25, జూన్ 2006, ఆదివారం

పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ

జూన్ 25 ఆదివారం మాటీవీలో పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ వచ్చింది. గుర్తుకొస్తున్నాయి అనే కార్యక్రమం అది. ఇంటర్వ్యూ చేసింది కుంచె రఘు. మధ్య నుండి చూసాను, నాకు నచ్చింది.

పెద్దలు, ప్రముఖులు తమ జ్ఞాపకాలను తవ్వుకుంటూ మాట్లాడుతుంటే వినడానికి నాకెంతో ఇష్టం. తాను ఏ పాటలు ఏ సందర్భంలో పాడారో, ఎవరెవరు ఏమన్నారో చక్కగా చెప్పుకూంటూ పోయారు శ్రీనివాస్ గారు. రామారావు, భానుమతి నటించిన ఓ సినిమాలో (పేరు మర్చిపోయాను) పాటలన్నీ భానుమతి గారే పాడారట, ఉన్న ఒకే ఒక్క మగ గొంతు పాట తనదట. సినిమా పేర్లలో నేపథ్య గాయకు"డు" - పీబీశ్రీనివాస్ అని వేసారట - చెప్పుకుంటూ మురిసిపోయారాయన. ఈ పాట గురించే మరో సంగతి చెప్పారు-

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు సినిమాలూ,పాటలూ ఈ వ్యవహారాలంటే పడేవి కాదట. ఆయన కొడుకు విశ్వనాథ పావనిశాస్త్రి ఓసారి శ్రీనివాస్‌తో ఇలా చెప్పారట. ఆ పాట ఎలాగో విశ్వనాథ వారి చెవిలో బడింది. మగవాడు పాడితే అలా ఉండాలిరా, స్వరం నాభిలోంచి రావాలి అంటూ కొడుకుతో మెచ్చుకోలుగా మాట్లాడారట. నాకదో పెద్ద మెప్పు అని చెప్పుకున్నారు శ్రీనివాస్ గారు.

ఇలాగ మరిన్ని విషయాలు చెప్పారు. తన తర్వాత చిత్రరంగానికి వచ్చి ఎంతో ఎదిగిన బాలు గురించి ఎంతో మెచ్చుకోలుగా మాట్లాడారు. లేతమనసులు సినిమా గురించి, ఎనిమిది భాషల్లో తాను చేపట్టిన ఓ కార్యక్రమం గురించి కూడా మాట్లాడారు.

ఇంటర్వ్యూ చేసే వారూ, ఇచ్చేవారు ఇద్దరికీ లయ కుదిరింది. ఆయన అడగడం ఈయన చెప్పడం చక్కగా సాగింది. శ్రీనివాస్ గారికి వినబడ్డం కోసం ఇంటర్వ్యూ చేసిన రఘు పెద్దగా మాట్లాట్టం, వారిద్దరి మధ్యా ఆత్మీయ వాతావరణం ఉన్న భావనను కలిగించింది. రఘు కూడా గాయకుడు కావడం, శ్రీనివాస్ గారి కృషి గురించి బాగా శోధించడం బహుశా దీనికి కారణం కావచ్చు. రఘుకు అభినందనలు.

ఒక చిరు లోపం: కార్యక్రమాన్ని బాగా ఎడిట్ చేసారు. ఇష్టాగోష్ఠిగా జరిగే కార్యక్రమాన్ని యథాతథంగా చూపిస్తే బాగుంటుంది. కత్తిరింపులు తప్పనిసరైనా సాఫీగా గతుకులు లేకుండా ఉండేలా చేస్తే ఇంకా బాగుండేది. మొత్తానికి ఆదివారం నాడు మంచి కార్యక్రమం చూసాను.

ఈ కార్యక్రమం వెనువెంటే పెళ్ళిపుస్తకం పేరుతో దంపతులను ఇంటర్వ్యూ చేసే కార్యక్రమంలో డాక్టరు ఎన్.ఇన్నయ్య, కోమల దంపతుల ఇంటర్వ్యూ వచ్చింది. పర్లేదు, బానే ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు