13, సెప్టెంబర్ 2006, బుధవారం

నిరుత్తర కుమారులు

గాజుగదిలో కూర్చుని బయటివాడిపై రాయేస్తే ఏమవుతుంది?
నిరాయుధుడు కదా అని చేతిలో కర్రొకటి పట్టుకుని కవ్విస్తూ పోగా, వాడు ఏకే47 బయటికి తీసి గురిపెడితే ఎలా ఉంటుంది?

కాంగ్రెసు పరిస్థితి ఇదీ! రాజీనామా చేసి చూసుకుందాం రా అని ఎమ్మెస్ అన్నాడు. బానే ఉంది, రాజకీయాల్లో అది మామూలే! కేశవరావు చూడండి, కేసీయార్‌ను రాజీనామా చెయ్యమనండి, నేను నెల రోజుల్లో ఎన్నికలు పెట్టిస్తాను అంటూ ఎగదోసాడు. అయితే, అవతలి వ్యక్తి వ్యూహ నిపుణతను కేకే అంచనా కట్టలేక పోయాడు. (అసలు అవతలి వాళ్ళ మాటలను, చేతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు కేకేలాగా లొడలొడా మాట్లాడడు.) అంది వచ్చిన అవకాశాన్ని కేసీయార్ భలే చక్కగా వాడుకున్నాడు.. ప్రతి సవాలు విసర్లేదు, ఏకంగా రాజీనామా విసిరేసి, రా తేల్చుకుందాం అని తొడ గొట్టాడు.

ఇంత జరిగింతరవాత, వీళ్ళేంచేస్తున్నారు? దాక్కునేందుకు స్థలాలు వెదుక్కుంటున్నారు! ఏదో అంటూ ఉంటాం, అలాగే నేనూ ఏదో అన్నాను, అంత పట్టించుకోనక్కరలేదు అని కేకే అంటున్నాడు. సవాళ్ళు విసరడం చపలత్వం అయితే, అబ్బే నేనేదో చెతురుకన్నాను, పట్టించుకోనక్కరలేదు అని అనడం చవటత్వం!

తెరాస:అన్నీ అనుకూలాలే!అనూహ్యమైన ఎత్తేసి, కేసీయార్ ఉత్తర కుమారులను నిరుత్తరుల్ని చేసాడు. సిద్ధిపేట సభతో జడత్వాన్ని కాస్త వదుల్చుకున్న తెరాసకు ఈ రాజీనామా వ్యవహారం ఒక ఊపు నిస్తుందనడంలో సందేహమేమీ లేదు. వ్యక్తిగతంగా కేసీయార్ పరపతి బాగా పెరుగుతుంది. ఈ సంఘటనతో కేసీయార్ కు అన్నీ ఉపయోగాలే! రాజీనామా చేసిపారేసి, తెలంగాణ పట్ల నిబద్ధుణ్ణనే సందేశమిచ్చాడు. ప్రజల్లో తనపట్లా, తెరాస పట్లా విశ్వసనీయతను మరింత పెంచుకున్నాడు. రాజీనామాను స్పీకరు ఎలాగూ ఒప్పుకోడు కాబట్టి (ఫాక్సుల్లోనూ, ఫోనుల్లోను టాటా చెబితే కుదరదట, స్వయంగా కలిసే చెప్పాలట! ఈయన పోడు, ఆయన ఒప్పుకోడు), తన లోక్‌సభ సభ్యత్వానికి ఢోకా ఏమీ లేదు. లోక్‌సభ అడిగింది కాబట్టి నిరాహారదీక్ష విరమించిన వాడికి, స్పీకరు కుదరదన్నాడు కాబట్టి రాజీనామా వెనక్కి తీసుకోడంలో కష్టమేముంది! ఈలోగా ఎలాగూ కాంగ్రెసు వెనక్కి తగ్గుతుంది కాబట్టి, నైతిక విజయం సాధించినట్లే! కేసీయార్‌కి అన్నీ ప్లస్సులే! ఒకవేళ స్పీకరు రాజీనామాను ఒప్పుకున్నా పోయేదేమీ లేదు, అది ఆయనకు మరింత లాభమే!

కాంగ్రెసు: దిమ్మెరపోయింది అనే మాట కాంగ్రెసుకు బాగా సరిపోతుంది. స్వయంగా కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడే ఇవ్వాళ కాంగ్రెసు పార్టీని చిన్నబుచ్చాడు.
 • ఎమ్మెస్: రాజీనామా సవాలు విసరడంలో తప్పేమీ లేదు. ఎటొచ్చీ ఊహించని జవాబుతో తల బొప్పి కట్టింది. అయినా గంభీరంగానే రాజీనామాకు సిద్ధపడ్డాడు. కాస్త పరువు నిలబెట్టుకున్నాడు.
 • ఇక కేకే.. లొడలొడా మాట్లాడ్డమే తప్ప ఆలోచించడం ఉండదు. (ఇంటర్వ్యూలిచ్చేటపుడు చూడండి.. అడిగేవాణ్ణి ప్రశ్న పూర్తిగా అడగనివ్వడు, సగంలోనే అందుకుని సమాధానం ఇచ్చేస్తాడు. ఆ మధ్య టీవీ9 వాళ్ళ ఆదివారం సాయంత్రపు ఫోనాఫోనీ కార్యక్రమంలోనైతే, ప్రశ్నలడిగేవాళ్ళపై ఎదురుదాడి చేసాడు! విషయ పరిజ్ఞానం ఉన్నవాడు అలా చెయ్యడు.)
మొత్తమ్మీద, కాంగ్రెసు తనకు తానుగా అంటించుకున్న ఈ బురదను కడుక్కున్నా, మరక పోదు. చొక్కాను మార్చేసి వేరేది తొడుక్కుంటారా? కావచ్చు!

3 కామెంట్‌లు:

 1. భలే చెప్పారు.
  కేంద్ర మంత్రిపదవులు తీసుకోకుండా వుంటే TRS ఇప్పటికి వుద్యమాన్ని అంటొ ఇంతో ముందుకు తీసుకెళ్ళేది.
  కానీ ఇప్పుడు మంచి వూపొచ్చింది. కెసిఆర్ చాలా తెలివైన పని చేసి కాంగిరేసోల్లని దద్దమ్మలని చేశాడు.
  -- ప్రసాద్
  http://charasala.wordpress.com

  రిప్లయితొలగించండి
 2. ఇది కె.సి.ఆర్. కు తాత్కాలిక విజయమే. పదివీ త్యాగంతో ప్రజల సానుభూతి ఉండటం వలన ఎన్నికలలో (జరిగితే) గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ వారికి గ్రహింపు ఆలస్యంగానైనా వచ్చింది. అందుకే హడావుడిగా మాట ఫిరాయింపు.

  cbrao

  http://groups.yahoo.com/group/biosymphony/
  http://deeptidhaara.blogspot.com/
  http://paradarsi.wordpress.com/

  రిప్లయితొలగించండి
 3. కె.సి.ఆర్ అసలు ఒక బాధ్యత తెలియని పక్కా అవకాశ వాద రాజకీయ నాయకుడు, కె.కె తను ఒక మేధావి నని భ్రమలో వుండే నాయకుడు, వీరిద్దరిని మించి ఒక తల పండిన విదూషకుడు...ఇంకా ఏం ఆశించగలం?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు