2, డిసెంబర్ 2009, బుధవారం

బలవన్మరణ దీక్ష

పులి మీద స్వారీ చెయ్యడానికి పూనుకుంటే మళ్ళీ దిగే వీలుంటుందో ఉండదోనని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంట. లంచావతారం సినిమాలో కాబోలు.. దాసరి చెబుతాడు, లంచం తీసుకోవడం పులిమీద స్వారీ లాంటిదని. స్వారీ మొదలెట్టడమే మన చేతిలో ఉంటుంది, దిగడం మనవల్ల కాదు. ఆమరణ నిరశనదీక్షలు కూడా అలాంటివేనని ఇప్పుడు తోస్తోంది.


ఈ ఆమరణ దీక్షల్లో లొసుగును గ్రహించినవాడు కాబట్టేనేమో మరణించిన ఓ కాంగ్రెసు నేత (మరణించాడు కాబట్టి పేరు చెప్పడం లేదు) చాకచక్యంగా వ్యవహరించాడు. రెండు మూడేళ్ళ కిందట ఓసందర్భంలో (ఏదో గుర్తులేదుగానీ అంతర్గత ప్రజాస్వామ్యం విపరీతంగా ఉండే కాంగ్రెసులోని గొడవనుకుంటాను) ఆమరణ దీక్షకు ఉపక్రమించాడు. ఈలోగా ఢిల్లీనుంచి పిలుపొచ్చింది, మాట్టాడదాం రమ్మని. నేనిప్పుడు రాను, ఆమరణ దీక్ష అయ్యాక వస్తాను అని చెప్పాడంట. పత్రికలు కూడా నవ్వాయప్పుడు! పులిమీద స్వారీ చెయ్యడమే కాదు, దానిమీంచి దిగే మార్గం కూడా జాగర్త చేసుకోని స్వారీకి ఉపక్రమించిన ప్రాప్తకాలజ్ఞుడాయన.

పాపం కేసీయారు ఇలాంటి ఏర్పాట్లేమీ చేసుకున్నట్టు లేదు. నేనేం చెబితే దానికి తలలూపేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఊరుకోక ఏంచేస్తార్లే అని అనుకొని ఉండవచ్చు. తానొకటి తలచిన దైవమొకటి తలచునన్నట్టు, ప్రజలు అలా అనుకోలేదు. దీక్ష చెయ్యాల్సిందేనన్నారు. ప్రజల ఆవేశం కారణంగా కేసీయారుకు ఆమరణ దీక్ష చెయ్యకతప్పని పరిస్థితి ఏర్పడింది. బహిరంగంగా ఆత్మహత్య చేసుకోబోయినవాడి పరిస్థితి అయింది. కిరసనాయిలు పోసుకున్నాడు, ఇక నిప్పంటించుకోవడమే తరువాయి. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి, అడ్డం పడకపోతారా అని ఆలోచించాడు. ఎవ్వడూ వచ్చి ఆపడు, పోనీ తనే మానేద్దామనుకుంటే, కుదరదంటున్నారు. అగ్గిపెట్టె ఇచ్చి, కాల్చుకో అని ఉరిమి చూస్తున్నారు. కేసీయారుకిది బలవన్మరణ దీక్ష అయింది. (బలవన్మరణమంటే తనను తాను చంపుకోవడం. ప్రజల ఒత్తిడి మీద చేస్తున్నది కాన, దీన్ని బలవన్‌బలవన్మరణ దీక్ష అని అనాలా? ఏమో!)

అక్కడికీ పళ్ళరసం తాగాడు. తాట తీస్తామని జనం ఆగ్రహించడంతో మళ్ళీ ఆమరణ.. చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ఆట.
------------------------------------

ఒక వాస్తవికమైన సమస్య కోసం చేపట్టిన ఉద్యమం - మొదలెట్టిందెవరైనా - ప్రజల మద్దతు పొందుతుంది. కేసీయారు కూడా అలాగే పొందాడు. ఆయనడిగే పరిష్కారం - రాష్ట్ర విభజన - సమంజసం కాకపోవచ్చు, కానీ సమస్య ఉందని ఒప్పుకోకుండా ఉండలేరెవరూ! (సమస్యను బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు. పరిష్కారం రాష్ట్ర విభజన తప్ప మరో మార్గం లేదన్నట్టుగా పూనకం తెప్పిస్తున్నారు.) అయితే పరిష్కారం సాధించే మార్గంలో ఆయన చేపట్టిన పద్ధతులు కొన్ని ఉద్యమానికి మద్దతు తెచ్చేవిగా లేవన్నది సత్యం. కొన్ని అద్భుతమైన ఎత్తులువేసిన కేసీయారే కొన్ని చవకబారు పనులు చేసి ప్రజల్ని నీరసపరిచాడు. ఈ నీరసపరిచే చర్యల్లోదే.. తాజా దీక్షావిరమణాంకం. అయితే ఈ చర్యే అనుకోకుండా ప్రజల్లో -ముఖ్యంగా విద్యార్థుల్లో - వేడి రగిలించింది. సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది.

ఆమరణ దీక్ష మొదలెట్టేదాకా నాయకుడు ప్రజల్ని నడిపించాడు. విరమణ ప్రహసనం తరవాత, ఇక ప్రజలే నాయకుణ్ణి నడిపిస్తున్న విధానం చూస్తున్నాం. ఇప్పుడిక ఉద్యమాన్ని ఆపగల సత్తా నాయకుడి చేతుల్లో ఏమాత్రముందో సందేహమే!

అయితే ప్రాణత్యాగాలతో తెలంగాణ రాదని సిద్ధాంతకర్తలు ప్రకటిస్తున్నారు కాబట్టి, కేసీయారు పులిమీదనుంచి దిగే ఏర్పాట్లు చేస్తున్నట్టే!

--------------------------------
పాపం పోలీసులు! శాంతి భద్రతలు కాపాడవలసింది వాళ్ళే, కానీ గొడవలు జరిగే చోటికి పోరాదు. ఉస్మానియాలోకి అడుగు పెట్టకూడదట. ఖమ్మం ఆసుపత్రిలో కేసీయారు గదిలోకి అడుగుపెట్టకూడదట.. రేపేదన్నా అనుకోనిది జరిగితే మాత్రం శాంతి భద్రతలకు ఈ పోలీసులే బాధ్యత వహించాలి.

22 కామెంట్‌లు:

  1. "ఆమరణ దీక్ష అయ్యాక వస్తాను" సూపరో సూపరు

    అయితే ప్రాణత్యాగాలతో తెలంగాణ రాదని సిద్ధాంతకర్తలు ప్రకటిస్తున్నారు కాబట్టి, కేసీయారు పులిమీదనుంచి దిగే ఏర్పాట్లు చేస్తున్నట్టే!

    నిజం చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. చనిపోతానని తెలిసే దీక్షకి దిగాడని కొందఱంటున్నారు. ఆయనకి అతితాగుడు మూలంగా కాలేయసమస్యలూ, మూత్రపిండాల సమస్యలూ గట్రా చాలా ఉన్నాయట కదా ! "ఎలాగూ పోయేవాణ్ణే కదా, పోతూ పోతూ, తెలంగాణ కోసం పోయాడనిపించుకుందా"మని దిగాడంటున్నారు. ఒకవేళ అనుకోనిదే జఱిగితే ఆయన్ని ఆంధ్రావాళ్ళే ఏదో చేశారని అభాండాలేసి దాడులు చేస్తారు.

    --తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  3. చావు తప్పి కన్నులొట్టబోవడం అంటే ఇదేనేమో.

    రిప్లయితొలగించండి
  4. కామెడీ క్లైమాక్స్ చూస్తామని ఊహించాం గానీ ఇలా థ్రిల్లర్ మూవి క్లైమాక్స్ చూపిస్తాడని(చూపించేట్టు చేశారు అనాలేమో) అస్సలు అనుకోలేదు. LBS గారు చెప్పింది కూడా ఒక కారణం అయివుంటుంది.

    రిప్లయితొలగించండి
  5. బలవంతంగా దీక్షలోకి నెట్టబడి కే.సీ.ఆర్. ఇప్పుడు స్వయంకృతాపరాధపు ఫలితం అనుభవిస్తున్నాడు!

    చనిపోయిన శేఖరుడి సంగతి చాలామంది హాయిగా మఱచిపోయారు, ఇప్పుడు ఈ శేఖరుణ్ణి కూడా ఎవ్వఱూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. అనవసరపు రాద్ధాంతం చేసి "ఏదో పొడిచేశానని అనిపించుకోవాలి" అన్నట్టుగానే ఉంది చూడడానికి మాత్రం ఈ తంతు అంతానూ.

    రిప్లయితొలగించండి
  6. పళ్ళరసం వరకూ అంతా ఊహించినట్టే జరుగుతోంది అనుకున్నాను కానీ అంతలోనే అనుకోని ట్విస్ట్.. చూడాలి ఏం జరుగుతుందో..

    రిప్లయితొలగించండి
  7. ఆయనకు సెలైన్ పెట్టటానికి వీల్లేదు, బిస్కత్తులు ఇవ్వటానికి వీల్లేదు అని స్వయానా ఆయన కొడుకే అంటూంటే బిత్తరపోవాల్సివచ్చింది.

    బొల్లోజు బాబా

    రిప్లయితొలగించండి
  8. చూద్దాం ఇంకెత కామెడీ ఉందో ముందు ముందు.

    రిప్లయితొలగించండి
  9. చదువరి గారు,
    మీరన్నట్టుగా
    "(సమస్యను బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు. పరిష్కారం రాష్ట్ర విభజన తప్ప మరో మార్గం లేదన్నట్టుగా పూనకం తెప్పిస్తున్నారు.)"

    అది తప్పు. దీన్ని మరోలా తిరగ రాసి సరి చేసా:

    "సమస్యను బాగా పలుచన చేసి అతిచిన్నదిగా ఊహలలోకంలో మీలాంటివారు గడిపేస్తున్నారు

    - అసలెప్పుడు ఒకే రాష్ట్రంగా మెలిగాంగనక ఇప్పుడు విడిపోడానికి.

    అవును ఒప్పుకుంటా కెసిఆర్ దగ్గర జిత్తులమారి తనం కరువైంది. వలస పాలకుల్లా తెలివిగా మసలుకోవడం తెలియని ఒక అమాయకుడైన తెలివిలేని నాయకుడు. అసలు కెసిఆర్ గాడి నోటి దురుసు మరియు హేయమైన ప్రవర్తన కారణంగానే ఇన్నాళ్ళు జనాలు అణిగిమనిగి ఒదిగి పోయారు. కాని ఒక్కటి నిజమండోయ్ - వాడు ఎలాంటివాడైనా ఉద్యమాన్ని బ్రతికించి ఊపిరి పోసిన నాదుడంటే నమ్మబుద్దికావట్లేదు కదా! వీడికున్నంత మాస్ జనాల మద్దత్తు దేశదేశాల్లో ఎవ్వడికిలేదంటే కూడా ఎదవలెవ్వరికి నమ్మబుద్దికాదు. కదా? ఎదవన్నర ఎదవలకి తిక్కరేగుతుంది - కాని ఏంపీకలేరు. కదా? ఇలాంటి బ్లాగుల్లో రాతలు రాయడం తప్ప - ఎవ్వడికైనా రాష్ట్రాన్ని విడదీయొద్దని చచ్చిపోవడమో లేక కాల్చడమో చేయగలరా? లేదు కదా! contd...

    రిప్లయితొలగించండి
  10. #2#

    ఇక్కడి ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది - బలవంతమైన తెలివైన వలస పాలకులు చేసే అన్యాయాలకు అక్రమార్కాలకు అణచివేతకు ఈ ప్రజస్వామ్యం ఒక ముసుగులా మాత్రమే పనికొస్తుందని అర్థమైయింది. ఇక దీన్ని ఆపడానికి ఎవరితరమూ కాదు - మళ్ళీ చెన్నారెడ్డి లేక ఇందిరాగాంధి, వైఎస్ లాంటి నియంతలు రావాలి - ఉన్నార్లే రోషయ్యేంతక్కువోడు కాదు. సబితను పోలీసులను ఎలా వాడుకున్నాడో చూసాంకదా - పాపం సబిత భర్త ఆత్మ ఎంత క్షోభించిందో... సర్లే కానియ్యి. చలి చీమల చేత బలవంతమైన పాములు చావయా? మరి ఈ తెలంగాణ అమాయకపుటెదవలు చలి చీమలే. కదా?

    ఉప్పెనలా ఎగసిపడే ఈ ప్రజోద్యమాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే ఇలాంటి అమాయకులు ఇంకెందరో బలిదానం కావలసిందే తప్పదు. జాగ్రత్త! మరి ఉంటా...

    రిప్లయితొలగించండి
  11. I just want to share this wonderful quote from late Sri KaLOji.

    "దోపిడి చేసే ప్రాంతేతరులను, దూరం దాకా తన్ని తరుముతం
    ప్రాంతం వాడే దోపిడి చేస్తే, ప్రాణంతోనే పాతర వేస్తం" — కాళోజి

    రిప్లయితొలగించండి
  12. కాళోజి ఎవరు? మధ్యలో ఆయన గోలేంటి?

    రిప్లయితొలగించండి
  13. >>>>ఒక వాస్తవికమైన సమస్య కోసం చేపట్టిన ఉద్యమం<<<<

    Kaasepu KCR ni Marachipoyi
    Telangaanaa Gurinchi Telusukune Prayatnam Cheyandi.

    Appudu idi Avaastavikamaina Udyamamaa Vaastavikamaina, Nyaayamaina Udyamamaa Ardha Mavutundi.

    Here is one Link to know about Telangaanaa

    video.google.com/videoplay?docid=7730660376611492753#

    రిప్లయితొలగించండి
  14. @ ఆబ్రకదబ్ర

    ప్రముఖ తెలంగాణా ప్రజాకవి కాళోజీ గురించి మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా వుంది. వారు ఇప్పుడు లేరు.

    రిప్లయితొలగించండి
  15. రాజన్న: 1. తెలంగాణ గురించి మీకు తెలిసిన మాత్రం నాకు తెలవకపోవచ్చేమోగానీ, నాకూ ఒకింత తెలుసు. 2. తెలంగాణ కేసీయారుతో పుట్టిందేమీ కాదు, కాబట్టి కేసీయారును పక్కనబెట్టి చూట్టానికేమీ అభ్యంతరం లేదు. అలా చూసే చెబుతున్నా.. సమస్య వాస్తవికమైనదే.. కానీ, పరిష్కారం రాష్ట్ర విభజన కాదు. సమస్యను బాగా వెడల్పు చేసి, భూతద్దంలోంచి చూసి, చూపి, రాష్ట్ర విభజనే సర్వరోగనివారిణి అని చెప్పి ప్రజలను నమ్మించబూనుకున్నారు తెలంగాణవాదులు. ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు తెలంగాణేతరులను బూతులు తిట్టడానికి కూడా వెనకాడలేదు. తిట్టడం మీ హక్కు, పడటం ఇతర ప్రాంతాలవాళ్ళ ఖర్మ అన్నట్టు మాట్టాడారు. ఎవరి నుంచైతే ఏర్లుపడాలని కోరుకుంటున్నారో వాళ్ళని ఓ పక్కన తిట్టిపోస్తూనే, మా బాధలను అర్థం చేసుకోడం లేదంటూ నిష్ఠురాలాడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  16. "ఎదవన్నర ఎదవలకి తిక్కరేగుతుంది - కాని ఏంపీకలేరు. కదా? ఇలాంటి బ్లాగుల్లో రాతలు రాయడం తప్ప - ఎవ్వడికైనా రాష్ట్రాన్ని విడదీయొద్దని చచ్చిపోవడమో లేక కాల్చడమో చేయగలరా? లేదు కదా!" - శ్రీధర్ రాజు - చికాగో: వ్యాఖ్యల్లో ఇలాంటి రాతలు రాయడం కాకుండా, రాష్ట్రాన్ని విడదీయాల్సిందే అంటూ దానికోసం చచ్చిపోవడమో లేక కాల్చుకోవడమో మీరు చెయ్యగలరా? లేదు కదా! (నేను వేరే ఎవరో యదవల గురించి కాదు ఈ మాటలంటున్నది, ఘనత వహించిన ఒకే ఒక్కరితో మాట్టాడుతున్నాను.)

    నేను ప్రాణత్యాగం చేస్తేనన్నా తెలంగాణ వస్తుందేమోనని కేసీయారు అనుకోవడం వేరు, కేసీయారు చస్తేనన్నా తెలంగాణ వస్తదేమో చూద్దాం అని ఎదురుచూడ్డం వేరు. కేసీయారును చంపితేనన్నా తెలంగాణ వస్తుందేమో చూద్దాం అని అనుకోవడం మరీ వేరు. నేను చస్తేనన్నా తెలంగాణ వస్తదేమో అని శ్రీధర్ రాజు - చికాగో అనుకోవడం చాలా వేరు, తేడాలు తెలుస్తున్నాయా? లేదు కదా!

    చికాగోకు హై. ఎంత దూరమో, హై.కు చికాగో కూడా అంతే దూరం! ఏం చెబుతున్నానో అర్థమౌతోందా? లేదు కదా!

    కేసీయారు ఖచ్చితంగా జననాయకుడు. వాక్శక్తిలో ఆయనతో సరితూగగలిగినవాళ్ళు మనకు లేరు. ఉద్యమాన్ని నిర్మించినవాడికి ప్రస్తుతం తాను చేపట్టిన ఈ పనిపై నిబద్ధత లేదన్నది ఎత్తి చూపుతున్నానంతే!

    రిప్లయితొలగించండి
  17. అబ్రకదబ్ర: మీకు తెలియకనే అడిగారని అనుకోను. అయినా చెబుతున్నాను, నాలుగు తెలుగు మాటల్లో నలభై ఉర్దూ మాటలు కలిసిన తెలుగు మాట్టాడుతూనే 'తీరపోని' ఇంగ్లీషు మోజును ఎద్దేవా చేసిన వ్యక్తి ఆయన. ఒకసారెప్పుడో కాళోజీ విజయవాడలో ఉండాల్సి వచ్చినపుడు, అక్కడ ఎవరో ఆయన్ను ఎగతాళి చేసారంట. దానికి ఆయన కసి పెంచుకున్నాడు, ఇక 'తీరపోన్ని తీరం దాకా తరుముతా' నంటూ.. ఇదీ వరస! చౌడప్పో ఎవరో బూతు కవిత్వం రాసాడంట. కాళోజీ ఎద్దేవా కవిత్వం కూడా రాసాడు!

    శ్రీధర్ రాజూ, కాళోజీని అంటే కష్టంగా అనిపిస్తోంది, కదా! నా రాష్ట్రంలోనే నన్ను వలసవాడు అన్నపుడు, దురాక్రమణదారు అన్నపుడు, దోపిడీదారు అన్నపుడు, 'పో, నీ రాష్ట్రాన్నీ, నీ రాజధానినీ ఏర్పాటు చేసుకోపో' అని అంటున్నపుడు నాకూ కష్టం కలుగుతుంది. నేజెప్పేది మీకు అర్థమౌతోందా? లేదు కదా!

    రిప్లయితొలగించండి
  18. చదువరి గారు,

    మీ టపా బాగుంది. అంతకంటె శ్రీధర రాజు గారికి మీరిచ్చిన సమాధానం చాలాబాగుంది.


    కాముధ

    రిప్లయితొలగించండి
  19. @శరత్:

    తెలీకపోటమేంటి :-)

    @చదువరి:

    మీరనుకుంది నిజమే. తెలిసే అడిగా. పద్యాలు కోట్ చేస్తే పనులైపోతాయనుకునేవాళ్ల వెర్రితనానికి చిర్రెత్తి అడిగా. వ్యక్తిగత కక్షలూ కార్పణ్యాలూ స్వార్ధాలూ అజెండాలతో రాయటం వచ్చనొకడు, కూయటం వచ్చని మరొకడు .. తేరగా కూర్చుని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే విద్యలో కాళోజీ, కేసీయార్ దొందూ దొందే. వాళ్లిద్దరికీ ఇవ్వాల్సింది ఒకే విలువ. రేపు జై ఆంధ్రా అనో జై సీమ అనో మరో పోటీ ప్రత్యేకవాది పుట్టుకొస్తే వాడికి దొరికేదీ ఆ విలువే.

    రిప్లయితొలగించండి
  20. ఇది నిజమైన ఉద్యమం కానే కాదు. పొట్టి శ్రీరాములు గారు పోరాడిన విధంగా అహింసా మార్గంలో ఎటువంటి గొడవలు లేకుండా చేస్తే ఎటువంటి ఉద్యమం ఐనా ప్రజలను ప్రభావితం చేస్తుంది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్న కార్యకర్తలు, విద్యార్థుల(అసలు వాళ్ళు నిజమైన కార్యకర్తలు, విద్యార్థులేనా?)ను అడ్డుకునే నాధుడే లేడా? ఇన్ని గొడవలు జరుగుతున్నా నగర పొలీసు కమీషనరు & ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు ఇవ్వాలి.

    రిప్లయితొలగించండి
  21. abrakadara garu....please dont criticise t.g.venkatesh garu or vasantha nageswara rao garu for saying separate andhra or separate seema.....this is a reaction for action..

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు