వాక్యంలో క్రియ మాత్రమే తెలుగు..మిగతా అన్ని పదాలూ ఇంగ్లీషే! వీళ్ళ నాలుకలు చీలికలైపోను!

ఈ సందర్భంలో నాకో కోరికండీ. ఒకేఒక్కడు లాగా నాకు ఓ రోజుకోసం శాసనాలు చేసే అవకాశం వస్తే.. రెండు, మూడు ముఖ్యమైన శాసనాలున్నాయండీ చెయ్యడానికి..
ఒకటి - ఆంధ్ర ప్రదేశ్‌లో చదువుకునే ప్రతీవాడూ, తెలుగువాడైనా, ఉత్తరాది వాడైనా, ఆఫ్రికా వాడైనా సరే.., ఇంటర్మీడియట్ వరకూ తెలుగు చదివితీరాలి. (దీని గురించి వివరంగా మరోసారి).
రెండు - తెలుగు టీవీ ''లంగర్ల'' మీద చేతబడో, బాణామతో చేసి నోళ్ళు పడిపోయేలా చేసినా నేరంకాదు.
మూడు - రాజకీయనాయకులను, అవకాశం దొరికినప్పుడు కూడా మీ..మీ పెంపుడుకుక్కల చేత కరిపించకపోతే .. నేరం.
పై మూడు శాసనాలు చేసేస్తానండి. ఇది నా హిట్‌లిస్టు.

నేనీ వ్యాసంలో ఒక్కరి గురించి మాత్రం రాయకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటీ ఇప్పటిదాకా వాడు, వీడు అని రాసినవాడు హఠాతుగా ఒక్కరు అని గౌరవసంబోధనలోకి దిగాడనుకుంటున్నారు కదూ. నిజమేనండీ, నేనూ మనిషినే, నాకూ దైవభక్తీ, పాపభీతీ ఉంటాయి మరి. సాక్షాత్ శ్రీవేంకటేశుని, శేషశయన విష్ణుమూర్తిని దూషించగలమా చెప్పండి..!? ఈ గోలేమిటంటున్నారా..!!!!! అయితే మీరు ఈటీవీ చూడరాండీ..!? చూస్తే, అందులో కాసెట్లమ్ముకునే ఎడ్వర్టైజ్‌మెంట్లు చూసేఉండాలే! చిరునవ్వుతో, బూరెబుగ్గలతో, అపార వినయ విధేయతల బరువువలన కొద్దిగా వంగిన వీపుతో, చిరుబొజ్జతో, ముద్దపప్పులా, మొద్దబ్బాయిలా, ఎం..థో సరళంగా కనిపించే ఈ వెంకటేశ్వర స్వామిని గాని లేదా విష్ణుమూర్తిని గాని చూసిఉండేవారే! ఆయన్ని చూస్తుంటే, నాకెందుకో ఈటీవీ అధినేత సుమన్ గుర్తొస్తూ ఉంటాడు. సుమన్ కు వెంకటేశ్వరుడికి ఇంత దగ్గరి పోలికలా..! లేక సుమనే వెంకటేశుడా..లేక సుమన్ భగవంతుడి పదకొండో అవతారమా..? ఏమో...!

ఇక్కడో చిన్న విషయం..ఎవరి మీద పాటలు రాసినా పరవాలేదు గానీ, రుద్రభూపతియైన శివుడిపై మాత్రం పాటలు రాయవద్దని "శ్రీమాన్ సుమన్ స్వామి"కి నా విజ్ఞప్తి. మొలకో చర్మం చుట్టుకుని, బూడిద పూసుకున్న సుమన్ని చూడలేమేమోనని నా ఉద్దేశ్యం, అంతే! మన వేడుకోలును ఆయన పట్టించుకోక (పట్టించుకుంటాడనే నమ్మకం నాకు లేదు. ఛానెలు ఆయనదే కదా. పైగా, అసలు చిక్కల్లా అదేనాయె) అలాంటిదే జరిగితే, ఆ కాసెట్టుకు ఎడ్వర్టైజ్‌మెంటు విడుదల చేసేలోపే, మొత్తం కాసెట్లన్నిటినీ కొని 'పారెయ్యడానికి' యావదాంధ్రదేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాను.

వార్తా ఛానెళ్ళు

ఇక వార్తా ఛానెళ్ళు. వీళ్ళకి, సినిమా ఛానెళ్ళకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. అదే - "తేడా". సినిమా ఛానెళ్ళు ఏంచేసినా సూటిగా, మొహమాటం లేకుండా ఉంటుంది, "శ్రీమాన్ సుమన్ స్వామి" లాగా. వార్తల వాళ్ళు కాస్త తేడా గా ఉంటారు. వీళ్ళు మనకు ఉపదేశాలిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. వార్తలు చూద్దాంగదాని బాసింపట్ట వేసుకుని, ఓచేత్తో రిమోటు పట్టుకుని, అమ్మ పంపిన పూతరేకు నంజుతూ, సొఫాలో చిదానందంగా కూచుంటామా..! కాసిని వార్తలయ్యాక బోధన మొదలు.. పెళ్ళికి ముందే సెక్స్ పై ఖుష్బూ లేదా సానియా మీర్జా అభిప్రాయం గురించిన వార్త. వార్తేగదా అని మనం అనుకుంటే..పప్పులో కాలేసినట్లే! ఘనత వహించిన టీవీ9 వారు - "సానియాను విమర్శించే వారు ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, సమాజాన్ని చెడగొట్టే విషయాలు మరెన్నో ఉన్నాయి, సినిమాల్లో చూపించే పచ్చి శృంగారాన్ని చీదరించండి, క్లబ్బులు, డిస్కోలు, పబ్బుల సంస్కృతిని ముందు ఎదిరించండి" అంటూ ఉద్బోధిస్తారు. రైటే! నిజమే!! ఇవన్నీ సమాజానికి చేటే!!! కాని తమరు చేసేదేమిటి..? ఇవే సినిమాలకు, క్లబ్బులకు, పబ్బులకు మీ కార్యక్రమాల్లో చోటివ్వడంలేదా? సిటీలైట్స్ అనో, సిటీబీట్స్ అనో మరో పేరుతోటో ఈ పబ్బుల్లో జరిగే డాన్సులు, జుగుప్స కలిగించే డ్రెస్సులకు ప్రచారం కలిగించడంలేదా? ఓపక్కన అలాంటివి చూపిస్తూనే, ఈ బోధనలేమిటి? మీరు బూతులు మాట్లాడుతూ, అలా మాట్లాడ్డం తప్పని మాకు చెప్తారా? ఇది అన్యాయమండీ.. రవిప్రకాష్ ! శ్రీరంగ నీతులు చెప్పొచ్చు, తప్పులేదు..కానీ...

ఇక మొద్దుశీను కథ.. వాడు దొరకడమేమో కానీ వార్తా ఛానెళ్ళకు పండగైపోయింది. మేం కనిపెట్టామంటే మేమని ఓ..ఊదరగొట్టేస్తున్నారు. వాడు ఢిల్లీలో ఉంటూవచ్చాడని, ఆ విషయం మేమే కనుక్కున్నామని ఈటీవీ2, ఈనాడు పేపర్లు చెప్పుకుంటుంటే, అ విషయం మేమే ముందు చెప్పామని టీవీ9 అంటోంది. నవంబర్ 19 పొద్దున టీవీ9 లో న్యూస్‌వాచ్ కార్యక్రమంలో వార్తల విశ్లేషణ కాసేపు పక్కన పెట్టి, కరీం తమ రిపోర్టరుతో ఒక వార్తను చెప్పించాడు. ఆవిడ చెప్పిందంతా ఒకటే.. ఢిల్లీ విషయం మేమే ముందు చెప్పామని. చూసే మనబోటివాళ్ళకి తెలిసిపోతూనే ఉంది వీళ్ళ ఆరాటం. అయితే ఒకటి - పోలీసులు వెధవాయిలని, సీబీఐ పప్పుసుద్దనీ, ఈ పప్పుసుద్దని కలియబెట్టే పప్పుగుత్తి రాజకీయనాయకుల దగ్గర ఉందనీ...వీళ్ళు తమ పరిశోధనలతో నూటా డెబ్భయ్యేడోసారి తేల్చిపారేసారు...  

అభినందనలు!!
ఇక భాష విషయానికి వస్తే, సినిమా ఛానెళ్ళ కంటే వీళ్ళు కాస్త నయం. తెలుగును బాగానే ఉచ్ఛరిస్తారు. ఇంగ్లీషు పదాలతో కలిపి కుళ్ళబొడిచెయ్యడం కాస్త తక్కువే. కానీ, ఈ వార్తా ఛానెళ్ళ పేర్లు, వాళ్ళ కార్యక్రమాల పేర్లు చూడండి.. చాలా వరకు ఇంగ్లీషు పేర్లే.. వార్తలు అని ఎక్కడా అనరు.. న్యూస్ అంటారు. సిటీలైట్స్, న్యూస్‌వాచ్, నైన్ పి.ఎం న్యూస్, ఇలాంటి పేర్లే. వీళ్ళకి తెలుగు పేర్లు దొరకవో, లేక ఇంగ్లీషుపై మోజో తెలీదు. (వీళ్ళని కూడా నా హిట్‌లిస్టు లో చేర్చాలి !!)

ఎన్ని తిట్టినా, నా ఓటు వార్తా ఛానెళ్ళకేనండి. వీళ్ళలో మంచి పాలు కాస్త ఉంది సుమండీ!. "శ్రీమాన్ సుమన్ స్వామి" లాగా భయపెట్టే వాళ్ళూ, చెవుల ఝాన్సీ ( ఎవరా..? "మా"టీవీ లో అమితాబ్ బచ్చన్ ) లాగా మొహానికి నవ్వు అతికించేసుకుని ఇంగ్లీషు పదాలు, తెలుగు క్రియలు రుబ్బి పడేసే వాళ్ళు, "గురూ" అంటూ ఈలేసి, కన్ను కొట్టే వాళ్ళు, వెకిలి డ్రస్సులు, వికారపు చేష్టలు చేసే "ఉదయ భానులు" ఇక్కడ ఉండరు. అన్నట్టు ఉదయ భాను అంటే గుర్తొచ్చింది.. ఈమధ్య జీ టీవీ లో బంగారం పంచే ఒక కార్యక్రమం లో ఆమెను చూసి, జాకెట్టు వేసుకోలేదని నాకు అనుమానం వచ్చింది. ఆమాటే మా ఆవిడతో అంటే నోరు మూసుకోమని కసిరింది. (నిజమే, బుద్ధి లేదు, మనసులో మాట దాచుకోలేకపోయాను. కాని, ఆరోజున, ఆ కార్యక్రమంలో, అదాటున ఆమెను చూసిన ఎవ్..వ్హడికైనా ఈ అనుమానం వచ్చి తీరుతుంది.., పందెం!).

మీ పిల్లల్ని టీవీ చూడకుండా చెయ్యండి. నేనా పని కొంతవరకూ చెయ్యగలిగాను. అయినా అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటారు. అంచేత నేనో మార్గం కనిపెట్టాను. ఇలాంటి విలనీ సీరియళ్ళు చూసేటపుడు, రన్నింగ్ కామెంటరీ చెప్తూ ఉంటాను. విమర్శిస్తూ, ఎగతాళి చేస్తూ ఉంటాను. "నాన్నా, నిజజీవితంలో ఇలాంటి ఆడ విలన్లు, పెళ్ళిళ్ళు చెడగొట్టే వాళ్ళు, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని విలనీ చేసే వాళ్ళు, అమ్మోరిలాగా కళ్ళు పెద్దవి చేసి భయపెట్టే విలనీమణులు, కిడ్నాపులు చేసే క్రూరిణిలు, రౌడిణిలు, జారిణిలు, చోరిణిలు ఉండరు, సినిమాల్లో కూడా అరుదే. ఇవన్నీ నిజమనుకునేరు. ఇదంతా ఛానెల్ వెధవల అతి. వీటిని చూడొద్దు, చూసినా వెంటనే మర్చిపోండి" అని మా మిన్నమ్మని, బిజ్జులయ్యని బతిమిలాడుతూ ఉంటాను.

అసలీ ఛానెళ్ళకు బుద్ధి చెప్పే పంతులుగారే లేరా? అయ్యా, రాజశేఖరా! రైతులకి వాతలు, వాళ్ళకిచ్చే కరెంటుకి కోతలు - పెట్టడం మీద నుండి దృష్టి మరల్చి, ఈ ఛానెళ్ళ సంగతి చూడవయ్యా! నీ మొండితనమే వీళ్ళకి సరైన మందు. కనీసం రఘువీరారెడ్డికి చెప్పి వీళ్ళని తిట్టించరాదూ, విని ఆనందిస్తాం కదా!!

పోనీ నరేంద్రతో చెప్పి, వీళ్ళ తోలు వలిపించి, వీళ్ళ రక్తంతో తర్పణం చేయించుదామనుకున్నా, ఆయన తన గొడవల్తోటే బిజీ గా ఉన్నాడాయె, నా గోడు వింటాడా!? లాభంలేదు.

అన్నట్టు.. ఇలాంటి గొడవ నాకేనా..., మీకూ ఉందా..?

13 కామెంట్‌లు:

  1. ఇన్నాళ్ళకు దొరికింది తెలుగు లో ఓ బ్లాగు.... నా అభినందనలు....

    ఇది చదివి నవ్వలేక చచ్చాను..... ఆ గోడే అందరి గోడూనూ...

    మీ శైలి బాగుంది... మరిన్ని ఆశిస్తూ....

    రిప్లయితొలగించండి
  2. మరిన్ని తప్పక రాయండి.
    అభినందనలతో....

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగు చాలా బాగుంది. tv9లో ఖుష్భూ గురించి ఆ టాప్ స్టోరీ చెప్పినప్పుడు నాక్కూడా మీలానే అనిపించింది.

    రిప్లయితొలగించండి
  4. అబ్బో, ఎందుకు లేదండీ! అసలందుకోసమే ఓ టీవీ ఛానెల్ పెట్టాలనేంతగాఉంది. కానీ వార్తాఛానెళ్ళలో టీవీ9 భాష చాలా చాలా చాలా భయంకరంగా, ఒక్కోసారి అరగంట కార్యక్రమంలో కనీసం ఆరు తెలుగు మాటలకోసం వెదుక్కోవలసి వచ్చేటంత ఘోరంగా ఉంటోంది. మంత్రి జానారెడ్డి గారు "షాయసక్తులా" కృషి చేయడం నిజమే. కానీ తెలుగు తల్లిని క్షోభ పెట్టేంత ఘోరమైన భాష మన శాసనసభాపతిగారిది.

    రిప్లయితొలగించండి
  5. Adbhutamgaa raasarandi.. Chaala navvinchaaru. Ikapote, eemadhyane Gemini lo 'Bangaaram Meekosam' karyakramamu kudaa alanevundandee... Radhika gaaru Ekkado oka telugu padam vaadutu.. adee tamilam Vuchchaaranalo English to kalipi Khunee chesestunnaaru.. KarNakaThoramugaa vundi.

    రిప్లయితొలగించండి
  6. ఏలా చెప్పను నా బాధ తో కూడిన ఆశ్చర్యం లోని ఆనందం.
    ఎందుకంటారా??
    మీ కూలంకషమైన విశ్లేషణ చూసి ఆశ్చర్యం.
    ఆహా అందరూ చెప్పాలనుకునేవి చెప్పలేనివి మీరు చక్కగా రాసేసినందుకు బోలెడు ఆనందం.
    కానీ ఇదంతా నిజమే కదా..
    మన తెలుగు పాపం మనం !! అని విపరీతమైన బాధ.
    మొత్తానికి చాలా బాగా రాసారు.

    DD8 గురించి కూడా కొంచెం చెప్పుంటే బాగుండేది

    రిప్లయితొలగించండి
  7. ఆల్రెడీ చచ్చిన పాము (DD8) నెందుకు చంపమంటారండీ స్వాతి గారు!

    చదువరి గారూ! చదువరి గారూ!! శ్రీమాన్‌ సుమన్‌ స్వామి గురించి మరికొంచెం రాయరూ! ప్లీజ్‌. ఇన్నాళ్ళూ టీవీ ఏడుపే తప్ప నవ్వే లేదు. మరొక్క సారి సుమన్‌ గురించి చెబితే హాయిగా దొర్లి దొర్లి, కళ్ళెంబడి నీళ్ళొచ్చేలాగా నవ్వుకుంటా!

    రిప్లయితొలగించండి
  8. అందరు ఇలా అలోచిస్తే ఎప్పుడో పరిస్థితి బాగుపడేదనిపిస్తుంది. ఎవడైనా బుద్ధి+ఎద్దు ఉన్నవాడు ఆ పరిశ్రమలో అడుగుపట్టేంత వరకు ఈ ఘోరకలి తప్పదేమో...

    రిప్లయితొలగించండి
  9. excellent,awesome,very nice
    kshaminchali(angla padalu vadinanduku)nakkuda tv9,etv meda
    peekala daka kopam vundi
    asalu valla bhasha(ex: tv9 lo.. first test lo bad shot ki out ayina ganguly..)chi chi dini amma
    givitham mida virakthi puduthundi
    kani ee vishayam lo etv2 vallani mechukovali.meeru naa lanti TV bali pashuvu annamata inka mee nunchi chala expect chestunnamu regural ga ee vishayam mida post chestu undandi.ABHINANDANALU.

    రిప్లయితొలగించండి
  10. చాలా బాగా చెప్పారండి లేకుంటే న్యూస్ చానెల్ అడ్డు పెట్టుకుని అడ్డమైన న్యూస్ చెత్త అంతా చూపిస్తున్నారు. ఈ బ్లాగ్ మనకు మంచి ఆయుధం లాంటిది. నాకు తెలుగు చానెల్స్ అంటె భయం వేసి టీవి రూంలోకి వెల్లదం మనేశాను టీవి సీరియల్స్ ఆడవాల్లకి ఒక మత్తులాగ బానిసలను చేస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  11. నేను చూసే కొన్ని ఛానెల్సు
    1) History
    2) NGC
    3) Discovery
    4) Cartoon Network
    5) POGO (Just for Gags)
    6) gyan darshan

    పై ఛానెల్సు చూస్తూంన్నంత వరకు మన ఆరోగ్యానికేమీ ఢోకా లేదని నా హామీ...
    పైవి కాక తేజా (అప్పుడప్పుడు వాడేసే తెలుగు సినిమాలకోసం)

    రిప్లయితొలగించండి
  12. "శ్రీమాన్ సుమన్ స్వామి" యోగి వేమన సీరియల్ కి కథ, మాటలు, పాటలు, దర్శకత్యం మర్చి పొయా బొమ్మలు కూడ అన్నీ ఆయనే అట . మరి యోగి వేమన పాత్ర ఎవరు వేస్తారు ? అది కూడ తెలియదా ???

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు