9, సెప్టెంబర్ 2006, శనివారం

శంఖారావం - తెలంగాణ కాంగ్రెసు నాయకులెక్కడ? ఎక్కడ??

తెరాస తన ఉద్యమ మూడో దశను ఉరుములు మెరుపులతో మొదలెట్టింది. మొదటి దశ 2001 నుండి, 2004 మే వరకు జరిగింది. తెరాస శరవేగంగా ఎదిగిన దశ అది. 2004 మే నుండి మొన్నటి రాజీనామాల దాకా జరిగినది రెండో దశ, సుషుప్తి దశ. ఢిల్లీలో ఏం చేసారో తెలీదు గానీ, ఉద్యమం అచేతనంగా కనిపించింది. కేసీయార్ దీన్ని వ్యూహాత్మక మౌనం అంటారు. కావచ్చు! ఇప్పుడిక మూడో దశ ఆర్భాటంగా మొదలైంది. మూడో దశ ఎలా మొదలెట్టాలని తెరాస ఆశించిందో సరిగ్గా అలాగే చేసింది. నిరాహారదీక్షపై వచ్చిన విమర్శలను తిప్పిగొడుతూ జరిగిన ఈ సభ తెరాసకు, కేసీయార్‌కూ చాలా కీలకమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇదో మేలిమలుపు. ఈ సభలో కేసీయార్ ధోరణిలో కొద్ది తేడా వచ్చినట్లుగా కనిపించింది. ముఖ్యంగా గమనించినవి ఇవి.

  1. తెలంగాణ పట్ల తన నిబద్ధతను ప్రజలకు చెప్పాడు.
  2. పూర్తిగా తెలంగాణ కాంగ్రెసు నాయకుల పైనా, వైయెస్ పైనే ఆయన గురి. సోనియాను పల్లెత్తి మాట అనలేదు. కేంద్రం త్వరలోనే తెలంగాణ అనుకూల ప్రకటన చేస్తుందని తెరాస ఆలోచిస్తున్నట్లు దీన్ని బట్టి అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ రాదు అని వాళ్ళకు ఖచ్చితంగా తెలిస్తే, బహుశా సోనియానూ వదిలేవారు కాదు.
  3. కేసీయార్ ప్రసంగం ఇదివరకటిలా కాక, సంయమనంగా ఉన్నట్లు అనిపించింది. ఇదివరలో ఉన్న ధోరణి వలన తెలంగాణ వ్యతిరేకుల సంఖ్య పెరగడం తప్ప వేరే ప్రయోజనం లేదని గ్రహించినట్లున్నారు. నరేంద్ర ప్రసంగం గురించి ఎప్పట్లాగానే పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.
మొత్తమ్మీద సిద్ధిపేట శంఖారావంలో మనకు వినబడేవి ఇవి:
  1. తెరాసకు ప్రజల మద్దతు ఉంది.
  2. తెరాసకు కేసీయార్ తిరుగులేని నాయకుడు.
  3. మేథోవర్గం తెరాస వెన్నంటే ఉంది.
  4. కాంగ్రెసుకు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఇక కష్టాలే.
  5. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదో కాంగ్రెసు జవాబు చెప్పుకు తీరాల్సిన పరిస్థితి కల్పించబోతున్నారు. 'సోనియాకు వదిలేసాం, ఏ సంగతీ ఆమె తేల్చి చెప్పేదాకా మేమేం మాట్లాడం' లాంటి సొల్లు కబుర్లు కాంగ్రెసు వాళ్ళకిక కుదరక పోవచ్చు. దసరా తరువాత తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియా వద్దకు బారులు తీరవచ్చు.
  6. పాపం, తెరాస తిరుగుబాటు నేతలది దిక్కుతోచని స్థితి

మలిమలుపు: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తరువాతి మలుపు, మంత్రివర్గ విస్తరణ. దసరాకు జరగొచ్చంటున్నారు. విస్తరణలో పదవులు దొరికిన తెలంగాణ కాంగ్రెసు నాయకులు పదవీ వ్యామోహ విముక్తులవుతారు, దొరకనివారు పదవీ విరక్తులవుతారు. ఇప్పటి మంత్రులు కొందరు పదవీ విముక్తులైనా కావచ్చు! పదవులు దొరికిన వారికి పెదవులు ఎలాగూ విడివడవు, పదవీ విరక్తులను వైఎస్ ఎలా కాపాడుకుంటారో చూడాలి.

ఇక, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు వివాదంపై వైఎస్ ఏదో ఒకటి చెయ్యకుంటే, అది పుంజుకునే అవకాశం కనబడుతోంది. తెరాసకు అదో అస్త్రం కాబోతోంది. అలాగే ఇతర ప్రాజెక్టులు కూడా.

తెలంగాణ వస్తుందా రాదా అనేది ఎప్పటిలానే శేషప్రశ్నే! కానీ ఒకటి మాత్రం విస్పష్టం.. తెలంగాణ వస్తే మా ద్వారానే రావాలి అనే కాంగ్రెసు కోరిక ఇక తీరదు. ఆ అవకాశం తెరాస కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడే ఉండేది. ఇకపై తెలంగాణ అంటూ వస్తే అది తెరాస ఘనతే!

2 కామెంట్‌లు:

  1. కె.సి.ఆర్ బలమంతా సిద్దిపెటలో మాత్రమే. సభకు వచ్చిన ప్రజలు ఏం చెప్పుతాడొ అని ఆసక్తిగా వినటానికి వచ్చారే గాని వాళ్లంతా ఓట్లు వేస్తారనుకొనవసరం లేదు. తెలంగాణాలో, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం బలాలను తక్కువ అంచనా వెయ్యలేము. ఈ మధ్య జరిగిన ఎన్నికలు వీటి బలాన్ని, తె.రా.స బలహీనతను బయట పెట్టాయి.నల్గొంద లేక ఖమ్మంలో కె.సి.ఆర్ సభ నిర్వహిస్తే తనకున్నది వాపో లేక బలుపో తెలుస్తుంది.సభలకు వచ్చే వారంతా ఓట్లు వెయ్యరని గతంలోనే వెల్లడైన సత్యం,మరువవొచ్చునా?
    cbrao

    http://groups.yahoo.com/group/biosymphony/
    http://deeptidhaara.blogspot.com/
    http://paradarsi.wordpress.com/

    రిప్లయితొలగించండి
  2. తెలుగు వాళ్ళకు ఎప్పుడు బుద్ది వస్తుందో!. ఈ తెలంగాణ, ఆంద్ర, రాయలసీమ. ఇది ఎమిటి!. చిన్న లేదా వేరే రాష్ట్రం వచ్చిన్నంత మాత్రాన ప్రజలు బాగుపడతారంటె నమ్మ వచ్చా? జార్కండ్ మంచి ఉదాహరణ. నెలకొక్క ముఖ్య మంత్రి. పెద్ద పార్టీల చెతిలో కీలు బొమ్మలు.

    ఇంకో ద్రుక్పదములో చూస్తే - పార్లమెంటులో తెలుగు/దక్షినాది రాష్ట్రాలు శక్తి వంతంగా వుండడము వుత్తరాది నాయకులకు మింగుడు పడని విషయము. ఏలా అంటే AP MP లు 42. తెలంగాణ, అంధ్ర, రాయసీమగా 3 రాష్ట్రాలు ఇతే 28, 15 10 గా MP లు గా విడి పొతే ఇంక మనమందరూ వుత్తరాది నాయకుల ముందు బిచ్చమెత్తుకొవలసిందే. మేలుకో తెలుగు వాడ!. కలసివుంటేనే మన తెలుగు శక్తికి రక్ష, సుఖము, పురొగతి. మేలుకో ! మేలుకో ! రాజకీయ పావు కావద్దు. TRS 50% అసెంబ్లీ స్తానాలలో ఒడి పోయిన విషయము అందరికి తెలుసనుకుంటా!. అదీ పొటీ చేసిన 52 నుంచే (తెలంగాణా seat లు 100+).

    మన ప్రగతి మన చేతులొనే ఉంటే మనకు మంచిది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు