ఈ బ్లాగు గురించి

తెలుగులో నా గోడు అంటూ 2005 నవంబరులో మొదలైందీ బ్లాగు. చదువరి అనే తెరపేరు తగిలించుకుని రాయడం మొదలెట్టాను. తరవాత ఆ పేరుని బ్లాగుకీ తగిలించేసాను.

2005 డిసెంబరులో నా బ్లాగు రూపం

టపాలు: రాజకీయాలు, సామాజికాంశాలు ప్రధాన వస్తువులు. సినిమా, భాష, బ్లాగులు, సాంకేతికాంశాలపై కూడా టపాలు వస్తూంటాయి.

వ్యాఖ్యలు: మొదట్లో అనామకులు కూడా వ్యాఖ్య రాసే సౌకర్యం ఉండేది. కానీ తరవాత ఆ సౌకర్యం తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పెట్టాను. వ్యాఖ్యల్లో చర్చ జరిగితే పాల్గొంటాను. విడివిడిగా ప్రతీ వ్యాఖ్యకూ సమాధానం రాయనప్పటికీ, అన్ని వ్యాఖ్యలకూ కలిపి సమాధానం ఇస్తూంటాను.

రూపం, ఆమరిక: బ్లాగును ఒకే రూపంలో పదేపదే చూట్టం బోరు కొట్టేది. గతంలో తరచూ మార్చేవాణ్ణి. మార్చడం సరదాగా ఉండేది. కానీ ఇప్పుడా ఆసక్తి అంతగా లేదు. బ్లాగు సాంకేతికాల మీద అధ్యయనం చేస్తూ, ప్రయోగాలు చేస్తూ ఉన్నాను ప్రస్తుతం. అవన్నీ ఈ బ్లాగులోనే ప్రయోగిస్తూంటాను.

బ్లాగులోని పాత టపాలను తేలిగ్గా చూడగలిగే సౌకర్యం ఉండాలి అనే సంగతిని దృష్టిలో పెట్టుకుంటాను. అలాంటి సౌకర్యాలు ఈ బ్లాగులో బానే ఉన్నాయి. "పాత టపాలు" ఇందులో ప్రధానమైనది. "ట్యాగుసాంద్రత", "నా బ్లాగులో వెతకండి", టపాకు కింద ఉండే "రిలేటెడ్ పోస్ట్స్", "పేజీలు" ఇతర సాధానాలు. "నా బ్లాగుజాబితా" లో నాకు నచ్చిన ఇతరబ్లాగుల జాబితా ఉంటుంది. అయితే నాకు నచ్చిన బ్లాగుల మొత్తం సంఖ్యలో ఈ జాబితా ఒక చిన్న భాగం, అంతే. ఈ జాబితాను విస్తరించాల్సి ఉంది.

బ్లాగాశయం: ఆశలూ ఆశయాలూ ఏమీ లేవు. రాయాలన్న మోజు, నాకు తెలిసింది చెప్పుకోవాలన్న కుతీ ఈ బ్లాగుకు కారణం, అంతే! ఆ కుతి తీరేదాకా ఈ బ్లాగు నడుస్తూనే ఉంటది. అయితే అనేకానేక అంశాలపై టపాలు రాయాలని ఉంది.. ముఖ్యంగా చరిత్ర, సినిమా, పుస్తకాలు, భాష, వగైరాలు. కాస్తో కూస్తో రాసినా, రాయదలచినంత రాయలేదు.

మరింత మెరుగ్గా కాకపోయినా, మరింత చురుగ్గా రాయాలని అనుకుంటూంటాను. టపా ప్రచురించిన ప్రతీసారీ ఇకనుండి వారానికి రెండో మూడో టపాలు రాయాల్సిందే అని అనుకుంటూంటాను. ఒక్క నిదర తీసేసరికి ఆ సంగతి ఎనక్కి పోతుంది. ఇకనుంచన్నా తరచుగా రాయాలి. (మీకు వినబడీ వినబడకుండా మనసులో అనుకున్నానన్నమాట!) కాస్త నిడివి తక్కువ టపాలు రాయాలని కూడా అనుకుంటూంటాను. :)

శైలి, భాష: సాధారణంగా వచనమే ఉంటుంది. కాబట్టి చదవడం నల్లేరు మీద నడకలా కాకపోయినా, ఓమాదిరి సుఖంగానే సాగిపోతుంది. ఆమధ్య ఛందస్సు నేర్చుకుని పద్యాలు రాయడం మొదలెట్టడంతో, అక్కడక్కడా అవీ తగులుతూ అడ్డంపడుతూంటాయి. అయితే అవి చాలా తక్కువగా ఉంటాయి గాబట్టి, పర్లేదులెండి. నా బ్లాగులో పద్యాలు రాసి, నా చదువరులను ఇబ్బంది పెట్టడం ఎందుకని వాటినిక్కడ రాయను. ఇతర బ్లాగుల వ్యాఖ్యల్లో రాసి ఆ మోజు తీర్చుకుంటూంటాను, ఆ బాధలేవో వాళ్ళే పడతారని. :)

నా భాషకు ఈ బ్లాగో ప్రయోగశాల. ఎలా మాట్టాడతానో అలా రాయాలనేది ఆశయం. కానీ అలా రాయబోతే, భాష సరిగ్గా అలాగే పడదు. పుస్తకాల భాష దొర్లుకొచ్చేస్తూంటది. దాంతో భాష అటూ ఇటూ కాకుండా సంకరంగా ఉంటది. అదే నాకు నచ్చడం లేదు. నిదానంగా అదే మెరుగు పడతది లెమ్మని అనుకుంటూంటాను. అలా మెరుగుపడేదాకా ఈ బ్లాగూ ఇంతే, ఈ భాషా ఇంతే! :)

జాగర్తగా ఆచితూచి రాయకపోవడంతో వాక్యనిర్మాణం ఒక్కోసారి ఏడిసినట్టు ఉంటది. ప్రచురించాక గమనించి మార్చిన సందర్భాలు బోలెడు. అచ్చుతప్పులు కూడా అంతే. ప్రచురించిన వెంటనే, లైవులో చూసుకుని తప్పులు దిద్దుకుంటూంటాను. మొదట్లో అక్కడక్కడా ఈనాడు సంపాదకీయం భాష తగిలేది, తరవాత దాన్ని సవరించుకున్నాను. :)

హాస్యం చాలా ఇష్టం. కొన్ని బ్లాగుల్లో ఉన్నంత చక్కటి, సునిశితమైన, వెకిలితనం లేని హాస్యం నేను ముద్రణలో చదవలేదు. ఈ బ్లాగులోనూ హాస్యం రాయాలని ఉన్నా, రాయలేను కాబట్టి రాయను.

ఈ బ్లాగులో వచ్చిన టపాల్లో, నచ్చిన కొన్నిటిని ఉన్నదున్నట్టుగా ప్రచురించే బ్లాగొకటుంది. అలా వేసేసి  ఊరుకోకుండా ఆ రచన యొక్క శ్రేయస్సును ఈ బ్లాగుకు ఆపాదిస్తారు, అది ఆ బ్లాగరి సౌజన్యం!

ఓ రెండొందల యాభై దాకా టపాలు ప్రచురించాను. ఇంకో వందదాకా డ్రాఫ్టుల్లో ఉన్నై.

--------------------        ******  ******  ******       -------------------

ఈ పేజీని మొదటగా ప్రచురించిన తేదీ: 2010 జూన్ 26      ::::       చివరిసారి సవరించిన తేదీ: 2010 సెప్టెంబరు 18

సంబంధిత టపాలు