3, ఆగస్టు 2006, గురువారం

ఏమిటీ ధోరణి!

ప్రత్రిపక్షాల పట్ల కక్ష, అలక్ష్యం చూపించే పాలకులను చూసాం.
పత్రికల్లో వచ్చిన వార్తలను అడ్డగోలుగా ఖండించే వాళ్ళను చూసాం.
శ్రీరంగనీతులు చెబుతూ, తామనుకున్నది చేసుకుపోయే ప్రబుద్ధులనూ చూసాం.
ప్రజలను నిలువునా మోసం చేసిన దగాకోరులనూ చూసాం.

కానీ..

నువ్వెంత అంటూ ప్రతిపక్షాలను, పత్రికలను,ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థలను, కోర్టులను కూడా తేలిక చేసి బహిరంగంగా మాట్లాడిన ఘనత మాత్రం ఈ కాంగ్రెసు ప్రభుత్వానిదే! ప్రజలను ఎగతాళి చేసేందుకు కూడా వెనకాడని మంత్రులున్నారు మనకు. మందుకు డబ్బులు తగలేసే బదులు కెపాసిటరు కొనుక్కోండన్న మంత్రి ఒకరు.

వీళ్ళు లంచాలు మేస్తున్నారోయ్ అంటూ ప్రతిపక్షం అరిస్తే ఏం మీరు తినలేదా అని అడిగే దొరలు వీరు.

వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపితే ఎవర్నీ వదలరు. ప్రతిపక్షాలు, పత్రికలు, ఎన్నికల కమిషను ఇలాగ, చివరికి కోర్టులను కూడా.

 • "ఆ రెండు పత్రికలనూ మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి."; "అసలా పత్రికను నేను చదవను." అని ఏకంగా ముఖ్యమంత్రే అన్నారు. పత్రికలపై దాడిలో ముఖ్యమంత్రే స్వయంగా దారి చూపించారు కదా, ఆ దారినే వెళ్తున్నారు మంత్రులూను.
 • వ్యతిరేక వార్తలు రాస్తోందని ఈనాడు పత్రికను, దాని అధిపతిని బండబూతులు తిట్టిన మంత్రి - జక్కంపూడి రామ్మోహనరావు గారు - మనకున్నారు.
 • దివాకరరెడ్డి గారు విలేకరులను తిడితే వాళ్ళు ఆయనపై ఫిర్యాదు చేసేదాకా వెళ్ళారు.
 • ఎన్నికల కమిషను విశాఖ ఉప ఎన్నికను రద్దు చేస్తే, కాంగ్రెసు పార్టీ రాష్ట్రాధ్యక్షుడే స్వయంగా ఇలా అన్నారు.. "ఇది వాళ్ళ జాగీరా ఏంటి ఏకపక్షంగా రద్దు చేసెయ్యడానికి"? ఈ ఎన్నికలోనే కాంగ్రెసు ఎమ్మెల్యే గండి బాబ్జీ తుపాకితో జనాలను బెదిరిస్తే, అతనిపై కేసు పెట్టినపుడు, పోలీసులను తప్పించుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఆ తరువాత ఆ కేసు గతి ఏమైందో తెలీదు.
 • స్థానిక ఎన్నికలపై కోర్టు ఇచ్చిన తీర్పు పైనా, అదే కేసులో పై కోర్టు చేసిన వ్యాఖ్యలపైనా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వీరి అసహనాన్ని సూచిస్తాయి. కోర్టు వ్యాఖ్యలు ఎన్నికల్లో మాకు చెడు చేసేవి గానూ, ప్రతిపక్షానికి మేలు చేసేవిగాను ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి.
 • గన్యా జ్వరంపై ప్రభుత్వ నిర్లిప్తత, స్పందన వీరి నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. "గన్యా పట్ల ప్రజలకు అవగహన లేదు" అని ఆరోగ్య మంత్రి రోశయ్య గారు అన్నారు. వారికి అవగాహన కలిగించడం మీ పనే కదా, మరి మీరేం చేస్తున్నట్లు?! మీ నిర్వాకాన్ని విమర్శిస్తున్న పత్రికలూ, పతిపక్షాలను ఎదుర్కొనేందుకు కత్తులు నూరుతున్నారా? విమర్శకు ప్రతివిమర్శ జవాబు కాదండీ, విమర్శలో సద్విమర్శను స్వీకరించి తప్పులు దిద్దుకోవాలి, అదీ పెద్దల లక్షణం. పోనీ పత్రికలది తప్పు - మీపై కక్ష గట్టారు. తెలుగుదేశానిది తప్పు - మి మంచిపనుల్ని (!) విమర్శించడమే దాని లక్ష్యం. మరి, నల్లకుంట లోని ఆ అమ్మ మిమ్మల్ని అడిగేసి, కడిగేసింది కదా, ఆమెకూ మీమీద కక్షేనా? (ఆరోగ్య మంత్రి రోశయ్య నల్లకుంట వెళ్ళినపుడు.. గన్యాతో మేమంతా చస్తుంటే, అధికారులు మా గోడు పట్టించుకోకుంటే, ఎందుకొచ్చావు ఇక్కడికి అంటూ తిరగబడింది ఒకామె) అది కక్షో ఆగ్రహమో గమనించండి. ప్రజాగ్రహాన్ని గ్రహించలేకే గత పాలకులు గత పాలకులయ్యారు.

  రోశయ్య గారి పర్యటనలో కొసమెరుపు: ఆ అమ్మకు జవాబివ్వలేక వెళ్ళిపోతూ అక్కడి యువకులతో మీరే వీళ్ళను చైతన్యవంతులను చెయ్యాలని సెలవిచ్చారట. (చంద్రబాబు గారు కూడా ఇలాగే అనేవారు.. మీరు మైండ్‌సెట్ మార్చుకోవాలని)
 • ఎన్నికలైన మరునాడే దేశం ప్రతినిధులను పార్టీ మార్పించి, అడ్డగోలుగా కాంగ్రెసును అనంతపురం జడ్పీ పీఠమెక్కించిన నాయకులు ఇలా అన్నారు.. "మా నాయకత్వంలోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని నమ్మి వాళ్ళు మావైపుకు చేరిపోయారు. వాళ్ళా మాట చెబుతుంటే నాకెంతో సంతోషం వేసింది" అని రఘువీరారెడ్డి గారు అన్నారు. "తాడిచెట్టెక్కింది దూడ గడ్డి కోసమని" అన్నట్టుంది, ఆ మారిన వాళ్ళు మార్చిన వాళ్ళూ చెప్పేది.
 • 60 వేల పైచిలుకు ఉద్యోగాలను పీకేసే జీవోను తెచ్చి, ప్రజలు, ప్రతిపక్షాలు, పత్రికలు గోల చేసేటప్పటికి ప్రభుత్వం మాట మార్చింది. మార్చి, వాళ్ళు ఏమన్నారు?
  "అది ఉత్తుత్తి జీవోయే! ఊరికినే జనాన్ని బెదిరిద్దామని విడుదల చేసాం అంతే!"
  "విడుదల చేసిన ప్రతి జీవోనీ అమలు చేస్తారా ఏంటీ? " ఇవి ఆర్థిక మంత్రి రోశయ్య గారి వాక్కులు. ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి!?

  ఇక ముఖ్యమంత్రి గారు.. మాటంటే తప్పేవాణ్ణి కానంటూ ఒక బహిరంగా ఉత్తరమే రాసేసారు. అది మీకూ తెలుసుకదా అని కూడా అన్నారు.
 • ఇక రాజకీయులు అధికారులను "యూస్‌లెస్ ఫెలో" అని తిట్టిన వార్తలు కనీసం మూడు చూసాను ఈమధ్య కాలంలో.
 • రాజకీయులకు, అధికారులకు మధ్య విభజన రేఖ మసకబారి పోయిన రోజులివి.
  ఎన్నికల్లో జరిగిన హింస గురించి మాట్లాడుతూ డీజీపీ ఇలా అన్నాడు.. "2001 ఎన్నికలలో కంటే తక్కువే జరిగింది." (డీజీపీ గొంతులో రాజకీయ ధ్వని!) పత్రికలలో వచ్చిన ఓ వార్తను లేదా ఓ వ్యాఖ్యను ఖండించడం వేరు.. "గాలిపటాలెగరేస్తుం"దంటూ ఓ పత్రికనే తూర్పార బట్టేసాడు. వారి శ్రీమతి గారి పిల్లల అమ్మకాల కేసు విషయమై అప్పటి అధికారులపై ఇప్పుడు ఆయన చేపట్టిన కక్ష సాధింపు మనకు తెలిసిందే! ఈ మధ్య కాలంలో కోర్టు చేత ఇన్ని సార్లు వాతలు పెట్టించుకున్న అధికారి మరొకరు లేరేమో. అది డీజీపీ గారి మరో ఘనత

  ప్రస్తుత విషయానికి సంబంధించినది కాకున్నా రాస్తున్నాను. ఈ డీజీపీ మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఉంది. అదేమిటంటే.. ఈ మనిషి తెలుగులో మాట్లాడగా నేను చూడలేదు. తెలుగు రాకా? తెలుగంటే లెక్కలేకా? తెలుగువాళ్ళంటే లెక్కలేకా? మన రాష్ట్రంలో ఇన్నేళ్ళు పని చేసిన తరువాత కూడా తెలుగు మాట్లాడడం లేదంటే.. ఆయన ఎటువంటి మనిషో చూచాయగా తెలుస్తూంది. (ఇదివరకటి డీజీపీ సుకుమార్ గారు కన్నడిగుడైనా చక్కటి తెలుగు మాట్లాడేవారు. ఈయన సంగతి ఇది.) "ఏమయ్యా తెలుగు వారి రాష్ట్రంలో ఇన్నేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు తెలుగు మాట్లాడకపోతే ఎట్లా" అని అడగలేరా!?

  (అడగలేరు. ఈ మనిషికి మేడం దన్నుందట మరి!)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు