24, డిసెంబర్ 2009, గురువారం

ఇక సంప్రదింపులట!

2012 సినిమాలో కాబోలు.. భూమి ధ్రువాలు మారిపోతాయంట. ఉత్తర దక్షిణ ధ్రువాలు అటుదిటూ ఇటుదటూ కావడంతో ప్రళయం జరుగుతుందట. అలా ఎందుకు జరిగిందో కారణం నాకు తెలవదు.

2009 డిసెంబరు 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ధ్రువమార్పిడే జరిగింది. కోస్తా, సీమల్లో ఉద్యమాగ్ని చప్పున చల్లారిపోయి, తెలంగాణలో గుప్పున మంటలెగసాయి. కారణం మనందరికీ తెలుసు. కేంద్రం చేసిన మరో ప్రకటనతోఈ ధ్రువమార్పిడి జరిగింది. ఆంధ్రప్రదేశాన ఇలా జరగడం ఇది రెండో సారి. మొదటిసారి డిసెంబరు 9 న - తెల్లారితే పదో తేదీ అనగా - జరిగింది.


కాంగ్రెసు డిసెంబరు 9 నాటి తన తప్పుడు నిర్ణయాన్ని సరి చేసుకునేందుకుగాను కేంద్రప్రభుత్వం చేత మరో ప్రకటన చేయించింది. 'డిసెంబరు 9 న చేసిన ప్రకటన తరవాత రాష్ట్రంలోని వివిధ వర్గాలలో వ్యతిరేకత వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విషయమై అన్ని సంబంధిత పార్టీలు వర్గాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించాం' అని కేంద్ర  హోమ్‌మంత్రి చెప్పాడు.

ఒక్కటి మాత్రం స్పష్టం. తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై కేంద్రం వెనక్కుపోయిందేమీ లేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైపోయిందన్నమాట ఇప్పటికీ నిజమే! అందులో తేడా ఏమీ లేదు. ఇప్పటి ఈ సంప్రదింపులు ఆ ప్రక్రియలో భాగంగానే భావించాలి. ఈ సంప్రదింపుల కారణంగా తెలంగాణ ఏర్పాటు ఆలస్యమౌతుంది -అది ఖాయం! సంప్రదింపులు ఏనాటికి పూర్తవ్వాలో చెప్పకపోవడం ప్రత్యేకరాష్ట్రం పట్ల అతిపెద్ద ప్రతికూలాంశం. అయితే, ఏర్పాటు విషయమై కేంద్రం వెనక్కుపోయినట్టైతే అనిపించడం లేదు.

సమైక్యాంధ్ర ఉద్యమం సమైక్యాంధ్రనేమీ సాధించలేదు. 'సంప్రదింపులు ' సాధించుకున్నారు. అయితే కోస్తా సీమలకు కావలసింది అదే! సమైక్యాంధ్ర ఉద్యమానికి నిజంగా కావాల్సింది.. రాష్ట్ర విభజనకు ముందు తమ అభిప్రాయాలను, తమ కోరికలను పరిగణనలోకి తీసుకోవడమే!

అయితే 'సంప్రదింపుల్లో ' చాలా అయోమయాన్ని దట్టించింది కేంద్రం. ఏయే విషయాల గురించి సంప్రదించదలచిందో చెప్పలేదు. సంప్రదింపులు ఎప్పుడు మొదలౌతాయో చెప్పలేదు. ఎప్పటిదాకా జరుపుతారో చెప్పలేదు. కేంద్రం తరపున సంప్రదింపులు జరిపేదెవరో చెప్పలేదు. ఇందుకోసం ఏదైనా సంఘాన్ని ఏర్పాటు చేస్తారా అనే సంగతులను చెప్పలేదు.

అయితే ఈలోగా సీను తెలంగాణకు మారింది. ఒక ప్రధానమైన సమావేశం ప్రస్తుతం (డిసెంబరు 24 మధ్యాహ్నం 2 గం. ప్రాంతంలో) జరగబోతోంది. పార్టీలకతీతంగా తెలంగాణ శాసనసభ్యులు ఎంపీలు పాల్గొంటున్న సమావేశమిది. ప్రొఫెసరు కోదండరామ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు.

10 కామెంట్‌లు:

  1. ఇలా ధ్రువాలు వారానికోసారి మారితే బావుణ్ణు. ఈ రోజు వీధిలోకెళ్ళి పనులు చేసుకోవడానికి చిక్కింది (మాది ఆంధ్రా ప్రాంతం మరి !) ఇలా తెలంగాణా వాళ్ళకూ వీలు పడాలంటే, వారం పోయాక కేంద్రం ఇంకో ప్రకటన చెయ్యాలి. అప్పుడు ఇక్కడ భగ్గుమంటే, వాళ్ళు సంక్రాంతి షాపింగూ అవీ చేసుకోవచ్చు. సినిమా షూటింగులొక్కటే కాస్త ఇబ్బంది పడతాయి. పర్లేదు. కేంద్రానిదేం పోయింది ? తెగేదాకా లాగింది అందరూనూ !

    రిప్లయితొలగించండి
  2. వెనక్కి పోలేదని చెప్పినా ఇక్కడ జనాల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ నాయకుల్ని ఏంచేసినా పాపం లేదు. వీళ్ళ నాయకుల రూపంలో సంచరిస్తున్న రాక్షసులేమోనని అనుమానం నాకు.

    రిప్లయితొలగించండి
  3. ఈ రాష్ట్రపతి పాలనేదో వెంటనే వచేస్తే బాగుణ్ణు. అందరి నోళ్ళూ మూతపడతాయి. అపుడు ఆందోళనలు చేసే ప్రతి వెధవనీ అణచివేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. ఇందాకే తెలంగాణా వాదుల సమావేశం చూసి - బాధ కలిగి ఒక టపా రాశాను. తెలంగాణా గొడవ సమసిపోయేదాకా మనకీ శాంతి లేదు, ప్రభుత్వానికీ శాంతి లేదు.

    http://virajaaji.blogspot.com/2009/12/blog-post_24.html

    రిప్లయితొలగించండి
  5. విద్యార్థులు అనబడే పనికిమాలిన వాళ్ళు, రాజకీయనాయకులు అనబడే ఊసరవెల్లులు ఎవరైనా సరే గత నెల నుండి విధ్వంసాలు సృష్టిస్తూనే ఉన్నారు. అమాయకుల వ్యక్తిగత (ప్రైవేట్) ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను నిస్సిగ్గుగా ధ్వంసం చేస్తున్నారు. మీ వంతు అయిపోనివ్వండి. తర్వాత ప్రకృతి వంతు. ఎంతగా ప్రకృతి విరుచుకుపడుతుందో చూస్తారు గాక.

    రిప్లయితొలగించండి
  6. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే లాభమని మురిసి పోతున్నారు సమైక్య ఆంద్ర వాదులు.
    మరో ప్రణబ్ కమిటీ, రోశయ్య కమిటీ లాంటి శకుని పన్నాగమని మండి పడుతున్నారు తెలంగాణా వాదులు.
    మొత్తం మీద మన ప్రజాస్వామ్యం కుళ్ళి కంపు కొడుతోంది.

    రిప్లయితొలగించండి
  7. కుళ్ళి కంపుకొడుతోందంటూ ప్రతీదానికీ ప్రజాస్వామ్యాన్ని తిట్టడం ఫ్యాషనైపోయింది. యాభై యేళ్ళనాటి సమస్యకు మనమో కుళ్ళిపోయిన పరిష్కారాన్ని సూచిస్తున్నామనే సంగతిని మనం గుర్తించం. దానికోసమని కార్లూ బస్సులూ తగలెడతాం. ఎంతో బుద్ధిమంతులు మా విద్యార్థులు అని ఓ పక్కన మనం ముద్దు చేస్తూ ఉండగానే.. మరోపక్కన సదరు "బుద్ధిమంతులు" తమకు మద్దతుగా వచ్చిన రాజకీయ నాయకులను ఎడపెడా కొడుతూంటారు -ఆకురౌడీల్లాగా! అయినా మనం దాన్ని గుర్తించం. "బుద్ధిమంతులైన" విద్యార్థుల గుంపులో సంఘవ్యతిరేకశక్తులు కలిసి పోయాయని పాచిపోయిన వాదన చేస్తాం.

    కుళ్ళిపోయింది ప్రజాస్వామ్యం కాదు, మన బుర్రలు!

    రిప్లయితొలగించండి
  8. >>కుళ్ళిపోయింది ప్రజాస్వామ్యం కాదు, మన బుర్రలు!<<

    WELL SAID !

    రిప్లయితొలగించండి
  9. chadupari garu meeru raase vyasalu chala bagunani andi janalaki kasta sari aina daarilo nadichetatuga unnai....meeru ilane manchi rastu undandi.....

    రిప్లయితొలగించండి
  10. vishwanath garu nenu ade anukuntunanu....general president rule vaste developments aagipoye chances ekkuva unnai antaru....ippudu jarige vidwamsa kanda kante ade melu chestundi....kaneesam undevelopment nunchi bayatapadatam........veellu chese bandh moolanga rastraniki ravalasina IT companies ippudu ikkada adugu pettataniki kooda baya padutunai...malli bandh moolanga jarigina aarthika nastam matram chala ekkuva.....

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు