24, జూన్ 2007, ఆదివారం

కౌన్సెలింగు చేసేందుకు వీళ్ళెవరు?

4 కామెంట్‌లు
తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు గాను కోస్తా, రాయలసీమ ఉద్యోగులకు తెరాస వాళ్ళు కౌన్సెలింగు (సలహా ఇవ్వడం, నచ్చజెప్పడం) చేస్తారట. సలహాలు అడిగితేనే ఇవ్వాలి. ఈ ఉచిత సలహాలేంటి? ఎవరడిగారు? ఎవరిక్కావాలివి? వాళ్ళను స్వస్థలాలకు పంపడం ప్రభుత్వం పని. ప్రభుత్వం ఆ పని చెయ్యడం లేదని ఎవరికైనా అనిపిస్తే, పోయి ప్రభుత్వంతో మొరపెట్టుకోవాలి. ఉద్యోగులను వత్తిడి చెయ్యడమేంటి మధ్యలో? ప్రభుత్వం ఫలానా సుబ్బారావును హై. నుండి గుంటూరో, శ్రీకాకుళమో, చిత్తూరో బదిలీ చేస్తే వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఆ ఫలానాపై ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. బాబూ వెళ్ళండి ప్లీజ్స్ అంటూ బతిమిలాడతారో, కర్రుచ్చుకుని గెంటుతారో అది ప్రభుత్వం ఇష్టం. ఈ తెరాస వాళ్ళెవరు కౌన్సెలింగు చెయ్యడానికి?


అధికారంలో ఉండి హంగూ ఆర్భాటాల్తో తిరిగే రోజుల్లో వీళ్ళంతా ఏం చేసినట్టు? తెలంగాణ రాష్ట్రం ఇమ్మని అడుక్కునే రోజుల్లో, కాంగ్రెసు దేవత కటాక్షం కోసం దేబిరించే రోజుల్లో ఈ జీవోలు గుర్తుకు రాలేదా? అప్పుడేం చేసారో ఈ కౌన్సెలింగు నేతలు? తెలంగాణాకు అనుకూలంగా అమ్మగారి చేత ఏదో ఒక ప్రకటన చేయించమని దిగ్విజయ్ సింగును ముష్టెత్తుకునే రోజుల్లో ఈ జీవోలను ఏ పరుపుల కింద దాచారు? ఇవ్వాళ మాత్రం ఈ సలహా దళాన్నొకదాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీసులకెళ్ళి తైతక్కలాడుతున్నారు. జీవోను అమలు చెయ్యకపోతే ప్రభుత్వం మెడలు వంచి చేయించుకోవాలి లేదా చేతులు ముడుచుక్కూచ్చోవాలి . అంతేకానీ, ఉద్యోగులనిలా హింసించడమేమిటి?

8, జూన్ 2007, శుక్రవారం

ఇన్నాళ్ళూ ఏమైపోయారు పాల్ గారూ?

7 కామెంట్‌లు
కిలారి ఆనంద్ పాల్:
"ఎన్నికలప్పుడు రాజశేఖరరెడ్డి నన్ను 5 మిలియను డాలర్లు డబ్బులడిగాడు. నేనివ్వనన్నాను. అంచేత నాపై పగబట్టి ఆయనా సోనియాగాంధీ కలిసి నా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ కు దేశంలో అనుమతి రద్దు చేసారు."

మూడేళ్ళ తరవాత ఆయనకీ సంగతి హఠాత్తుగా గుర్తొచ్చి, ఈ ముక్క పత్రికల వాళ్ళ దగ్గర బైటపెడితే, ముఖ్యమంత్రి ఫక్కున నవ్వేసాడు. (అంటే ఏదో ఉందన్నమాటే!)

అసలు పాల్ కు రాజకీయ నాయకులతో పనేంటి? కూటములు పెట్టి ప్రజలకు స్వస్థత ప్రసాదించే దైవజనుడు రాజకీయులతో అంత పూసుకు తిరగాల్సిన అవసరం ఏంటి? 108 దేశాల్లో తిరిగాను, 60, 70 మంది ప్రభుత్వ, దేశాధినేతలతో ప్రత్యక్షంగా పరిచయం ఉంది. ఇరాక్ లో నా శాంతి ప్రయత్నాలు విజయం సాధించే దశలో, అసూయతో బుష్షు అడ్డం పడి యుద్ధానికి వెళ్ళాడు. బుష్షూ రైసూ కలిసి సోనియా గాంధీతో కుమ్మక్కై నా సంస్థకు అనుమతులు రాకుండా చేసారు.. ఇలా ఆయన చెప్పుకు పోతుంటే మనకూ నవ్వొచ్చింది. ఆ రాత్రి టీవీ9 వాడి ఫోనాఫోనీ కార్యక్రమంలో చూడాలి అయ్యవారి తీరు.. అబ్బో..!

టీవీ 9 వాడి ఫోనాఫోనీ ఎంతో రంజుగా మంచి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందిస్తూ సాగింది. పైన చెప్పినవి కాక కొన్ని జోకులు చూడండి..

పాల్ ఆయన ఎదురుగా ఉన్న ఫైలు లేపి చూపిస్తూ మంత్రి మారెప్ప, రోశయ్య, నట్వర్ సింగు, ఇలా ఎందరో ఉత్తరాలు ఇచ్చారు. ఇందులో అందరి ఉత్తరాలు ఉన్నాయి. సమయం వచ్చినపుడు బయట పెడతాను అంటూ చెప్పినవాడు, టీవీ 9 రజనీకాంత్ "ఏదీ చూపించండి" అంటే వెతికాడు కానీ కనిపించలేదు.

ఈ లోగా మంత్రి మారెప్ప లైను లోకి వచ్చాడు..
పాల్ ఉత్సాహంగా ఆ మారెప్ప గారూ చెప్పండి అన్నాడు. మారెప్ప ఆయన్ని నిరాశ పరుస్తూ ఈ పాల్ చెప్పేవన్నీ అబద్ధాలు. నేను ఆయన తమ్ముడికి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవం అని అన్నాడు. వెంటనే పాల్, 'ఇదుగో మీరు రాసిన ఉత్తరం నా దగ్గరే ఉంది. అసలు అందులో మీరేం రాసారో చెప్పండి', అని అడిగాడు.

అప్పుడు "మంత్రి" మారెప్ప అద్భుతమైన డవిలాగు చెప్పాడు "అబ్బే నేనేం రాయలేదు, తెల్ల కాగితమ్మీద సంతకం పెట్టిచ్చాను". (ముఖ్యమంత్రి గారు ఫైలు చూడకుండానే సంతకం పెట్టానని చెప్పుకున్నాడు. వారి దర్బారులో మంత్రేమో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు. శభాష్!) మతి పోయిన రజనీకాంత్ తేరుకుని "అలా తెల్ల కాగితమ్మీద సంతకం ఎలా పెట్టారండి" అనడిగితే ఈయన దైవజనుడు కదా అని పెట్టాను అని అన్నాడు.

అన్నిటి కంటే గొప్ప జోకు ఏంటంటే, పాల్ గారు పదే పదే చెప్పిన ఓ మాట..
"నా సంస్థను ఇలా అడ్డుకోవడం వలన వీళ్ళెంత తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం లేదు.. ఎంతో మంది విధవరాండ్రకు అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలోని వేలాది విధవరాండ్రకు (ముందు లక్షలాది అని అన్నాడు) నేను మేలు చేస్తున్నాను" ఇలా పదే పదే విధవరాండ్రు అని ఆయన అంటూ ఉంటే, నాకు గురజాడ వారి గిరీశమే గుర్తుకొచ్చాడు.

ఇహ జోకులాపి విషయానికొస్తే..

మూడేళ్ళ కిందట వీళ్ళు డబ్బులడిగారని పాల్ గారు చెబుతున్నారు. అది దిగ్భ్రాంతి కలిగించేంత, నమ్మలేనంత విషయమేమీ కాదు. అడిగే ఉంటారు! కానీ..
  • డబ్బుల సంగతి ఇన్నాళ్ళూ ఎందుకు దాచారు?
  • అసలు వాళ్ళతో ఈయనకు తగవు రావడానికి కారణం అదేనా, లేక.. ప్రజలకు చెప్పనిది, చెప్పుకోలేనిది ఇంకా ఏమైనా ఉందా?
  • డబ్బులివ్వనందున ఈయన సంస్థకు అనుమతులు ఇవ్వడం లేదంటున్నారు. అందుకే అ సంగతులన్నీ ఇప్పుడు బైట పెట్టానంటున్నారు. మరి అనుమతులు నిరాటంకంగా కొనసాగి ఉంటే బయట పెట్టేవారు కాదా?
  • ఇప్పటి వరకూ ఎవరెవరు ఈయన్ని డబ్బులడిగారు? ఎంతెంత ఇచ్చారు?
  • కూటముల మాటున ఈయన రాజకీయులతో అనైతిక సంబంధాలు పెట్టుకున్నట్టుగా అనుమానం కలుగుతోంది. ఏయే పార్టీలతో ఈయనకు సంబంధాలున్నాయి?
అసలు పాల్ కు అంతంత సొమ్ము ఇప్పించే స్తోమత ఎక్కడిది అనే సంగతి విచారించాలి. అలాగే పైదేశాల నుండి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు తెస్తున్న ఇతర మత ప్రబోధకులు, ప్రచారకులను కూడా విచారించాలి. మత ప్రచారం పేరుతో వీళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో ఆరా తీయాలి.

3, జూన్ 2007, ఆదివారం

ఏది చరిత్ర?

4 కామెంట్‌లు
గజనీ మహమ్మదు మన దేశం మీదకి 17 సార్లు దండెత్తి వచ్చాడు. మన రాజులను చిత్తుగా ఓడించి దేవాలయాలను ధ్వంసం చేసి, సంపదలను దోచుకుపోయాడు.

ఇది మనం చదువుకున్న చరిత్ర.

కానీ పంజాబు రాజు ఆనందపాలుడు గజనీ మహమ్మదుకు రాసిన ఉత్తరం చూడండి ..

"నీ రాజ్యం మీదికి తురుష్కులు దండెత్తి వచ్చారని, ఖురాసాన్ ప్రాంతాన్ని ఆక్రమించారని విన్నాను. నువ్వు కావాలంటే ఐదువేల గుర్రాలతో, పదివేల సైనికులతో, నూరు ఏనుగులతో నేను నీకు సాయంగా వస్తాను. లేదా, నీకిష్టమైతే అంతకు రెట్టింపు బలగంతో నా కుమారుడిని పంపుతాను. నేనీ ప్రతిపాదన చేస్తున్నది నీ అనుగ్రహం కోసం కాదు. నేను నిన్ను చిత్తుగా ఓడించి పరాభవించాను. నీపై నేను సాధించిన పైచేయి నాకు తప్ప మరొకరికి దక్కకూడదని నా కోరిక"

ఈ ఉత్తరం గురించి రాసింది ఎవరో కాదు, సాక్షాత్తూ గజనీ ఆస్థానంలోని చారిత్రకుడు, అల్ బెరూనీ. అంటే దీనర్థం గజనీ మన మీదికి దండెత్తిన మొత్తం 17 సార్లూ గెలవలేదన్న మాట. మరి మనకలా ఎందుకు చెబుతున్నారు? ఎవరా చెప్పేది?

ఇదీ, ఇలాంటి అనేకానేక పాత వాస్తవాలు కొత్తగా తెలుసుకోవాలంటే (తెలుసుకోవాలి కూడా) ఎం.వి.ఆర్.శాస్త్రి గారు రచించిన ఏది చరిత్ర? అనే పుస్తకం చదవాలి. ఇదే కాదు దాని తరవాత వచ్చిన ఇదీ చరిత్ర కూడా చదవాలి.

రచయిత శాస్త్రి గారు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు.

ఈ పుస్తకాల గురించి నాకు చెప్పిన త్రివిక్రమ్ కు కృతజ్ఞతలతో..
- ఏది చరిత్ర? గురించిన వికీపీడియా వ్యాసం చూడండి. ఆ వ్యాసాన్ని విస్తరించండి.

2, జూన్ 2007, శనివారం

మీస వైరాగ్యం భక్తి వైరాగ్యం

8 కామెంట్‌లు
అభిప్రాయాలు మార్చుకోకపోతే రాజకీయ నాయకుడు కాలేడు అని పెద్దలన్నారు. రాజకీయుడే కాదు, అభిప్రాయాలు మార్చుకోకపోతే చాలా కాలేము అని అంటాన్నేను. జీవితంలో కనీసం ఓ ఐదారొందల సార్లు అభిప్రాయాలు మార్చుకోకపోతే అంత బతుకు బతికీ ఉపయోగమేముంటుంది చెప్పండి?! అసలు అభిప్రాయాలు మార్చబట్టేనట, చలం అరుణాచలమెళ్ళింది! నేను మార్చుకున్న ఓ అభిప్రాయం గురించి చెబుతాను.. ఆ అభిప్రాయం మీసమ్మీద.

ఆ మధ్య తిరపతెళ్ళి గుండు చేయించుకొచ్చాను. ఏవో కష్టాల్లో పడి ఉంటాడు.., దేవుడు గుర్తొచ్చాడు, లేపోతే తిరుపతెందుకెళ్తాడు అని అనుకుంటున్నారా? నిజమే మరి, కష్టాల్లో ఉన్నప్పుడు కాక, అంతా బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి విసిగించడం ఎందుకు చెప్పండి? అసలు నాకో సందేహం.. కష్టాలొచ్చినపుడు, ఆస్తికులు దేవుడికి మొక్కుకుంటారు, చక్కహా గుండు చేయించుకుంటారు, మరి నాస్తికులు గుండెప్పుడు చేయించుకుంటారబ్బా?

నాస్తికులు "దేవుడు లేడు, భక్తీ ముక్తీ అంతా ట్రాష్ అంటూ ఇంగ్లీషులో కొట్టిపారేస్తుంటారు కదా.. వీళ్ళకి పాపం తగలదూ? చచ్చిపోయాక నరకానికి పోరూ?" అని చింత ఉండేది నాకు. ఈ మధ్య ఓ బ్లాగులో (పేరు గుర్తు లేదు) రాసింది చదివాక నాకా సందేహాలు పటాపంచలైపోయాయి. అందులో ఇలా రాసారు..

జయ విజయుల కథ తెలుసు కదా, వాళ్ళు విష్ణుమూర్తి ద్వారపాలకులు, పరమభక్తులు. సనక సనందనాదుల శాపవశాన ఏడు జన్మలు విష్ణువుకు దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శాపవిమోచనం కోసం విష్ణువు కాళ్ళావేళ్ళా పడితే సరే మూడు జన్మలు నాకు బద్ధ శత్రువులుగా నన్ను తిడుతూ జీవించండి. ఆ తరువాత నన్ను చేరుకోవచ్చు అని చెప్పాడట. ఆ విధంగా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు, రావణ కుంభకర్ణులు, జరాసంధ కంసులు మనకు దొరికారు. అదే విధంగా మన నాస్తికులు కూడా గత జన్మాల్లో శాపగ్రస్తులై, సదరు శాప విమోచనం కోసం ఈ జన్మలో దేవుణ్ణి తిడుతూ ముక్తి కోసం ఎదురు చూస్తున్నారట. అంచేత వాళ్ళ గురించి మనం దిగులు చెందనక్కరలేదు, మనకంటే వీర భక్తులు వాళ్ళు! శ్రీ వేంకటేశ్వరుడు వారికి ముక్తిని ప్రసాదిస్తాడు, నోడౌట్! సో.. నాస్తిక్స్, డోంట్వర్రీ!

ఇక నా గుండు దగ్గరికి వస్తే.. గుండు చేయించుకున్నపుడు మీసం కూడా తీసెయ్యాల్సి వచ్చింది. గుండు చేయించుకుని రాంబగీచాలో గదిలోకి వెళితే వీడెవడన్నట్టు చూసారు పిల్లలు. అద్దంలో చూసుకుని నేనే గుర్తుపట్టలా.. ఇహ వాళ్ళేం గుర్తు పడతారు! మూతి మీద మీసం లేకపోతే నాకు నచ్చదు. మరిప్పుడెలా? మరీ చూసుకోలేకుండా ఉన్నానే! మీసమ్మీద నా అభిప్రాయం మార్చుకుంటే తప్ప ప్రశాంతంగా ఉండలేననిపించింది. కృష్ణుడికి మీసముందా? వాజపేయీకి మీసముందా? అని సమాధానపడ్డాను. అలా అభిప్రాయం మార్చుకున్నాక మీసం లేకపోయినా బానే అనిపించింది. పదిరోజుల్లో మీసమ్మొలిచాక మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నాను లెండి.

సంబంధిత టపాలు