21, సెప్టెంబర్ 2006, గురువారం

రాష్ట్ర విభజనతో నీళ్ళూ, నియామకాలు వస్తాయా?

నిధుల కోసం తెలంగాణ, నీళ్ళ కోసం తెలంగాణ, నియామకాల కోసం తెలంగాణ అని అంటారు తెలంగాణ వాదులు. తెలంగాణ ఏర్పడితే నీళ్ళు, నియామకాలు విరివిగా వస్తాయా? చూద్దాం...ముందుగా నియామకాలు:

ఎక్కడినుండి వస్తాయి కొత్త ఉద్యోగాలు? రాష్ట్రానికి అవసరమైన ఉద్యోగులు ముందే ఉన్నారు కదా! కొత్తగా అవసరమైన నాలుగైదు వేల మంది ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఐదు వేల ఉద్యోగాల కోసమేనా, తెలంగాణ? ఒకవేళ తెలంగాణ ఏర్పడితే, జీవో 610 ప్రకారం వెనక్కు పంపాల్సిన ఇతర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపిస్తారా? పంపిస్తే మరో 20 వేల కొత్త ఖాళీలు వస్తాయి. కానీ..రాష్ట్ర విభజన అంటే భౌగోళిక విభజనా, లేక ప్రజలూ, ఉద్యోగుల విభజనా? విభజన సమయంలో ఇదో వివాదం కానుంది. అసలు ఆస్తి పంపకమంటేనే వివాదాల పుట్ట. బోలెడన్ని షరతులు, సర్దుబాట్లతో కూడిన వ్యవహారం! విభజన ఇష్టపడని వాళ్ళు బెట్టుగా ఉన్నా.., అది కోరుతున్నవారు సర్దుబాటుకు ముందుకు వస్తారు, అది సహజం. పంపకాల రోజున.. ఇదుగో రాష్ట్ర పంపకం ఎలాగూ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగుల ప్రస్తుత స్థితిని కొనసాగించాల్సిందే ఎవర్నీ వెనక్కి పంపరాదు అని షరతు పెడితే, ఈ వేర్పాటు వాదులు ఒప్పుకోరా? రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉన్నవారికి అది ఒక చిన్న సర్దుబాటు! ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి.. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యే క్రమంలో ఆంధ్రులు మద్రాసును వదులుకోవాల్సి వచ్చింది. మద్రాసు పేరెత్తకపోతేనే ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచిస్తామని అప్పటి నాయకులు అన్నారు ( http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82_%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81#), మనవారు విన్నారు. ప్రత్యేక రాష్ట్రమనే పెద్ద లక్ష్యం ముందు, మద్రాసు చిన్నదిగా కనిపించింది, వదులుకున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ అనే పెద్ద లక్ష్యంకోసం ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అంచేత, ఈ సర్దుబాట్ల క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, ఒక్క ఉద్యోగి కూడా వెనక్కి పోరు, ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటే తప్ప! కాబట్టి కొత్తగా నియామకాలు వచ్చే అవకాశం తక్కువ. వచ్చే కాసిని అవకాశాల కోసం పంపకాలు అవసరమా? నియామకాల విషయంలో మరో కోణం -తెలంగాణలో ఏర్పడే కొద్దో గొప్పో ఖాళీలను కూడా ఆంధ్రులే ఆక్రమించుకుంటున్నారనే వాదన ఉంది. ప్రత్యేక రాష్ట్రంలో ఆ అవకాశం ఉండదు కాబట్టి ఆ మేరకు కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ప్రస్తుత ప్రైవేటీకరణ యుగంలో కొత్తగా ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశాలెన్ని? ప్రైవేటు రంగంలో వచ్చే అవకాశాలను తెలంగాణేతరులు అందిపుచ్చుకోకుండా అడ్డుకుంటారా కొత్త రాష్ట్ర నేతలు?ఇక నీళ్ళు.. తెలంగాణ ఏర్పడే వేళ.. చాలా పెద్ద వివాదం కాబోతున్నది ఇదే! హైదరాబాదు కంటే పెద్ద వివాదం అవుతుంది. మూడు ప్రాంతాలు కూడా గట్టిగా పట్టుబట్టేది ఈ విషయంలోనే.. హైదరాబాదు విషయంలో కాదు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు జరిగింది ఆంధ్ర ప్రదేశ్ కే గాని, అందులోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన రోజున దీన్ని ఇదమిత్థంగా తేల్చుకోవాలి. మూడు ప్రాంతాలు తమతమ నీళ్ళ కేటాయింపులను కట్టుదిట్టంగా పరిరక్షించుకున్న తరువాతే రాష్ట్రం వేరు పడుతుంది. ఇది అంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదు. నీటి పంపకాల్లో ఒక సార్వత్రిక నియమం ఉంది.., అంతర్జాతీయంగా పాటిస్తారు దీన్ని - "ఇప్పటికే ఏర్పాటైన అయకట్టును పరిరక్షిస్తూ, మిగిలిన నీటినే కొత్తగా పంపకం చేయాలి". కృష్ణ నీటిని తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన 811 టీఎంసీ నీటిని ఇప్పటికే వాడిన భాగం పోగా మిగిలిన నీటినే పంపకం చెయ్యాలి. ఇప్పటికే ఏర్పడ్డ ఆయకట్టును పరిర్తక్షిస్తూ నీటి పంపకం చేస్తే, తెలంగాణకు వచ్చే వాటా ఎంత? రాష్ట్ర విభజన సమయానికి కృష్ణ ప్రాజెక్టులలో ఎవరెవరి భాగం ఎంత, నిర్వహించేది ఎవరు, ఎవరెవరు ఎంతెంత నీటిని వాడుకోవాలి, వాడుకోవాల్సింది నికర జలాలనా లేక వరద నీళ్ళనా.. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఇలాగే గోదావరి నీళ్ళు.. ('అన్నదమ్ముల్లాగా విడిపోదామ'ని అంటున్న రాజకీయులు తెలుసుకోవాల్సింది ఒకటుంది.. వేర్లు పడ్డాక, రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య సంగతేమో కానీ నీళ్ళ దగ్గర కొట్లాటలు రాకుండా ఉంటాయా అనేది సందేహమే!)


ఇలాంటి వేర్పాటు వివాదాల్లో కాస్తో కూస్తో సర్దుబాటుకు ముందుకొచ్చేది, సహజంగానే వేర్పాటు కావాలని గొడవ చేస్తున్న వారు! కాబట్టి నికరంగా నష్టపోయేది తెలంగాణాయే! రాజకీయులు రాష్ట్రం కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. కానీ మేథోవర్గం దానికి ఒప్పదు. తెలంగాణ కోరుతున్న రాజకీయులు, మేథావుల మధ్య ఈ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు.

ఏదేమైనా మూడు ప్రాంతాల ప్రజలూ గట్టిగా వత్తిడి చెయ్యాల్సింది ఒకటుంది.. "విభజన సమయంలో మీరు ఏమేం ఒప్పందాలు చేసుకుంటున్నారో బహిరంగ పరచాలి. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెసు, తెరాస చేసుకున్న ఒప్పందం లాంటి దొంగ వేషాలు కుదరవు" అని. లేకపోతే ఈ రాజకీయులు మనల్ని ముంచి పారేస్తారు, పాతరేస్తారు!

మొత్తమ్మీద రాష్ట్ర విభజన జరిగితే నీళ్ళు, నియామకాల విషయంలో కూడా తెలంగాణ పరిస్థితి మెరుగుపడేదేమీ ఉండదనిపిస్తోంది. మరెందుకీ విభజన? ఎవరికోసం ఈ విభజన? కేసీయార్ కొత్త కారణాలు రెండు మూడు చెబుతున్నారు.. "ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ" అని. వాటి సంగతి కూడా చూద్దాం!

3 కామెంట్‌లు:

 1. ప్రత్యెక తెలంగాణా వల్ల ఒక కొత్త పోస్ట్ వస్తుంది. అదే ముఖ్య మంత్రి పదవి. సమస్యలో! లెక్కలేనన్ని.

  రిప్లయితొలగించండి
 2. ఆసక్తికరమైన వ్యాఖ్యానం. నీటి వివాదాలను మరింత వివరంగా గణాంకాలతో పాటుగా ఇస్తే బాగుండేది. పూర్తి వివరాలతో మీ నుంచి మరొక టపా ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 3. >>హైదరాబాదు కంటే పెద్ద వివాదం అవుతుంది. మూడు ప్రాంతాలు కూడా గట్టిగా పట్టుబట్టేది ఈ విషయంలోనే.. హైదరాబాదు విషయంలో కాదు.<< మీ ఎనాలిసిస్ బాగుంది. హైదరాబాద్ కోసం పట్టుబట్టడం బేరసారాలలో భాగమే అని నేను కూడ అనుకుంటున్నాను.

  మీరు GOM కు మెయిలిచ్చారా?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు