3, జూన్ 2006, శనివారం

వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు

ఈ మధ్య కాలంలో వినవచ్చిన కొన్ని వార్తలివి. నీలాలు వార్తాంశాలు కాదు.
  1. నాగార్జున సాగర్ లో చేపల కూర పెట్టలేదని విద్యుత్తు, సమాచారశాఖ మంత్రి షబ్బీర్‌ అలీ గోల. ఉద్యోగాల్లోంచి పీకి పారెయ్యండి వాళ్ళను; మంత్రులు ఉన్నదే తినేందుకని తెలియని చవటాయిలకు ఉద్యోగాలు అనవసరం. (సంపాదన లేని మంత్రి పదవీ, చేపల కూర లేని సాగరు భోజనమూ ఎవడిక్కావాలండీ!)
  2. జర్నలిస్టులపై మరోసారి విరిచుకుపడ్డ జేసీ. కడుపుకు అన్నం తింటున్నారా జర్నలిస్టులసలు? "మీరంటే నాకిష్టం లేదు, నాక్కనపడకండి" అని ఓసారి చెప్పినపుడు వినాలి. ఇక లాభంలేదు, అనంతపురం తడాఖా చూపాల్సిందే!
  3. దేశంలో 22 నకిలీ విశ్వవిద్యాలయాలు - యూజీసీ వెబ్‌సైట్లో ప్రకటన. మరి వాటిని మూసేసి, వాటి నిర్వాహకులను బొక్కలో తొయ్యలేదెందుకో!?
  4. లాభసాటి పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల జాబితా, వాటిపై తీసుకున్న చర్యలతో సహా ఎన్నికల కమిషను వెబ్‌సైట్లో ప్రకటన. మరి వీళ్ళపై చర్యలేవీ? పై అంశంలో విశ్వవిద్యాలయాలను ఎందుకు మూయలేదో ఇప్పుడర్థమైంది! (యథా రాజా తథా ప్రజా)
  5. తనపేరు కూడా లాభసాటి జాబితాలో పెట్టారని లోక్‌సభ స్పీకరు గారు వేదనతో ఇలా అన్నారు - "ఇలా అవమానిస్తే ఇకపై ఇలాంటి పదవులను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రారు." మంచిది మేష్టారూ, అసలా నిబంధన చెప్పేదీ అదే. తప్పుకోండి మీరంతా! ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పూర్తి సమయం పని చేయండి, చాలు. ప్రజలడిగేది అదే! ఇంతటి నిజాయితీ కబుర్లు చెప్పే మీరు వెంటనే శాంతినికేతన్ పదవికి రాజీనామా ఎందుకు చెయ్యలేదు? అసలు మీ అధ్యక్షతలోని SSDAనిర్వాహకత్వం గురించి ది వీక్ లో రాసారు చూసారా? మీకే లాభమూ లేకపోతే ఆ పదవిని పట్టుకుని ఇంకా ఎందుకీ పాకులాట? ఎందుకు దానిపై మీకంత యావ? నిజాయితీ పరుణ్ణి, నీతిమంతుణ్ణీనని మీరు చెప్పుకుంటే సరిపోతుందా. నైతికత పట్ల అంత నిబద్ధత ఉంటే.. గంగూలీని క్రికెటు జట్టు లోంచి తీసేసినపుడు ఎందుకు నిరసన తెలియజేసారు? క్రికెటు టీముకూ లోక్‌సభ స్పీకరుకూ ఏమిటి సంబంధం? అప్పుడేమైంది మీ నిబద్ధత? లోక్‌సభ సమావేశాలను హడావుడిగా, అర్ధంతరంగా ప్రభుత్వం రద్దుపరచినపుడు మీ గొంతు పెగల్లేదే? అప్పుడేమైంది మీ నిబద్ధత? (ఎదటి వారికీ .. చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ..!)
  6. సింహాచల నరసింహస్వామి క్షేత్రంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, దేహశుద్ధి చేసిన భక్తులు. పోపు గారికిది తెలిసిందనుకోండి, "గుళ్ళో చేసినా, బళ్ళో చేసినా.., ఊళ్ళో చేసినా, ఒళ్ళో చేసినా .. మత ప్రచారం చేసేవారు భగవద్బంధువులు, వారిని కొట్టడం పరమత సహనం లేకపోవడమే" అని నీతులు చెబుతారు, మన ప్రభుత్వానికి. (చెప్పేవాడికి వినేవాడు లోకువ!)

2 కామెంట్‌లు:

  1. ఈ వార్తలు ఒక్కొక్కటీ చదువుతున్న కొద్దీ ఒళ్ళు మండిపోతుందండీ. వీటికి తోడు లాభదాయక పదవుల బిల్లును రాష్ట్రపతి తిప్పి పంపినప్పుడు ఆ బిల్లును మళ్ళీ ఆయనకే పంపుతామని నిస్సిగ్గుగా కెమెరాల ముందు రంకెలేసిన ప్రకాశ్ కారత్ ను చూసి అసహ్యమేసింది. కమ్యూనిస్టులు సంపద మీద హక్కు అందరికీ ఉండాలనేది మా సిద్ధాంతమంటారు. కానీ లాభదాయక పదవులు మాత్రం అన్నీ ఒక్కరి దగ్గరే దఖలు పడాలి! సిద్ధాంతాలకు, ఆచరణకు ఎంతెంత దూరం!!

    రిప్లయితొలగించండి
  2. ‌కనీసం పార్లమెంటు గురించి, పార్లమెంటు సబ్యుల గురించి చట్టాలు పార్లమెంటు సబ్యులే చెసుకునే విధానం రద్దవ్వాలి. వాళ్ళ జీతభత్యాలు వాళ్ళే పెంచేసుకుంటున్నారు, వాళ్ళుకు అనుకూలంగా చట్టాలు మార్చేసుకుంటున్నారు. కనీసం ఇలాంటి సందర్బాలలో ప్రజాభిప్రాయసేకరణ చేస్తే బాగుంటుంది.
    -- ప్రసాద్

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు