20, నవంబర్ 2006, సోమవారం

బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం

మన ఎన్నికలలో మామూలు విషయాలకు కూడా కొత్త అర్థాలు వస్తూంటాయి. ఏ ప్రాముఖ్యతా లేని మామూలు విషయాలను మన రాజకీయులు పెద్దవి చేసి ప్రజల సానుభూతిని, తద్వారా ఓట్లను కొల్లగొట్టే ఆలోచనలు చేస్తుంటారు. కరీంనగరు, బొబ్బిలి ఎన్నికల్లో కూడా ఇలాంటి రెండు విషయాలు పైకి తేలాయి.

కరీంనగరు ఎన్నికకు వస్తే... వెంటనే గ్రహించేసి ఉంటారు - బీడీల గురించి అని. ఈ ప్రాంతంలో బీడీ ఆకు (తునికాకు) ఏరుకుని బీడీలు చుట్టి అమ్ముకునే కార్మికులు ఎక్కువ. బీడీ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరికగా బీడీ కట్టపై పుర్రె బొమ్మను ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రయోజనం శూన్యమైనా, మనకీ నిర్ణయంలో తప్పైతే ఏమీ కనబడదు. (మీక్కనబడితే ఏమిటో వ్యాఖ్యలో రాయగలరు.)

మన ముఖ్యమంత్రి కరీంనగరు పర్యటనకు వెళ్ళినపుడు దీని ప్రస్తావన తెచ్చి, కేసీయారు కార్మిక మంత్రిగా ఉంటూ కూడా దీన్ని ఆపలేదు, అసలు దీనికి ఆయనే కారణం అంటూ విమర్శించి, బీడీని ఎన్నికలలో ప్రచారాంశం చేసేసాడు. అందుకు కేసీయారు ఊరుకుంటాడా!? మీరే దీనికి కారణం, మీ మంత్రి పనబాక లక్ష్మియే దీనికి కారణం అంటూ ఎదురుదాడి చేసాడు. ఇక ఒకరి తరువాత ఒకరు రంగంలోకి దిగి యథాశక్తి తిట్టుకోడం మొదలుపెట్టారు. పాపం బీడీ కార్మికులు అప్పటిదాకా దాన్ని పట్టించుకున్నారో లేదో గానీ ఆ తరువాత మాత్రం ప్రచారానికొచ్చిన రాజకీయులను ప్రశ్నించడం మొదలెట్టారు. ఇదెలా తయారయిందంటే కేంద్రం చేసిన ఈ నిర్ణయం తప్పని చివరకు కాంగ్రెసు, తెరాస కూడా అంటున్నాయి. వెచ్చగా తాగుదామని బీడీ వెలిగించుకుంటే, అది చకచకా కాలి, చూసుకునే లోగానే మొదలంటా కాలి వేళ్ళను చుర్రుమనిపించినట్లయింది, కాంగ్రెసు, తెరాస పరిస్థితి. అప్పనంగా బీడీ దొరికింది గదాని, తెదేపా కూడా బీడీ తాగడానికి ఉత్సాహపడుతోంది.

కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం తప్పని స్వయంగా అదే పార్టీకి చెందిన (అందునా కాంగ్రెసు పార్టీ) ముఖ్యమంత్రే బహిరంగంగా అన్న ఘటన, స్వయంగా ఆ కేంద్ర మంత్రివర్గంలోనే సభ్యురాలైన మంత్రి కూడా అన్న ఘటన మనమెప్పుడు చూసాం? ఈ బీడీ వార్తలు చదూకోడానికి సరదాగా ఉన్నాయి. పనబాక లక్ష్మి అప్పజెప్పిన ఓ డైలాగు మాత్రం ఈ నాటకానికంతటికీ హైలైటు.. నాలాంటి దళితనేతపై దొర చేస్తున్న అహంకార పూరిత విమర్శ అంటూ కేసీయార్ విమర్శ గురించి ఆమె వాపోయింది. సానుభూతి కోసం వాడే ఈ డైలాగు ఎవరుబడితే వారు తెగ వాడడంతో మరీ అరిగి, చిరిగి పోయింది.

ఇక బొబ్బిలిలో.. వోక్సు వాగను ఇక రానట్లే నంటూ ఈనాడులో వార్త రావడం బొత్స సత్యనారాయణకు కాస్త తలనెప్పి అయింది. వోక్సు రానందుకు కాదు.. ఎవరో తెలీని వాడికి డబ్బులిచ్చారు కదా -అందుకు, జర్మనీకి తన తమ్ముడిని తీసుకెళ్ళాడు కదా -అందుకు, మరిప్పుడేమో బొబ్బిలిలో నిలబెట్టింది స్వయానా తన భార్యనే కదా - అందుకు, మొత్తం తన వాళ్ళతోటే జిల్లా రాజకీయాలను నింపేస్తున్నాడనీ, అందరూ కలిసి దోచుకుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తారు కదా- అందుకు. ఈ వ్యవహారంలో బొత్స సత్యనారాయణ గారి పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించి ఎన్నికలలో లాభం పొందాలని తెదేపా భావిస్తుంటే బొత్స దాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ఎత్తెత్తాడు. ఈనాడులో ఆ వార్త రాగానే ఆ పేపరుపై దాడికి దిగి, తన భాషను, తన యాసను గేలి చేస్తూ రాసింది, ఇది ఆ ప్రాంత ప్రజలను వారి యాసను అవమానించడమే నంటూ ప్రాంతీయ సెంటిమెంటును గిల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

గాల్లోంచి శివలింగాలను సృష్టించే వాళ్ళు కొందరైతే ఆ గాలి కూడా లేని శూన్యంలోంచి కూడా ఎన్నికల ప్రచారాంశాలను సృష్టించగలరు మనవాళ్ళు. మనమీ ఐటీలు, ఐఐటీల ద్వారా ప్రపంచంలో వెలుగులోకి రాకముందు, పాశ్చాత్య దేశాల్లో భారతదేశమంటే పాములాడించేవాళ్ళే మదిలో మెదిలే వారంట.. ఆయా దేశాల్లో కూడా రాజకీయులు కొద్దో గొప్పో మనవాళ్ళ స్థాయిలోనే ఉంటారు కాబట్టి గానీ, లేకపోతే పాములాళ్ళ స్థానాన్ని వీళ్ళెప్పుడో ఆక్రమించేవాళ్ళు.

11 కామెంట్‌లు:

  1. ఓహో అదన్నమాట సంగతి. నన్నిక్కడ మనదేశం గురించి అడిగిన వాళ్లలో సగంమంది మీ ఇంట్లోకి పాములు వస్తుంటాయా, రోడ్లమీద పాములు తిరుగుతుంటాయటకదా అని అడిగారు. మా ఇల్లంటే మా పొలంలో వుంది ఆదీ ఆరు అంకణాల పాక గనుక పాములు రావడం మామూలేగానీ వీళ్లకీ అభిప్రాయం ఎందుక్కలిగిందో నాకర్థం అయేదికాదు.

    రిప్లయితొలగించండి
  2. అవతల పార్టిలో తప్పులెతకలేకపొలేతే ఇవతల పార్టి వాళ్ళు వెనకబడతారు మరి. తిట్టడానికి ఎదో ఒక సాకు అవసరం. కాదేది తిట్టు కనర్హం?

    రిప్లయితొలగించండి
  3. భాష మీద,అదే యాస మీద, బీడి కట్ట పైన హెచ్చరిక మీద ఎందుకింత రాద్ధాంతం? అన్ని రాజకీయ పార్టీలు గురువింద గింజలే.

    రిప్లయితొలగించండి
  4. ఇలాంటి చిన్న చిన్న ఎత్తులు చిత్తులు నిజంగానే పనిచేస్తాయండి. అందుకే రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే వాళ్లు ఇలాంటి విద్యలు బాగా నేర్వాలి. మా రాష్ట్రంలో ఇలాంటిదే ఒక "చిన్ని" వేషం జరిగింది. దాని గురించి నా బ్లాగులో రాస్తా.

    రిప్లయితొలగించండి
  5. ఒక వ్యక్తి తన మాండలికంలో మాట్లాడినదాన్ని ఉన్నదున్నట్లు ఒక పత్రిక ప్రచురిస్తే అది మాండలికాన్ని హేళన చేసినట్లవుతుందా ? అయినా ఈనాడు ఎక్కడి పత్రిక ? మొదట్లో అది విశాఖపట్నానికి చెందిన పత్రికే కాదూ ? వారెందుకు కళింగ మాండలికాన్ని హేళన చేస్తారు ? కాంగ్రెస్‌వారికి అధికారం ఉన్నా మతి పోతుంది.లేకపోయినా మతి పోతుంది.

    రిప్లయితొలగించండి
  6. రాజకీయాలు పిచ్చివాళ్ళ స్వర్గం - పిచ్చివాళ్ళు వారా? మనమా? కాంగ్రేస్‍ని ప్రత్యేకం వేలెత్తి చూపక్కరలేదు, అందరూ ఒక్కటే.

    రిప్లయితొలగించండి
  7. అవును, అందరూ ఓ తానులోని ముక్కలే! కాకపోతే కాంగ్రెసు సమానుల్లో మొదటిది!!

    రిప్లయితొలగించండి
  8. క్రికెట్ కిట్ల తొకానిది బీడీ, భాషా, యాసాల తొ అవుతుందొ అని ఒచిన్న ప్రయత్నం

    రిప్లయితొలగించండి
  9. erry uiu oio hkl tgtfi oioiopopo opo 56788908-45

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు