6, ఆగస్టు 2006, ఆదివారం

ప్రజలతో జయప్రకాష్ నారాయణ ఫోనాఫోని

ఇవ్వాళ - ఆగస్టు 6 ఆదివారం - సాయంత్రం 6 నుండి 7 వరకు టీవీ9 లో జయప్రకాష్ నారాయణతో ఫోను లో మాట్లాడే కార్యక్రమం జరిగింది. ప్రజలు నేరుగా టీవీ9కి ఫోను చేసి ఆయనతో మాట్లాడే కార్యక్రమం ఇది. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన ప్రజల ప్రశ్నలకు చక్కగా సమాధానమిచ్చారు. తమ పార్టీ ప్రసక్తిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఆయన దీన్ని బాగా వాడుకున్నారు.

జేపీ చెప్పిన ముఖ్యమైన విషయాలివి.

  • పార్టీపై ప్రజల స్పందన చాలా బాగుంది.
  • ప్రజాస్వామ్యంలోను, పార్టీలోను నాలుగు విషయాలకు ప్రాధాన్యం..
    • యువత
    • మహిళలు
    • చదువు పొందలేని వర్గాలు
    • మధ్యతరగతి
  • ప్రజల చుట్టూ రాజకీయం తిరగాలి.
  • విద్య, ఆరోగ్యం కేంద్రంగా పాలన జరగాలి. సమాజంలో ఉపాధ్యాయుడు, ఆరోగ్య కార్యకర్త ముఖ్యమైన వారు.
  • పార్టీకి మూలాధార సూత్రాలు..
    • అతర్గత ప్రజాస్వామ్యం
    • చందాలు కేవలం చెక్కుల ద్వారానే
    • ఎన్నికల ఖర్చు కమిషను నిర్దేశించిన దానికంటే పైసా కూడా ఎక్కువ పెట్టం
    • ఎన్నికల్లో సారా, డబ్బూ వంటి అవినీతికర పద్ధతులకు పాల్పడం
    • ఒకవేళ మావాళ్ళే ఎన్నికల అవినీతికి పాల్పడితే, వాళ్ళను ఓడించమని మేమే ప్రచారం చేస్తాం.
  • అయ్యేయెస్సులూ, మంత్రులూ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రీ వీళ్ళు కాదు పెద్దవాళ్ళు.., ప్రజలు పెద్దవాళ్ళు. వీళ్ళంతా ప్రజలు చెప్పినపని చెయ్యాలి, చెయ్యమన్నప్పుడు చెయ్యాలి, వద్దన్నప్పుడు మానెయ్యాలి. రాజకీయాలను ప్రజల చుట్టూ తిప్పాలన్నదే లోక్సత్తా ఉద్దేశ్యం.
  • రిజర్వేషన్లు: కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు మరి కొన్నాళ్ళపాటు ఉండాలి. అయితే వాటిని క్రమబద్ధీకరించాలి. కుల, వర్గ విచక్షణ లేకుండా అందరికీ నాణ్యత గల చదువును ఇవ్వాలి.
  • అక్టోబరు మొదటి వారంలో పార్టీ ఏర్పాటు.
  • ఆగస్టు 9 పార్టీ విధానాల ప్రకటన.
  • పార్టీలో చేరాలన్న ఔత్సాహికులు ఆగస్టు 9 తరువాత, కింది చోట్ల సంప్రదించవచ్చు...
    • ఉచిత ఫోను: 1 800 425 2979
    • ఈ అడ్రసుకు ఉత్తరాలు రాయవచ్చు: పోస్టుబాక్సు: 100, హైదరాబాదు– 4
  • జయప్రకాష్ నారాయణ ఇంకా ఇలా అన్నారు...
    • పాలకులు సేవకులే.
    • రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలందరికీ తెలుసు. కానీ అది వస్తుందనే నమ్మకమే వారికి లేదు.
    • చెడ్డవాళ్ళ దుర్మార్గం కన్నా మంచివాళ్ళ మౌనం ప్రమాదకరం.
    • చర్చలిక ఆపేసి, చర్యలు మొదలుపెడదాం.
  • కార్యక్రమం చివర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఏవీయెస్ రెడ్డి ఫోను చేసారు. ఎన్నికల కమిషను చేతకానిది అంటూ నిర్దాక్షిణ్యంగా అనేక అభాండాలు నాపైన వేసారు కదా, మీకది భావ్యమా? అని అడిగారు. దీనికి జయప్రకాష్ నారాయణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. అయితే వోటరు పేర్లపట్టిక తయారీలో రాష్ట్ర ఎన్నికల కమిషను అధికారాలు పరిమితం అని మాత్రం చెప్పారు.
నేనివి అడగాలనుకున్నాను. ఎంత ప్రయత్నించినా లైను దొరకలేదు.
  1. అధికార భాషగా తెలుగు అమలు విషయంలో, మాతృభాషలో విద్యాబోధన, తెలుగు భాషాభివృద్ధి విషయాల్లో మీ విధానం ఏమిటి?
  2. అవినీతి విషయమై మీ అభిప్రాయాలు సుస్పష్టం. అయితే అవినీతి అంటని పార్టీలు ఇప్పటి రాజకీయాల్లో లేనే లేవు. మరి, ప్రస్తుత సంకీర్ణ యుగంలో మీ పార్టీ పొత్తుకు వెళ్ళాల్సి వస్తే.., ఈ అవినీతిమయ పార్టీలతో పొత్తు విషయంలో మీ విధానం ఏమిటి?
జయప్రకాష్ నారాయణ రాజకీయ ప్రవేశంపై తమ అభిప్రాయాలు ఎస్సెమ్మెస్సుల ద్వారా పంపమని టీవీ9 వాళ్ళు ప్రజలను అడిగారు. 93% మంది అనుకూలంగా స్పందించారు.

మంచి కార్యక్రమం. టీవీ9 కు అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు