11, అక్టోబర్ 2007, గురువారం

వ్యాఖ్యోపాఖ్యానం

తెలుగు బ్లాగుల రాసి బాగా పెరుగుతోంది, ఇక బ్లాగరులు 'వాసి'పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వింజమూరి విజయకుమార్ గారు మధ్యంతర మార్గ నిర్దేశనం లాంటిది చేసారు. బ్లాగు నాణ్యతకై బ్లాగరులంతా పునరంకితం (అమంగళం ప్రతిహతమగుగాక :) ) కావాలని వారి ఉద్దేశ్యం కాబోలు.


బ్లాగుల వాసిని వింజమూరి వారికి వదిలేసి, వ్యాఖ్యల వాసి గురించి రాయదలచాను. నాకెందుకో జాబుల కంటే వ్యాఖ్యలే ఇష్టం, అసలు కంటే కొసరు ముద్దు లాగా. వాసి విషయం చూస్తే మన బ్లాగు వ్యాఖ్యలు మరీ నాసిగా లేవని నా ఉద్దేశ్యం. నేనైతే కూడలిలో ముందు వ్యాఖ్యల పేజీకే వెళతాను. వ్యాఖ్యల తీగలను పట్టుకునే బ్లాగు డొంకలను కదిలిస్తూంటాను. మంచి మంచి వ్యాఖ్యలు రాసే వ్యాఖ్యాతలున్నారు మనకు. వీరి వ్యాఖ్యలు సదరు బ్లాగరికే కాక, ఇతర చదువరులకూ మేళ్ళు (మళ్ళీ అమంగళం ప్రతిహతమగుగాక :) ) చేస్తూంటాయి. కొత్తపాళీగారు ఈ జాబు గురించి ఏమన్నారబ్బా, చరసాల ఏం మాట్లాడారు, ఫలానావారు ఏమంటున్నారో.. ఇలా చూస్తూంటాను.

వ్యాఖ్యలను గమనించారో లేదో.. కొన్ని విపులంగా, కొన్ని ముక్తసరిగా, కొన్ని జోకొడుతూ, కొన్ని రెచ్చగొడుతూ, కొన్ని వాదిస్తూ, కొన్ని బోధిస్తూ.. ఇలా రకరకాలుగా ఉంటాయి. వ్యాఖ్యాతల్లో కొన్ని రకాలు..
  1. బోళాశంకరులు: వీరికి మనమేం రాసినా నచ్చుతుంది. భలే రాసారు, అదిరిందండి, గొప్పగా రాసారు, చాలా చక్కగా రాసారు.. ఇలాంటివి వీరు ఎక్కువగా రాస్తూ ఉంటారు. (నేనీబాపతు వ్యాఖ్యలు రాయడం ఎక్కువే!) ఈ మాటలు ఎక్కువగా నిజాయితీ గానే ఉంటాయి. కాకపోతే, ఎందుకు నచ్చిందో, ఏది నచ్చిందో లాంటివి రాయరు వీళ్ళు. బద్ధకం అంతే! లేదా ఆ సమయానికి ఏమి రాయాలనేది తట్టక కావచ్చు. లేదా.. ఏమి రాస్తే ఏమొస్తుందోనన్న బెరుకు చేత కావచ్చు. ఏదన్నా గానీండి.. చిన్న మెప్పుదలతో సరిపెడతారు వీళ్ళు, తమ వ్యాఖ్యతో బ్లాగరిని సంతోషపెడతారు. బ్లాగరికి తదుపరి జాబు కోసం ఉత్సాహాన్నిస్తారు.
  2. విశ్లేషక శేఖరులు: బ్లాగును చక్కగా విశ్లేషిస్తారు వీళ్ళు. జాబు ఎందుకు బాగుందో చెబుతారు. ఏది నచ్చిందో చెబుతారు. నచ్చకపోతే ఎందుకు లేదో కూడా చెబుతారు. సద్విమర్శకులవలన సాహితీకారులకు కలిగే ప్రయోజనాలు ఈ వ్యాఖ్యాతల వల్ల బ్లాగరికి కలుగుతాయి. (శ్లేషక శిఖామణులు కూడా ఉన్నారు. అదేదో సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాసు అన్నట్టు, వీరి ఒక్క వ్యాఖ్యలో లక్ష అర్థాలు వెతుక్కోవచ్చు!)
  3. దిశా నిర్దేశకులు: వీరు విశ్లేషకులే కాక దిశా నిర్దేశం కూడా చేస్తారు. ముందేం రాయాలో కూడా చెబుతారు. మన తరువాతి జాబుకు వీరు ప్రేరణనిస్తారు.
  4. ఇక మిగిలిన వాళ్ళు - రాయని భాస్కరులు. వీరు వ్యాఖ్యలు పెద్దగా రాయరు.. లేదా అసలే రాయరు. కానీ జాబులు చదువుతూ ఉంటారు.
వ్యాఖ్యాతలందరూ ఏదో ఒక కోవకు చెందుతారని కాదు. ఒక్కోసారి ఒక్కో రూపంలో ఉంటారు.

రెండ్రోల కిందట ఈ వ్యాఖ్య చూసాను.. నాకు నచ్చింది. వైజాసత్య జ్యోతి గారి బ్లాగులో రాసిన వ్యాఖ్య ఇది. అసలు ఈ వ్యాఖ్య చూసే ఈ జాబు రాసాను.
"అడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెత ఎంతవరకూ నిజమో కానీ అడగంది మగాడు ఇవ్వడు అన్నది మాత్రం అక్షరాలా నిజమేమో. పెళ్ళితో భార్యను సాధించాము. ఇంక అక్కడితో ఆ సమస్యా పూరణం అయిపోయింది. ఇంక దాని (సమస్య) గురించి ఆలోచించమెందుకు అనుకుంటారు మగాళ్ళు. మైండ్ లో ఒక ఓపెన్ ప్రాసెస్ తో మగాళ్ళు నిద్రపోలేరు. దాన్ని బలవంతగా బజ్జో పెట్టాలి లేకపోతే ఆ ప్రాసెస్ కు ముగింపైనా పాడాలి. ఒక జన్మదినము కంటిన్యువస్ గా గుర్తుపెట్టుకోవటమనేది మగాడి బుర్రని తినేస్తుంది. ఆడాళ్ళకి టిప్: మీకు ముఖ్యమైన రోజుకు ముందు దాన్ని గుర్తుచేస్తూ మీ ఆయనకి SMS కొట్టండి. ఆ గిఫ్టుకంటే గుర్తు పెట్టుకోవటమే ముఖ్యం అని అడాళ్ళంటారు (అదేకదా మరి తంటా)"

రాసిన కాసిని వాక్యాలు కూడా చక్కటి అర్థాన్ని చెబుతున్నాయి. వ్యాఖ్యలో చమత్కారమూ ఉంది.. (సమస్యా పూరణం). అసలు 'విషయం ఇదీ' అని చెప్పే నేర్పరితనమూ ఉంది (ఆడాళ్ళకి టిప్). 'మర్చిపోకుండా జాగ్రత్తపడరు, మర్చిపోయే దాకా చూసి, ఆపై విమర్శిస్తారు. అంత శ్రమ పడే కంటే గుర్తే చెయ్యొచ్చు కదా!' ఎంత చక్కగా చెప్పారు!రవీ, శెభాష్!

వ్యాఖ్యలు రాసి తప్పుల్లో కాలేసిన సంఘటనలు నాకు జరిగాయి.. అవీ-ఇవీ లో ఓ వ్యాఖ్య రాసి, మరీ దురుసుగా ఉందని పెద్దలు తిడితే తుడిచెయ్యాల్సి వచ్చింది. నేను తుడిచేసిన నా వ్యాఖ్య అదొక్కటే. (నా బ్లాగులో ఇంతవరకు ఒక్క వ్యాఖ్యను కూడా తుడిచెయ్యలేదు.. వ్యాఖ్యాత తుడిచేస్తే తప్ప.) అలానే రెండు రెళ్ళ ఆరు లోనూ ఒక వ్యాఖ్య చేసాను.. జాబు బాగుంది, కానీ నేనాశించినంత బాలేదు. ఆ ముక్కే రాసాను. ఎటొచ్చీ అది తీసికెళ్ళాల్సిన అర్థం తీసికెళ్ళినట్టు లేదు. తరవాత అబ్బెబ్బే అది కాదు నా ఉద్దేశ్యం అని చెప్పుకోవాల్సి వచ్చింది. అలానే తెలంగాణ ఉత్సవంలో కూడా;ఒక పదం పడలేదు.. దాంతో అర్థం మారిపోయింది. దాన్నీ సరి చేసుకోవాల్సి వచ్చింది. ఈ తత్తరబిత్తర పనులు చూసేనేమో.. కృష్ణదేవరాయలు ఇలా అన్నారు!

ఇదీ సంగతి!

23 కామెంట్‌లు:

  1. దీన్ని చూడగానే నేను త్వరలో వడ్డించబోయే టపా నేమోనని కాస్త కంగారు పడ్డా.

    హమ్మయ్యా నాలాంటోళ్ళు ఇంకా కొందరున్నారన్నమాట. అదీ పైకి చెప్పుకుంటూ. నేను ఇంతకు ముందే ఓ సారి బ్లాగా దీని గురించి, మళ్ళీ సింహావలోకనం లో ఒకసారి. చదవగానే ఎలకకు పని చెప్పకుండా కిలకకి(కీబోర్డు) పని చెప్పాలంటే కరణ్ తాపర్ లెవెల్లోనో, భరాగో లెవల్లోనో వుండాల. అప్పుడప్పుడూ B2B సంబంధం కూడా వుండాల.

    టింగు రంగామంటూ ఇంకో నలభై ఎనిమిది గంటల్లో ఇలాంటిదే ఒకటి విడుదల చేస్తా. స్టే ట్యూనుడు.

    -- విహారి

    రిప్లయితొలగించండి
  2. భలే రాసారు, అదిరిందండి, గొప్పగా రాసారు, చాలా చక్కగా రాసారు.

    రిప్లయితొలగించండి
  3. ఏదయినా ఒక మంచి టపా చూస్తే ప్రసాదు గారి,కొత్తపాళీ గారి,లలిత గారి వాఖ్యల కోసం వెతుక్కుంటాను.జ్యోతి గారి టపాలో రవిగారి ఆ వాఖ్య నాకూ చాలా నచ్చింది.అలాగే ఆచార్యులవారిది కూడా.

    రిప్లయితొలగించండి
  4. అబ్బో నేనూ ఒకటో టైపే...
    ఎక్కడో బాగా టచ్ చేస్తే తప్ప విపులంగా వ్యాఖ్య రాసే అలవాటు లేదు.

    అన్నట్టు ఈ టపా అదిరింది, బాగా రాసారు :)

    రిప్లయితొలగించండి
  5. నేను హార్లిక్స్ తాగను, తింటాను టైపు.టపాలు అందరివీ చదువుతా,కాని నేను కామెంట్స్ రాయటం తక్కువే. టపా బాగా ఉంటే, బాగా ఉందని రాయని సందర్భాలు ఎక్కువ. ఎక్కడన్నా నన్ను కదిలించిన అంశం ఉంటే, టపా బాలేక పోయినా,వ్యాఖ్య రాస్తా.ఇదీ నా కామెంట్ వేదాంతం.దీనర్థం, ఈ టపా బాగా లేదని కాదు. చదువరి బ్లాగులో,రాజకీయాలు కాక, వెరే విషయాలు ఎప్పటికైనా కనపడక పోతవా అని నిరీక్షించే ఆశావాదిని నేను.వెంకన్న లడ్డులో, జీడిపప్పు, కిస్మిస్‌లలా, చదువరి రాసిన నా చదువు, సినిమాలు, పుట్టపర్తి నారాయణాచార్యుల పై వ్యాసం, పేరు లేకుండా రాసిన పారడీలు (పొద్దులో) లడ్డూ లోని జీడిపప్పుల్లా నన్నాకర్షిస్తాయి. అవి ఎంతో వైవిధ్యంగా కూడా కనిపిస్తాయి. చదువరికి మంచి పేరు తేచ్చాయి పారడీలు గతంలో.

    రిప్లయితొలగించండి
  6. అవును, మంచి వ్యాఖ్యలు రాయడం కూడా ఒక కళే. పొద్దులో వ్యాఖ్యలకి కూడా పేరడీలు రాసి మీరు ఆ గౌరవం అప్పుడే కలిగించారు వ్యాఖ్యలకి.
    ఆంగ్ల బ్లాగుల్లో నేను చూసినంతలో (చూసింది తక్కువే) మంచి వ్యాఖ్యలు ఎక్కువగా కనబడవు. చాలావరకు ఎస్సెమ్మెస్ సందేశాలవంటివి ఉంటాయి. ఆ లెక్కన మన తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల వాసి చాలా పైస్థాయిలో ఉంది. ఇతర భారతీయ భాషల సంగతి తెలీదు మరి. రవితో బాటుగా రానారె, రాకేశ్వర, శ్రీరాములు కూడా మంచి వ్యాఖ్యలు రాస్తారు.
    కొందరి బ్లాగుల్లో వ్యాఖ్య రాయడానికి ఒక టపారాసినంత శ్రమపడాల్సి వస్తుంది - ఉదాహరణకి మీ బ్లాగే తీసుకోండి. కృషణదేవరాయల వారిది కూడా. ఎందుకో వ్యాఖ్య పెట్టే కిటికీ ఒకపట్టాన లోడవదు. అయ్యాక టైపు చెయ్యడం మొదలెడితే బొత్తాం నొక్కిన అరగంటాకి తెరమీద అక్షరం కనబడుతుంది. ఒక టపాకి వ్యాఖ్యల సంఖ్య పెరిగిన కొద్దీ ఈ జాప్యం ఇంకా పెరుగుతుందని నా అనుమానం. మీ కందాల టపాకి చివరి వ్యాఖ్యలు రాయడానికి చాలా ఓపిక తెచ్చిపెట్టుకోవాల్సి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  7. నేను నెట్టులోవుండే సమయం చాలా లిమిట్ గా వుంటుంది
    టైమును బట్టి నేను రాస్తుంటాను
    నేను ఏ టైపో గాని

    మీవ్యాఖ్యనము బాగుంది

    రిప్లయితొలగించండి
  8. కొత్తపాళీ గారు అన్నది నిజం చదువరి గారు.. మీది.. ప్రవీణ్ గారిది.. చరసాల ప్రసాద్ గారి బ్లాగుల కి వ్యాఖ్యలు రాయాలి అంటే.. టపా రాసినట్లే.. సమస్య.. మొదట.... ఆరంభ శూరత్వం.. పిదప.. నెమ్మదిగా బ్లాగ్ కదలడం అసలు వ్యాఖ్య వచ్చిందా లేదా అనేది చూడడం కూడా కష్టమే..

    ఇక మీరన్నట్లు టపా రాయగానే.. దాని వాసి కన్నా వ్యాఖ్యలు ఏమొచ్చాయా అని చూడడం అనేది పరిపాటి అయిపొయింది ..నాకయితే కొత్తపాళిగారు, తాడేపల్లి బాల సుబ్రహ్మణ్యం గారు ఇచ్చే సలహాలు సూచనలు నచ్చుతాయి.. రాస్తున్నప్పుడు ఒక్కటే అలోచన "రాముడి తోక పివర్ణుండిట్లనియే" లా కాక "రాముడి తో కపివర్ణుండిట్లనియే అనేట్లుగా రాస్తున్నామా.. లేద అని అలోచిస్తాము.. అప్పుడే రాశి గల టపాలు .. వాశి గల వ్యాఖ్యలు..

    రిప్లయితొలగించండి
  9. "నేనైతే కూడలిలో ముందు వ్యాఖ్యల పేజీకే వెళతాను." - నేనూ అంతే. కాకపోతే దీనివల్ల ఒక నష్టం ఉంది. నెనరులు అనేమాటను మించి వ్యాఖ్య రాసే అవకాశం ఇవ్వని కొన్ని అద్భుతమైన టపాలు కళ్లబడకుండానే జారిపోతున్నాయి. మెచ్చుకోళ్లు ఆక్సిజన్ లాంటివి. విషయాన్ని చర్చించే వ్యాఖ్యలు టపాను శక్తిమంతం చేస్తాయి. చర్చించాలంటే అందులో విషయం ఉండాలికదా అంటారేమో! ఒక్కోసారి వ్యాఖ్యల్లోనే విషయం పుడుతుంది - ఆ బ్లాగు ఒక చర్చావేదికగా మారుతుంది. బహుశా అందుకే అసలైన 'చర్చావేదికలు' (గుంపులు) పలుచన ఔతున్నాయి. కాకపోతే, పాల్గొనాల్సినవాళ్లంతా పాల్గొనే అవకాశం 'గుంపు'ల్లో కుదిరినట్లు బ్లాగుల్లో కుదరకపోవచ్చు. వర్థమాన వ్యాఖ్యాతల్లో రాకేశ్వరుని వ్యాఖ్యలు అత్యంత ఆసక్తకరంగా వుంటాయి. విజ్ఞుల వ్యాఖ్యల్లో ఎంతో విషయం వుంటుంది. కొన్ని చిరాకు పుట్టిస్తాయి. ఐతే, ఎవరేవ్యాఖ్య చేసినా వినినంతనె వేగపడక 'వివరింప దగున్' - అనే సూత్రాన్ని పాటించే సాధన చేస్తున్నాను. కొన్నికొన్ని వ్యాఖ్యల దృష్ట్యా 'పరస్పరడబ్బాల చప్పుడు' వినబడనీయకుండా కూడా జాగ్రత్తపడాల్సి వస్తోంది. కొత్తపాళిగారన్నట్లుగానే ఈ టపాలో వ్యాఖ్యరాయడానికి నేను టపారాసినంత శ్రమపడాల్సివచ్చింది. జైహింద్! జై జన్మభూమి!! :)

    రిప్లయితొలగించండి
  10. వ్యాఖ్యలు బ్లాగుల ఆదరణకి ఒక ముఖ్య కారణం అనుకుంటా.

    కూడలిలో ముందు బ్లాగులే చూసినా, మళ్ళీ వ్యాఖ్యలు తెరిస్తే పొరపాటునో, తొందరపాటులోనో తప్పి పోయిన టపాలు కొన్ని కనిపిస్తుంటాయి.

    కొందరుబ్లాగరుల టపాలకు, కొందరి కొన్ని టపాలకు వ్యాఖ్యలు రాయడానికి చాలనని జంకుతుంటాను.

    కవిత్వం, సాహిత్యం, హాస్యం, సాంకేతికం, రాజకీయం మీద వ్యాఖ్యానించడం నాకు కష్టం.

    ఎంత బాగా నవ్వించారో చెప్పాలని ఉంటుంది. కాని అన్ని సార్లూ చెప్పలేను. కవిత్వం కూడా కొన్ని సార్లు సున్నితంగా తాకుతుంది. రాసిన వారిని మనసులోనే అభినందించుకుంటూ ఆనందించగలనే కాని వ్రాయడానికి మాటలలో పెట్టలేను.

    కొంతమంది సాధారణంగా ఎప్పుడూ బాగా రాస్తూ ఉంటారు. వారికీ డిటో.

    విషయం నన్ను ఆలోచింప చేసేదో, నాకు ఓరిచయమైనదో అయితే కాస్త సంభాషణలో పాలు పంచుకోగలను.

    moderation పెట్టుకున్నా, ఏ వ్యాఖ్యనూ తీయ బుద్ధి కాదు. తీరికగా స్పందించడం కోసమే. వ్యాఖ్యలను handle చెయ్యడానికి కూడా నేర్పూ, ఓర్పూ కావాలి!

    రిప్లయితొలగించండి
  11. అన్నా! చేతుల్ల బల్పాలు కట్టుకోని నారదున్లెక్క చిర్తలు కొట్టుకుంట అన్ని బ్లాగులు తిర్గుతుంటనె. ఏదొక వాక్య రాయబుద్దయితదె నాకు. నువ్వు రాసేవన్ని మంచిగ్గొడ్తయన్న.

    రిప్లయితొలగించండి
  12. rama గారికి:
    పేజీలో యూనీకోడ్ కంటెంటు ఎక్కువయిన కొద్దీ పేజీ నెమ్మదిగా లోడవడం నేను గమనించాను.
    నా బ్లాగులో సాధ్యమయినంత వరకూ చిత్రాలు అవీ తీసేసి సరి చేసాను.
    ఇక ఇంతకంటే కావట్లేదు మరి :(

    రిప్లయితొలగించండి
  13. వ్యాఖ్యల్లు వ్యాఖ్యల్లు అందురే గానీ.. అవి రాసేటి వీలసలు ఇవ్వరే మీరూ..
    అని మెత్తగా మొట్టగా అసలు కతేంటో చూడబోయాను. నాకేమీ అర్థం గాలేదు. ఎందుకైనా మంచిదని ఈ రెండు మార్పులూ చేసాను.. 1. వ్యాఖ్యాతల బొమ్మలు రాకుండా చేసాను. 2. వ్యాఖ్యల పేజీ వేరే విండోలో కాకుండా అదే విండోలో తెరుచుకునే ఏర్పాటు చేసాను. ఇదంతా అయ్యాకే రానారె గారు వ్యాఖ్య రాసారు. అంటే అవీ పనిచెయ్యలేదన్నమాట! మరి ఇబ్బందేంటో!? ప్రవీణ్ గారూ మీ పేజీ చూసాను, బానే లోడవుతూంది.

    యనానిమస్సన్నా! నెనరులు. మీరు ఈ మధ్య కొత్తపాళీలో రాసిన (మీరేననుకుంటున్నాను) వ్యాఖ్య చూసా.. "గవ్, కొత్తపాలన్నా" అని మొదలవుతుంది. మొదటి పదం 'గన్' అని అనుకుంది నా బుర్ర. "గన్ కొత్తపాలి" ఏందబ్బా అని ఆలోచించాను కాస్సేపు. ఆ తరవాత సమజైంది. వ,న దగ్గరగా ఉంటాయి గదా.. అదీ ఇబ్బంది! కాసేపు నవ్వుకున్నాను. అవునూ, మీరు అజ్ఞాతంగా రాయడమెందుకు?

    నవీన్, మీ గురించి ఒక వ్యాఖ్య చదివినట్టు గుర్తు చాన్నాళ్ళ కిందట.. మీరు భలే చురుగ్గా రాస్తారని, తక్కువ మాటలతో పెద్ద భావాలనే పలికిస్తారనీ అర్థం వచ్చేలా ఒకరెవరో మెచ్చుకున్నారు మిమ్మల్ని. (ఎక్కడో, ఎప్పుడో గుర్తులేదు.) అది నిజమే సుమా!:)

    అందరికీ నమస్సులతో

    రిప్లయితొలగించండి
  14. అన్నీ చదివేటప్పటికే కడుపు నిండిపోతుంది... చాలా చోట్ల వ్యాఖ్య రాసే తీరిక లేకపోడమే నా సమస్య.. కానీ ఆ విషయంలో రానారె గారన్నట్లు ఆ తరహా ఆక్సిజన్‌ని అందించడానికే బహుధా ప్రయత్నిస్తూంటాను. నాకు మటుకు మీ టపాలో అనే కాదు ఎక్కడైనా - కళాసృష్టి కంటే కళాస్వాదనే గొప్పది - అన్న కొ.కు. మాటే రింగుమంటూంటుంది...

    రిప్లయితొలగించండి
  15. ఎప్పటిలగే నేను అలస్యము, మీ వ్యాఖ్యల పాకం చాలా బాగుంది. మీ టపాలో, పాపం కలియుగపాండవులు అయిన అజ్ఞానతవాసులను(Anonymous) మరిచినట్లు ఉన్నరే...

    -మరమరాలు

    రిప్లయితొలగించండి
  16. మూర్ఖునికి/అజ్ఞానికి మౌనమే భూషణమని ఎప్పుడో కన్ఫ్యూషియస్సు, భర్తృహరి చెప్పారు. అందుకే నేను చాలా సార్లు విజ్ఞులు చర్చిస్తూ ఉంటే మధ్యలో నా వెధవ వ్యాఖ్య రాయకుండా సావధానంగా మళ్ళీ మళ్ళీ ఆ టపాకు వెళ్ళీ, చదివి అంతో ఇంతో నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  17. ౧) వాహ్ చదువరి గారూ, చాలా బాగా వ్రాసారు. మీ తెలుగు చాలా బాగుంటుంది (భోళాశంకర వ్యాఖ్య)
    ౨) మీరు వ్యాఖ్యాతలను నాలుగు వర్గాలుగా విడదీశారు, నేను అందులో ఏ కోవకి చెందుతానో నాకు తెలియకున్నది. దానికి కారణం, టపా బట్టి వ్యఖ్యవుంటుంది అని నా నమ్మకం.
    ఉదా - తోటరాముల టపాలో భోళాశంకర వ్యాఖ్య తప్ప ఇంకేం వ్రాయలేము, కోపా గారి టపాలకి విశ్లేషక భోళాశంకర వ్యాఖ్యలు, రానారె వాటిలో శ్లేషక, మీ వంటి వారి రాజకీయ బ్లాగులలో నిరక్షర వ్యాఖ్యలు వగైరా.. వగైరా .. వ్రాయగలము (విశ్లేషక వ్యాఖ్య)
    ౩) మీ టపా లాగా ఇక్కడ వ్రాసిన వ్యాఖ్యలు చాలా బాగున్నాయి (శ్లేషక వ్యాఖ్య)
    ౪) మీరు ముందు ముందు ఇలాంటి మంచి టపాలు వెయ్యగలరు (దిశా నిర్దేశ వ్యాఖ్య)
    ౫) (మిగిలిన వాళ్ళ వ్యాఖ్య)

    :D

    రిప్లయితొలగించండి
  18. వ్యాఖ్యల డబ్బా తొందరగా లోడ్ అవ్వడానికి
    pop up వాడితే మేలేమో.
    అలానే వర్డ్ వేరిఫికేషన్ అచేతనం చెయ్యవచ్చు.

    రిప్లయితొలగించండి
  19. బాగా విశ్లేషించారు చదువరిగారు. నేను ముందు బ్లాగులన్నీ చూస్తూ వెళ్ళేసరికి నా బ్లాగులు రాసే సమయం చిక్కేది కాదు. రోజు కూడలి చూడకుండా కుదరదు. కాని వ్యాఖ్యల ద్వారా బ్లాగులకెళ్ళడం వల్ల చాలా హాయిగా ఉంది ఇప్పుడు. షార్ట్‌కట్. మంచి బ్లాగు పోస్టులు మిస్సయ్యామనే బాధ ఉండదు. నాకు అర్ధం కాని పోస్టులలో వ్యాఖ్య రాయను. టపాకి తగ్గట్టు వ్యాఖ్యను రాయలేననుకుంటే కూడా రాయను. చదివి వెళ్ళిపోతాను. ఎప్పుడన్నా బోర్ కొట్టి, రాసే మూడ్ లేకుంటే నా బ్లాగులోని పాత వ్యాఖ్యలన్నీ మళ్ళీ చదువుకుని గత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాను. కాని మంచిపోస్టు రాసాను అనుకున్నపుడు మాత్రం వ్యాఖ్యలకోసం ఎదురుచూస్తాను. ఎవరన్నా రాయకుంటే ఎందుకు రాయలేదని అడిగి మరీ రాయమంటాను. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అలవాటైపోయింది మరి.వ్యాఖ్యలలో మాత్రం వాసి ఎక్కువగా ఉంది. టపా వాసి బాగుంటేనే కదా వ్యాఖ్యలు ఎక్కువ వచ్చేది.

    రిప్లయితొలగించండి
  20. :D అంటే నోరంతా వెళ్ళబెట్టి నవ్వారని
    ;-) అనగా చెతురాడుతున్నారని.
    పొపన అంటే పొట్ట పగిలేట్టు నవ్వుతున్నారని..:-D

    రిప్లయితొలగించండి
  21. ఇటువంటి వ్యాఖ్యలు వర్గీకరించారలేదే http://andam.blogspot.com/2007/10/blog-post_13.html#c4113826798613688150

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు