5, సెప్టెంబర్ 2006, మంగళవారం

లోక్‌సత్తా పార్టీ అవసరమా?

అవసరమే!

లోక్ సత్తా పార్టీ ఏర్పడబోతోంది. పార్టీ పెట్టే విషయంపై రకరకాల అభిప్రాయాలు వినవచ్చాయి. నాకూ నా అభిప్రాయం రాయాలనిపించింది. ఓటేసే ప్రతీ ఒక్కరికీ ఈ విషయంపై అభిప్రాయం ఉండి తీరుతుందని నా ఉద్దేశ్యం.

లోక్ సత్తాకు వ్యతిరేకంగా వినవచ్చిన అభిప్రాయాలు : (నీలాలు నా వ్యాఖ్యలు)
  1. సంఘ సేవ అంటూ మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగడం ఏంటి? పైకి కబుర్లు చెబుతున్నారు గానీ, వీళ్ళు పైనుంచి దిగివచ్చిన వారేం కాదు. నిజమే సంఘసేవ అంటూ మొదలెట్టారు. కాని వాళ్ళ కార్యక్షేత్రం మాత్రం మొదట్నుండీ రాజకీయాలే గదా! అయినా.. సంఘసేవ చేస్తామని మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగితే తప్పేంటి?
  2. జయప్రకాశ్ నారాయణా, ఆయన చుట్టూ ఉన్నవారు అంతా ఒక కులానికే చెందిన వారు. ఇది ఒక కుల పిచ్చి పార్టీ కాబోతోంది. జయప్రకాశ్ నారాయణ చుట్టూ ఉన్నవారు ఆయన కులస్తులే అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆ పార్టీ నడవడికను గమనించేందుకు, వారి విధానాలను పరిశీలించేందుకు ఆపై నిర్ణయం చేసుకునేందుకు మనకింకా దాదాపు మూడేళ్ళు సమయముంది. చూద్దాం ఎలా ఉండబోతున్నారో! ఇప్పుడే వద్దనడమెందుకు?
  3. డబ్బు లేని రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, నేర మరకలు లేని రాజకీయాలు అంటూ ఉపదేశాలు చెప్పిన వాళ్ళు వీళ్ళు. నిజంగా అలాగే రాజకీయాలు నడపబోయినపుడు, వీళ్ళకు తెలిసి వస్తుంది, అవి లేకుండా రాజకీయాలు నడపడం ఈ రోజుల్లో కుదరదని. నిజమే, కష్టమే! కానీ నడుపుతానంటున్నాడు గదా, ఎలా చేస్తాడో చూద్దాం. చేస్తే అంతకంటే కావలసిందేముంది? చెయ్యలేకపోతే మనకు పోయేదేమీ లేదు కదా!
  4. రామారావు లాంటి సమ్మోహకుడు ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ జయప్రదం అయింది. అంతటి ప్రజానాయకుడు లోక్ సత్తాకు లేరు కాబట్టి అది విఫలమౌతుంది. అది లోటే! కానీ అంతమాత్రాన రాజకీయాలకు పనికిరారని కాదు గదా!
  5. ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకు సామాన్యుల బాధలు తెలవ్వు ఇలాంటి వ్యాఖ్య ఒకే ఒక్కరు చెయ్యగా విన్నాను. ఆయన పీసీసీ అధ్యక్షుడు. మరెవరూ ఇటువంటి విమర్శ చెయ్యగా నేను వినలేదు. (అందుకే ఆయన కేశవరావు అయ్యారు.) దీని గురించి మాట్లాడ వలసిన అవసరం లేదు. ఇదొక పసలేని వాదన.
  6. స్వయంగా తనే రాజకీయాల్లోకి దిగి, జయప్రకాశ్ నారాయణ తన విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నాడు. "రాజకీయాలనేవి మంచివారు ఉండదగినవి కావు, అదో మురుగ్గుంట, పందులకు మాత్రమే అనుకూలం" అనే భావనతో మనమున్నాం. అంచేతే ఈ విశ్వసనీయత విషయం తలెత్తింది.
నా ఉద్దేశ్యంలో అన్నిటి కంటే ముఖ్యమైన అంశం ఒకటుంది..
ప్రస్తుతం మనకు రెండే శక్తులున్నాయి.. అయితే కాంగ్రెసు, లేదంటే తెలుగుదేశం. విధానాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి అవలక్షణాల్లొ ఈ రెంటికీ పెద్ద తేడా లేదు. ఇక కాస్తో కూస్తో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు బలమైన శక్తి కాదు. ఈ పరిస్థితుల్లో మనకు ఒక మూడో శక్తి కావాలి. మూడో పార్టీ కాదు, ఒక శక్తి కావాలి. ఓటేసేందుకు మనకు మరో వికల్పం కావాలి.

నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని ఒకపక్షమంటే, ఏఁ, నువ్వు చెయ్యలేదా అని రెండోది అంటున్న రోజులివి. కాదు అని ఖండించాల్సిన అవసరం కూడా వాళ్ళకు కనిపించడం లేదు. అంతలా బరితెగించి పోయారు. వీళ్ళకు ప్రజలంటే లెఖ్ఖేలేదు. 'ఈ ఐదేళ్ళ తరువాత మనమెలాగూ ఉండము, ఆపై ఐదేళ్ళ తరువాత ఎలాగూ తిరిగి వస్తాము' అనే ధీమా అధికార పక్షానిది కాగా, ఈ ఐదేళ్ళ తరువాత మనదే రాజ్యం అనేది ప్రతిపక్షం ధీమా! మూడో శక్తి ఉంటే ఆ ధీమా ఉండదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

లోక్‌సత్తా చెబుతున్న సిద్ధాంతాలను ఆచరణలో పెడితే అది మూడో శక్తి కాగలదనే నా నమ్మకం. అప్పుడు మన రాజకీయాలు మంచికి మళ్ళుతాయి. చూద్దాం, లోక్‌సత్తా మూడో శక్తిగా ఏర్పడుతుందేమో!

6 కామెంట్‌లు:

  1. చదువరి గారు! లొక్ సత్తా మీద న ఆలోచనలని అద్దం లో చూసినట్లుగా ఉంది.
    నిజమే! లొక్ సత్తా అధికారం లోకి వచ్చి ఇప్పుడు చెబుతున్నది చేసి చూపగలిగితే,చాల బాగుంటుంది...చూపలేకపోతె మరో అయిదేళ్ళు మనకి పేద్ద తెడా ఎమీ ఉండదు!!!

    రిప్లయితొలగించండి
  2. గతంలో మేధావి ఎం.ఎన్.రాయ్ ఇలాగే రాజకీయ పార్టి స్థాపించి కొంతకాలం నడిపి ఎన్నికల్లో ఓడిపొయాక, పార్టి రద్దు చేసారు. ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని ఆదర్శాలు వదులుకోవాలి. స్థాయికి తక్కువైన పనులు చెయ్యాలి.ఇట్లా ఉండటం జయప్రకాష్ నారాయణ్‌కు సాధ్య మౌతుందా? లేక చరిత్ర పునరావ్రుత మౌతుందా?

    ఒక మంచి పనికి చెయూత నివ్వాలనే తపన వ్యక్తమౌతుంది ఈ వ్యాసంలో. మీ జాబుని బయొసింఫనిలో ప్రచురిస్తున్నా.

    cbrao

    http://groups.yahoo.com/group/biosymphony/
    http://deeptidhaara.blogspot.com/
    http://paradarsi.wordpress.com/

    రిప్లయితొలగించండి
  3. జయప్రకాశ్ గారికి చెప్పినవి చెయ్యగలిగే శక్తినివ్వాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా. ప్రార్ధించడము ఆఖరి ప్రయత్నముగా కాదు..ఆరంభ యత్నముగా..మీరూ ప్రార్ధించండి.

    రిప్లయితొలగించండి
  4. ప్రజాస్వామ్యంలో గెలవాలంటే గుంపు ముఖ్యమైపోయింది. గుంపులోని అందరి నిబద్దత ఒకేస్థాయిలో ఉండదు. ఆ తేడావలననే దాన్ని గుంపు అనవలసి వస్తుంది.

    ప్రజాస్వామికంగా పటిష్టమైన విధంగా పార్టీని నిర్మించొచ్చు. కానీ ప్రజలు దానిని అర్ధం చేసుకొనే స్థాయిలో లేరు. జయప్రకాష్ నారాయణ గారి వలన తెలుగునేలలో ప్రజస్వామిక స్ఫూర్తి కొద్దికొద్దిగా పెరుగుతుంది.

    వారు పార్టీని పెట్టకపోయినప్పటికీ ఈ ప్రభావం తగ్గేది కాదు. పార్టీ విజయం సాధిస్తే మంచిదే. సాధించకపోతే వారు ప్రజలకు అందిస్తున్న ఈ స్పూర్తి తగ్గిపోతుందేమోనని నాబాధ.

    పార్టీ లేనప్పుడు వారిని ఓపెన్ మనిషిగా గుర్తిస్తారు. పార్టీ వచ్చాక అన్నిరకాల బయాస్ లని అంటగడతారు.

    పార్టీ పెట్టకుండా ప్రజస్వామిక విలువలకొరకు పోరాడే సంస్థగా లోక్ సత్తా ఇంకా స్పూర్తిమంతంగా పనిచేయగలిగి ఉండేదని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు