11, ఆగస్టు 2006, శుక్రవారం

ఈయన అన్‌ఫిట్!

వారికది జీవధార, జీవనాధారం. అమ్మ, దైవం కూడా. అలాంటి గోదారి పొంగి, పొర్లి, కూడూ గుడ్డా గూడూ ఎత్తుకెళ్ళిపోయింది. చుట్టూ నీళ్ళే.. కానీ తాగేందుకు చుక్క పనికిరాదు. ఎటు చూసినా నీళ్ళే, నీళ్ళంటేనే భయపడేలాగా. రోజుల తరబడి తాగేందుకు సరైన మంచినీళ్ళు కూడా దొరకలేదు. ఇక తిండి సంగతి సరేసరి. ఈ పరిస్థితిలో ప్రజలెలా ఉంటారు? దీనంగా ఉంటారు, ప్రభుత్వ సాయం కోసం, మన అనుకున్న వాళ్ళ ఓదార్పు కోసం మొహం వాచి ఉంటారు. రోజులు గడుస్తున్నా పట్టించుకునే వాడే లేడన్న ఆవేదనతో కడుపు మండి ఉంటారు. సాయం చెయ్యాల్సిన బాధ్యత ఉన్న పెద్దమనిషి కనపడినపుడు నిలదీసి, అడిగేసి, కడిగేస్తారు.


వాళ్ళనెలా చూసుకోవాలి? తిండీ నీళ్ళూ ఇవ్వాలి. తలదాచుకునేందుకు చోటివ్వాలి. ఏం పర్లేదు నేనున్నానంటూ ధైర్యం చెప్పాలి. మరి వీళ్ళ ఎమ్మెల్యే ఏమన్నారు? వీళ్ళనాదుకోవాల్సిన వీళ్ళ ప్రతినిధి వీళ్ళనెలా గౌరవించారు? ప్రభుత్వం ఇచ్చే సాయం వీళ్ళకి అందేలా చూడాల్సిన కుడుపూడి చిట్టెబ్బాయి గారు ఏమన్నారు?

మీ అంతు తేలుస్తానన్నారు! నా కులం పేరెట్టి మాట్లాడతారా, మీ ఊరి నేంచేస్తానో చూడండన్నారు! ఎగబడి కొట్టబోతే, నలుగురైదుగురు కలిసి వెనక్కి లాగాల్సొచ్చింది. టీవీల్లో ఆ వీరంగం చూసి నివ్వెరపోవడం ప్రజల వంతు అయింది.

అంతా అయిపోయాక చిట్టబ్బాయి సిసలైన మాటొకటన్నారట.. "ఇదొక దురదృష్టకర సంఘటన" అని.

అవున్నిజమే, దురదృష్టం ప్రజలది. మిమ్మల్నెన్నుకున్నారు గదా! ఇప్పుడు ముంచెత్తిన ఈ వరద పెద్ద లెక్కలోది కాదు. వరద తగ్గాక ఇదే గోదారి చలవతో మళ్ళీ పంటలూ, జీవితాలూ పండించుకుంటారు, వీళ్ళు. ఈ కష్టాలు మరచిపోతారు. కానీ.. కాని కాలంలో కాని మాటలన్నారే.. మీ ఈ మాటలను మరచిపోగలరా?!

చిట్టబ్బాయీ! "ఈయన అన్‌ఫిట్" అంటూ అరుస్తున్న ఆ గ్రామస్తుల అరుపులు చెవుల్లో రింగు మనడం లేదూ!?

3 కామెంట్‌లు:

 1. ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాంగానీ "రీకాల్" కు అవకాశం లేనంతవరకూ మనది నాయకస్వామ్యమే!

  రిప్లయితొలగించండి
 2. వీళ్ళు పచ్చి దొంగలు. మేకవన్నె పులుల్లా వుండేవాళ్ళు; ఇప్పుడు మేకవన్నే కూడా అవసరం లేదని పులుల్లానే తిరుగుతున్నారు. వీళ్ళకెలా తెలుస్తుంది ప్రజల గోడు, ఇల్లు కాలుతుంటే చలి కాచుకొనే దొంగ వెధవలు.

  -- ప్రసాద్
  http://charasala.wordpress.com

  రిప్లయితొలగించండి
 3. Time అంటారు చూడండి. అదన్న మాట. ఇది చిట్టబ్బాయి టైము.ప్రజలకూ వస్తుందండీ టైము. తమిళనాడు చక్కటి ఉదాహరణ. అక్కడి ప్రజలు తెలివిగా ఉంటారు ఎన్నికలప్పుడు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు