5, నవంబర్ 2009, గురువారం

మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..

అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?

మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.


ఐదో తరగతి దాకా చదువు తెలుగులో చెప్పకుండా, పరాయిభాషలో చదువు చెప్పడం వాళ్ళకు వేస్తున్న అసలు శిక్ష అనేది మనం గమనించాలి. దానికితోడు తెలుగులో మాట్టాడినందుకు ఈ శిక్ష!

ఓ సంగతి చూడండి.. సాఫ్టువేరు ఉద్యోగాలు చేసే మన కుర్రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతలేదన్నా కనీసం ఓ మూణ్ణాలుగు లక్షల మందైనా ఉంటారు. "మన కుర్రాళ్ళు" అంటే 20-30 సంవత్సరాల మధ్య ఉండే తెలుగు వాళ్ళు! దాదాపుగా అంతా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళే! ప్రతీ రోజూ కనీసం ఏడెనిమిది గంటలు జాలంలో ఉంటారు. ఇంతమంది తెలుగువాళ్ళు జాలంలో తిరుగుతూంటే తెలుగు బ్లాగులను చూసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి? ఏనాడన్నా మీ బ్లాగుకు వెయ్యి మంది వచ్చారా? బ్లాగులకు సందర్శకులను సరఫరా చేసే కూడళ్ళకు కూడా వెయ్యిమంది రారు నా ఉద్దేశంలో! ఈ కుర్రాళ్ళలో బ్లాగులున్నాయని తెలవనివాళ్ళు, బ్లాగులంటే ఆసక్తి లేనివాళ్ళు కొంతమంది పోయినా, కనీసం ఒక్..క శాతం కూడా బ్లాగులను చదవడం లేదెందుకు?

తెలుగు చదవడం, రాయడం రాకే! ఇంగ్లీషు మీడియమ్ చదువులు వీళ్ళకు తెలుగును నేర్పనివ్వకుండా చేసాయి. (ఇప్పుడు బ్లాగులు చదివేవాళ్ళలో కూడా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళు బాగా తక్కువ మంది ఉండొచ్చు.) చిన్నప్పుడు తెలుగులో చదవడం, పెద్దయ్యాక (కనీసం ఇంటరుదాకా) తెలుగు చదవడం - ఈ రెండు పనులు చేస్తే తెలుగు చదవలేక/రాయలేకపోవడం అనేది ఉండదు. 

తెలుగులో మాట్టాడితేనే తప్పయ్యే పరిస్థితి బడుల్లో ఉంటే, మన పిల్లలకు తెలుగు చదవడం రాయడం వస్తుందా? వాళ్ళ పిల్లలకు మాట్టాడ్డం వస్తుందా? అంచేతే.. ఐదు దాకా పిల్లలకు చదువు తెలుగులోనే చెప్పాలి. పునాదిలో తెలుగుంటే ఆ పైన ఏ భాషలో చదివినా నెగ్గుకొస్తారు. ఆరో తరగతి నుంచి ఇంటరు దాకా ఏ భాషలో చదివినా, తెలుగు సబ్జెక్టు మాత్రం చదివి తీరాలి. ఈ పనులు చేసిన ముఖ్యమంత్రి మరో రాయలే!

~~~~~~~~~~~~~~~~~~~

సరే..
పెద్దలు కొందరు (మేధావులు) అసలు సంగతిని పక్కనబెట్టి, దీనికి సామాజిక కోణాన్ని ఆపాదిస్తూంటారు.  కులాన్ని, మతాన్ని సమస్యలోకి లాక్కొస్తారు. లాక్కొస్తున్నారు కూడా. 'పిల్లలకు శిక్ష వెయ్యడమనేది అసలు సమస్య. అంతేగానీ, తెలుగులో మాట్లాడొద్దనడం కాదు' అంటూ ఉపదేశాలిస్తున్నారు. ఆ శిక్ష వేసినవాళ్ళకు తగు శిక్ష విధించాలి అని వాదిస్తున్నారు. నిజమే ఆ పంతుళ్ళను బడినీ శిక్షించాల్సిందే, అందులో మరో అభిప్రాయం ఉండటానికి లేదు. కానీ, అదేనా పరిష్కారం? మెడలో పలక వేసిన సంగతి మనకు తెలవగానే నోరెళ్ళబెడుతున్నాంగానీ, అంతలా కాకపోయినా.. ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన మాత్రం అనేక బడుల్లో ఉంది. ఫైన్లు వేస్తారు. ఒక పీరియడ్లో నిలబెడతారు, ఐడోంట్ స్పీక్ తెలుగు అనీ వంద సార్లు రాయిస్తారు.. ఇలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళను ఏంచేస్తాం? 30 యేళ్ళ కిందటే నెల్లూరులో ఒక బడిలో "అయామె తెలుగు డాంకీ" అని రాసున్న పలకలు మెడలో తగిలించేవారని ఓ డాక్టరు గారు చెప్పారు, చూడండి. "తెలుగులో మాట్టాడకూడదనే ఆంక్షలు ఏ ఇంగ్లీషు బడిలోనైనా ఉంటాయి, ఇక్కడేదో పెద్ద హింస జరిగిపోయినట్టు చేస్తున్నారేంటి " అని కంచె అయిలయ్య అన్నాడు. నిజమే చెప్పాడు. కానీ, అందులో తప్పేమీ లేదన్నట్టు మాట్టాడ్డమే ఆయన ప్రత్యేకత!

కంచె అయిలయ్య ఇంకా ఏమన్నాడో చూడండి..
తెలుగు భాష మాట్లాడొద్దని అన్నందుకు, ఆ ప్రిన్సిపల్‌ను పిలిచి అఫిషియల్సు ఎంత హ్యుమిలియేట్ చేస్తున్నారో చూడండి.  పిల్లలకు ఆహారం లేకపోతే అఫిషియల్సు పట్టించుకోట్లేదు, మీడియా పట్టించుకోట్లేదు, సోషల్ వెల్ఫేరు స్కూల్స్ నడవకపోతే పట్టించుకోట్లేదు. బోర్డులు కట్టారనే కారణంతో ఇం..త పెద్ద నన్‌ను, ప్రిన్సిపల్‌ను హెరాస్ చేసే ప్రక్రియ మనం చేస్తున్నామే!
అని బాధపడిపోయాడాయన!

ఇంకోమాట కూడా .. ఇదేదో పెద్ద నేరమైనట్టు ఆ బడిమీద చర్య తీసుకోవడం లాంటివి చెయ్యకూడదు. పిలిచి ఓమాట చెప్పి వదిలేస్తే సరిపోద్ది అని అన్నాడు. ఆయన ప్రాథమ్యాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తోంది గదా!  మరికొందరు మేధావులు కూడా ఇలాగే సమస్యను ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.

~~~~~~~~~~~~~~~~~~~

ఇంతకీ.. అయిలయ్య ఈ సమస్యకో పరిష్కారం చూపించాడు.. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటరు  దాకా పిల్లలందరికీ మూడు సబ్జెక్టులు మాతృభాషలోను, మూడు ఇంగ్లీషులోను చెప్పాలంట. అలాగైతే రెండు భాషలూ వస్తాయంట.  ఉన్న సబ్జెక్టులు ఆరు - తెలుగు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్సు, సోషలు - ఇవేగా?
అందులో మూడు తెలుగులో చెప్పమంటున్నాడు. మాతృభాషలో చదువు చెప్పడమంటే అదే కదా ! -లెక్కలు, సైన్సు, సోషలు తెలుగులో చెబుతారు. ఈయన లెక్కేంటో అర్థం కాలేదు అని అనుకుంటూండగా, ఇంకో ముక్క అన్నాడు..
- 'సగం సిలబస్సు మాతృభాషలోను, సగం ఇంగ్లీషులోను చెప్పాలి, ఆ దెబ్బతో రెండు వచ్చేస్తాయం'ట. ఇంకోటేంటంటే.. ఇలా చదివిన పిల్లకాయలు దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా చక్కగా చదివెయ్యగలరంట !!!

అయిలయ్య చెప్పినది ఇలా ఉండగా..

~~~~~~~~~~~~~~~~~~~

ఏ తికమకా లేకుండా కొందరు పెద్దలు ఇలా చెబుతున్నారు..
"ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు చదువు ప్రవేశించి, తెలుగును మరణశయ్య మీదకి ఎక్కిస్తోంది" ఈ ముక్క ఎవరన్నారో తెలుసా.. రంగనాయకమ్మ!

"అధికార భాషగా తెలుగును అమలుచెయ్యని ప్రభుత్వానికి తెలుగు ప్రాచీనతను అడిగే నైతిక హక్కు లేదు." జ్వాలాముఖి

"గత ఇరవై యేళ్ళుగా ఇంగ్లీషు మాధ్యమ చదువులు విపరీతంగా పెరిగాయి. దాదాపు రెండు తరాల విద్యార్థులు తెలుగు రాకుండానే తెలుగును నామమాత్రంగ చదువుతూనో, అసలు చదవకుండానో పాఠశాల చదువులు, కాలేజీ చదువులూ వెలగబెట్టారు. డాక్టర్లు, ఇంజనీర్లూ అయ్యారు. వీళ్ళంతా పరభాషా సంస్కృతులకు పరాయీకరణం చెంది ఇంట్లో తెలుగు పత్రికను కనబడనీయరు, కనబడ్డా ముట్టరు. వీళ్ళు తెలుగుకు దూరమైతే వీళ్ళ పిల్లలకు రానిస్తారా? ఇలా మరో రెండు తరాలు గడిస్తే వీళ్ళంతా తెలుగు మాటకు కూడా దూరమవుతారు. ఓ సమాజంలో 20 శాతం మంది ఆ భాషను చదవకుండా చదువు ముగిస్తే ఆ భాష మృతభాష అయ్యే ప్రమాదముంది అని యునెస్కో హెచ్చరించింది."- కాలువ మల్లయ్య. ఈయన రాసిన వ్యాసం పూర్తిగా చదివి తీరాలి. మనం చూస్తున్న కొందరు ఇంగ్లీషు భక్తుల నైజాన్ని ఆ పేజీల్లో పరిచాడాయన.

వీళ్ళే కాదు, వేలమంది పెద్దలు - విద్యావేత్తలు, భాషావేత్తలు, రచయితలు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు -  తెలుగులో బోధన చెయ్యాలనీ, తెలుగును విధిగా నేర్పాలనీ చెబుతున్నారు. వీళ్ళు మనకు రాజకీయ నాయకులు కాకపోవచ్చు, కానీ నాయకులే -సాంస్కృతిక నాయకులు!

మనమంతా కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసి, పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది.

~~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~

ఈ విషయంపై పొద్దులో జరుగుతున్న చర్చ చూడండి.

30 కామెంట్‌లు:

 1. మీ టపా చదివాక, ఆ లంకె చూసాక, నాకొకటి గుర్తొచ్చింది. మా బడిలో (మాది ఇంగ్లీష్రె మీడియం స్కూల్డ్ కాని తెలుగు మొదటి భాష) రెడ్ స్టిక్ అని ఒకటుండేది. ఎవరు తెలుగు మాట్లాడితే అది వాళ్ళ చేతిలోకి వెళ్ళేది. సాయంత్రానికి ఎవరి చేతిలో అదో ఉంటే వాళ్ళ నడ్డి విరిగేది. కొన్నాళ్ళు నడిచినా మేము మాత్రం ఆ ఎర్ర కర్రని చేతులు మర్చుకునా గుట్టుగా తెలుగు మాట్లాడుకునే వాళ్ళం. కొన్నాళ్ళు అయ్యాక స్కూల్ వాళ్ళే తీసేసారనుకోండి అది. అప్పట్లో అది అంత పట్టించుకోలేదు. ఇప్పుడు తలుచుకుంటే చాలా అన్యాయం అనిపిస్తోంది. తరగతి పెరిగే కొద్దీ స్కూల్ లో దాదాపు ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాళ్ళం. కానీ తెలుగు మీద ఇష్టం ఏ మాత్రం తగ్గలేదు ఆ పైన ఎక్కువ మందికి మా తరగతి లో .

  మా లాటివి వీధి కొక స్కూల్. ఇక తెలుగు కనీసం ఒక భాష గా కంపల్సరీ కాని స్కూళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు.

  రిప్లయితొలగించండి
 2. మీరేంటి సార్ పొద్దున్నే కంచె అయిలయ్య గారి తో పెట్టుకుంటున్నారు , "నేను తెలుగోడిని ఎట్లెతా " అని పుస్తకం రాస్తే చావలేక చావాలి :)

  రిప్లయితొలగించండి
 3. తెలుగు మాట్లాడితే ఫైను అన్నది చాలా స్కూళ్ళల్లో ఇంతకు ముందు ఉన్న అభిజాత్యమేనండి. నాకు ఈ మధ్యనే ఈ సంగతి తెలిసింది.ఇంకా దారుణం ఏమంటే, అలా చేసే స్కూళ్ళను పొగిడేపరిస్థితి ఉన్నది.

  "ఇంగ్లీషు మాట్లాడడానికి ఉద్దేశ్యించబడ్డ పాఠశాల కాబట్టి అది సబబే, కాపోతే శిక్ష అంతలా ఉండకూడదు" అనడం - మార్జాల క్షీరన్యాయమే తప్ప మరొకటి కాదు.

  గణితంలోనో, సైన్సులోనో తక్కువ మార్కులొస్తేనో ఫైను లేదే? తెలుక్కు మాత్రమే ఏమిటి ఈ దరిద్రం?

  వ్యక్తిగత వాదాలను సార్వజనికం చేయడం కోసం, సమస్యను వక్రీకరించే వారి ధోరణి పూర్తిగా అనుచితం.

  అంతర్జాల పత్రికలో, ఓ ఉపయుక్తమైన చర్చ పక్కదారి పట్టించడం వల్ల ఏం ఒరుగుతుందో అర్థమవట్లేదు.

  రిప్లయితొలగించండి
 4. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు పెద్దైన తరువాత కూడా ఇంగ్లిష్ మాట్లాడుతారనుకోను. మీరు బ్యాంక్ కి వెళ్ళినా, టెలీఫోన్ ఎక్స్చేంజ్ కి వెళ్ళినా అక్కడ ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడం కనిపిస్తుంది. నేను ICICI, & HDFC బ్యాంక్ లకి వెళ్తుంటాను. ఇక్కడ స్థానిక బ్రాంచిలలో పని చేస్తున్న వాళ్ళలో మేనేజర్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ 30 ఏళ్ళ లోపు యువకులే. వాళ్ళు తెలుగు బాగానే మాట్లాడుతారు. 1980 తరువాత పట్టణాలలో ఎక్కువ మంది పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చేరడమే జరిగింది. కనుక ఈ ఉద్యోగులు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదివినవాళ్ళు అనుకోవాలి. ములాయం సింగ్ యాదవ్ "अंग्रेजी हठाओ" అన్న లెవెల్ లో మీరు ఆంగ్లం పై ఎందుకు విరుచుకుపడుతున్నారు?

  రిప్లయితొలగించండి
 5. @ Sravya Vattikuti: "నేను తెలుగోడిని ఎట్లెతా " ....LOLLLLLL
  నాకు వాడి గురించి మొన్నటి వరకూ తెలీదు.. అంతర్యానం లొ చదివా..

  రిప్లయితొలగించండి
 6. //నిజమే ఆ పంతుళ్ళను బడినీ శిక్షించాల్సిందే, అందులో మరో అభిప్రాయం ఉండటానికి లేదు. కానీ, అదేనా పరిష్కారం?

  ఎంత మాత్రమూ కాదు. పిల్లలకు శిక్ష గురించి ఆలోచిస్తే, అంత చిన్న వయసులోనే ఆంగ్ల మాధ్యమంలో చదువు నేర్పించటం కూడా వారికి శిక్షే.
  అయిలయ్య గారు చూపిన పరిష్కారం ఏమాత్రం సరియైనది గా తోచటం లేదు.
  నెల్లూరు బడిలో జరిగిన సంఘటన సంఘటన ఘోరాతి ఘోరం.
  'ప్రాధమిక స్థాయి వరకు నిర్బంధ తెలుగు అమలు' విషయంలో చర్చను దాటి ఉద్యమందాకా వెళ్ళగలిగితేనే ప్రయోజనం ఉంటుంది.
  మరొక్కసారి ఆలోచించవలసిందిగా విన్నపం.

  రిప్లయితొలగించండి
 7. "మనమంతా కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసి, పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది"

  PIL పిటిషన్లాంటిదేదైనా పెట్టి సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ఏమైనా లాభముంటుందంటారా? ఇంటర్నెట్లో పెట్టి, మనకి తెలుసున్న వాళ్ళందరికీ తెలియజేస్తే ఎంత స్పందన వస్తుందో చూడవచ్చు. దాన్నిబట్టి ఎంతమంది తెలుగువాళ్ళు దీన్ని గురించి పట్టించుకుంటారో కూడా అంచనా వెయ్యవచ్చు.

  రిప్లయితొలగించండి
 8. కామేశ్వరరావు గారు, ప్రభుత్వంపై ఏవిధంగా ఒత్తిడి తెచ్చినా మంచిదేనండీ. ముఖ్యంగా ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్యమాల వల్లే ఫలితం ఎక్కువ ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 9. ఇప్పుడు పరిస్థితి గమనించక చాలమంది ఇన్ని పాఠశాలలున్న తెలుగుదేశం లో తెలుగు కనుమరుగవుతుందా అని వాదిస్తున్న మేధావులు తెలుగుబడులన్నింటినీ సక్సెస్ స్కూల్లపేరిట ఇంగ్లీష్ మీడియానికి మారుస్తున్నారు అనేవిషయాన్ని కావాలని విస్మరిస్తున్నారు. ఇప్పుడు మేల్కోకుంటే తెలుగు భాష ,జాతి ఆత్మహత్యచేసుకున్నచందమే అవుతుంది

  రిప్లయితొలగించండి
 10. మీరు హైదరాబాదులో వుంటారుగా,
  మీ పిల్లలు ఆంగ్లమాధ్యమమా, తెలుఁగుమాధ్యమమా?

  అసలు మధ్యతరగతి వారు తమ పిల్లల్ని చేర్పించడానికి తెలుఁగుమాధ్యమం పాఠశాలలు వున్నాయా? "అంటే బొత్తిగా గవర్నమెంటువారి బళ్ళకు పంపలేం కదండీ" అంటూంటారుగా?

  ఇలాంటి విషయాల్లో మాటలకూ చేతలకూ ఎంత పొంతనుందో గమనించ అవసరం వుంది.

  ఆ పిల్లలు ఆంగ్లమాధ్యమం పాఠశాలలో తెలుఁగులో మాట్లాడి తప్పు చేశారు అన్నది అన్నతని పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుతంటే, అతని కనీస నిజాయితీకి నేను దణ్ణం పెడతాను.

  నిన్నెవరో బ్లాగర్ని కలిసాను, అతనంటున్నాడు, అందరికీ తమతమ పక్షపాతాలు వుంటాయండి, విషయాల్ని అందులో ఇఱికించడానికే ప్రయత్నం ఎంతసేపూనని.. నిజమనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 11. నాకు ఇక్కడివి , పొద్దులోవి కొంతమంది వాఖ్యలు చదువుతుంటే వ్యక్తుల మీద దాడి , వ్యక్తిగత దాడులు అని మొత్తుకొనే వారు చూడండి అది గుర్తుకొస్తుంది అంటే ఆ హక్కులు "కొంతమంది కే " ఉంటయా లెకపోతే కొన్ని విషయాలకే వర్తిస్తాయో మరి :(

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. మీరు హైదరాబాదులో వుంటారుగా,
  మీ పిల్లలు ఆంగ్లమాధ్యమమా, తెలుఁగుమాధ్యమమా?

  అసలు మధ్యతరగతి వారు తమ పిల్లల్ని చేర్పించడానికి తెలుఁగుమాధ్యమం పాఠశాలలు వున్నాయా? "అంటే బొత్తిగా గవర్నమెంటువారి బళ్ళకు పంపలేం కదండీ" అంటూంటారుగా?

  రాకేశ్వర రావు,
  మంచి ప్రశ్నే వేశారు!


  మరి కాస్తో కూస్తో స్కూళ్ళలో "సరుకు" ఉన్న కాలంలో
  చదువుకున్నాం కాబట్టి పిల్లలని మంచి స్కూల్లో చదివించాలనే ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా! మంచి స్కూలంటే ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పే స్కూలే కాదు, సబ్జెక్టుని మెదళ్ళకోకి సులభమైన పద్ధతుల ద్వారా పంపగలిగే స్కూలు! అటువంటి స్కూళ్ళు ఇవాళ ఏ మీడియమ్ లలోనూ లభ్యం కావు. పోర్షన్ ఎంత ఉందో చెప్పడం! దాన్ని రుబ్బించడం, స్కూల్లో ఉన్నంత సేపూ ఇంగ్లీష్ లో మాట్లాడించి పంపడం!

  నేను మునిసిపల్ హై స్కూల్లోనే చదివా పది వరకూ! ఇరవయ్యేళ్ళ క్రితం! అప్పటి ప్రమాణాలు ఇప్పుడు ఏ గవర్నమెంట్ పాఠశాల్లోనూ లేవు గాక లేవు. మరి ఏ ధైర్యంతో పంపుతారు ఆ స్కూళ్ళకి? ఆ స్కూళ్ళ ప్రమాణాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ఎవరిది?


  ప్రైవేట్ స్కూళ్లలో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు బోధించడమే కష్టంగా ఉంది, ఇక పూర్తిగా తెలుగు మాధ్యమం ఎక్కడా లేదు. కొద్దిగా విద్యాప్రమాణాలు బావున్న స్కూల్లో తెలుగు మీడియం ఉండదు. ఇప్పుడేం చెయ్యాలి మరి?

  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నంతలో మంచి స్కూలు ఎన్నుకోవాలి!ఇంట్లో మన పిల్లలకు మనం తెలుగు నేర్పుకోవాలి.

  పిల్లల్ని అట్లా అనాగరికంగా శిక్షించడం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పే!

  వెంకటరమణ గారు చెప్పినట్లు "'ప్రాధమిక స్థాయి వరకు నిర్బంధ తెలుగు అమలు' విషయంలో చర్చను దాటి ఉద్యమందాకా వెళ్ళగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. ....!

  రిప్లయితొలగించండి
 14. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న అత్యధికులు ఇంగ్లీష్ మీడియం చదివిన వారంటే ఎందుకో నాకు నమ్మశక్యంగా లేదు. దాదాపు నాకు తారసపడ్డవాళ్ళలో 50-50 తెలుగు/ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు. ఇంక వాళ్ళు బ్లాగులకు వచ్చి ఎందుకు చదవలేదంటారా? నా అభిప్రాయం ప్రకారం, బద్ధకం ప్రధాన కారణం. ఓపిక లేకపోవడం ఇంకో కారణం. నా వరకే వస్తే మా ఎంటెక్ క్లాస్‌మేట్స్ పదమూడు మందిలో 12 మంది కనీసం పదో తరగతి దాకా తమ మాతృభాషలో చదివిన వారే.కానీ నేను తప్ప వాళ్ళలో ఎవరూ కంప్యూటర్లలో మాతృభాషను పట్టించుకున్న వాళ్ళు లేరు. కనీసం కంప్యూటర్లలో మాతృభాష ఉందని కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు.

  రిప్లయితొలగించండి
 15. సుజాత గారూ, సరిగ్గా చెప్పారు. "..ప్రైవేట్ స్కూళ్లలో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు బోధించడమే కష్టంగా ఉంది,.. " - కష్టంగా కాదండి, కొన్ని బడుల్లో అసల్లేదు. కొన్నిచోట్ల "తప్పనిసరి" కాదు. ఏదో మొక్కుబడిగా ఉంది. ఆరో తరగతిలో తెలుగు చెప్పడం మొదలెట్టి తొమ్మిదితో ఆపేస్తారు. (ఇంటిదగ్గరే తెలుగు నేర్చుకున్న పిల్లలు కూడా ఆరో తరగతి వచ్చేసరికి సుబ్బరంగా పేపర్లు చదివేస్తారు, ఉత్తరాలు రాసేస్తారు. బడిలోనేమో అప్పుడు అ, ఆ లు దిద్దిస్తారంట. ఈరకం బడుల మెడలు వంచాల్సిందిపోయి, పిల్లల మెడల్లో పలకలు తగిలిస్తుంటే చూస్తున్నాం.)

  శ్రావ్య వట్టికూటి: "నేను తెలుగోడిని ఎట్లెతా " - సూపర్! :). వ్యక్తిగత దాడి - సరిగ్గా గమనించారు.

  వెంకటరమణ, కామేశ్వరరావు: ఊరికే ఇలా బ్లాగుల్లో రాసుకుంటూ కూచ్చుంటే అంతేనండి. ప్రభుత్వాన్ని అడగాలి. "..ముఖ్యంగా ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్యమాల వల్లే ఫలితం ఎక్కువ ఉంటుంది." - అవును ఇదే సరైన మార్గం. ఏదో ఒకటి చెయ్యాలి. త్వరలో ఒక ఉద్యమ రూపం ఏర్పడుతుందని ఆశిద్దాం.

  రవి: అవును, అది అనుచితమైన ధోరణే! నచ్చనివి బోలెడుంటాయి, భేదాభిప్రాయాలు లెక్కలేనన్ని ఉంటాయి. కానీ అసలు సమస్యను వక్రీకరించడం కిరాతకం.

  మంచు పల్లకీ: తెలుగుపీపుల్.కామ్ లో కూడా కొంత దొరకొచ్చు.

  వాసు: అన్యాయమే.

  రిప్లయితొలగించండి
 16. రవిచంద్ర: "..నమ్మశక్యంగా లేదు." మీ అంచనాయే సరైనదేమో! నేననుకునేది తప్పు కావచ్చు.

  రాకేశ్వరరావు: నా పిల్లలు ఇంగ్లీషులోనే చదూతున్నారు. తెలుగులో చదివిద్దామనుకున్నా, వీలులేని పరిస్థితి. బడులే లేవు. ఉన్నా, వాటిల్లో చదువు లేదు. అందుకే అన్ని బడుల్లోనూ తెలుగు మాధ్యమం ఉండాలనేది.

  ఇక నిజాయితీ సంగతి- "నిజమనిపిస్తుంది."- నాకే పక్షపాతం ఉందని అంచనా కట్టారు మీరు?

  రిప్లయితొలగించండి
 17. ఇంక వాళ్ళు బ్లాగులకు వచ్చి ఎందుకు చదవలేదంటారా? నా అభిప్రాయం ప్రకారం, బద్ధకం ప్రధాన కారణం.

  @రవిచంద్ర:
  నా వరకు దీనికి కారణం బద్దకం కాదు. మిగిలిన రంగాల కంటే కూడా సాఫ్ట్ వేర్ లో పక్కవాడి సంపాదనతో పోటీ పడటం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రంగాలలో ఒకే అనుభవం, స్థాయి/పదోన్నతి గల వారికి సరిసమాన జీతం ఉంటే ఇక్కడ మనకు బోలెడన్ని హెచ్చుతగ్గులు. బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు ఈ పోటీకి. ఇక్కడ మెటీరియలిస్టిక్ భావజాలమెక్కువ. 'బ్లాగుల వల్ల ప్రయోజనమేమిమిటి? అదే సమయంలో షేర్ మార్కెట్ విశ్లేషిస్తే లాభమేమో.., లేదా సబ్జెక్ట్ పెంచుకో... రిలాక్సేషన్ కోసం వారాంతాల్లో మాల్స్ కి వెళ్ళు, సినిమాకి వెళ్ళు, లేదా విహారయాత్రకి వెళ్ళు.' ఇదీ సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆలోచనా విధానం. నేనెక్కువగా చూసింది ఇటువంటివాళ్ళనే (తప్పుపట్టటం లేదు సుమా...! ఎవరి ఇష్టాలు వారివి)

  రిప్లయితొలగించండి
 18. మా అబ్బాయి ఇంగ్లీషు మీడియమ్ లోనే చదువుతున్నాడు. కానీ వాడికా గతి పట్టించిన ఈ వ్యవస్థ మీద నాకు చాలా కసి ఉంది. ఇక్కడ అసలు సమస్య ప్రభుత్వంతో కాగా దాన్ని వ్యక్తుల మీదికి, వాళ్ళ పిల్లల మీదికి తోయడం, తద్ద్వారా వాళ్ళ తెలుగు భాషాభిమానం మీద బుఱదజల్లే ప్రయత్నం చెయ్యడం, తద్ద్వారా వాళ్ళ వాదనని వాదనతో ఎదుర్కోలేక దాన్ని వాళ్ళ వ్యక్తిగత నిస్సహాయత మీదికి తిప్పి మూలచ్ఛేదం చెయ్యాలని చూడ్డం - ఇదంతా చాలా అభ్యంతరకరం.

  దశాబ్దాలుగా పాతుకుపోయిన రాక్షసిలాంటి వ్యవస్థతో సాధారణ ఏకాకి (సింగిల్) వ్యక్తులు పోరాడలేరు, మనసులో ఎంత భాషాభిమానం ఉన్నా ! అంతమాత్రాన వాళ్ళు భాషాభిమానులు కాకుండా పోరు. వాళ్ళ వాదనలో నిజాయితీ లేకుండా పోదు. ఇదెలాంటిదంటే "ధర్మం చెయ్యండి" అని ఒక బిచ్చగాడు అడుక్కుంటూంటే"నేను నీకు ధర్మం చేశ్తా సరే, నువ్వు నాలా ఇంకొకడికి చేస్తావా ?" అని అడగడంలాంటిది. ఇది ఇంకా ఎలాంటిదంటే - రెడ్డివర్గపు రౌడీయిజానికి అభ్యంతరం చెపితే "దీని పేరే రంగారెడ్డి. కాబట్టి నీకు మాట్లాడే హక్కు లే"దని వాదించడం లాంటిది.

  తెలుగు భాషాభిమానులు ఈ ఆంగ్లవ్యవస్థని సృష్టించలేదు. వారు పుట్టకముందే ఇది రాక్షసిలా పెంచిపోషించబడింది. ఈ వ్యవస్థని భరించలేకనే దీని స్థానంలో తెలుగు వ్యవస్థ రావాలని కోరుతున్నాం. అంతే తప్ప మా వాదనలో నిజాయితీ లేకా కాదు, మాకు తిన్నది అరక్కా కాదు.

  -- తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 19. నేను పదవ తరగతి వరకు తెలుగు మీడియం లో చదువుకున్నాను. అందునా ఓయస్సస్సీ, సంస్కృత భాష ఓ సబ్జక్టుగా. ఇంకాస్త చెప్పాలంటే, ఇంగ్లీషులో మొదట్నుంచీ నాకు తక్కువ మార్కులే.నాకు ఎమ్సెట్ ర్యాంకు తెచ్చుకోవడంలో కానీ, ఇంజినీరింగు డిస్టింక్షన్ లో పాస్ అవడంలో కానీ, చేస్తున్న ఉద్యోగంలో కానీ ఇప్పటి వరకు ఇంగ్లీషు రాకపోవడం వల్ల ఇబ్బందులు రాలే.

  ఇప్పుడింకో రెండేళ్ళ తర్వాత మా పాపకు, "లండను బ్రిడ్జ్ పడిపోయింది, ఐఫిల్ టవర్ కూలింది" వంటి పనికిమాలిన పాటలు నేర్పించి, భవిష్యత్తులో ఐదవ జెనెరేషన్ కూలీగా మార్చాలంటేనే కడుపులో దేవుతోంది. (నేను ఇప్పుడు నాల్గవ జనరేషన్ కూలీని కనుక). కానీ తెలుగు మీడియం బళ్ళు లేవు, ఉన్నా అస్సలు బావోలేవని, తెలుగులో గణితం బోధించే టీచర్ అయిన మా ఆవిడే చెబుతూంది. మా బాధలెవరు తీర్చాలి?

  ************

  "సమస్యను వ్యక్తిగత కారణాలకు ఆపాదించి పరిష్కారం వెతకటం శాస్త్రీయ పద్ధతి కాద" న్న పెద్దమనుషులు ఇప్పుడిలా రంగు మార్చి, మీ పిల్లల సంగతేంటని అడగటం ఏమిటో అంతుపట్టట్లేదు.

  ***************

  చదువరి గారు, బ్లాగులో రాయడం, బాధలు వెళ్ళగక్కడం పరిధిని దాటి ఏదైనా కావాలి? కింకర్తవ్యం?

  లోక్ సత్తా వారిని అడుగుదామా? కనీసం వారి వెబ్ సైటులో నన్నా మన బాధలు చెబుదామా?

  రిప్లయితొలగించండి
 20. చదువరి, చాలా బాగా రాశారు.
  ఈ పలకల సంఘటన జరిగిన దగ్గర్నుండి, అటుపైన తాడేపల్లి గారి రెండు జాబులు చదివి దీని విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నా. పొద్దులో చర్చ జరుగుతున్నందుకు సంతోషం. తప్పకుండా దీన్ని గురించి ఒక ఉద్యమం జరపాలి.
  తెలుగు బ్లాగు సందర్శకుల గురించి మీరన్న మాట చాలా నిజం. ఇదే సాఫ్టువేరు యువత తెంగ్లీషులో చర్చలు జరిగే సైట్లలో విరివిగా పాల్గొంటూ ఉంటారు.

  @ శ్రావ్య .. భలే భలే!

  రిప్లయితొలగించండి
 21. రవి పొద్దులో చెప్పినట్టు, తెలుగు భాష మీద భావోద్వేగం ఉన్నవాళ్ళ మధ్యకూడా ఐకమత్యం తక్కువ కనిపిస్తోంది, ఈ కామెంట్లు చూస్తే. కాని ఐకమత్యం లేకపోతే కలిసి ఏమీ సాధించలేం. ఏకాభిప్రాయానికి రావాలంటే మన వ్యక్తిగత నమ్మకాలని పక్కనబెట్టి కొంచెం బుద్ధికి పని చెప్పాలి. ఆ ఉద్దేశంతో ఆలోచిస్తే నా బుద్ధికి వచ్చిన ఆలోచనలు ఇవి:

  1. తెలుగు మాధ్యమాన్ని కోరుకునే వాళ్ళు తమ పిల్లలని ఇంగ్లీషు మీడియంలో చదివించడం గురించి. రాకేశ్వర రావుగారు తక్కిన వాళ్ళు చెప్పినదాంతో సంతృప్తి పడ్డారో లేదో నాకు తెలియదు. నా మాటల్లో మళ్ళీ చెపుతున్నాను. తెలుగు భాష కోసం తాపత్రయ పడేవాళ్ళు ఇంగ్లీషు పాఠశాలల్లో గతి లేకే చదివిస్తున్నారు. అందుకే కదా అన్ని స్కూళ్ళలోనూ ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమం కావాలని కోరుకుంటున్నది. అంచేత "మీకు మాత్రం ఇంగ్లీషు చదువులూ మాకు మాత్రం తెలుగా?" అని తెలుగు మీడియంలో పిల్లల్ని చదివించే వాళ్ళు ఎవరైనా ఒకవేళ అడిగితే, అది అర్థం లేని ప్రశ్న. మాకు కూడా తెలుగు చదువులే కావాలనే కదా కోరుకుంటున్నది! తమ పిల్లలని చదివిస్తున్న ప్రైవేటు స్కూళ్ళలో కూడా తెలుగు మాధ్యమం కావాలనే కదా తాపత్రయం. మరి ఆ ప్రశ్నకి ఏమైనా అర్థముందా?

  2. రవి, మీ వ్యక్తిగత అనుభవం మీ వరకూ నిజమే అవ్వొచ్చండి. కాని దాన్ని సాధారణీకరించడం సరి కాదు కదా. ఇంటరు వరకూ తెలుగు మీడియంలో చదువుకుని ఇంజినీరింగులో ఇంగ్లీషు మీడియంతో చాలా అవస్థలు పడిన వ్యక్తులు ఒకరిద్దరు నాకు తెలుసు. భాషా శాస్త్ర వేత్తలు కూడా దీన్ని సమర్థించ లేదు, నాకు తెలిసి. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు ప్రైవేటు పాఠశాలల కన్నా తక్కువే అనడానికి ప్రతి యేడూ వచ్చే పరీక్ష ఫలితాలు చూస్తే తెలుస్తుంది. ప్రమాణాలు సరిగాలేని ప్రైవేటు పాఠశాలలు చాలానే ఉండవచ్చు. కాని ఒక ఊరిలో అన్నిటికన్నా మంచి ప్రమాణాలున్న పాఠశాలలు సాధారణంగా ప్రైవేటువే (అసలంటూ ఉండాలే కాని) అని నాకు తెలిసినంతలో అనిపిస్తున్నది.

  3. ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలని కోరుకునే వాళ్ళని ఏదో తెలుగు భాష ఉద్ధారకులని అనుకోవడం అవివేకం. తెలుగు భాషలో చదువుకో గలగడం, అలా చదువుకున్న వాళ్ళకి ఇతరులతో సమానమైన అవకాశాలు ఉండాలనుకోవడం, తెలుగుదేశంలో ఉంటున్న తెలుగువాళ్ళ ప్రాథమిక హక్కు. కాదా? అంచేత, అయితే తెలుగు మాధ్యమంలోని ప్రభుత్వ పాఠశాలల స్థాయిని ప్రైవేటు పాఠశాలల ప్రమాణాలతో సరిపోయేలా చెయ్యాలి. కావలసినన్ని పాఠశాలలు పెట్టాలి. అలా చెయ్యలేకపోతే ప్రైవేటు పాఠశాలలో కూడా తెలుగు మాధ్యమం నియమితం చెయ్యాలి. ఇది హక్కులకి సంబంధించిన విషయం కాని ఏదో ఉద్ధరణ విషయం కాదు. మరే ఇతర ప్రసక్తీ అవసరం లేదు.

  నా ఆలోచనల్లో ఏమైనా తప్పులుంటే వాటిని (సహృదయులు, అంటే తెలుగు మీద తాపత్రయం ఉన్నవాళ్ళు) ఎత్తి చూపండి. ఈ విషయమై మనం ఏకాభిప్రాయానికి రావడం ముఖ్యం.

  రిప్లయితొలగించండి
 22. ఇంకొక్క మాట. కొన్ని కొన్ని పనులు ప్రభుత్వం మాత్రమే చెయ్యగలదు. ఎవరి దాకానో పోనక్కర్లేదు. మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలని చూస్తే చాలు, మన మాతృభాషకి ప్రభుత్వ పరంగా యేమి చెయ్యగలమో తెలుసుకోవడానికి.
  తాము స్వయంగా గొప్ప భాషాపండితులైన వారు కూడా, పిల్లలకి ఇంటొ తెలుగు నేర్పుకోండి సరిపోతుంది, అని ఈ సమస్యని పలుచన చెయ్యడం విచారకరం.
  ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టడమే తక్షణ కర్తవ్యం.

  రిప్లయితొలగించండి
 23. రవి గారు,
  మీ వ్యాఖ్యలో ఒక విలువైన పాయింట్ ఉంది గమనించారా? మీరు తెలుగు మీడియంలో పది వరకు చదివినా ఉన్నత విద్యలో మీరు ప్రతిభ కనపరచడానికి కారణం మీ హైస్కూలు విద్యలో ప్రమాణాలు ఉన్నతంగా ఉండటం!

  తెలుగు మీడియంలో చదివిన మనం ఐదారు క్లాసుల్లో ఒక విషయం మీద సొంతగా వ్యాసం రాయడమో, మాట్లాడటమో చేయగలిగి ఉండేవాళ్ళం! ఇప్పుడు చూశారా, అది ప్రైవేట్ స్కూలైనా, గవర్నమెంట్ స్కూలైనా ఒక విషయం మీద పూర్తి అవగాహన కల్పించడం, సర్వతోముఖాభివృద్ధి అనే సమస్య లేదు.

  సిలబస్ పూర్తి చేయడం, ఆ వృత్తంలోనే పిల్లల్ని గిరికీలు కొట్టించడం!ఆ తర్వాత వరసగా ఏదో ఒక కోర్సు ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇక తమ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకునే తీరికేది?CBSE లో చదివిన వాళ్లకు స్టేట్ సిలబస్ లో లెక్కలు రావు. కానీ ఎంసెట్ లో రాంక్ రావాలి. అందుకని మళ్ళీ ట్యూషను! ICSEలో చదివిన వాడికి మరోటి! ఇన్నిన్ని ఛాయిస్ లు ఒక్కోసారి పిల్లల జీవితాలతో ఆడుకోవడానికే ఉన్నాయేమో అనిపిస్తోంది.

  మీకు తెలుసో తెలీదో , పదో తరగతిలో 500 మార్కులు పైన సంపాదించి ఈనాడు పేపర్లో రెండో పేజీ మొత్తం పిల్లల ఫొటోల్తో నింపే చాలా ప్రైవేట్ స్కూళ్లలో తొమ్మిదో తర్గతి సిలబస్ లేనే లేదు. ఎనిమిది తర్వాత రెండేళ్ళూ పదో తరగతి సిలబసే! అంటే రెండేళ్ల పాటు ఆరు సబ్జెక్టుల్ని రుబ్బి రుబ్బి 500 పైన మార్కులు సంపాదించేలా చేస్తున్నారు. ఈ పద్ధతి నేను చదువుకునేటపుడు ఉంటే నాకు కనీసం 580 మార్కులు వచ్చి ఉండేవనిపిస్తుంది.

  అసందర్భం అనుకోకపోతే పడిపోతున్న ప్రమాణాల గురించి ఆలోచించడం కూడా మన బాధ్యతే అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. కత్తి మహేష్ కుమార్: నన్ను దూషించినందున మీ వ్యాఖ్యను తీసేసాను. మీ రాతల్లో సంయమనం లోపిస్తోందని గతంలో చెప్పాను. మీరు ఇంకా మారలేదు. అంచేతే ఆ వ్యాఖ్యను తీసేసాను.

  ఇకపోతే, మీరు "National Curriculum Framework 2005 ని అమలు జరిపించేలా చేస్తే విద్యాప్రమాణాలతోపాటూ తెలుగూ బాగుపడుతుంది." అని కూడా ఆ వ్యాఖ్యలో అన్నారు. అదే NCF 2005 ఏం చెబుతోందో చూడండి...
  In language, a renewed attempt to implement the three-language formula is suggested, along
  with an emphasis on the recognition of children’s mother tongues, including tribal
  languages, as the best medium of education. The multilingual character of Indian society
  should be seen as a resource to promote multilingual proficiency in every child, which
  includes proficiency in English. This is possible only if learning builds on a sound language pedagogy in the mother tongue.

  మాతృభాషలో విద్యాబోధనను అమలు చెయ్యాల్సింది NCF 2005 లో కనబరచిన ఈ స్ఫూర్తి తోనే!

  పొద్దు వ్యాసంలో కూడా NCF 2005 లింకు ఉదహరించబడింది. మీరది చూసినట్టు లేరు.

  రిప్లయితొలగించండి
 26. కామేశ్వర రావు గారు, సుజాత గారు : ఈ మొత్తం చర్చ ఎక్కడి నుంచి ఆరంభమయింది? ఓ పాఠశాలలో "తెలుగు" లో మాట్లాడినందుకు యాజమాన్యం శిక్షించడం నుండీ.

  దీనికి మూల సమస్యలు స్థూలంగా రెండు
  ౧. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన లేకపోవడం
  ౨. ప్రమాణాలు పడిపోవడం.

  పై సమస్యలు రెండు ప్రభుత్వ జోక్యంతోనే నెరవేరగలవు. అయితే కాస్తో కూస్తో పరిష్కారం త్వరగా లభించగలిగేది మొదటి సమస్యకే. రెండవ సమస్య జటిలమైనది, కమీటీల ద్వారా తప్ప తేలనిది, మేధావులు తమకు అనుగుణంగా వాదనలు ఏర్పరుచుకోవడానికి, తమకు అనుగుణంగా విషయాలను మలుచుకోడానికి దోహదం చేసేదీనూ.

  సత్వరం పరిష్కారం దొరకడానికి సాధ్యమయే సమస్య మూలాన్ని పక్కకు నెట్టి, intellectual పద్ధతిలో, కాని పనిని తలకెత్తుకోవటం ఏం తెలివి?

  ప్రమాణాల గురించి చర్చ తెగేది కాదు. అది పక్కకు పెట్టి, పొద్దులో చదువరి గారు చెప్పినట్టు, సమస్య మూలాన్ని fragments లో విడగొడితే వచ్చే మొదటి మూలం గురించి ఆలోచించటమే సబబైనది.

  రిప్లయితొలగించండి
 27. మన దేశ దురద్రుష్టం ఏమిటంటే, మన దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు ముస్లిములు, ఆంగ్లేయులు పరిపాలించి, వారి భాషలని మనపై రుద్ది, మన దేశ భాషలను తుడిపివేసారు. ఇప్పటికి, మన రాజకీయ నాయకులు అప్పటి గుర్తులను వదలటంలేదు. విచిత్రమేమిటంటే, విదేశాలలో, ఉదా:- రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి ఎన్నో అభివ్రుద్ధి చెందిన దేశాలలో, విద్య, వారి,వారి భాషలలో తప్ప "ఆంగ్ల భాషలొ" నేర్పబడటలేదు. సైన్స్, ఇంజినీరింగ్ లాంటి విషయాలు కూడా, వారి మాతృ భాషల్లోనే నేర్పబడుతున్నాయి. మరి, మన దేశంలొ, మన దెశ భాషల్లో చదువు నేర్పటానికి అడ్డంకి, కష్టము మన నాయకులకి ఏమిటొ తెలియాల్సివుంది.
  భవదీయుడు,
  మాధవరావు.

  రిప్లయితొలగించండి
 28. చదువరి, చాలా బాగా రాశారు.

  రిప్లయితొలగించండి
 29. ఆలస్యంగా చుసిన మన ఈ తెలుగు భాష పై ఇక్కడ ఒక పెద్ద discussion (తెలుగు లో పదం గుర్తు రావట్లేదు) జరగడం నాకెంతో సంతోషంగా ఉంది, కాని మన దురదృష్టం ఎంటంటె ఇప్పుడు గవర్నమెంట్ ఎహ్ సొంతంగా ఆంగ్ల మాద్యమ పాటశాలలు మొదలు పెడుతుంటే ఇంక మన తెలుగు ఏమవుతుంది....
  మా ఊర్లో లంబాడి(ST) వాళ్ళు చాలా ఎక్కువ, వారి భాషకు లిపి లేదు కాని వారి భాష ఇప్పటికీ మన్నన పొందుతోంది,
  మన భాష కూడా కొన్ని తరాల తరువాత లిపి ని మర్చిపొఇ ఒక లిపి లేని భాషగా మిగిలి పోతుందేమో అని బాదగా ఉంది, మన తెలుగు కోసం మనం ఏమైనా చేయాలి, జపాన్,చైనా వాళ్ళు కూడా మన దేశం లోకి వొచ్చి వారి వారి భాషలను మనకు నేర్పిస్తున్నారు, ఇలా వారి భాషనూ వాళ్ళు అబివృద్ది చేస్తుంటే మనం మన భాషను కలరాస్తున్నాము....:(

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు