29, నవంబర్ 2007, గురువారం

మర్యాదకరమైన మాటలు

14 కామెంట్‌లు
ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.
........

కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని (నిమ్నత్వాన్ని), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు.

24, నవంబర్ 2007, శనివారం

రహదారులు, రహగొందులు, రహసందులు

6 కామెంట్‌లు
కర్ణుడి చావుకు కారణాలివీ అంటూ ఒక పద్యం ఉంది. గూగులునడిగాను గానీ దొరకలేదు. నాకు గుర్తున్నంత వరకు రాస్తున్నాను. మొదటి పాదం మొదటి పదం సరైనదో కాదో తెలీదు..
నరు(?) చేతను నాచేతను
వరమడిగిన కుంతి చేత పారుని చేతన్
ధరచే భార్గవు చేతన్
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్
హై.లో దిక్కుమాలిన, నత్తనడకల ట్రాఫిక్కుక్కూడా తలమాసిన కారణాలు బోలెడున్నాయి. ఆ కారణాల్లో కొన్ని.., కందాల్లో ఇక్కడ..

22, నవంబర్ 2007, గురువారం

మరోసారి తలంటు!

3 కామెంట్‌లు
ప్రాజెక్టుల్లో తప్పులు జరిగాయని సియ్యేజీ అంటోంది. పత్రికలు, ప్రతిపక్షాలూ పెడుతూ వస్తున్న గోల నిజమేనని తేలిపోయింది. గోదావరి జల వినియోగ అథారిటీ పై తన నివేదిక (cag.nic.in/html/cag_reports/andhra/rep_2007/civil_chap_3.pdf) 70 వ పేజీలో సియ్యేజీ ఇలా అంది:

"There were serious deficiencies in the efficient, economic and effective implementation of the projects undertaken under GWUA. The schemes were undertaken without proper care in finalizing the ayacut, source and availability of assured power supply..."


"..The agreements were one sided in favour of the contractors and suitable provisions were not incorporated to protect Government interest. The consultants were not made responsible for any deviations in quantities, designs and drawings during execution. The contractors enjoyed huge undue benefits due to incorrect projection of materials required, preparation of unrealistic estimates, etc. Despite being monitored at all levels, the rate of progress in the works under SSP and JCRDLIS is not as per the milestones fixed."

ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన పద్ధతిలోనే రాజ్యాంగ సంస్థ, సియ్యేజీ మీద కూడా ఎదురుదాడి చేస్తోంది. ప్రాజెక్టుల అంచనాలు పెంచేశారంటూ 'కాగ్‌' చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేసాడంట! మరీ చిత్రమేంటంటే "తన హయాంలో 'కాగ్‌' ఇచ్చిన నివేదికలన్నింటినీ చంద్రబాబు అంగీకరిస్తారా?" అని అడిగాడంట. బాబొప్పుకుంటే ఈయనొప్పుకుంటాడు గామోసు!

ఇలాంటి నివేదికలు వచ్చాక, బాధ్యుల మీద చర్యలేమీ లేకపోతే ఇట్టాగే మాట్టాడతారు.

20, నవంబర్ 2007, మంగళవారం

ఏరు దాటిన వెనుక..

4 కామెంట్‌లు
కం. ఏరును దాటిన దళపతి
పేరుకె మద్దతు తెలిపెను! పేరోలగమున్
చేరగ తొలగెను ముసుగులు
తేరుకు జూచిన ప్రభుతకు తెరపడి పోయెన్!


ఊరు హర్దనహళ్ళి
ఊతపదమట 'హళ్ళి'
'అప్ప'జెప్పిరి మళ్ళి
-కర్నాటకదల్లి

సూత్రధారుడు నాన్న
పాత్రధారుడు కన్న
భాజపాకిక సున్న
-కర్నాటకాన

రాజకీయమ్మంత
రోత వెదకిననెంత
కానరాదే సుంత
-దేశమందంత!

8, నవంబర్ 2007, గురువారం

ఉప్పూకారపు తప్పులు

30 కామెంట్‌లు
స్పీకరు ముందే నాయకుడు, ప్రతి నాయకుడు తిట్టుకున్నారట. అయినా ఆయన నోరు మెదపలేదు. (మెదిపితే తన్నూ 'నోర్ముయ్' అంటాడేమోనని సందేహించి ఉండొచ్చు.) అంతటి సభలోనే ఆయన మౌన ముని. బయట, ఆయన చాంబర్లో అయితే ఇక చెప్పేదేముంది? ముఖ్యమంత్రి తన శైలిలో, "ఇంత చిన్న వయసులో కూడా ఎంతో సహనంతో సభను సమన్వయం చేస్తున్నాడ"ని స్పీకరును ప్రశంసిస్తూ ఉంటాడు. బహుశా ఇదేగామోసు ఓర్పంటే. చిన్న వయసంటే ఏంటి, స్పీకరయ్యే వయసు లేదా? పోనీ ఆయనేమైనా అద్భుతంగా పనిచేస్తున్నాడా? కళ్ళ ముందు తిట్టుకుంటుంటే, ఇష్టమొచ్చినట్టు మాట్టాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉంటం కూడా గొప్పేనా? ఈ మాత్రం చూసేందుకు ఇంకా చిన్న పిల్లాడైనా సరిపోతాడు!
---------------

ముఖ్యమంత్రి "ఉప్పూ కారం తింటున్నాను కాబట్టి ఊరుకోలేకపోయాను" అన్నాడు. ('లక్షాధికారియైన లవణమన్నమె గాని మెరుగు బంగారమ్ము మింగబోడు ' గదా!) ఆయనన్న మాటలని అలాగే తీసుకోవాలి. అంతేగాని, ఇంగ్లీషోడన్నట్టు చిటికెడు ఉప్పు జల్లి సేవిస్తే అపార్థాలు గోచరిస్తాయి. నేను ఇక్కడ కవి హృదయాన్ని ఆవిష్కరించదలచాను..

చంద్రబాబు ఉప్పూ కారాలు మానేసి చాన్నాళ్ళయింది. అంటే ఖచ్చితంగా కాదుగానీ, సాత్వికాహారం, అందునా మితంగా తినడం, యోగాసనాలు వెయ్యడం, ఆయన అలవాటు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చమత్కరించాడన్నమాట! "ఉప్పూ కారం తినకే నువ్వలా ఐపోయావు", "నీలాగా నేను చేవ చచ్చిన వాణ్ణి కాదు", ఇలాంటి తాత్పర్యాలు లాగొచ్చు ఆ మాటల నుండి. ఒక్ఖ మాటలో లక్ష బూతులన్న మాట.

అయినా, 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేరెండంటా' అనే మనిషిని నెమలి ఈకతో కూడా కెలక్కూడదు. చంద్రబాబుకు అదింకా అర్థం కాలేదెందుకో!? లేక.. తిట్టించుకుని సానుభూతి కొట్టేద్దామని, పనిలో పనిగా ముఖ్యమంత్రి దురుసుతనాన్ని బజారుకీడుద్దామని ప్రయత్నమా? ఏమో చెప్పలేం..

రాజకీయులు.. దేనికైనా వెనుదీయరు గదా!
------

పెద్దల సభలో గలభా!
ఈ ముక్క రాసినందుకే శాసనమండలి ఈనాడు సంపాదకుణ్ణి సభకు పిలిపించి మందలించాలని తీర్మానించింది ఒకప్పుడు. ఏడో తేదీన శాసన మండలిలో జరిగింది గలభా కాదు, _మ్..మీ అనొచ్చేమో!. (నేను పూర్తిగా చెప్పడం లేదు. ఒకవేళ వాళ్ళకు తెలిస్తే నన్నూ సభకు పిలిచి, బూతులు తిట్టే ప్రమాదం ఉంది. ఎవరితోటైనా పెట్టుకోవచ్చు గానీ చాలామంది రాజకీయ నాయకులతోటీ, కొన్ని పిచ్చి కుక్కలతోటీ అస్సలు పెట్టుకోకూడదు) అమ్మనాబూతులు తిట్టుకున్నారట, తోపులాటలో ఒక మంత్రికి చొక్కా చినిగిందట.

"మండలి వస్తే విద్యాధికులు, ఉపాధ్యాయులు వగైరా పెద్దమనుషులు సభకు వచ్చే అవకాశం ఉంటుంది, అర్థవంతమైన చర్చలు జరుగుతాయి."
మండలి కావాలని కోరుతూ ఇలాంటి జోకులు చాలానే వేసారు, అప్పట్లో. న్యాయశాఖ మంత్రి హెచ్చార్ భరద్వాజ్ "మండలి కావాలనేది ఆంధ్రుల కోరిక, దాన్ని అడ్డుకుని వారి ఆకాంక్షలను తోసిపుచ్చకండి" అని పార్లమెంటులో ప్రతిపక్షాలకు చెబుతూ మొత్తం ఆంధ్రులందరి మీదా జోకాడు. ఇప్పుడు చూడండి, ఏం జరుగుతోందో!!

అయినా, వాళ్ళు మాత్రం ఉప్పూకారం తినడం లేదేటండి?

సంబంధిత టపాలు