19, సెప్టెంబర్ 2006, మంగళవారం

ఆదివారం టీవీ కార్యక్రమాలు

మామూలు రోజుల్లో లాగానే ఆదివారం నాడు కూడా టీవీల్లో సినిమాల గురించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త సినిమాల నటులు, దర్శకులు, నిర్మాతలతో ఇంటర్వ్యూలు పెట్టి వాటికి ప్రచారాలు కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. జెమినీలో జోకర్ల లాంటి ఇద్దరు లంగర్లు (మనుషులు బాగానే ఉంటారు, వాళ్ళ ప్రవర్తనే.. జోకర్లలాగా ఉంటుంది. ఒకరి పేరు సత్తెన్న.. ఇంకోళ్ళెవరో గుర్తు లేదు) కొత్త సినిమా జనుల ఇళ్ళలో లంగరు దించి, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ఈ మధ్య వస్తున్నట్లు లేదు (మరో పిచ్చి కార్యక్రమమేదో పెట్టి ఉంటారు!).

పదింటికి మాటీవీలో "గుర్తుకొస్తున్నాయి" వస్తుంది.. బాగుంటోంది. ఈ వారం ఎస్పీ శైలజ జ్ఞాపకాలు. చక్కగ మాట్లాడింది. ఇంటర్వ్యూ చేసేవారు (కుంచె రఘు) తక్కువగా మాట్లాడుతూ అసలు వ్యక్తితో ఎక్కువ మాట్లాడించడంతో కార్యక్రమం బాగుంటున్నది. అదవగానే పెళ్ళిపుస్తకం వస్తుంది, పర్లేదు
ఇహ పదకొండున్నరకు ఈటీవీ2 లో తెలుగువెలుగు కార్యక్రమం వస్తుంది; చాలా బాగుంటుంది. మృణాళిని గారు నిర్వహిస్తారు. తెలుగు భాష గురించిన ఈ కార్యక్రమం అనేక చిన్న చిన్న కార్యక్రమాలను కలిపి అల్లిన మాల లాంటిది. నాకు బాగా నచ్చింది. ఈ వారం పొత్తూరి వెంకటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ వచ్చింది. తెలుగు భాషాభిమానం ప్రజల్లో తగ్గుతోంది కానీ భాషకొచ్చిన ప్రమాదమేమీ లేదని ఆయన అన్నారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు..
 • భాషాభ్యుదయం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకోవాలి.
 • శాసనసభ్యులే సభలోసరైన తెలుగు మాట్లాడడం లేదు, ముందు వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి.
 • భారత, భాగవతాలను అధ్యయనం చేస్తే భాషపై పట్టు పెరుగుతుంది, జర్నలిస్టులకుముఖ్యంగా ఇది అవసరం.
ఈ కార్యక్రమంలో ఇంకా పద్యపఠనం, సామెతలు, జాతీయాలు, ప్రసిద్ధ తెలుగువారి ఫోటో చూపించి గుర్తు పట్టమనడం వంటివి ఉంటాయి. ఇదివరలో రాళ్ళబండి కవితా ప్రసాదు పద్యగానం చేసేవారు, బ్రహ్మాండంగా ఉండేది. నేనీ కార్యక్రమం చూసి కొన్ని వారాలయింది, ఎప్పుడు మార్చేసారో ఏమో! ఈసారి మీగడ రామలింగస్వామి సుమతీ శతక పద్యాలు పాడారు. మరీ పొడవుగా రాగం సాగతీయడంతో బాగుండలేదు. ఇహ ఆ తరువాత గరికపాటి నరసింహారావు గారిసామెతలు, జాతీయాలు, చమత్కారాలపై ప్రసంగం. అరగంట పాటు ఉండే "తెలుగు వెలుగు" కు ఈ సహస్రావధాని చెప్పే ఈ ఐదారు నిముషాల కబుర్లు తలమానికం. చక్కటి పాండిత్యానికి, ఖంగున మోగే గొంతు తోడవడంతో అదేపనిగా వినబుద్ధేస్తుంది. అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.

ఈ వారం ఆయన చెప్పిన ఒక చమత్కార విషయం.. ఒకాయన తను రాసిన కథను ఓ పత్రిక్కి పంపాడు. దాన్ని పూర్తిగా చదవడానికి సంపాదకుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. . అంత భయంకరంగా ఉంది. ఆ చెత్తంతా పూర్తిగా చదివేసరికి సంపాదకుడికి నీరసంతో పాటు కోపమూ వచ్చింది. కథ పేరు "నేనెందుకు బతికి ఉన్నాను?". వెంటనే రచయితకు ఓ కార్డు ముక్క రాసి పడేసాడు. అందులో ఆయన రాసింది మూడు ముక్కలే.. "పోస్టులో పంపావు కనక"

సుమను ఈ కార్యక్రమం దరిదాపుల్లోకి కూడా వెళ్ళి ఉండడు! లేకపోతే ఇంత బాగుండేదా!?

ఇక ఆదివారం సాయంత్రం 6 గంటలకు టీవీ9 లో ఫోనాఫోనీ ఉంటుంది. ఎవరో ఒక రాజకీయుడితో ప్రజలు ఫోను చేసి మాట్లాడే కార్యక్రమం ఇది, బాగుంటుంది. ఈ వారం నేను చూళ్ళేదు.
రాత్రి 8:30 కు జెమినీలో అమృతం! మొదట్లో బాగానే ఉండేది. ఉండేకొద్దీ నాణ్యత తగ్గుతూవచ్చింది. ఇప్పుడు బొత్తిగా కొత్తదనం ఉండడం లేదు. రాత్రి పదీ పదిన్నర ప్రాంతంలో మాటీవీ, జీటీవీల్లో వార్తల్లో వ్యక్తులతో ఇంటర్వ్యూలు వస్తాయి. అవి బానే ఉంటాయి. జీటీవీలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి - పేరు సురేష్ రెడ్డి అనుకుంటా - బాగా చేస్తాడు. టీవీ9 రవిప్రకాష్ కూడా ఒకప్పుడు జెమినీ టీవీలో ఆదివారం రాత్రి పదింటికి ఇంటర్వ్యూలు చేసేవాడు. అప్పుడు జేసీ దివాకరరెడ్డిని, చల్లా రామకృష్ణారెడ్డిని ఆయన చేసిన ఇంటర్వ్యూలు నాకు గుర్తున్నాయి. మీకు చాలా బస్సులతో బస్సు రవాణా సంస్థ ఉన్నది కదా అని దివాకరరెడ్డిని అడిగితే, అబ్బే ఎన్నో లేవండి, ఏదో కాసిని ఉన్నాయంతే అంటూ జవాబు చెప్పాడు. (ఇప్పుడు అదే దివాకరరెడ్డి రవిప్రకాషుపై - టీవీ9పై - వేరే విషయమై పరువునష్టం దావా వేసాడు.)
సినిమాలు మాత్రం అంత మంచివి ఉండవు. మొత్తమ్మీద ఆదివారం టీవీ - పర్లేదు.

2 కామెంట్‌లు:

 1. సుమన్ను ఆ రెండవ టీ వీ దరిదాపుల్లోకి రానీరనుకుంటాను

  అసలు రామోజీరావు గారు ఆ రెండవ టీవీ పెట్టుకున్నదే పుత్ర రత్నం గారి నుండి తన టేస్టును కాపాడుకోవడానికేనేమో! :)

  రిప్లయితొలగించండి
 2. యాంకర్లను లంగర్లు గా పేర్కొన్న మీ పద ప్రయోగం బాగుంది

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు