8, ఆగస్టు 2006, మంగళవారం

భావ దారిద్ర్యం, భావ దాస్యం

చిన్న విషయంగా అనిపించవచ్చు. కాస్త ఆలోచిస్తే ఏమిటి మనకింత అవివేకం అనిపిస్తుంది. బొంబాయిలో జూలై 11 న పేలుళ్ళు జరిగితే.. దాన్ని 7/11 అన్నారు. నిజానికి మన పద్ధతి ప్రకారం అది 11/7. మరి అలా ఎందుకన్నారు? అమెరికా వాళ్ళు ముందు నెల పెట్టి ఆపై తేదీ పెడతారు కాబట్టిన్నీ, 9/11 అనేది, వాళ్ళ దేశంలో ఇలాంటిదే ప్రముఖ దాడి జరిగిన తేదీ కాబట్టిన్నీ, దానికి ప్రాస కుదురుతున్నది కాబట్టీ దాన్ని మనం 7/11 అన్నాం! దీనికి ప్రధాన కారకులు కొందరు మాధ్యమాల వాళ్ళు, మరీ ముఖ్యంగా కొత్త పుంతలు తొక్కుతున్నామనుకుంటూ పెడదోవలు తొక్కే టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికిల్, టీవీ9 లాంటి ప్రసార సాధనాలే!


మన సినిమా పరిశ్రమల పేర్లను కూడా ఇలాగే మార్చిపారేసారు. హాలీవుడ్‌ను చూసి వుడ్లు పెట్టేసుకున్నారు. హిందీ సినిమా బాలీవుడ్, తెలుగు సినిమా టాలీవుడ్ అయిపోయాయి. చెన్నై, కోల్‌కతాలలోని పరిశ్రమలను ఏమనాలనే విషయమై మొదటి అక్షరాలు ఒకటే అవడంతో కాస్త తేడాలొచ్చినట్లున్నాయి. ఇంగ్లీషు వికీపీడియాలో ఈ వుడ్ల మీద చర్చ జరిగింది. ఒకాయన టాలీవుడ్ అంటే బంగ్లా సినిమా అంటున్నాడు.. బహుశా టాలీగంజి లో ఉందేమో బంగ్లా సినిమా! మనం జాలీవుడ్ అని పిలుచుకుంటే పోలా.. జూబిలీ హిల్స్ పేరు కలిసొస్తుంది, జాలీగా కూడా ఉంటుంది. (అరవ సినిమాను కాలీవుడ్ అని బంగ్లా సినిమాను కాళీవుడ్ -కలకత్తా కాళిక పేరిట- అంటే పోతుందేమో! మరి కన్నడ సినిమానో? (మూడో క కారం).. ఖాళీవుడ్ అనొచ్చేమో! కన్నడ పరిశ్రమ పరిస్థితికి ఆ పేరు సరిపోతుంది కూడాను.) అనుకరణపై ఎందుకింత యావ?

త్రివిక్రం గారు చెప్పినట్లు మెడముళ్ళేసుకుని తిరగడం లాంటిదే ఇదీను!

ఇక భాష సంగతి చెప్పే పనే లేదు. భాష విషయంలో మనకున్నంత భావ దాస్యం మనదేశంలో మరొకరికి లేదనుకుంటాను. దాని గురించి చెప్పుకోడమంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లే!

ఎలాగూ తిండి ప్రసక్తి వచ్చిందిగా దాని సంగతే చూద్దాం..
భోంచేసావా అని అడగరు.. మీల్స్ చేసావా, లంచయిందా.. ఇలా అంటారు. హోటలుకు వెళితే రెండు భోజనాలు అనరు.. రెండు మీల్స్ అంటారు.
అన్నం కు బదులు రైస్! (వడ్లూ, బియ్యం, అన్నం.. అన్నిటికీ వాడే ఈ బోడి మాటంటే ఎందుకో అంత ప్రీతి!?)
నెయ్యిని ఇంట్లో నెయ్యి అనే వాళ్ళు హోటలుకు వెళితే ఘీ అనో ఆయిల్ అనో అంటారు.
అప్పడం అని అనరు.. పాపడ్ అంటారు.
మంచినీళ్ళు అనడం నామోషీ.. వాటర్ అంటారు.
పచ్చడి, ఊరగాయ అనరు.. చట్నీ, పికిల్ అంటారు. (పచ్చళ్ళు తింటంలో ప్రపంచం లోనే మొనగాళ్ళం మనం. ఆ గర్వంతోనైనా తెలుగు మాట వాడొచ్చు గదా)
కూర అనరు..కర్రీ అంటారు.
పెరుగు ను కర్డ్ అంటారు.
మజ్జిగ ను బటర్‌మిల్క్ అంటారు.
పప్పును దాల్ అని హిందీలో అంటారు. (ఏ భాషైనా పర్లేదు.. మన మాట కాకుండా ఉంటే చాలు.)

పళ్ళను కూడా అంతే..
గ్రేప్స్ అంటారు గానీ ద్రాక్ష అనరు
బత్తాయిలను అదేదో మోసంబీ అనో సరంబీ అనో అంటారు.
కమలాలను ఆరెంజెస్ అంటారు. (చాన్నాళ్ళ పాటు ఆరెంజి లంటే నారింజలనుకునే వాణ్ణి నేను. కాని అది కాదని తరవాత్తెలిసింది. )
కొబ్బరికాయను కోకోనట్టనీ వేరుశనక్కాయలను పల్లీలనీ ... ఇలా సాగుతూ పోతుంది.

మొన్నటికి మొన్న జయప్రకాశ్ నారాయణ గారి టీవీ9 ఫోను కార్యక్రమానికి ఫోను చేసిన వాళ్ళలో కొందరు తమ ప్రశ్నను ఇంగ్లీషులోనే అడిగారు. పోనీ అది సరైన ఇంగ్లీషా.. పరమ బొట్లేరు ఇంగ్లీషు.

ఎందుకీ కష్టాలు.. నవ్వుల పాలవడానికి తప్ప!

ఈ జాబుకు కొనసాగింపును కూడా చూడండి

4 కామెంట్‌లు:

  1. మన పిచ్చి గంగవెర్రులెత్తుతోంది. కి, కు లాంటివి మినహాయించి మిగిలిందంతా ఇంగ్లీషులోనే ఒలకబోస్తారు మరికొందరు. ఒంటిమీద ఖద్దరు వుంటేగానీ విలువివ్వరన్నట్లు, మూతికి నాలుగు ఇంగ్లీషు మాటలు తగిలిస్తేగానీ విలువ రాదనుకుంటారు.

    -- ప్రసాద్
    http://charasala.wordpress.com

    రిప్లయితొలగించండి
  2. చక్కగా చెప్పారు! ఇంకాస్త గడ్డి పెట్టండి ఈ తెలుగాంగ్లేయులకి!

    రిప్లయితొలగించండి
  3. మరీ ఆవేదన కలిగించే విషయం ఆ మధ్య ఒక బ్లాగులో చదివాను: మన రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెటూర్లో పెళ్ళి జరుగుతోంది. భోజనలదగ్గర వడ్డించేవారిలో ఒక మనిషి "ఓట్రేచు, ఓట్రేచు" అంటున్నాడట. ఏమిటా అని అడిగితే అన్నం అని తెలిసిందట. (వైట్ రైస్ కాస్తా వోట్రేచు అయిందన్నమాట!) ఆ ఏడుపేదో తెలుగులోనే ఏడవొచ్చు కదా! అని అడిగితే "తెల్లన్నం అని తెలుగులో అంటే మగపెళ్ళివారి ముందు చిన్నతనం" అనుకున్నాడట. చదువుకున్న మూర్ఖులు కొందరు ఇంగ్లీషు రానివారిలో కూడా ఆంగ్లభాషను ఆ స్థాయిలో అలవాటు చేస్తున్నారన్నమాట!

    రిప్లయితొలగించండి
  4. నా చిన్నప్పుడు మా వూర్లో కబడ్డీ ఆడేప్పుడు "ఒన్స్‌మోర్" లాంటి పదాల్ని ఏమాత్రం చదువురాని వాళ్ళూ తెలుగు పదాల్లాగే తమ యాసలో అనే వారు. వాళ్ళకది ఆంగ్లపదమనే తెలియదు. నాక్కూడా అప్పుడు తెలియదు. అంతగా చొరబడ్డాయి ఈ ఆంగ్లపదాలు జన సామాన్యంలో.
    ఆ మద్య ఇండియా కొచ్చినప్పుడు అప్పుడప్పుడూ మా అమ్మ "టెశ్శను, టెశ్శను" అంటుంటే ఇదేంటబ్బా అనుకొని అడిగితే అదేంటో చెప్పలేకపోతోంది. చివరికి మా తమ్ముడు దాన్ని "Tension" అని తర్జుమా చేశాడు. ఆందోళన అని నేను చెప్పినా ఆమెకు "టెశ్శనే" నచ్చినట్లుంది. :(
    -- ప్రసాద్
    http://charasala.wordpress.com

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు