23, సెప్టెంబర్ 2007, ఆదివారం

ట్రాఫిక్కబుర్లు

హైదరాబాదు.
మంగళవారం సాయంత్రం ఆరుంబావు.
ఆఫీసు నుండి ఇంటికెళ్తున్నా, కారులో.
నేనే నడుపుతున్నాను.

నామీద జాలిపడ్డానికి ఇంతకు మించిన కారణం మరోటక్కరలేదు.
నిజానికి ఇంటికి 'వెళ్తున్నాను' అనేకంటే, ఇంటికి వెళ్ళే దారిలో ఆగి ఉన్నాను అని అంటే సరిగ్గా ఉంటుంది. ప్రస్తుతం ట్రాఫిక్కు ఎందుకాగిందో తెలీదు. నా కంటే ముందు అనేక కార్లు, ఆటోలు, మినీ లారీలు వగైరాలు ఆగి ఉన్నాయి. ఈ బళ్ళ సందుల్లోంచి మోటారు సైకిళ్ళు, స్కూటర్లు, సైకిళ్ళు ఒడుపుగా వెళ్ళిపోతున్నాయి.. బండరాళ్ళ సందుల్లోంచి ప్రవహించి పోయే నీళ్ళ లాగా! ఈ ముష్టికారు నవతల పడేసి స్కూటరేసుకుపోతే బాగుంటుంది అని మళ్ళీ అనుకున్నాను. అలా అనుకోవడం నాకు మామూలే!

నా ముందు ఓ కారు ఆగి ఉంది. పాపం, కొత్త కారు, ఇంకా నంబరు గూడా రాలేదు. రోజూ ఇలాంటి దరిద్రపు ట్రాఫిక్కులో కొట్టుకొని పోతూ, కారు ఉన్నవాళ్ళు ఎందుకు కొన్నామా అని ఏడుస్తుంటే.. ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నవాళ్ళని పాపమనక ఇంకేమంటాం?!! ఇంకా నంబరు కూడా రాకుండానే ఆ కారుకు ఎడమ పక్కన పెద్ద సొట్ట. దాని గురించి జాలిపడాల్సిన అవసరం లేదులెండి. కాలుద్దని తెలిసీ నిప్పును పట్టుకున్నవాడిపై జాలెందుకు చెప్పండి.

ఆ కారుకు, నా కారుకు మధ్య ఖాళీ కాస్త ఎక్కువగా ఉంది - అంటే ఓ రెండు మూరలు ఉంటుంది లెండి. మామూలుగా హై.లో జానెడుకు పైన ఒక్క బెత్తెడు కూడా ఖాళీ వదలరు. ఇక్కడి బళ్ళ మూతీ, ముడ్డీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ సంగతి. అదుగో, అంత ఖాళీ ఉండేసరికి ఆటోవాడొకడు ముందు చక్రాన్ని దూర్చేసాడు. ఏమయ్యా, ఏంటా దూరడం అని అడగలేను... "చుప్, సాలా, తేరా గాడీ కో లగా క్యా? ఫిర్, క్యోఁ చిల్లారా?" అని అంటాడు. అసలు జానెడు కంటే ఎక్కువ ఖాళీ వదలడం నాదీ తప్పు, వాణ్ణనుకుని ఏం లాభం? అమధ్యెప్పుడో చుట్టపు చూపుగా అమెరికా వెళ్ళాను. -డెట్రాయిట్ పక్కన ఓ శివారు నగరం. రోడ్డు మీద మనిషి కనబడ్డు, అన్నీ కార్లే! నేను మా ఆఫీసు స్నేహితుడితో పాటు అతడి బండిలో వెళ్ళేవాణ్ణి. అతడు బండి నడుపుతూంటే నాకు మహా చిరాకొచ్చేసేది. ఏ లైటు దగ్గరో ఆగాల్సి వచ్చిందనుకోండి... ముందున్న బండికి ఓ ప్ఫది మీటర్ల వెనక ఆపేవాడు. 'ఎహె, ఇంత ఖాళీ ఉంచాడేంటి.. ఎవడన్నా వచ్చి దూరితేనో' అని కొట్టుకులాడి పోయేవాణ్ణి. ముందు బండి బంపరు దాకా తీసుకెళ్ళి ఆపితే ఈయన సొమ్మేం పోయింది అని తహతహ లాడిపోయేవాణ్ణి. అక్కడ అలా దూరరు అని తెలిసినా ప్రాణం కొట్టుకులాడేది; అలవాటైపోయిన ప్రాణం కదా.

ఇక్కడ.. సరే ఈ ఆటోవాడు దూరాడు గదా.. నేనేమైనా తక్కువ తిన్నానా?! హై. లో ఓ ఆరేడేళ్ళు బండిని నడిపిన వాణ్ణే గదా.. ఓ అరడజను ఢక్కామొక్కీలు తిన్నవాణ్ణేను! నేనూరుకుంటానా? కుడిపక్కనున్న వాడికీ నాకూ మధ్య ఓ మూరెడు ఖాళీ ఉందని గమనించాను. (అంత ఖాళీ ఉండడం ఆశ్చర్యమే) వెంటనే స్టీరింగును బాగా కుడికి తిప్పి ముందుకు ఓ రెండు జానెలు పోనిచ్చి మళ్ళీ ఎడమకు తిప్పి ఇంకో రెండు జానెలు పోనిచ్చి ఆపాను. ఇప్పుడు నా బండిని ఆటోకి అడ్డం పెట్టానన్నమాట. హమ్మయ్య, మనసు చల్లబడింది. ఇహ నేను ఓ గంటైనా ఇలా ఉండగలను. విసుగు, అలసట అనేవి 90 శాతం మానసికం, మిగతాది శారీరకం అని నేను నమ్ముతాను. ఇప్పుడు మనసు చల్లబడింది కాబట్టి, విసుగు మాయమైంది.

ట్రాఫిక్కులో ఉండగా పక్క మనిషితో సఖ్యంగా ఉండడం, సుహృద్భావంతో మాట్టాడ్డం, చిరునవ్వు నవ్వడం లాంటివి జరుగుతాయంటే నేన్నమ్మను.. హై. లో ఎవడూ నమ్మడు. అదేదో లవ్వుంది గదా.. యుటోపిక్కో, ప్లేటోనిక్కో, టైటానిక్కో... దానికి సమానం అది! "హైదరాబాదు మత సామరస్యానికి గీటురాయి/ఉదాహరణ/నమూనా/బండగుర్తు/ప్రతీక" లాంటి జోకే ఇది కూడా. ఆమధ్యోరోజు నా ముందున్నవాడు బ్రేకేస్తే నేనూ బ్రేకేసాను. నా వెనకో బైకుంది. బైకుర్రాళ్ళు మామూలుగా బ్రేకు వాడరు గదా, అంచేత బ్రేకు వెయ్యలేదు. థ్థడ్ మని శబ్దం! నేనా కుర్రాడితో, "బాబూ, అప్పుడప్పుడు బ్రేకు కూడా వాడాలమ్మా" అని అన్నాను కాస్త వ్యంగ్యంగా. నేనంత సౌమ్యంగా మాట్టాడ్డం నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ కుర్రాడు దానికి ఇంకొంచం ఉప్పూ కారం కలిపి "బ్రేకా? అంటే ఏంటంకుల్?" అని అడిగాడు. బండి సొట్టలకు అలవాటు పడినంతగా అంకులనిపించుకోడానికి పడలేదు. గుడ్ల నీళ్ళు కుక్కుకోని, కిక్కురుమనకుండా ముందుకు తిరిగాను. నాపైన వాడిది పైచేయి అయిపోవడంతో అంతులేని విసుగొచ్చేసింది ఆ రోజున ట్రాఫిక్కులో.

హమ్మయ్య బళ్ళు కదులుతున్నాయి. ఓ వందా రెండొందల మీటర్ల తరవాత మళ్ళీ ఆగుతాం కదా.. అప్పుడు మరి కాసిని కబుర్లు చెబుతాను. ప్రస్తుతానికి ఉంటాను.

20 కామెంట్‌లు:

 1. హైదరాబాదు ట్రాఫిక్కు మరింత పెరగాలనీ, మీరు ఇలా ఎక్కువగా అందులో చిక్కుకుంటూ ఉండాలనీ కోరుకుంటున్నాను. ఈ సారి ఆవేశంలో పద్యం పుడుతుందేమో అని ఆశకూడా ఉంది :)

  రిప్లయితొలగించండి
 2. మీరు మరీ నిజాలు మాట్లాడేస్తున్నారు అంకుల్.హృదయభానుని అస్తమానూ మాట్లాడనీయకూడదు.అంకుల్ మనలో మన మాట మీ బ్లాగు బహు చక్కగా వుంది కొత్త పెళ్ళికొడుకులా.

  రిప్లయితొలగించండి
 3. అందుకనే నేను భాగ్యనగరంలో ఉన్న రెండేళూ డ్రైవింగ్ అనే మాట తలపెట్టక, బుద్ధిగా బస్సుల్లోనూ, షేర్ ఆటోల్లోనూ తిరిగాను. (హై. రోడ్లమీద నడవడం కుదరని పని). ఐనా, ఇలా అంకుళ్ళు కూడా కొత్తపెళ్ళికొడుకులవుతుంటే ఎలాగబ్బా? "-)
  చదువరి గారూ, టపా అదిరింది. మళ్ళీ ఇటువైపు (డెట్రాయిట్ పరిసరాలకి) వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?

  రిప్లయితొలగించండి
 4. మీ టపా చదువుతున్నంతసేపూ హైదరాబాద్ ట్రాఫిక్ కళ్లముందు కదలాడింది అంటే నమ్మండి. నాక్కూడా ఇక్కడికి అమెరికా వచ్చిన కొత్తల్లో మనకు కొట్టుకులాడిపోయేది వీళ్ల ట్రాఫిక్ సెన్స్ చూసి ..వీళ్లింతే ఇంక బాగుపడరు అని మెల్ల మెల్లగా అలవాటు పడిపోయాను.

  రిప్లయితొలగించండి
 5. నేను on-site వెళ్ళినప్పుడు, మా హోటల్ ముందు రోడ్ దాటుతూ, కార్ ఏదో వస్తోందని ఆగాను. అతను నన్ను చూసి ఆగాడు. ఎందుకా అని చూస్తే నన్ను ముందు రోడ్ దాటమని సైగ చేసాడు. నాకు ముందు అర్థం కాలేదు. రోడ్ దాటి వచ్చేసాను. తర్వాత మా టీం-లీడ్ (ఆయన తమిళాయన)చెప్పారు, అక్కడ నడిచేవాళ్ళకి దారి ఇస్తారని. నేను భళ్ళున నవ్వేసాను.

  రిప్లయితొలగించండి
 6. మీరు అనుభవిస్తున్న ట్రాఫిక్ బాధలకు ముందుగా నా సెల్ఫ్ పిటీలందుకోండి.. ఇదివరకు ఇతర చోదకుల విన్యాసాలకి సాలా గీలా లాంటి ఒత్తిడిని తగ్గించగల మంత్రాలు జపించేవాడిని. వాళ్ళ విన్యాసాలకి చిరిగే అరిటాకు నాదే కదా! నాకారుకి పడిన సొట్టలు, నాజేబుకి పడిన చిల్లులు 90% నేను పార్క్ చేసి ఉంచినప్పుడు పడినవే అని వింటే మీఅందరికీ నామీద సెల్ఫ్ పిటీ కలగచ్చు. ఒకసారి, మాఅబ్బాయి కారాట ఆడుకుంటూంటే చూసా. వాడికి కారు నడపడం అంటే గేరువేయడం, బ్రేకునొక్కడంతోపాటు మధ్య మధ్యలో సాలా అనాలి అని ఫిక్సయిపోయాడని అర్ధమై, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వెర్రి నవ్వు నవ్వడం అలవాటు చేసుకుంటున్నా.

  మీరు అమెరికాలో గమనించినట్లే, కొరియావాళ్ళకి కూడా ట్రాఫిక్ సెన్సు లేదని గ్రహించా. పైగా పాదచారులు నడవడానికి పేద్ద పేద్ద పేవ్మెంటులు వదిలేసి భూమాతని వ్యర్ధం చేస్తారు. ఎప్పటికి నేర్చుకుంటారో.. ప్చ్.

  రిప్లయితొలగించండి
 7. ఇరగదీసారు టపా :)
  ట్రాఫిక్ సెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు.

  ఇక్కడ ఇంకో విషయం వాహన చోదకులే కాక పాదచారులక్కూడా అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండకపోవడం. అడ్డంగా ఎక్కడంటె అక్కడ రోడ్డు దాటడం, రోడ్డు మధ్యలో పరిగెట్టడం, రూల్సేవీ (జీబ్రా క్రాస్ వగయిరా) వీరికి అసలు వర్తించవనీ వీరి నమ్మకం.

  ప్చ్... కొన్ని అంతే.

  రిప్లయితొలగించండి
 8. చదువరి గారూ, చాలా బాగుంది మీ టపా. విసుగు, అలసట 90% మానసికం అన్న విషయంతో నేనూ ఏకీభవిస్తాను. స్కూటర్లను, సైకిళ్ళను, బండరాళ్ళ మధ్య నీటితో బాగా పోల్చారు. ఇక్కడ అమెరికాలో ఉన్న నా స్నెహితుడు ఒకడు కూడా, సిగ్నల్ దగ్గిర ఆగినపుడు, ముందు బండికి, తన బండికి మధ్య రెండు మూడు కార్ల దూరం ఉంచుతాడు. పక్కన కూచున్న నాకు భలే అసహనంగా అనిపిస్తుంది. ఇక మీరన్నట్టు, స్కూటరో, బైకో ఉంటే ట్రాఫిక్ బాధ తప్పించుకోవచ్చుగానీ, ఇంటికి చేరే సరికి ఫాంటూ, షర్టూ, పొగ చూరి మసి బారిపోతాయి. బెంగుళూరులో పనిచేసిన రోజుల్లో నా అనుభవాన్ని బట్టి చెపుతున్నా.

  రిప్లయితొలగించండి
 9. చదువరి గారు,

  కొత్త ముస్తాబు బాగుంది.టపా అదిరింది.
  -నేనుసైతం

  రిప్లయితొలగించండి
 10. మన హై.లో జనాల ట్రాఫిక్ సెన్సుకీ, ఇక్కడి (బుడాపెస్టు) వాళ్ళ ట్రాఫిక్ సెన్సుకీ వుండే హస్తిమశకాంతర తేడా చూసి సరిగ్గా పదైదు(పదిహేను) నిమిషాల క్రితం మా సహోద్యోగితో మాట్లాడా. మనసులో అనిపించింది దీనిమీద ఓ బ్లాగు బ్లాగొచ్చు అని, కానీ ఇంతలో మీ బ్లాగు.

  'ఎహె, ఇంత ఖాళీ ఉంచాడేంటి.. ఎవడన్నా వచ్చి దూరితేనో' అని కొట్టుకులాడి పోయేవాణ్ణి... బాగా నచ్చింది.

  రిప్లయితొలగించండి
 11. హబ్బా చదువరి గారు ఇరగదీశారండి బాబు! హైదరాబాద్ అటుంచితే... మాకు దుబయ్ లొ మూరెడు, బారెడు కాదండి బాబు బెత్తడు కూడా ఉంచరు. ఎంత నీ ముద్దు నాకొద్దన్నా హై. సిటి బస్ లొ మగ పీనుగులు అమ్మాయిలను రాసుకొన్నట్టె రాసుకుపోతారు. మీరు డెట్రాయిట్ కాదు కాని దుబయ్ రండి పులకరించిపోతారు (ఇక్కడి ట్రాఫిక్ గంటలు కాదండి రోజులుంటాయ్, మీరు మరిన్ని టపాలు మాకు అందించొచ్చు) ట్రాఫిక్ జాం లొ డ్రైవ్ చేసి.

  రిప్లయితొలగించండి
 12. ఎపుడో వెళ్ళి ఒక వారం ఉండేదానికి హై.లో బండి నడపటం ఈత కొట్టడానికి బంజీ దూకుడు దూకినట్టే.. గురువు గారు కో.పా గారి మార్గమే మన మార్గమూనూ..
  హైదరాబాదు డ్రైవింగు సాహసీకుల స్వప్నం.. మనం దీన్ని కూడా ప్రోమోట్ చెయ్యచ్చేమో!! అప్పుడు రియో నగరంలోని మోటోబాయ్స్ సంస్కృతిని మించిపోవటం ఖాయం..

  రిప్లయితొలగించండి
 13. మొన్నామధ్య.. నేను మా ఫ్రండ్ అనుకొన్నాము.. ఈ భాగ్యనగరం లో బస్స్ లో వెళ్ళేకన్నా... కార్లో వెళ్ళడం చాల సులువని మరి మీరేమో.. కార్లో కష్టం అంటున్నారు... సికంద్రాబాద్ నుండి బస్లో 3 గంటలకి బయల్దేరితే... మా ఇంటికి చేరుకోడానికి 3 గంటలు పట్టింది.. మాకు.. అంటే 6 గంటలకి ఇంటికి వెళ్ళాము..(ట్రఫిక్ సమస్య లేకపొతే మా ప్రయాణం అరగంట మాత్రమే) కారు అయితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని బయల్దేరితె ఇంటికెళ్ళి పడుకొవడమేగా అనుకొన్నాము.. కార్లవాళ్ళకి కూడా ఇన్ని కష్టాలున్నయి అని ఇప్పుడే తెలిసింది... కార్లు ... బస్సులు కన్నా.. కాళ్ళకి బుద్ది చెప్పడం.. నయమేమో..

  రిప్లయితొలగించండి
 14. వ్యాఖ్యాతలందరికీ నెనర్లు. ఈ మాటను వెలికితీసినందుకు బాల సుబ్రహ్మణ్యం గారికి మరోసారి నెనర్లు. :)

  రాధిక గారూ, :)

  కొత్తపాళీ గారు, ప్రస్తుతం అటుకేసి వచ్చే ఆలోచన లేదండి. వస్తే, తప్పక కలవగలను.

  RSG గారూ, నాకూ ఆ అనుభవమైంది.. 'చిత్రమైన మనుషులు వీళ్ళు' అని అనుకున్నాను.

  సత్యసాయి గారూ, నేనిలా సాలా గీలా అననండి.. అచ్చతెలుగే! పక్కన పిల్లకాయలున్నపుడు మీలాగానే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాలెండి:)

  శివకుమార్ గారూ, హైదరాబాదుకు సమ ఉజ్జీ ఒకటి ఉందన్నమాట!

  రమ గారూ, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదనీ.. హై.లో బయటికెళ్ళనంత సుఖం మరోటి లేదు. ఖర్మకాలి వెళ్ళాల్సే వస్తే, బస్సే కాస్త నయం. అయితే దేని ఇబ్బందులు దానికేడ్చాయి లెండి.

  రిప్లయితొలగించండి
 15. చదువరి గారు, బ్లాగు అదిరింది.. నేను బెంగళూరులో ఉంటానండీ.. ఇక్కడి ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అరగంట ప్రయాణానికి గంటలకు గంటలు పట్టటం మామూలు విషయమే ఇక్కడ. నేను మొన్ననే ఒక చిన్న స్కూటర్ కొన్నా.. ఇప్పుడు కొంచెం నయం.. :)

  రిప్లయితొలగించండి
 16. నా మట్టుకు నేను, హై.ట్రాఫిక్కులో బండి నడపడం ఓ పెద్ద శిక్ష అనుకుంటుంటాను. మీ టపా చదువుతున్నంత సేపూ ఒక వైపు మన ట్రాఫిక్కు గురించిన చిరాకు, కోపం ఒకవైపు... గిలిగింతలు పేట్టే మీ వర్ణన ఒకవైపు :-)

  అన్నట్టు నేను చాలా రోజుల క్రితం రాసుకున్న టప మళ్ళీ చదుకునేట్టు చేసింది మీ టపా.

  రిప్లయితొలగించండి
 17. Chaduvari garu,
  Chaala baaga varninchaaru hy. traffic ni. Meeru cheppinattu ikkada US lo anta khaali vadileste karu ki karu madhya gunde kottukunedi. Asalu vachina kottallo.. auto horns leka nidra pattedi kadandi US lo....

  రిప్లయితొలగించండి
 18. Hi chaduvari....

  gii hydlo trafic samputundi....
  post chala bagundi....
  naku oka help cheyara... meru previous ga use chesina template xml file pamputa.. (naku 3 columns template kavali... ) nenu edit cheyadaniki try chesa kani.. sariga ravadam ledu...
  thanks,
  vijju...

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. Hi Vijju,

  If Chaduvari garu already sent the template, sorry for the duplication otherwise here is the location Three Column Templates from where you can get a three column template. Also if you like the template on my site (which is also there on the above link), http://teluguvadini.blogspot.com, please send me an email at teluguvadini@gmail.com then I can send you my working one.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు