20, సెప్టెంబర్ 2006, బుధవారం

రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?

రాష్ట్ర విభజన విషయమైఈ జాబు రాస్తున్నాను. తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా అనే విషయం జోలికి పోవడం లేదు. రాష్ట్రం విడిపోవాలా లేదా అనే విషయం జోలికీ పోవడం లేదు. అవన్నీ అధికారం కోసం ఆవురావురంటున్న వారు, తహతహలాడుతున్నవారు చెప్పాలి, మనం వినాలి. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడితే వీళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయా అనేది ఆలోచిస్తున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పడే పక్షంలో ఏం జరుగుతుంది అనే నా ఊహకు రూపమే ఈ వ్యాసం. (కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్ర అనడం రివాజుగా వస్తూంది. అది అంత సబబు కాకున్నా నేనూ ఇక్కడ అలాగే వాడుతున్నాను.)

తెలంగాణ ఎందుకు కావాలంటే.. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం అని తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ అంటున్నారు. ఇది నిజాయితీతో కూడిన కోరిక. కేసీయార్ దాన్ని కాస్త విస్తరిస్తూ, తెలంగాణ కేవలం అభివృద్ధి కోసమే కాదు.., ఆత్మ గౌరవం కోసం, స్వయంపాలన కోసం అని కూడా అన్నారు. ఆమధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం ఫోనాఫోనీ కార్యక్రమం లో కూడా ఇదేమాట చెప్పారాయన.

నిధులూ, నీళ్ళు, నియామకాల సంగతి చూస్తే, ప్రత్యేకరాష్ట్రంలో ఈ మూడు 'న'కారాలూ నకారం కాబోతున్నాయి. ముందుగా నిధుల సంగతి చూద్దాం.



రాష్ట్ర విభజన అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పడడమా? కాదు! తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలు ఏర్పడడం. రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి ఏ గొడవలూ లేనట్లే! మొట్ట మొదటి గొడవ రాజధాని విషయంలోనే! హైదరాబాదు ఇద్దరికీ కావాల్సిందే అని ఆంధ్ర నాయకులు అడుగుతారు. కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడంలేదు. కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే అలా ఉండొచ్చు. (ఎవరి రాజధాని వాళ్ళకు ఉంటేనే దీర్ఘకాలంలో మంచిది. విభజన సమయంలో బేరసారాలకు ఒక ఆయుధంగా ఆంధ్ర నాయకులు హైదరాబాదును వాడుకుంటారు.) తెలంగాణ రాజధాని ఉన్నచోటే ఉంటుంది. ఆంధ్రకు మాత్రం కొత్తగా ఓ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాష్ట్రానికి మౌలికంగా ఏం కావాలి? శాసనసభ కావాలి, సచివాలయం కావాలి, హైకోర్టు కావాలి, రాష్ట్ర స్థాయి పరిపాలనా యంత్రాంగం కావాలి. డైరెక్టరేట్లు కావాలి, కేంద్ర పోలీసు వ్యవస్థ కావాలి. మొత్తమ్మీద ఓ పరిపాలనా వ్యవస్థతో కూడిన రాజధాని కావాలి. తెలంగాణకు హైదరాబాదు ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. లేనిదల్లా ఆంధ్రకే! ఆంధ్రకు ఓ కొత్త రాజధాని నిర్మాణం కావాలి. దానికి నిధులు కావాలి. ఇప్పుడు చెప్పండి.. రాష్ట్ర విభజన జరిగితే నిధులెవరికి కావాలి? ఇప్పటికే ఇవన్నీ ఉన్న తెలంగాణకా? అసలేమీ లేని ఆంధ్రకా? ఆంధ్రకే!

పైగా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చెందిన హైదరాబాదును వదులుకున్నందుకు, అక్కడి నుండి వస్తున్న ఆదాయాన్ని వదులుకున్నందుకు బదులుగా, సాపేక్షికంగా తమ నగరాలను అభివృద్ధి చేసుకునేందుకు కూడా కోస్తా, రాయలసీమలు నిధులు అడుగుతాయి. ఇదంతా కొత్త ఖర్చే కదా. విభజన జరక్కపోతే ఆ నిధులను ఇతరేతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టొచ్చు. కాబట్టి ఆ దామాషాలో తెలంగాణకు వచ్చే నిధులు తగ్గినట్లే!

పైగా కొత్త రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేస్తే రాయలసీమవాళ్ళు, రాయలసీమలో ఏర్పాటు చేస్తే కోస్తా వాళ్ళు తగు రక్షణలు కోరుతారు. రక్షణలంటే మరోటేమీ కాదు.., నిధులు, మౌలిక వసతులు! నిజానికి ఇది అవసరం కూడా.. ఎందుకంటే మళ్ళీ మరో విభజన జరిగి, ఇప్పుడు హైదరాబాదును వదిలి పోవాల్సి వచ్చినట్లే రేపు ఒక ప్రాంతం వాళ్ళు రాజధానిని వదులుకోవాల్సి వస్తే ఇప్పటి వ్యథ మళ్ళీ లేకుండా ఉండేందుకు. దురాశాపరులైన రాజకీయులు అన్నికాలాల్లోను, అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు.

ఇక్కడొక విషయం గమనించాలి.. తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రతో పోల్చి చూసేటపుడు తెలంగాణ నాయకులు హైదరాబాదును పరిగణనలోకి తీసుకోరు. 'హైదరాబాదు అందరిదీ, దాన్ని వదలి, మిగతా తెలంగాణలో అభివృద్ధిని చూడండి' అని అంటూంటారు. మరి రాష్ట్ర విభజన జరిగాక, హైదరాబాదు పూర్తిగా తెలంగాణకే చెందాక, అప్పుడు అభివృద్ధిని పోల్చి చూస్తే..! ఇప్పటి తేడా అప్పుడు ఉండదు, పోలిక తిరగబడొచ్చు కూడా! కోస్తా రాయలసీమలకు మరిన్ని నిధులివ్వాల్సింది అందుకు కూడా!

కాబట్టి రాష్ట్ర విభజన జరిగితే నిధులు కావలసింది ఆంధ్రకే గాని, తెలంగాణకు కాదు. తెలంగాణకు అదనపు నిధులు దొరకడం కష్టం! హైదరాబాదు నుండి వచ్చే ఆదాయం మాత్రం పూర్తిగా తెలంగాణకే చెందుతుంది కనుక, ఆ మేరకు తెలంగాణకు అదనపు నిధులు వచ్చినట్లే! ఆంధ్రకు ఆ మేరకు నష్టం జరిగినట్లే!

నిధుల సంగతిది. ఇక నీళ్ళు, నియామకాల సంగతి..

6 కామెంట్‌లు:

  1. పోనిలెండి హైదరాబాదును తీసుకొని ఆవిధంగానైనా తెలంగాణా బాగుపడుతుందంటే అంతకంటే ఏం కావాలి? కర్నూలు, విజయవాడ, వైజాగ్ లను అభివృద్ధి చేయడానికి మంచి అవకాశము. ఇకపోతే కొత్త రాజధానిగా గుంటూరు, విజయవాడ మధ్యలో కొత్త నగరాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. నేను ఛస్తే ఒప్పుకోను.:) మద్రాసు నుండీ ఆంద్ర విడిపోయినప్పుడు రాయలసీమకు రాజధాని అని పెద్ద మనుషుల ఒప్పందం. విశాలాంద్ర ఏర్పాటుతో ఆ రాజధాని కాస్తా హైదరాబాదు కు చేరింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ విడిపోతే రాయలసీమకే రాజధాని రావాలి.

    --ప్రసాద్
    http://charasala.wordpress.com

    రిప్లయితొలగించండి
  3. గ్రేటర్ విజయవాడలో తాడేపల్లిని కలపాలి
    చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుః
    విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్‌ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్రా వాళ్ళు మొదట మద్రాసు కోల్పోయారు. ఇప్పుడు హైదరాబాదు కోల్పోతున్నారు. కనుక ఈసారి రాయలసీమను వదులుకుంటారే గాని, రాజధాని మాత్రం ఆంధ్రలోనే ఉంటుంది. రాయలసీమ వారు అంతగా పట్టుబడితే మూడు రాష్ట్రాలు చేయాల్సివస్తుంది. అప్పుడు రాయలసీమకు మిగిలేది బూడిదే. అందువల్ల రాయలసీమ వారికి ఆంధ్ర చెప్పినట్టు వినడం తప్ప మరో మార్గం లేదు. తెలంగాణలో కూడా ముస్లింల ప్రభావం పెరుగుతుంది. మతఘర్షనలు కచ్చితంగా జరుగుతాయి. దాన్ని వంచడానికి భాజపాకి హిందువుల మద్దతు పెరుగుతుంది. స్వల్ప వ్యవధిలోనే అధికారం భాజపా వశమౌతుంది.

    రిప్లయితొలగించండి
  5. రాష్ట్రం విభజించ బడ్డంక ఆంధ్రా వాళ్ళు ఎన్ని నిదులైనా కేంద్రం నుంచి తీసుకోవచ్చు. దానికి తెలంగాణా వాళ్ళ నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉండదు. తెలంగాణా తానాకు రావాల్సిన వాటా మాత్రమే అడుగుతుంది, అదనంగా ఒక్క పైసా గూడా అవసరం లేదు. తెలంగాణా మొదటినుండీ అడిగేది కూడా అదే, సమాన వాటా.

    రిప్లయితొలగించండి
  6. బాగా వుంది మీ అనాలిసిస్. ఎవరి రాజధాని వాళ్ళకు ఉంటేనే దీర్ఘకాలంలో మంచిది అని మీరు రాశారు. కాని, హైదరాబాద్ను మాత్రం సీమాంధ్ర వదులుకోరాదు అని నా ఒపినియన్.

    రఘు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు