31, అక్టోబర్ 2011, సోమవారం

గూగుల్ ప్లస్ బ్లాగర్ = " "

గూగుల్ వాడు అనేక సేవలను తామర తంపర గా జనాల్లోకి దింపేస్తూంటాడు. మన జీమెయిల్లో పైన ఎడం చేతి పక్క నుండి వాడి సేవల జాబితా మొదలౌతుంది. జాబితా చివర ’మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే మరో సేవలజాబితా కిందకి జారుతుంది. దాని చివర ’ఈవెన్ మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే ఒక సేవల పేజీకి వెళ్తాం. ఇదివరకు ఆ పేజీనిండా బోలెడు సేవల జాబితా ఉండేది. వాటిలో ల్యాబ్స్ అని ఒకటుండేది.. అది నొక్కితే ఇంకా ప్రయోగ దశలో ఉన్న సేవల జాబితా ఇంకోటి ఉండేది. మొత్తం ఒక యాభైకి పైగానే ఉండేవి. ఇప్పుడు ఆ సేవల జాబితా బాగా చిక్కిపోయింది. అవన్నీ ఏమయ్యాయో తెలవదు.

బజ్.జ్.జ్.జ్ అంటూ ఒకటి మొదలుపెట్టి, అయినవాళ్ళనీ కానివాళ్ళనీ పోగేసి హడావుడి చేసుకొమ్మన్నాడు. మిగతా బ్లాగుల సంగతేమో గానీ, ఆ హడావుడి దెబ్బకి తెలుగు బ్లాగులు కుసింత వెనకడుగేసాయి. తరవాత ప్లస్సును తీసుకొచ్చాడు. అదొచ్చాక, బజ్జును బజ్జోపెట్టేస్తున్నాడు. మొత్తమ్మీద సేవలను చిలికేసి, కలిపేసి, విడదీసి,.. ప్రయోగాలు చేస్తున్నట్టున్నాడు.

నిన్నో మొన్నో బ్లాగర్ లో లాగినయ్యాక ఒక సందేశం వచ్చింది.. బ్లాగర్ ప్రవరను గూగుల ప్లస్ ప్రవరతో ఏకం (ఇంటెగ్రేషన్) చేసుకుంటావా అని అడిగింది. అపుడు బ్లాగర్ ప్రవర పోయి, గూగుల్ ప్లస్ ప్రవరయే బ్లాగుల్లో కూడా కనిపిస్తుందన్నమాట! సరే బావుందిలే ఫొటో ఒక్కటీ మార్చేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటూ సరే కానిమ్మని చెప్పాను. ఠక్కున పని కానిచ్చేసింది. తరవాత చూస్తే ఏముంది.. పేరు బ్లాగర్ లో నేను పెట్టుకున్న ’చదువరి’ అనే పేరు పోయి, నా అసలు పేరు ’తుమ్మల శిరీష్ కుమార్’ అని కనిపించడం మొదలైంది. నా పేరే కాబట్టి దిగుల్లేదనుకోండి. కాకపోతే, ’చదువరి’అనే పేరు చూపించదు. ఎందుకయ్యా అంటే.. ప్లస్ మన అసలు పేరు చూపిస్తుంది గానీ, ముద్దు పేర్లు మురిపాల పేర్లూ చూపించదంట! వర్డుప్రెస్సులో మాత్రం నేను చదువరి గానే చెలామణీ అవుతూంటాను కాబట్టి వర్డుప్రెస్సు బ్లాగుల్లో నా వ్యాఖ్యలు ’చదువరి’ తోటే కనిపిస్తాయి. అంటే.. బ్లాగుల్లో నా వ్యాఖ్యలు ఈ రెండు పేర్లతోటీ వస్తూంటాయన్న మాట!

ప్లస్ లో, ప్రవరను మార్చే పేజీలో, నిక్ నేమ్ అన్నచోట గూగుల్ ఇలా చెప్పింది:

"Your nickname won't be shown on your profile, but it may be used (instead of your full name) in other Google services."

"మీ ప్రవరలో నిక్ నేమ్ చూపించం. కానీ, ఇతర గూగుల్ సేవల్లో అసలు పేరు బదులు ఈ పేరును వాడుకోవచ్చు" అని కదా దానర్థం! మరి బ్లాగర్ లో అలా చూపించడం లేదేంటో మరి..!? చూపించాలంటే ఏం చెయ్యాలా అని వెతికేసాను, కానీ దారి కనిపించలా. మీకేమైనా తెలిస్తే చెప్పగలరు. బ్లాగర్ ప్రవరను ప్లస్సు నుంచి విడదీసి తిరిగి మునుపటిలా పెట్టుకోవచ్చని అన్నాడుగానీ, ఆ పని చెయ్యడం నాకు కుదరలేదు. ఒకవేళ కుదిరినా.., ఏదో ఒకరోజు కలిపేసుకోడం తప్పనిసరి అని అనకపోడు.

7 కామెంట్‌లు:

 1. There is one column for 'display name' in "blogger profile" > "Edit profile". changing your name in that column might help..I am not sure though

  రిప్లయితొలగించండి
 2. it is not possible to have different name other than the Google plus name. Google confirms that. please see http://www.google.com/support/blogger/bin/answer.py?answer=1375600

  రిప్లయితొలగించండి
 3. అబ్బ ఎంత పని జరిగి పోయింది. అసలు గూగుల్ ప్లస్ ఇంకా బేటా దశలోనే వున్నట్టుంది. మనకు తరువాత జరిగే మార్పలు గురించి ఒక్క మాట కూడా చెప్పడు ఈ గూగులోడు.

  రిప్లయితొలగించండి
 4. @పేరు బ్లాగర్ లో నేను పెట్టుకున్న ’చదువరి’ అనే పేరు పోయి, నా అసలు పేరు ’తుమ్మల శిరీష్ కుమార్’ అని కనిపించడం మొదలైంది. నా పేరే కాబట్టి దిగుల్లేదనుకోండి. కాకపోతే, ’చదువరి’అనే పేరు చూపించదు

  మీ బ్లాగర్ నేమ్ 'చదువరి' మళ్ళి కావాలంటే చెప్పండి, ఉపాయం చెప్తా :)

  రిప్లయితొలగించండి
 5. చెప్పండి మౌళి గారూ. మీరు చెప్పాక, ఎలా చెయ్యొచ్చో చూద్దామని వెతికానుగానీ, నాకు దొరకలా! :)

  రిప్లయితొలగించండి
 6. మీ మెయిల్ ఐ డీ ఇవ్వండి, వివరాలు పంపిస్తాను .

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు