24, నవంబర్ 2007, శనివారం

రహదారులు, రహగొందులు, రహసందులు

కర్ణుడి చావుకు కారణాలివీ అంటూ ఒక పద్యం ఉంది. గూగులునడిగాను గానీ దొరకలేదు. నాకు గుర్తున్నంత వరకు రాస్తున్నాను. మొదటి పాదం మొదటి పదం సరైనదో కాదో తెలీదు..
నరు(?) చేతను నాచేతను
వరమడిగిన కుంతి చేత పారుని చేతన్
ధరచే భార్గవు చేతన్
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్
హై.లో దిక్కుమాలిన, నత్తనడకల ట్రాఫిక్కుక్కూడా తలమాసిన కారణాలు బోలెడున్నాయి. ఆ కారణాల్లో కొన్ని.., కందాల్లో ఇక్కడ..



రహగొందులు, రహసందులె!
రహదారులు లేనెలేవు రాచనగరునన్
అహరహమిట ప్రవహిస్తూ
సహియించే నాగరికులు సాహసులు సుమీ!

నలుడే అచ్చెరువొందగ
తొలుచుచు, మెలికెలు తిరుగుచు, దూరుచు, తోలున్
తలచిన, బైకుల తిలకులు
తల దూరెడి కంతలోన ధర దూర్చు జుమీ!

తోపుడు బళ్ళకు తోడుగ
ఆపిన యాటో లటునిటు, యాచక గుంపుల్!
దాపునె మొలిచిన యాడులు*
ట్రాఫికు నాపుట కదనపు టమరిక లవియే!
*యాడులు:- ప్రకటనలు (Ads). (ఇలాంటి మ్లేచ్ఛ పదాలు, అందునా పొట్టిపదాలు, పొడిపదాలూ రాసి, 'అయ్యో అదేంటో చెప్పుకోవాల్సి వచ్చిందే' అని అనుకుంటే ఎలా? అంచేత నేనలా అనుకోను.)
ఎడమ దిశనె నడపాలని
మడి గట్టుకు కూరుచుంటె మరియా దవదోయ్
కుడిఎడమల ఎడమెంచక
వడివడిగా దూసుకెళుటె మగతన మిచటన్!

బందుల రాబందులు తము
మందలుగా అడ్డగించి బాధలు పెట్టన్
బంధన మందున చిక్కడి
సందులకై ఎగబడుదురు సంకెల బిగియన్

దారికి మధ్యన కడుదురు
పౌరుల బాధలు తలపక ప్రార్థన స్థలముల్
తీరుగ దేవుడె అడ్డగ
వారలకిక రక్షణేది, భాగ్యనగరిలో?

6 కామెంట్‌లు:

  1. వెధవది ఒక జబ్బై కూర్చొంది. సరే చివరి పాదములొయతి కుదరలేదు. కాని వ్రాశాను కాబట్టి వ్యాఖ్యుతున్నాను, తప్పులింకేమైనుంటే చెప్పుము
    కం.
    నగరమున ప్రయాణము చే
    యగనెవ్వరికైనను హరియను ప్రాణంబుల్
    రగిలిన కోపము పద్యం
    బుగ చదువరి రాసెననెను బ్లాగేశ్వరుడున్

    రిప్లయితొలగించండి
  2. బ్లాగేశ్వరా!గిరి గారూ, మీరూ చిటికెల్లో పద్యాలను పూయిస్తూ, కాయిస్తున్నారండి. మీ పద్యం చక్కగుంది.

    రిప్లయితొలగించండి
  3. బాగా చెప్పారండి. భాగ్యనగరంలో ఎడమ పక్కనే వెళ్ళాలనుకోటం మడి కట్టుకోటంలాంటిదే. కుడి ఎడమలు రెంటినీ సొంతం చేసుకోకుంటే బండి ముందుకు కదలదు (అ)భాగ్యనగరిలో

    రిప్లయితొలగించండి
  4. హ లతో ప్రాసున్న మొదటిది చాలా చాలా బాగుంది.
    ఎడమ దిశ కూడా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. చదువరి గారు,
    కేక!!!
    ఇంకో రెండు పద్యాలు వ్రాయండి
    ౧.స్కూటర్ మీద నలుగురు స్కూలు పిల్లల్ని ఎక్కించుకొని తీసుకెళ్లేవాడిమీద
    ౨. పదవ తరగతిలోనే బండి నడిపేవాళ్ల పైన, వాళ్ల అమ్మనాన్నలపైన.
    -ఊ.దం

    రిప్లయితొలగించండి
  6. పద్యము చెప్పినప్పుడు ఒన్స్ మోర్ , ఒన్‌మోర్ అనిపించుకొనే అవకాశం ఇద్దరికే వస్తుంది. ఒకటి నాటకములొ పాత్రధారికి ఒన్స్‌మోర్ అనిపించుకొనే అవకాశము, కవి కి ఒన్‌మోర్ అని పించుకొనే అవకాశము. కాబట్టి చదువరి ఒన్‌మోర్

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు