21, జులై 2006, శుక్రవారం

నెట్లో తెలుగు వ్యాప్తి

నెట్లో తెలుగు వ్యాప్తికై మనమేం చెయ్యాలి.

ఈ విషయం పాతదే! నెట్లోనూ, నోట్లోను కూడా బాగా నానింది. బ్లాగరుల సమావేశాల్లో ఈ విషయం అనేక సార్లు చర్చకు వచ్చింది. అనేక సూచనలొచ్చాయి. ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు గాను కింద నే రాసిన ఆరు మార్గాలు కొత్తవేం కాదు. గతంలో ఎందరో చెప్పినవే! మరోసారి బ్లాగరులు జూలై 23న హై.లో కలుస్తున్న వేళ.. చర్విత చర్వణమిది.


1. కంప్యూటర్లో తెలుగు చూపించగలిగే వీలు. కంప్యూటరు గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా చులాగ్గా చేసుకునేలా ఈ ఏర్పాటు ఉండాలి. అయితే ఇది అంత సులువుగా లేదు ప్రస్తుతం. ఆపరేటింగు సిస్టమును బట్టీ, బ్రౌజరును బట్టీ అనేక సంధి సమాసాలున్నాయి ఈ వ్యవహారంలో. ఒక్కో జతకు ఒక్కో పరిష్కారం. ఇవన్నీ చదువుకుని, ఆపై కంప్యూటర్లో తగు మార్పులు చేసుకోవడమంటే.. కష్టమైనపనే! కంప్యూటర్లో తెలుగు చూడాలనుకునే వారికి పెద్ద అడ్డంకే! అంచేత...

దీనికో అప్లికేషనుండాలి. మన వెబ్‌సైట్లలో ఎక్కడో ఒకపేజీకి వెళ్ళగానే ఈ అప్లికేషను కంప్యూటరును గాలించి, అది తెలుగుకు అనుకూలంగా ఉన్నదా లేదా అని చూసి.., లేకపోతే అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. దాంతో పని తేలికయిపోతుంది. భద్రతా పరమైన సమస్య విషయం.. మనమేం చేస్తామో ముందే చెబుతాం. వారు ఇష్టపడితేనే ఈ మార్పులు చేస్తాం, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు. మన కంప్యూటరు వీరులకీ పని పెద్ద లెక్కలోది కాదనుకుంటున్నాను.

2. కంప్యూటర్లో తెలుగులో రాసే వీలు. నేను తెలుగులో రాయడం మొదలుపెట్టి ఒక సంవత్సరం అవుతూ ఉంది. ఈ ఏడాదిలో చాలా ప్రగతి కనపడుతూ ఉంది ఈ విషయంలో. పద్మ, లేఖిని, అక్షరమాల మొదలైన వాటితో తెలుగులో రాయడం ఇవ్వాళ పెద్ద కష్టమేమీ కాదు. పైగా తెలుగు కీ బోర్డులు వచ్చేసాయి కూడాను.
3. ఇక మూడోది. తెలుగులో రాయొచ్చనీ, రాసేందుకు ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయని తెలుగు వారికి తెలియజేయడం.. మనం బాగా వెనకబడి ఉన్నది ఇందులోనే. దానికోసం మార్గాలు చూడాలి. ఏమిటా మార్గాలు? నాకు తోచినవి ఇక్కడ రాస్తున్నాను.
 1. మన అడ్రసు పుస్తకంలో ఉన్న తెలుగువాళ్ళందరికీ ఉత్తరాలు రాయాలి.
 2. ఆర్కుట్ లాంటి చోట్ల కనపడే తెలుగు వారందరికీ దీని సంగతి పరిచయం చెయ్యాలి.
 3. మనం మెయిలు చేసినంత మాత్రాన వెంటనే జనం తెలుగులోకి మారిపోకపోవచ్చు. ఇంగ్లీషులో రాయడానికి అలవాటు పడి తెలుక్కు మారాలంటే కాస్త కష్టమే. కాబట్టి మనం ఓపిగ్గా ఉండాలి. అంతెందుకు.. తెలుగ్గ్రూపులూ, తెలుగు బ్లాగులూ అంటూ కొట్టుకులాడే మనం కూడా కొండొకచో ఇంగ్లీషులో రాస్తూనే ఉంటాం కదా!
 4. బ్లాగులూ గట్రా రాసే కొద్ది మందిమి కూడా మరింత విరివిగా రాస్తూ ఉంటే చదివేవారికి కూడా ఆసక్తి పెరుగుతుంది.
 5. తానా అటా లాంటి తెలుగువారి వేదికలకు రాసి వారి సభ్యులకు మెయిళ్ళు పంపాలి.
 6. ఇవన్నీ ఇదివరకే చేసేసాం, ఫలితమేం లేదు అని అంటారా.. మొదటి ప్రయత్నానికే పనులన్నీ జయప్రదంగా అయిపోతాయా? మళ్ళీ రాద్దాం. విడివిడిగా కాక, తెలుగుబ్లాగు గుంపు నుండి రాద్దాం. ఒక వేదిక నుండి రాసినట్లు ఉంటుంది కూడాను.

3 కామెంట్‌లు:

 1. వెబ్ సైటు నుంచి కంప్యూటరును గాలించటం వీలు ఉందంటారా?
  ఆపరేటింగు సిస్టముకు ఒక అప్లికేషనుగా ఐతే సులభంగా చెయ్యవచ్చు. ప్రయత్నిద్దాం...

  రిప్లయితొలగించండి
 2. తెలుగులో మరిన్ని వెబ్‌సైట్లు రావాలి. అప్పుడు తెలుగు చదివే వారు పెరుగుతారు. చదివే వారు పెరిగితే అప్రయత్నంగా (automatically) తెలుగులో వెబ్‌సైట్లూ పెరుగుతాయి. ఇది పెళ్ళిచేస్తే గానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితేగానీ పెళ్ళి కుదరదులా వుంది. ఇప్పుడు రోజూ ఈనాడు కొన్ని వేల మంది చదువుతున్నారట. ఇప్పుడిప్పుడే తెలుగు వ్రాయగలిగిన ఉపకరణాలు లభ్యమవుతున్నాయి గనుక త్వరలోనే ఇది ఊపందుకుంటుందనుకొంటున్నాను. మీరన్నట్లు ఈ సందేశాన్ని మరింత విస్త్రుతంగా ప్రచారం చేయటం ద్వారా తెలుగు వ్యాప్తిని వుదృతం చేయవచ్చు.

  -- ప్రసాద్
  http://charasala.wordpress.com

  రిప్లయితొలగించండి
 3. నాకీమధ్యనే తెలిసింది తెలుగులో పెద్ద భ్లాగవతమే నడుస్తోందని. నేనూ ఒక స్కంధము తెరిచేశానాత్రంగా. బ్రహ్మాండమైన బ్లాగులున్నయి. అన్నీ చదివెయ్యాలనే ప్రయత్నంలో రాత్రిళ్ళు మేలుకొని అనారోగ్యంపాలవుతున్నాను.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు