25, అక్టోబర్ 2007, గురువారం

శభాష్, శ్రీరమణా!

3 కామెంట్‌లు
అక్టోబరు 25 న ఈనాడు పేపర్లో హైదరాబాదు విభాగంలో వచ్చిందీ వార్త! కూకట్పల్లి హౌసింగు బోర్డులో పద్దెనిమిదేళ్ళుగా ప్రజల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక పిచ్చివాడు, ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతూ, పనిలో పనిగా దసరా, దీపావళి పండగల శుభాకాంక్షలు కూడా చెబుతూ కాలనీ అంతటా బ్యానర్లు పెట్టాడంట.

నిజానికి ఈ బ్యానర్లు పెట్టింది పి.వి.శ్రీరమణ అనే వ్యక్తి.

***

రోడ్లమీదా, కాలనీల్లోనూ అలా శుభాకాంక్షలు చెప్పే బ్యానర్లు కొల్లలుగా చూస్తూంటాం. పెద్దకారు రాజకీయులకు చిన్నకారు వాళ్ళూ, చిన్నకారు సన్నకారు వాళ్ళకు వాళ్ళ చెంచాగాళ్ళూ పెడుతూ ఉంటారు ఇలాంటి బ్యానర్లు. ఫలానావాడి పుట్టినరోజు వచ్చిందనుకోండి.. "వారికి శుభాకాంక్షలు" చెబుతూ పెడతారు. ఆ ఫలానావాడు బ్యానరులో ఒక పక్కన నుంచోనుంటాడు. రెండో పక్కన బ్యానరు కోసం అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టినవాడు నుంచోనుంటాడు. ఇహ కింద, వాళ్ళ కాళ్ళదగ్గర, ఓ ఏడెనిమిది మంది సత్రకాయల ఫొటోలుంటాయి. ఏ బ్యానరైనా కొద్దిగా అటూ ఇటూగా ఇదే మూస! సందర్భాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఫలానావాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాడనో, ఫలానా "అన్న" ముష్టి పార్టీ గల్లీ కమిటీ మెంబరైన సందర్భంగానో, మరోటో మరోటో! ఇహ పండగలప్పుడూ ఈ బాపతు జనాల హడావుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు.

***

పాపం శ్రీరమణ చిర్రెత్తిపోయినట్టున్నాడు ఈ బ్యానరాసురుల గోలతో; ఆ పిచ్చివాడి పేరు మీద బ్యానర్లు తయారు చేసి కాలనీలో అంటించాడు. ఈ బ్యానరాసురుల్ని వెక్కిరించడానికే పెట్టినట్టు వాళ్ళకు వెంటనే అర్థం కాదేమోననే సంకోచంతో ఈ మాట కూడా చెప్పాడట.. "నేను ఎవర్నీ నొప్పించే ఉద్దేశ్యంతో పెట్టలేదు. నాయకులు ప్రజలకి ఇబ్బందులు కలిగించకూడదనే సందేశమిస్తూ ఇలా పెట్టాను".

ఈ రాజకీయ సత్రకాయలకు సంగతి అర్థమవుద్దంటారా అని!!


మీ నిరసనను తెలియజేసినందుకు శభాష్ శ్రీరమణా!

17, అక్టోబర్ 2007, బుధవారం

ఏంటో..

4 కామెంట్‌లు
  • నాయకులకు పెద్దపెద్ద విగ్రహాలు పెడతారు - అంత కంటే పెద్ద నిచ్చెనలు వాళ్ళ భుజాల మీదుగా కడతారు
  • ఉచిత విద్యుత్తు.. మోటారు కోసం ఉండదు - షాకిచ్చి చంపేందుకు మాత్రం వెనకాడదు.
  • పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - పదకొండు మంది ఆడవారి గోడు మాత్రం అడవి పాలు
  • దోపిడీ మీటర్ల నరికట్టలేరంట - ఆటోలు తీసేసి కార్లు పెడతారంట.
  • గోధుమపై నెనరు - వరినసలే కనరు
  • బయటి రింగు రోడ్లకు.. రెండువేల కోట్లంట - ఊళ్ళో రోడ్లకు.. రెండు కోట్లు లేవంట
  • ఒకరు గజదొంగ ఇంకోరు జగదొంగ (ఒకడు చిక్కడు ఇంకోడు దొరకడు) - ఒక్క జడ్జేం చాలుతాడు వీళ్ళను పట్టంగ! (అసలు, జడ్జీలతో కాకుండా జే.ఎం. లింగ్డో, రామచంద్ర సమాల్ లతో ఓ కమిషను వేసి వీళ్ళ సంగతి చూడమనాలి.)
  • వాళ్ళు రొప్పుతూ రోజుతూ రోడ్డేస్తారు - జలమండలి వాళ్ళు నవ్వుకుంటూ తవ్వేస్తారు (తారు కాసే మంట మీద నీళ్ళు జల్లినట్టు)
  • నిజాం పాలన తెస్తడంట - పాలిస్తడా లేక పీడిస్తడా?
  • సారీ బుష్, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యలేను - సరే బాస్, న్హా..కా సంగతి తెలుసులే!
  • సెన్సెక్సు పెరిగితే నల్లేరుపై నడక - పడితే..., పల్లేరుపై పడక

16, అక్టోబర్ 2007, మంగళవారం

బస్సు దోపిడీ!

4 కామెంట్‌లు
ప్రైవేటు బస్సుల అరాచకాన్ని అరికట్టేందుకు దసరా సమయాన ఒక దుర్గమ్మ పూనుకోవలసి వచ్చింది. ప్రైవేటు బస్సుల ఆగడాల గురించి మనకు తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వానికీ ఇవి తెలుసు. ఇవిగో కొన్ని..

  1. ప్రభుత్వానికి జెల్ల కొట్టడంలో వీళ్ళది అందె వేసిన చెయ్యి. టూరిస్టు క్యారేజిగా తిరగాలవి.. కానీ స్టేజి క్యారేజిగా తిరుగుతాయి. ఆంధ్ర దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసా సంగతి, సంబంధిత అధికారులకు తప్ప!
  2. హై. నుండి మీ ఊరికి ఒక బస్సూ, అట్నుండి ఇటొకటీ ఒకే సమయానికి బయలుదేరుతాయి. ఒక్కో బస్సుకు ఒక్కో ప్రత్యేక రిజిస్ట్రేషను నంబరుంటుంది (కదా!). రెంటికీ పన్ను కడతారని మనబోటి అమాయకులం అనుకుంటాం (కదా!). పాపం ప్రభుత్వమూ అలాగే అనుకుంటుంది. (ఔనా! ఏమో?) కానీ వాళ్ళు ఒకదానికే కడతారు.. ఆ నంబరు పెట్టుకునే రెండు బస్సులూ తిరుగుతాయి.
  3. రాత్రి ఎనిమిది నుండి పదింటి దాకా కూకట్‌పల్లి నుండి దిల్‌సుఖ్ నగరు దాకా చూడాలి.. మాఊరు, మీ ఊరని లేదు.. మొత్తం రోడ్డంతా వాళ్ళదే. రోడ్డు మీంచి ఒక్క అంగుళం కూడా దిగరు. మన హై. ముష్టి రోడ్లకు తోడు వీళ్ళ ఆగడం జతై మనకు నరకమే కనిపిస్తుంది.
  4. బస్సుపైన బస్సెత్తున సామానేస్తారు. హై. దాటేటప్పటికి పన్నెండు దాటుద్ది. ఇక ఆపైన ప్రయాణం మేఘాల్లో తేలిపోతూ సాగుతుంది. పైప్రాణాలు పైనే పోతాయి. మొన్న ఈనాడులో చూసాం కదా ఏం జరిగిందో!
  5. ప్రజలను దోచడంలో వీరు ఎమ్మెన్సీలకు పాఠాలు చెప్పగలరు. ప్రతి శుక్రవారం హై. నుండి గుంటూరు వెళ్ళే కొన్ని (అన్నీనా.. ఏమో?) బస్సుల్లో టిక్కెట్టు వెల పెరుగుతుంది. ఆది వారం అటునుండి వచ్చే టిక్కెట్లు వాస్తాయి. వీకెండుకు ఇంటికెళ్ళే సాఫ్టువేరు శ్రీమంతుల స్పెషలది. ఇది వారాంతపు స్పెషలు దోపిడీ. టిక్కెట్ల నల్లబజారు! సినిమా హాళ్ళ వాళ్ళు కొత్త సినిమాలకు టిక్కెట్లను పెంచేసినట్టు!!
  6. మీ ఊరి నుండి కూకట్‌పల్లి వెళ్ళాలని ఎక్కుతారు. పొద్దున్నే ఎస్సారు నగర్లో ఆపేసి, ఇకపోదు, అదిగో ఆ బస్సెక్కండి.. ఇదుగో ఈ ఆటోలో వెళ్ళండి అని అంటారు.
ఈనెల 5న మా అమ్మానాన్నా పొన్నూరు నుండి ప్రైవేటు బస్సులో వచ్చారు. రాత్రి రెండున్నరకి మా నాన్న ఫోను చేసారు.. "బస్సు బోల్తా పడింది, చీకటిగా ఉంది, ఎక్కడున్నామో తెలీదు, అంతా క్షేమమే, కంగారు పడొద్దు" అని. కాస్సేపటి తరవాత ఏదో ఆర్టీసీ బస్సులో ఎక్కి, పొద్దున తొమ్మిదిన్నరకు ఇంటికి చేరారు. ఇంతకీ, బస్సు డ్రైవరు పారిపోయాడు! వాడు అసలు డ్రైవరు కాదు.. అసలు డ్రైవరు గారి బావమరిదో మరొకడోనంట. అంతకు ముందు అక్కడెక్కడో ఆపి, దిగిపోయి, కాస్సేపాగాక మళ్ళీ ఎక్కాడంట.. అక్కడ మందేసి ఉంటాడని ప్రయాణీకుల అనుమానం!

ప్రైవేటు బస్సులని ఎత్తెయ్యాలని కాదు.. వాటిని అదుపు చెయ్యాలి. ప్రజలను వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుండి రక్షించాలి. టిక్కెట్టు రేట్లు అదుపు చెయ్యాలి (ఆర్టీసీ వాళ్ళను చేసినట్టుగా). ప్రయాణీకుల బళ్ళు ప్రయాణీకుల కోసమే నడవాలి. సరుకు రవాణా కోసం వాడరాదు.

ప్రస్తుతానికి పూనం మాలకొండయ్యదే పైచేయి. చూద్దాం, ప్రభుత్వమామెను ఎన్నాళ్ళు పనిచెయ్యనిస్తుందో!

11, అక్టోబర్ 2007, గురువారం

వ్యాఖ్యోపాఖ్యానం

23 కామెంట్‌లు
తెలుగు బ్లాగుల రాసి బాగా పెరుగుతోంది, ఇక బ్లాగరులు 'వాసి'పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వింజమూరి విజయకుమార్ గారు మధ్యంతర మార్గ నిర్దేశనం లాంటిది చేసారు. బ్లాగు నాణ్యతకై బ్లాగరులంతా పునరంకితం (అమంగళం ప్రతిహతమగుగాక :) ) కావాలని వారి ఉద్దేశ్యం కాబోలు.

10, అక్టోబర్ 2007, బుధవారం

మా పున్నమ్మ బడి

12 కామెంట్‌లు
నా గత జాబొకటి రాసేటపుడు నా చిన్నప్పటి బడి జ్ఞాపకం ఒకటి రాయాల్సొచ్చింది. ఆ సందర్భంగా జ్ఞాపకాలను అలా తవ్వుకుంటూ పోతుంటే చాలా బయటపడ్డాయి. కొన్ని బయటకు చెప్పుకోగలిగేవి, కొన్ని మనసులోనే మాగేసి ఆస్వాదించాల్సినవి. చెప్పుకోగలిగేవాటిలో కొన్ని ఇక్కడ.

9, అక్టోబర్ 2007, మంగళవారం

ఎవరెవరి సంపాదనలెంతెంత?

7 కామెంట్‌లు
నాయకుడు, ప్రతినాయకుడుల సంపాదనలు ఎవరెవరివి ఎంతెంతో తేల్చడానికి విచారణ కమిషను వేసేందుకు సిద్ధమట! ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మంచిది. ఏం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారో చెబితే సుఖమేముంది? చేస్తే గదా ప్రయోజనం!?

కాబట్టి ముఖ్యమంత్రి గారూ! వెంటనే ఆ కమిషనేదో వెయ్యండి. మీరిద్దరేగాదు, రాజకీయులంతా ఎవరెవరు ఎంతెంత మెక్కారో తేల్చండి.

మీరిద్దరూ అవినీతిపరులని తేలిందనుకోండి.. మీ సొమ్ములు గుంజేసుకుంటే ఒక్క గజం భూమి కూడా అమ్మకుండా మొత్తం ప్రాజెక్టులన్నిటినీ కట్టి పారెయ్యొచ్చు. (మీరే చెప్పుకున్న మీమీ ఆస్తుల వివరాలను బట్టి చెబుతున్నాను) మాకు రెండిందాలా లాభం.. మీరు కొట్టేసిన మా డబ్బులు మాకు తిరిగొచ్చేస్తాయి. మిమ్మల్నెలాగూ జైల్లో తోసేస్తారు కాబట్టి మాకు మీ పీడ విరగడౌతుంది. ఇంకో లాభం కూడా ఉంది.. మీ గతి చూసాక మీ తరవాత వచ్చేవాళ్ళు మీలాగా బరి తెగించరు.

అలాకాక, మీరు అవినీతిపరులు గాదనీ, స్వచ్ఛమైన తెల్ల చొక్కాల్లాంటి వాళ్ళనీ తేలిందనుకోండి.. మా ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకుంటాం. ఎన్ని దర్యాప్తు ప్రహసనాలు చూళ్ళేదు గనక!

2, అక్టోబర్ 2007, మంగళవారం

హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు... ముస్లిము సోదరులు

16 కామెంట్‌లు
హైదరాబాదు జంటపేలుళ్ళపై నా గతజాబు, దానిపై వచ్చిన వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఆ వ్యాఖ్యలకు సమాధానమే ఈ జాబు.

ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఉగ్రవాదులతో చేతులు కలపడాన్ని మనమేమనుకోవాలో చెప్పండి. -క్లుప్తంగా ఇదీ నా గత జాబు! దీనిపైన వచ్చిన విమర్శలోని ముఖ్యాంశాలు, నా జవాబులు:

1, అక్టోబర్ 2007, సోమవారం

ప్రజల సొమ్ము, సబ్సిడీల పాలు

10 కామెంట్‌లు
కిలో బియ్యం రెండు రూపాయలకే!
ఉచితంగా మూడు సెంట్ల భూమి!
ఉచిత కరెంటు
ఉచిత అది
ఉచిత ఇది
...

బహిరంగంగా చేస్తున్న ఓట్ల వేలం ఇది. వీళ్ళ సొమ్మేం బోయింది, వీళ్ళు మింగేసిన దాంటోంచి ఇవ్వడం లేదుగదా! మన జేబుల్లోంచి తీసేసుకున్నదే ఇస్తున్నారు. ప్రజల డబ్బులతోటి ప్రజల వోట్లను కొనాలను చూస్తున్నారు. కిలో బియ్యం మార్కెట్లో పాతిక రూపాయల దాకా ఉంది. మార్కెట్టు రేటుకు బియ్యాన్ని కొనుక్కొనే తాహతును ప్రజలకు సంపాదించి పెట్టాల్సింది పోయి, దాదాపు 20 రూపాయల సబ్సిడీ ఇస్తారట. సరే ప్రస్తుతానికి ఇచ్చారుపో.. ఎన్నాళ్ళకు ప్రజలకా తాహతు సంపాదించి పెడతారు? ఆ మాట చెప్పిన పాపాన పోలేదొక్కడు కూడా. దాదాపు పాతికేళ్ళుగా బియ్యంపై సబ్సిడీ ఇస్తూనే ఉన్నారు, ప్రజలికింతవరకు ఆ తాహతు చేకూరలేదు. ఈ సబ్సిడీ పథకం ప్రజలను జోకొట్టేందుకు పనికొచ్చేదే గానీ, దీర్ఘకాలిక ప్రయోజనం శూన్యం. ఏ సబ్సిడీకయినా "ఇదిగో ఫలానా సంత్సరానికల్లా ప్రజలకు ఈ సబ్సిడీ అవసరం లేకుండా చేస్తాం" లాంటి లక్ష్యాలంటూ ఉండాలి. లేకపోతే రిజర్వేషన్ల లాగా పరిమిత ప్రయోజనకరమో నిష్ప్రయోజనమో ఐపోతాయి.

అయితే ఈ వాగ్దానశూరులకు కొన్ని ప్రశ్నలు..
  1. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు?
  2. మీ పరిపాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఏ స్థాయికి తీసుకెళ్తారు? తలసరి ఆదాయ లక్ష్యం ఏమిటి?
  3. రాబోయే ఐదేళ్ళలో ఏయే పన్నులను ఏ లెక్ఖన పెంచబోతున్నారు? ఏ స్థాయిని దాటి పెంచరో కూడా చెప్పండి.
  4. సబ్సిడీలు పొందని ప్రజల కొనుగోలుశక్తిని ఎలా రక్షిస్తారు? ఆ శక్తిని ఏ స్థాయికి పెంచుతారు? ఎలా పెంచుతారు?
  5. ఊరికినే ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తారు సరే. ఆ స్థలాలకు అర్హత లేని మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకునే మార్గమేంటి? దానిపై మీ ప్రతిపాదన ఏమిటి? ఇప్పటి భూధరల మంటల్లో మధ్యతరగతి ఇంటి ఆశలు ఆహుతై పోతున్నాయి. మరి వారికెలాంటి రక్షణనిస్తారు?
  6. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తారు సరే.. బయట బజారులో బియ్యం రేటును ఎంతవరకు నియంత్రిస్తారు?
  7. రైతుకు కనీస ధరను ఎలా ఇస్తారు? ఎంత ఇస్తారు? పైవాటికి దీనికీ సమతుల్యతను ఎలా సాధిస్తారు?

కలరు టీవీలిస్తారా అని అడిగితే 'చూద్దాం బ్రదరూ' అని నవ్వాడట మన ఘన ప్రతిపక్ష 'నాయుడు'. ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగలు బట్టలారేసుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావన్న వ్యక్తి, ఇప్పుడా తీగలను పట్టుకుని ఉయ్యాలలూగమంటాడా!?

సంబంధిత టపాలు