13, ఆగస్టు 2006, ఆదివారం

పొంతన లేని ఆంగిక వాచికాలు

కొన్నేళ్ళ కిందటి సంగతి. అరవంలో ఒక టీవీ నాటకమో, సినిమానో వచ్చిందట. అందులో మూలాంశం ఏమిటంటే.. కరెంటు పోయినప్పుడు ఒక ఇంట్లోని భార్యాభర్తలు ఎలా ప్రవర్తిస్తారు అనేది. ప్రేక్షకుల్లో దానికి చాలా మంచి స్పందన వచ్చిందని చదివిన గుర్తు. కరెంటు పోయేది నాటకం లోని పాత్రలకే. ప్రేక్షకులకు అన్నీ శుభ్రంగానే కనబడుతూ ఉంటాయి. పాత్రలకు మాత్రమే కనపడవన్నమాట. (అచ్చు మన సినిమాల్లో హీరో వేసే మారు వేషాల్లాగా. మారు వేషం వేసింది హీరోయేనని పసి వెధవక్కూడా తెలిసిపోతుంది గానీ, సినిమా పాత్రలెవరికీ తెలియదు!) మగ పాత్ర కమలాసను చేసినట్లు చదివిన గుర్తు. నేనది చూడలేదు, ఎక్కడో చదివాను.

అదే పద్ధతిలో మన సినిమాల్లోని పాటలను ధ్వని పూర్తిగా తీసేసి, కేవలం అభినయాన్నే చూస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? భలే గమ్మత్తుగా, తమాషాగా ఉంటుంది. పిచ్చి వెధవల్లాగా గెంతుతున్నారేమిటి వీళ్ళిద్దరూ అని అనిపిస్తుంది. (ఆ గెంతులు చూసే మన సంగతి ఇక చెప్పేదేముంది లెండి!)

మరి.. మన రాజకీయ నాయకులు మాట్లాడేటపుడు ఇలాగే మోత లేకుండా ఉత్త వాళ్ళ ఆంగికాన్ని మాత్రమే చూస్తే ఎలా ఉంటుంది? నిజానికి మామూలుగా కూడా వాళ్ళ మాటల్లో వినడానికి సరుకేమీ ఉండదు కాబట్టి వినకపోయినా పరవాలేదు, అది వేరే సంగతి! (అయితే ఈమధ్య వాళ్ళు మనల్ని తిడుతున్నారు కాబట్టి, ఏమని తిడుతున్నారో తెలీడం కోసమన్నా వినాలేమో!)

చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి నమూనా మనకు. ఆయన మాట్లాడేటపుడు చేతులూపుతూ తర్జని చూపిస్తూ మాట్లాడతారు. ధ్వని లేదు కాబట్టి మనకెలా అనిపిస్తుంది? తర్జని చూపిస్తున్నాడు కాబట్టి .. 'మిమ్మల్నందరినీ తుక్కు కింద కొట్టిస్తాను ఏమనుకుంటున్నారో' అని ప్రతిపక్షాలను, స్పీకరును బెదిరిస్తిన్నుట్లు ఉంటుంది. అరచేతిని తెరిచి అడ్డంగా ఊపడం చూస్తే.. 'మీరెంత ఏడ్చి మొత్తుకున్నా మిమ్మల్ని వదిలేది లేదు' అన్నట్లుగానూ ఉంటుంది. నిజానికి ఆయన మాట్లాడేది ఇలా ఉంటుంది.. (ముఖ్యమంత్రిగా శాసనసభలో మాట్లాడేటపుడు)

"అధ్యక్షా, నేనొకటే చెప్తున్నాను..మేము చాలా ఆలోచిస్తున్నాం..ఏదీ వదలడం లేదు అధ్యక్షా..కాంగ్రెసు వాళ్ళు అనుకుంటున్నారేమో..మేము దేన్నీ వదలం..ప్రతీ దాన్నీ ఆలోచిస్తాం.. ఇప్పటికే ఈ విషయంలో చాలా ముందుకు పోయాం..ఇంగా ముందుకు పోతాం..మీరొక్కటాలోచించమని మనవి జేసుకుంటున్నానధ్యక్షా..మేం టోటల్గా ఆలోచిస్తున్నామధ్యక్షా.. ఇంగా ఆలోచిస్తాం..", తర్జని చూపిస్తూ.."దేన్నీవదలం అధ్యక్షా..ప్రతిదీ ఆలోచిస్తాం..రాజశేఖరరెడ్డి గారు నవ్వుతున్నారు..నవ్వండి..నవ్వండి..మీరలా నవ్వుతూనే ఉండండి..మేం మాత్రం ఆలోచిస్తూనే ముందుకు పోతాం. ఇలా విపరీతంగా ఆలోచించి, ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నానధ్యక్షా" (ఆయన పని చేస్తామని చెప్పడం లేదు, ఆలోచిస్తామనే చెబుతున్నారు. ఎందుకు చెయ్యలేదు అని అడిగే హక్కు మనకున్నా జవాబు చెప్పాల్సిన ఖర్మ ఆయనకు లేదు.ఆయనే కాదు మంత్రులకూ నేర్పారు అలా మాట్లాడ్డం)

ఇక రాజశేఖరరెడ్డి గారు.. మొహమ్మీద చిరునవ్వు చెరగనీయరీయన. చంద్రబాబుకు చిర్రెత్తింపజేసే చిర్నవ్వది! మోత లేకుండా చూస్తే ఆయనేదో మంచి కులాసా కబురు చెబుతున్నాడల్లే ఉందే అనుకుంటాం. చేతివేళ్ళన్నిటినీ ఒకచోటికి చేర్చి ప్రతిపక్షాలను ముద్దు చేస్తున్నట్లుగా (చిన్నపిల్లలను చుబుకం పట్టుకుని ముద్దులాడినట్లు, అన్నం ముద్దలు చేసి తినిపిస్తున్నట్లు) అనిపిస్తుంది, చూసేవాళ్ళకు. కానీ ఆయన ప్రసంగం ఇలా సాగుతుంది...

"ఏంటయ్యా ఫాక్షనిస్టు అని ఏప్పుడు నామీద పడి ఏడుస్తారు? ఏమయ్యా బాబూ, నువ్వేమన్నా పత్తిత్తువా? నీ మావను వెన్నుపోటు పొడిచి చంపించావు, నేనేమన్నా అన్నానా? నువ్వు సింగపూరులో, మలేషియాలో ఆస్తులు కూడబెట్టావు, నేనేమన్నా అన్నానా? నేను మాట్లాడేటపుడు నువ్వు మధ్యలో రాకు నాగం, నోరు మూసుకుని కూర్చో! 'అయ్యా, రైతులు ఇబ్బందులు పడుతున్నారూ, వాళ్ళను పట్టించుకోవయ్యా' అని అంటే పట్టించుకున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా? ఇప్పుడు మేము ఇవన్నీ చేస్తుంటే కుళ్ళుకుంటున్నావు. ఈ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తాము, మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం. ఏదో అవినీతి, అవినీతి అని నోరు పారేసుకుంటున్నారు, మీరేమైనా తక్కువ తిన్నారా? బియ్యం అమ్ముకున్నది మీరు కాదా? వాడికీ, వీడికీ అప్పనంగా భూములను పంచేసింది మీరు కాదా! ఇప్పుడు.. అవినీతిపై విచారణ జరపాలా? విచారణ జరిపించే ప్రశ్నే లేదు, ఏంచేసుకుంటారో చేసుకోండి."

ఈ రెండు ఉదాహరణల ద్వారా నే చెప్పొచ్చేదేమంటే రాజకీయులు చెప్పేదానికీ, చేసేదానికి పొంతన ఉండనట్లే.. వాళ్ళ ఆంగికానికీ, వాచికానికీ కూడా పొంతనుండదు అని.

అన్నట్టు, మన రాజకీయాలపై కె.ఎన్.వై పతంజలి గారు ఒక కథ రాసారు, పేరు గుర్తు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికై రాజకీయులు వేసే ఎత్తులు, జిత్తుల గురించిన కథ అది. చాలా హాస్యస్ఫోరకంగా రాసారు. శాసనసభ సమావేశాల అంకం కూడా ఉన్నదందులో. అది చదువుతూ కడుపుబ్బ నవ్వుకుంటాం. ఆ కథతో పాటు మరి కొన్ని ఆయన కథలు, నవలికలను కలిపి ఒక సంకలనంగా వేసారు. ఖాకీవనం కథ, వేటకథలు కూడా అందులో ఉన్నాయి. బాగుంటాయా కథలు. చదవకపోతే, తప్పక చదవండి.

4 కామెంట్‌లు:

  1. గురూ..!

    మీకు కేవలం అసెంబ్లీ లొ మాట్లాడుకొనె మాటలకి,చేతలకి(ఆంగికవాచకాలకి)సంబంధం కనిపించక పోతె ఫర్లెదు., నాకు వారు చెసే ప్రతీ విషయాలకీ, నెత్తి,నోరు బాదుకోవలాని అనిపిస్తుంది, ముఖ్యముగా నరెంద్ర, చంద్రశెఖర్ గార్ల విషయాలలో.....

    అనీల్ చీమలమఱ్ఱి

    రిప్లయితొలగించండి
  2. అనిల్! ఓ జ్ఞాపకం..
    చంద్రశేఖరరావు కాలికి దెబ్బ తగిలిన తరువాత సంగతి ఇది. ఓ రోజు ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రజ్యోతిపై విరుచుకుపడ్డప్పుడు ఆయన చెప్పిన మాటలు.. "నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా తెరాసను బద్నాం చేసే రాతలు రాయొద్దు".

    ఆయన ఈ విజ్ఞప్తిని తర్జని చూపిస్తూ చేసారు!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు