27, ఫిబ్రవరి 2006, సోమవారం

తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ

0 కామెంట్‌లు
శివరాత్రి నాడు (26-02-06) జీ-తెలుగు టీవీలో తనికెళ్ళ భరణిని శైలేష్ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. భాషోద్యమంపై కొన్ని ప్రశ్నలకు ఆయన తన అభిప్రాయాలు చెప్పారు.

భాషా విషయమై ప్రస్తుతం వచ్చిన కదలికను విస్తరించాలని, ఉధృతం చెయ్యాలనీ ఆయన భావిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతు తెల్పడం మంచి పరిణామంగా ఆయన భావించారు. తెలుగుపై ప్రవాసాంధ్రుల ప్రేమ, దూరంగా ఉండడంచేత కలిగిన అనురాగంగా ఆయన భావించారు (అయితే నెగటివ్ గా మాత్రం ధ్వనించలేదు).

అయితే, ప్రత్యేకించి నిరాశ వ్యక్తం చెయ్యనప్పటికీ ఆయన మాటలు ఆశావహంగా ధ్వనించలేదు. సాధారణంగా భరణి గారి హావభావాలు, భాష, ఆంగిక భాష చాలా ఉత్తేజితంగాను, ఉత్సాహం కలిగిస్తూను ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలో అలా అనిపించలేదు. మరి శైలేష్ రెడ్డి గారి ప్రశ్నలు ఆయనలో ఆ చొరవను రగిలించలేదో, లేక నేనే ఎక్కువ ఆశించానో తెలీదు.

మరిన్ని ప్రశ్నలు వేసి తగు సమాధానాలను రాబట్టితే బాగుండేది. ఉదాహరణకు భాషావిషయమై నెట్లో జరుగుతున్న చర్చల గురించి వారి సంభాషణలో రాలేదు. వారి సంభాషణ మొదట్లో నేను కొంత చూడలేదు. ఒకవేళ అప్పుడు వచ్చిందేమో తెలియలేదు. అయితే, భరణి గారు ప్రవాసాంధ్రులతో సంబంధాలు కలిగి ఉన్నారని మాత్రం అనిపించింది. జంపాల చౌదరిగారు తమ పిల్లలకు పెట్టుకున్న పేర్ల గురించి ప్రస్తావించారు.

24, ఫిబ్రవరి 2006, శుక్రవారం

హైకోర్టు ఆదేశాలు

0 కామెంట్‌లు
ఇవ్వాళ, ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు:

1. ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలి.
2. విద్యాసంస్థలు ప్రకటనలు జారీ చేయరాదు.
3. హెల్మెట్లు తప్పనిసరి.
4. సీటు బెల్టులు తప్పనిసరి.
5. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్లో మాట్లాడితే వెయ్యి రూపాయల జరిమానా.

ఇవన్నీ రాష్ట్రప్రభుత్వం చెయ్యాల్సిన పనులు. మరి, వారేం చేస్తున్నట్లో!?

22, ఫిబ్రవరి 2006, బుధవారం

మమ్మేలిన మా శాసనసభ్యులకు..

4 కామెంట్‌లు
తెలుగుకు ప్రాచీన హోదా కోసం శాసనసభ తీర్మానం చేసింది. చాలా సంతోషం. అలాగే మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. అది మీచేతుల్లోనే ఉంది.

1. పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమం లోనే విద్యాబోధన జరగాలి. అందరూ ఇంగ్లీషులో చదివి, తమ పిల్లలు తెలుగులో చదివితే ఈ పోటీ యుగంలో వెనకబడిపోతారేమో ననే భయం తప్ప ఏ తల్లిదండ్రులకూ తన భాషపై ప్రేమ ఉండకుండా ఉండదు. కాబట్టి ప్రజలే తెలుగొద్దనుకుంటున్నారు అని అనొద్దు.

2. ఆంధ్ర ప్రదేశ్ లో చదివే ఎవరైనా డిగ్రీ స్థాయి వరకూ తెలుగు ఒక విషయంగా చదివితీరాలి.

3. భాష విషయమై ప్రత్యేక పరిశోధన ఒక ఉద్యమ స్థాయిలో జరగాలి. వేమన గురించి ఎప్పుడో బ్రౌను చెప్పినది తప్ప ఆయన చరిత్ర మనకింకేమీ తెలీదు. ఈ విషయమై సమగ్ర పరిశోధన జరగాలి. వేమనకు జాతీయ కవిగా గుర్తింపు రావాలి. మన వేమన అందరి వేమన కావాలి. వీటికొరకు ప్రభుత్వం పూనుకోవాలి.

4. తెలుగు ప్రాచీనత కొరకు పట్టుబట్టడం ఎంత ముఖ్యమో భాషను ఆధునికీకరించడము అంతే ముఖ్యం. వివిధ రంగాలకు సంబంధించి పారిభాషిక పదకోశాలను నిర్మించాలి.., పాత్రికేయులకు ఉన్నట్లుగా.

5. అయ్యేఎస్సుల నుండి గుమాస్తా దాకా తెలుగొస్తేనే ఉద్యోగమివ్వాలి.

6. ప్రభుత్వ కార్యకలాపాలు సమస్తం తెలుగులోనే జరపాలి. ఇంగ్లీషులో రాసి తెలుగులోకి అనువాదం చెయ్యడం కాదు. తెలుగులో రాయాలి. అవసరమైతే - ఖచ్చితంగా అవసరమైతేనే - ఇంగ్లీషులోకి అనువదించాలి.

7. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, రహదారి పేర్లు, సూచికలు తెలుగులో రాయాలి.

8. కంపెనీలు, వ్యాపార సంస్థల్లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి. తెలుగు వాడేవారికి అమ్మకం పన్నులో 1 శాతం తగ్గింపునిస్తే చాలు.., తెలుగు వాడకంలో వాళ్ళు ప్రభుత్వానికే మార్గ దర్శకులౌతారు. (తమ రాష్ట్రంలోని వ్యాపార సంస్థల బోర్డులు తప్పనిసరిగా కన్నడంలో ఉండాలని కర్ణాటకలో నిబంధన ఉందట)

మిమ్మల్నెన్నుకున్నందుకు మేం గర్వపడేలా చెయ్యండి.

చివరగా ఓ వినతి.. తెలుగు టీవీ లంగర్లు తమ వెకిలిచేష్టలు తెలుగులోనే చెయ్యాలని నిబంధన పెట్టండి. ఎన్ని ఇంగ్లీషు పదాలు మాట్లాడితే అన్ని గుంజీళ్ళు తియ్యాలి..అదీ కార్యక్రమం అవగానే, కెమెరా ఎదుటే.

భవదీయుడు

మీరిది చూసారా..?

0 కామెంట్‌లు
1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా?
2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు?
3. "బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు?

వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు...అది పెద్దదే, కొత్తదే.

ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.

20, ఫిబ్రవరి 2006, సోమవారం

మనమూ మన భాషా..

3 కామెంట్‌లు
2005 సెప్టెంబరు 19 న ఈ బ్లాగు యాహూ 360 లో రాసుకున్నాను. కానీ ఎంచేతో బయట పెట్టలేదు. సందర్భం (మాతృభాషా దినం) వచ్చింది కదాని ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను.

సంబంధిత టపాలు