30, ఏప్రిల్ 2008, బుధవారం

మేటి దివిటీలు - 1

18 కామెంట్‌లు
తెలుగు వారి చరిత్ర రెండువేల యేళ్ళ నాటిది. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా మన ప్రసక్తి వచ్చిందట. ఎన్ని వేల యేళ్ళవాళ్ళమో ఖచ్చితంగా తెలీకపోయినా మొత్తానికి కొన్ని వేల యేళ్ళ వాళ్ళమే!

కొన్ని వేల యేళ్ళలో కొన్ని కోట్ల మంది పుట్టి, బ్రతికి, పోయారు. కొన్ని లక్షల మంది పుట్టి, బ్రతికి, బ్రతికించి, పోయారు. కొన్ని వందల మంది మాత్రం.. పుట్టి, బ్రతుకుతూ ఉన్నారు. ప్రజల మనసుల్లో వీరు చిరంజీవులు. తెలుగు జాతి ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో నుండి నాకు నచ్చిన పది దివిటీల పేర్లు ఇక్కడ రాయదలచాను. వాళ్ళు మనకు ప్రాతస్మరణీయులు. పదే రాయదలచాను కాబట్టి పదే ఉన్నాయి. పదిలో ఉండాల్సినవయ్యుండీ ఇక్కడ పేర్లు లేకపోతే.. అది నా తెలివితక్కువతనమే తప్ప చిరస్మరణీయులను తక్కువ చెయ్యడం కానే కాదు. ఆ సంగతి మీకు తెలియనిదేం కాదు!

అ వెలుగు దివిటీల గురించి రాయగలిగేంత విషయం ఉన్నవాడినేం కాదు నేను. నాకు తోచినంతలో ఒకటో రెండో పద్యాలు రాసి పూజ చేస్తున్నాను. పనిలో పనిగా నా పద్య కండూతి కూడా తీరుతోంది.

ఇక నేనెంచుకున్న వరస.. ఇది వారి జీవిత కాలాలను బట్టి తీసుకున్న వరస కాదు. వారి గొప్పతనాన్ని బట్టి నేనిచ్చిన ర్యాంకింగూ కాదు. దీనికో వరస లేదు. ఎవరిపై పద్యం సిద్ధమైతే వారి పేరు పెట్టేస్తానన్నమాట!
---------------------------------------------

వేమన:
తెలుగు వాడికి వేమన తొలిగురువు. మనకో వేదాన్ని ఇచ్చి, మన గుండెల్లో నిలిచిపోయాడు. ఉప్పు కప్పురాల తేడాయైనా, అల్పుడెలా పలుకుతాడన్నా.. వేమన వేదంలో మనకు దొరుకుతుంది! తెలుగుజాతికి ప్రాతస్మరణీయుడైన వేమన చరిత్ర అస్పష్టంగా ఉండటం మన దురదృష్టం. రెండేళ్ళ కిందనుకుంటా.. రాతప్రతుల సేకరణ అనే యజ్ఞం చేస్తే కొన్ని లక్షల పత్రాలు పోగుపడ్డాయట కేంద్ర ప్రభుత్వం దగ్గర. అలాంటి బృహత్ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వమూ చేస్తే వేమన గురించిన మరిన్ని వివరాలు తెలియవచ్చేమో!


వేమనకో నూలుపోగు:
అరటిపండునొలిచి అరచేతిలోనుంచి
ఆరగింపుమంటి వాదరమున
ఆంధ్ర జాతికీవె ఆదిగురుడవయ్య
అఖిలజనులవినుత అమర వేమ

వేమ నీతి యదియె వేమగీత యదియె
వేదసమముగాని వేరు గాదు
వేయిగళములెత్తి వేమారు పాడరా
వేద స్ఫూర్తి తోడ వేమ సూక్తి

26, ఏప్రిల్ 2008, శనివారం

రికార్డు డ్యాన్సులు, క్రికెట్టు కాంట్రాక్టర్లు

13 కామెంట్‌లు
అదసలు క్రికెట్టేనా అని!!
- అదే అయితే ఈ ఛీర్‌లీడర్లెందుకు?
- సరే.. ఉండాలీ అంటే, ఆడాళ్ళే ఎందుకు?
- సరే.. వాళ్ళే కావాలీ అంటే, ఆ కురచగుడ్డలెందుకు?

అన్నీ ఒకందుకే..
డబ్బుల కోసం! వందల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నది డబ్బుల కోసం. జనాలు రావాలి, టీవీల్లో చూడాలి - లేకపోతే డబ్బులెక్కడి నుంచొస్తాయ్? జనాలూ, తద్వారా డబ్బులూ ఇబ్బడిముబ్బడిగా రావాలంటే ఇలాంటి రికార్డింగు డ్యాన్సుల్లాంటివి పెట్టాలి. ఇలాంటి వేషాలేస్తే ఎక్కడైనా జనం పోగవుతారు. అలా పోగౌతారనేగా.. వీటిని పెడుతున్నది! పోగైనప్పుడు మనిషి లోని అసలు మనిషి బయటికి వస్తాడు. మంద మనస్తత్వం (మాస్ మెంటాలిటీ) గురించి తెలియనిదేముంది!

బజాట్టో బట్టలిప్పుకుని తిరుగుతూ "నన్నట్టాగన్నాడు", "మీదచెయ్యేసాడు" అంటూ ఏడవటంలో అర్థం లేదు. ఏఁ.., ఆట చూట్టానికి వచ్చిన వందలాది మంది స్త్రీల తోటి అలా అసహ్యకరంగా ఎందుకు ప్రవర్తించడం లేదు, వాళ్ళు? స్త్రీని గౌరవించటానికీ, ఈరకం జనాలతో వ్యవహరించడానికీ సంబంధముందని నేననుకోను.

కొత్త సంవత్సరం రోజున ముంబైలో గత రెండేళ్ళు జరిగినది విన్నాం కదా.. అర్ధరాత్రి, చిత్తుగా తాగి, రోడ్లమీద చిందులేస్తూ తిరిగే మూకల మధ్యకి (వందలాది మంది; పైగా ఆ సమయానికి వాళ్ళు పశుప్రాయులు) తామూ పోతే, తప్పు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ తాగుబోతులూరుకుంటారా? బట్టలు లాగెయ్యడాన్ని నేను సమర్ధించడం లేదు.. పిచ్చి కోతితో కలిసి కల్లు తాగి, ఆనక అది మీద పడి రక్కిందని ఏడవగూడదు అని చెబుతున్నాను. ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి. స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవానికీ దీనికీ సంబంధం ఉందని నేననుకోను!

హై.లో బీచి వాలీబాలు చూసేందుకు జనం ఎగబడ్డారట. ఎల్బీ స్టేడియమ్ లో జరిగే మామూలు వాలీబాలు చూసేందుకు ఎగబడతారా? ఆట కోసమనేనా ఆ తహతహ? ఆ రకంగానైతే జనం బాగా వస్తారనేగదా, డబ్బులు బాగా వస్తాయనే కదా.. ఇసకపోసి మరీ హై.లో ఆ ఆటాడించింది!

కోరికలుండటం సహజం. హద్దుల్లో ఉంచుకోలేకపోవడం, ఉత్సుకత చూపించడం సహజమైన బలహీనత. ప్రజల్లోని ఈ బలహీనతను సొమ్ము చేసుకుందామనే.. వాళ్ళీపని చేస్తున్నారు. ఇంకా ఈ దొంగ ఏడుపులెందుకు? ఈ వ్యాఖ్యానించే బలహీనత ఆ కొందరిదే కాదు.., చాలామందిది, మెజారిటీది. అవకాశం దొరక్క కొందరు, గుర్తుపడతారేమో, దొరికిపోతానేమో లాంటి భయాలతో మరి కొందరు,.. ఇలా రకరకాలు.

మనమిక్కడ అనాల్సింది అలా అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవాళ్లని కాదు.. ఆ డ్యాన్సర్లనీ, ఆ వేషాలేయించే వ్యాపారస్తులనీ! స్త్రీని గౌరవించంది వాళ్ళు - ఆ స్త్రీలు, ఆ వ్యాపారస్తులే! డబ్బుల కోసం నైతికంగా దిగజారిపోయింది వాళ్ళే! మహారాష్ట్ర, బెంగాలు మంత్రులు చేస్తున్నది రైటే! ఆ గంతులు మన సభ్యతకు, మర్యాదకు భంగకరం. పబ్లిక్ న్యూసెన్స్!

25, ఏప్రిల్ 2008, శుక్రవారం

ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

9 కామెంట్‌లు
ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది.

మొదటిది:
తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి పంపారంట. ఏదన్నా గానీండి.. తెలుగు నాయకులకు తెలుగు భాష పట్ల ఉన్న శ్రద్ధకు ఇదో ప్రతీక. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వార్త ఇది.

ఇదంతా మనకు మామూలే. ఈ రకం రాజకీయ నాయకులు మన చుట్టూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ ఉంటే మన కాళ్ళకూ చేతులకూ తగులుతూ, అడ్డం పడేంత మంది ఉన్నారు. కానీ.., మనకు మామూలు కాని వార్తొకటుంది, చూడండి:

తమిళనాడు శాసనసభలో తెలుగు గురించి మాట్టాడుతూ గోపీనాథ్ అనే సభ్యుడు కన్నీళ్ళ పర్యంతమై పోయాడు. ఆ రాష్ట్రంలో తమిళ మాధ్యమంలోనే
చదువు చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందట. దాని కారణంగా తన నియోజకవర్గంలో లక్ష మందికిపైగా తెలుగు మాట్లాడే పిల్లలు ఇబ్బంది పడతారని ఆయన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన మాట్టాడుతూండగా మధ్యలో ఆపి, స్పీకరు ఇక చాలు కూచ్చోమన్నాడట. దానికి ఆయన కన్నీళ్ళ పర్యంతమైపోయాడు. స్పీకరు మళ్ళీ మాట్టాడే అవకాశం ఇచ్చాడట గానీ, దుఃఖంతో సరిగ్గా మాట్టాడలేకపోయాడట. మనకంతగా పరిచయంలేని నాయకత్వమిది. ఊహించని వ్యక్తిత్వం.

గోపీనాథ్‌తో బొత్స ఝాన్సీని పోల్చి చూడాలి మనం. మామూలుగా ఝాన్సీ అడిగిన ప్రశ్నపై సభలో చర్చ జరిగే అవకాశం లేదట. ఇతర ప్రశ్నలను అడిగినవారు ధర్నాలతో బిజీగా ఉండటంతో ఆమెకు మాట్టాడే అవకాశం వచ్చిందట; దాన్నామె కాలదన్నుకుంది. "ఏదీ ఈమె ఇప్పటిదాకా ఇక్కడే ఉందే.." అని స్పీకరు కూడా వెతుక్కున్నాడట. ఇదీ ఆమె నిర్వాకం. మరి గోపీనాథ్ ఏంచేసాడు..? స్పీకరు ఆపమన్నా మాట్టాడబోయాడు. తన వాదన అంత సమంజసం కాకున్నా..
(ఏమాటకామాటే చెప్పుకోవాలి: తమిళనాడు ప్రభుత్వం చేసిన పని ఒప్పే. అక్కడుంటే తమిళంలో చదివి తీరాల్సిందే అని అనడంలో తప్పేఁవుంది.) తన భాష మాట్టాడేవారి కోసం తన పదవినీ తద్వారా తనకొచ్చిన అవకాశాన్నీ గోపీనాథ్ సద్వినియోగం చేసాడు.

శభాష్ గోపీనాథ్!

5, ఏప్రిల్ 2008, శనివారం

మన ప్రాధాన్యతలెక్కడున్నాయి

2 కామెంట్‌లు
లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు - బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది..

"...నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు లెక్కలోకి రారు. అక్కడున్నవాళ్లలో ఎవరికీ తెలియదు ఆమె జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిందని..."

జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయపోటీలు ఆడి కూడా, సరైన ప్రోత్సాహం లేదని గ్రహించి ఆ తరువాత వాలీబాలు ఆడటం మొదలుపెట్టి, జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటి అనితారెడ్డి ఇక్కడ, ఈ ఆటలో.. బంతులందిస్తోంది. జాతీయ స్థాయికి చెందిన ఒక క్రీడాకారిణికి మంచి గుర్తింపే!!! వాలీబాలు, బీచి వాలీబాలుల పట్ల మన ప్రాధాన్యతలవి.

అయినా అనితారెడ్డి దాన్ని చిన్నతనంగా భావించటం లేదు.. అది ఆమె హుందాతనం.

శభాష్ అనితా!

4, ఏప్రిల్ 2008, శుక్రవారం

అవిశ్వాస బీచి వాలీబాలు

9 కామెంట్‌లు
హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తానని రాజకీయులు వాగ్దానాలు చెయ్యడం గతంలో జోకు. అది నిజమయ్యే రోజు దగ్గర పడుతుందేమోనని మిత్రుడొకడన్నాడు. అదేంటని అడిగితే.. "అవును, బీచి వాలీబాలు ఆడుతున్నారుగా.. బీచి వచ్చేసినట్టే మరి! ఇహ సముద్రాన్ని లాక్కురావటమెంతసేపు?" అని అన్నాడు.

అసలు బీచే లేని హై.లో కూడా కాస్త ఇసక పోసి బీచి వాలీబాలు (బీవా) ఆడేసెయ్యొచ్చని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తీరా అసలు సంగతి ఇది.. జనాలని ఆకట్టుకోడానికి ఈ ఆటలో బోల్డంత గ్లామరుంది. అంచేత సముద్రం లేకపోయినా, బీచి లేకున్నా ఆడిస్తారు. డబ్బులిచ్చేవాడుంటే ఇదే ఆట సియాచిన్ గ్లేసియరులో కూడా ఆడించగలరు. అంతా మార్కెటింగు మాయ! అందాల సుందరి ఎంపికలు, పిల్లి నడకలు (వాటితో పాటు.. ముందే ఏర్పాటు చేసిన క్యాట్‌వాక్ మిస్‌హ్యాపులు),.. అన్నీ మార్కెటింగు మాయలే! ఏదేమైనా, ఈ బీవా పుణ్యమా అని పత్రికలోళ్ళకి పెద్ద శ్రమ పడకుండానే పేజీలు నింపుకునే అవకాశమొచ్చింది. మామూలుగా ఆటల పేజీల్లో వెయ్యాల్సిన ఈ బొమ్మలు విస్తరించి, ముందు పేజీల్లోకి కూడా వ్యాపించాయి. పేపర్లమ్ముకోవాలి కదా మరి!

ఆవిధంగా.. హై.కి బీచొచ్చేసింది. అయితే హై. లో ఈ పాటికే ఇంకో బీచుంది. అక్కడ ఆడేది, రాజకీయ నాయకులు. వాళ్ళు ఓ బంతాట (రాజకీయుల బంతాట - రాబం) ఆడుతూ ఉంటారు. ఈ రాబం కూడా బీవాలాగే ఉంటుంది. కాకపోతే బంతి.. మనం! అవిశ్వాస, విశ్వాస, శ్వాస,.. ఇలా రకరకాల పేర్లతో పోటీలు పెట్టేసుకుంటూ ఉంటారు.

బీ.వాలో ఎంచక్కా బట్టలు విడిచేసి ఆడతారు. ఆ ఆటకు అదో ముఖ్యమైన నిబంధన. సిగ్గు పడకుండా (లేకుండా), ఒళ్ళు దాచుకోకుండా ఆడాలన్నమాట! రాబం లో కూడా అంతే.. సిగ్గుపడకుండా విలువల వలువలిప్పి ఆడేస్తారు. బీవాలో రెండు ముక్కలన్నా అడ్డం పెట్టుకుంటారు.. రాబంలో అవీ ఉంచరు.

బీవాలో ఆటనెవరూ పట్టించుకోరు. ఆటలో ఎవరు బాగా ఎగిరారు, ఎవరు బాగా ఊగారు, ఎవరు హొయలతో బాగా అలరించారు ఇవే ముఖ్యం. ఎవరు గెలిచారు ఎవరు ఓడారనేది ఎవరికీ పట్టదు - ఆడేవారికీ చూసేవారికీ కూడా. ఎవరు బాగా ఆడారు అనేదాన్ని పట్టించుకునే వారి కంటే.., మన సినిమాల్లో హీరోయిను బాగా నటించిందా లేదా అనేది గమనించేవారే ఎక్కువ!

అలాగే మన రాజకీయులు చేసే చర్చల్లో - ఎవరు ప్రజాసమస్యల గురించి మాట్లాడారు, ఎవరు బాగా మాట్లాడారు, ఎవరు తర్కబద్ధంగా వాదించారు, ఎవరు నిజాయితీగా మాట్లాడారు అనేది ఎవరికీ అక్కరలేదు. ఎవరు గట్టిగా అరిచారు, ఎవరు బాగా బూతులు తిట్టారు, అవతలోణ్ణి మాట్టాడనివ్వకుండా ఎవరు ఎక్కువ గోల చేసారు.. ఇలాంటివే ముఖ్యం. డెసిబల్ స్థాయే కావాలి, అంతే! అదే కొలత. అక్కడ కూడా ఫలితం ముఖ్యం కాదు -గోలే ముఖ్యం.

బీవాలో లేని ప్రత్యేకత ఒకటి రాబంలో ఉంది.. బీవాలో ఆట తప్ప అన్నీ మనం పట్టించుకుంటాం. రాబంలో మాత్రం దేన్నీ పట్టించుకోం. ఎవడెట్టా పోయినా మనకు అనవసరం. బీవాకీ, రాబం కీ అదే తేడా.

అయితే..

బీవాలో కూడా రిఫరీ ధృతరాష్ట్రుడి లాగా, చేతకానివాడి లాగా, బక్కకోపంతో, ఒక పక్షం వారి కనుసన్నలలో డ్యాన్సాడుతూ ఉంటాడా అనేది నాకు తెలీదు. అంచేత ఆ పోలిక చెయ్యలేను.

2, ఏప్రిల్ 2008, బుధవారం

ఏప్రిల్ 1 వచ్చింది.. పోయింది!

3 కామెంట్‌లు
ఎమ్మెల్యేల ఆర్జనలపై విచారణ అన్నారు. ఇప్పటి వాళ్ళే కాదు.., 1978 నుండి ఎన్నికైన వారందరిపైనా అని అన్నారు. ఏప్రిల్ 1 న తేల్చేస్తామని అన్నారు. ఏప్రిల్ 1 వచ్చింది.., పోయింది కూడా! కానీ ఏం జరగలేదు. ఒక్కళ్ళు కూడా దాని గురించి ఎత్తలేదట.


స్పీకరు గారింకో మాటన్నారట.. ఆంధ్రజ్యోతిలో రాసారు..
అటు న్యాయ వ్యవస్థ, ఇటు పాలనావ్యవస్థ - రెండూ సరిసమానమైనవేనట,
అందువల్ల ఒకరిని ఒకరు గౌరవించుకోవాలట,
ఇప్పుడు ప్రజా ప్రతినిధుల ఆస్తిపాస్తుల గురించి విచారణ జరపవలసిందిగా తీర్మానం చేసి కోర్టును ఆశ్రయించడం అంత ఉచితం కాదట
తప్పులున్నాయేమోనని వెతకబోతే గౌరవానికి భంగమెలా అవుతుంది? చట్టం తనపని తాను చేసుకుపోనివ్వటమే గదా వీళ్ళు చేస్తోంది! కాబట్టి ఈ సందేహాలను పక్కనబెట్టి, శాసనసభ తీర్మానం చేసి, కోర్టుకు ఉత్తరం రాయాలి.

చూద్దాం.., ఇవ్వాళైనా ఆ తీర్మానం సంగతి తేలుస్తారేమో!

సంబంధిత టపాలు