చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో!
తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల ప్రశ్నలు కూడా చాలావరకు అనుకున్నవే వచ్చాయి. వాటికి కూడా తయారై వచ్చాడు. మొదట్లో కొద్దిగా నెర్వస్‌గా కనబడ్డాడు గానీ, తరవాత బానే నడిపించాడు. అన్నీ తనకనుకూలమైన ప్రశ్నలు, తాననుకున్న ప్రశ్నలే. ఉదాహరణకు
'రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు?' అని ఎవరో అడిగితే, దానికి 'నాకు రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయో తెలీదు. సమయానికి రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని మాత్రం తెలుసు. అలాగే...' అంటూ చక్కగా చెప్పాడు.
ఎక్కడో ఒకచోట ఒక ప్రశ్న ఎదురైంది. అది విని కాస్త కోపగించుకున్నట్టు కనబడింది. ఎటొచ్చీ సమావేశమంతా గందరగోళంగా ఉండడంతో ఆ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు వినబడలేదు. చిరంజీవే సమాధానం చెప్పేముందు ఫలానా వాళ్ళు ఫలానా ప్రశ్న అడిగారు, దానికి నా సమాధానం ఇది అంటూ చెప్పాడు.
డబ్బులెక్కడినుండి వస్తాయి, రాజకీయాలల్లో మీకు స్ఫూర్తి ఎవరు, లాంటి కొన్ని ప్రశ్నలకు "ప్రజలే" అంటూ సమాధానం చెప్పాడు. ఇలాటి గ్యాలరీ సమాధానాలు చాలానే ఉన్నాయి. బంధువులు రాజకీయాల్లోకి రావచ్చా అనే ప్రశ్నకు 'సత్తా, ఆసక్తి, శక్తి ఉంటే రావచ్చు, అర్హత ఉంటే పదవులూ అలంకరించవచ్చు' అని అన్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ ప్రశ్న, సమాధానం అనిపించింది.
ప్రజాసమస్యలపై తన అవగాహన గురించి ప్రశ్న వచ్చింది. దానికి, 'సమస్యల గురించి చెప్పేందుకు మీరున్నారు గదా' అని అన్నాడు. చాలా హాస్యాస్పదమైన సమాధానం అది. సమస్యలపైన అవగాహన లేకుండా రాజకీయాల్లోకి దిగుతున్నాడా ఏంటి అనిపిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనేది విలేకరులు చెబితేనే తెలుసుకుంటాడా!!ఇక, ఒకటి రెండు రొడ్డకొట్టుడు సమాధానాలు..
తెలంగాణ వంటి వివిధ సమస్యలపై మీ విధానాలు ఏమిటి అని అడిగినపుడు, అందరితోటీ చర్చింది, తగు సమయంలో, అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, ఇలాంటి సున్నిత సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకుపోయాడు. ప్రస్తుతానికైతే 'విధానం లేకపోవడమే ఆయన విధానం' లాగా అనిపించింది.
అవినీతి రహితమైన పార్టీ అంటున్నారు కదా.. ఇతర పార్టీల నుండి అవినీతి చరితులను ఎందుకు రానిస్తున్నారు అనే ప్రశ్నకు, 'తమ తమ పార్టీల్లో తామనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదని భావించినపుడు, మా విధానాలు నచ్చితే మావద్దకు రావచ్చు' అని అన్నాడు. 'ఇతర పార్టీల్లో కూడా నీతిమంతులు ఉటారు గదా' అనీ అన్నాడు.
అందరితోటీ మంచిగా ఉంటాను అంటూ తను ఎప్పుడూ చెప్పుకుంటూండే ధోరణిలోనే ఇప్పుడూ మాట్టాడాడు. విలేకరులతో స్నేహం చేసుకునే ధోరణిలో వ్యవహరించాడు. మాటలూ అలాగే చెప్పాడు, శరీర భావాలూ అలాగే ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ప్రత్యర్థులెవరు అని అడిగితే నాకు శత్రువులు, ప్రత్యర్థులు లేరు. నాకు శత్రువులల్లా సమస్యలే, పేదరికమే అంటూ చెప్పాడు. గ్యాలరీ సమాధానాల్లో ఇదొకటి.
మొత్తం మీద ఈ సమావేశం ద్వారా చిరంజీవి అసలు విషయం గురించి చెప్పింది తక్కువ, చెప్పనిది ఎక్కువ అనిపించింది. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ఒక్క మాట మాత్రం చెప్పాడు.
రాజకీయాల్లోకి కొత్తదనం ఏదైనా తేదలచుకున్నాడో లేదో గానీ, సమావేశ ప్రసంగంలోగానీ, విలేకరుల ప్రశ్నలకిచ్చిన సమాధానాల్లోగానీ కొత్తదనమేమీ లేదు.