25, అక్టోబర్ 2007, గురువారం

శభాష్, శ్రీరమణా!

అక్టోబరు 25 న ఈనాడు పేపర్లో హైదరాబాదు విభాగంలో వచ్చిందీ వార్త! కూకట్పల్లి హౌసింగు బోర్డులో పద్దెనిమిదేళ్ళుగా ప్రజల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక పిచ్చివాడు, ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతూ, పనిలో పనిగా దసరా, దీపావళి పండగల శుభాకాంక్షలు కూడా చెబుతూ కాలనీ అంతటా బ్యానర్లు పెట్టాడంట.

నిజానికి ఈ బ్యానర్లు పెట్టింది పి.వి.శ్రీరమణ అనే వ్యక్తి.

***

రోడ్లమీదా, కాలనీల్లోనూ అలా శుభాకాంక్షలు చెప్పే బ్యానర్లు కొల్లలుగా చూస్తూంటాం. పెద్దకారు రాజకీయులకు చిన్నకారు వాళ్ళూ, చిన్నకారు సన్నకారు వాళ్ళకు వాళ్ళ చెంచాగాళ్ళూ పెడుతూ ఉంటారు ఇలాంటి బ్యానర్లు. ఫలానావాడి పుట్టినరోజు వచ్చిందనుకోండి.. "వారికి శుభాకాంక్షలు" చెబుతూ పెడతారు. ఆ ఫలానావాడు బ్యానరులో ఒక పక్కన నుంచోనుంటాడు. రెండో పక్కన బ్యానరు కోసం అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టినవాడు నుంచోనుంటాడు. ఇహ కింద, వాళ్ళ కాళ్ళదగ్గర, ఓ ఏడెనిమిది మంది సత్రకాయల ఫొటోలుంటాయి. ఏ బ్యానరైనా కొద్దిగా అటూ ఇటూగా ఇదే మూస! సందర్భాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఫలానావాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాడనో, ఫలానా "అన్న" ముష్టి పార్టీ గల్లీ కమిటీ మెంబరైన సందర్భంగానో, మరోటో మరోటో! ఇహ పండగలప్పుడూ ఈ బాపతు జనాల హడావుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు.

***

పాపం శ్రీరమణ చిర్రెత్తిపోయినట్టున్నాడు ఈ బ్యానరాసురుల గోలతో; ఆ పిచ్చివాడి పేరు మీద బ్యానర్లు తయారు చేసి కాలనీలో అంటించాడు. ఈ బ్యానరాసురుల్ని వెక్కిరించడానికే పెట్టినట్టు వాళ్ళకు వెంటనే అర్థం కాదేమోననే సంకోచంతో ఈ మాట కూడా చెప్పాడట.. "నేను ఎవర్నీ నొప్పించే ఉద్దేశ్యంతో పెట్టలేదు. నాయకులు ప్రజలకి ఇబ్బందులు కలిగించకూడదనే సందేశమిస్తూ ఇలా పెట్టాను".

ఈ రాజకీయ సత్రకాయలకు సంగతి అర్థమవుద్దంటారా అని!!


మీ నిరసనను తెలియజేసినందుకు శభాష్ శ్రీరమణా!

3 కామెంట్‌లు:

  1. "దున్నపోతుమీద వానకురిసినట్టు" అనే సామెత చందంగా ఇలాంటివి ఎన్ని చేస్తే మాత్రం ఏ ఉపయోగం రాక్షసీయనాయకుల వీరంగాలముందు.

    రిప్లయితొలగించండి
  2. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటూ కోర్టుకెళ్లి ఊసురోమనే బదులు ఏదో మానవ ప్రయత్నం చేశాడు. చూద్దాం ఏమౌతుందో. ఎవడైనా తంతాడని తెలిసినా వినే పరిస్థితి కాదు కదా ఈ బ్యానరుచెంచాలది!

    రిప్లయితొలగించండి
  3. ramana gaaru...banners unnantha kaalam mee peru gurthundi potundi KPHB COLONY vaasula gundello....even ETV-2 news lo kooda choopinchaaru....but prajaswamyam lo prajalu mattu lo unnantha kaalam ee banners ki addu-adupu undadu..namaskaaram

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు