21, సెప్టెంబర్ 2007, శుక్రవారం

'కుడీ' 'ఎడమా', మధ్యలో కాంగ్రెసు, నెత్తి మీద కరుణానిధి

మధ్యంతరం వచ్చేటట్టే కనబడుతోంది. కాంగ్రెసుకు తల వాచేటట్టూ కనబడుతోంది. ఒకేపు వామపక్షాలతోనూ, మరో పక్క బీజేపీతోటి ఎడాపెడా వాయింపుకు గురై కుదేలైపోయింది. అయితే పాపం వీళ్ళకంటే కూడా పెద్ద ప్రమాదం తమవాడు, మిత్రుడూ అయిన కరుణానిధి నుండి వస్తున్నది. కాంగ్రెసోళ్ళు సాక్షాత్తూ రాముడి ఉనికినే ప్రశ్నించి, కన్ను లొట్టోయిన దశలో తీరిగ్గా నాలుక్కరుచుకుని, ఆకులు పట్టుకుని 'ఉఫ్ ఉఫ్' అనుకుంటూ ఉన్నారు, ప్రస్తుతం. గోరుచుట్టు మీద రోకటి పోటు లాగా, మూలిగే నక్కమీద తాటి పండు లాగా కరుణానిధి తయారయ్యాడు వీళ్ళకి. అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు. కరుణానిధి వాగుడు దేశమంతా వినబడుతోంది మరి!

ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల జంట కామెడీ ఒకటుంది. కోట, తుపాకీ ఒకటి పట్టుకుని తిరుగుతూంటాడు. ధర్మవరపు ఆయనకు ఆషాఢభూతి లాంటి అనుచరుడు లాంటి సహచరుడు. "మేజరు గారంటే ఏంటనుకున్నావ్? చవటనుకున్నావా? వెధవనుకున్నావా? చేతకాని దద్దమ్మనుకున్నావా?" అంటూ ఇలా ఉన్నవీ లేనివీ కల్పించి ఎదటివాడు ఏమీ అనకపోయినా అన్నీ తానే తిడుతూ ఎదటి వాళ్ళతో పోట్లాడుతూ ఉంటాడు. అంతా అభిమానం కొద్దీ అంటున్నట్టే ఉంటుంది గానీ ఆ మాటల్లో అంతా అవమానమే! కోటకు ఇతగాణ్ణి ఎలా వదిలించుకోవాలో తెలీదు.

ఖచ్చితంగా అలాగే కాకపోయినా సోనియా కరుణలకు, పై కామెడీకీ కొంత పోలిక ఉంది. సోనియా ఏదైతే ఒద్దనుకుంటోందో కరుణ అదే చేస్తున్నాడు. అతడిని అలా మాట్టాడొద్దని చెప్పలేదు, అలాగని ఊరుకోనూ లేదు. ప్రస్తుతం సోనియా, కరుణానిధిల వ్యవహారం చూస్తంటే నాకు కోట, ధర్మవరపే గుర్తుకొస్తున్నారు. పాపం సోనియా! కరుణానిధిని వదిలించుకోగలదో లేదో!!


మరో దృక్కోణం

ఈ వ్యవహారాన్ని మరో కోణం నుండి చూస్తే.. గుడ్డిలో మెల్ల లాగా కరుణానిధి వాచాలత వలన కాంగ్రెసుకు కొద్దో గొప్పో ఉపయోగమూ లేకపోలేదు. ఆయన నోటి దురుసు కారణంగా బీజేపీకి ఆయుధాలు దొరికి కాస్త పుంజుకొనే అవకాశం ఉంది. వామపక్షాల వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా సహిస్తారేమో గానీ, బీజేపీ బలపడితే తట్టుకోలేరు. వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉన్న తరుణంలో మధ్యంతరం జరిగితే బీజేపీకి సీట్లెక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వామపక్షాలు అందుకు తెగబడక పోవచ్చు. అందుకోసం అణు ఒప్పందంపై తమ అభ్యంతరాలను పక్కన బెడతారు. (వాళ్ళు దేన్నైనా పక్కన బెట్టగలరు!) ఈ రకంగా కరుణానిధి దుందుడుకు ధోరణి కాంగ్రెసుకు ఉపయోగపడుతుంది.

5 కామెంట్‌లు:

 1. మీ రెండవ దృక్కోణము బాగుంది, అన్నట్టూ మధ్యంతరము వస్తుందని నేననుకోను, ఇంకో సంవత్సరము దండుకోవడము ఏ దొంగ మాత్రం వదులుకుంటాడు చెప్పండి? నన్నడిగితే ఈ ఒక్క కారణముగానే ఇంతకాలమూ మనకు ఎన్నికలు రాలేదు.

  రిప్లయితొలగించండి
 2. కోతుల కీచులాట ఎప్పుడూ ఉండేదే. ఏదేమైనా అణు ఒప్పందం గట్టెక్కుతే దేశానికి కొంచెమైన మంచి చేసినట్టవుతుంది.

  రిప్లయితొలగించండి
 3. మధ్యంతరం రాకూడదనే కోరుకుందాము. వస్తే వచ్చే లాభాల కంటే నష్టాలే నాకెక్కువ కనబడుతున్నాయి. అవును వేరే ఇంకెవరయినా వచ్చే వారి కంటే మన కాంగ్రెసు ప్రభుత్వం కొద్దిగా ఎక్కువ తింటుంది. కానీ మధ్యంతరం వస్తే అనేక వేల కోట్లు మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి ఏదీ సాధించకుండానే.

  అలాగే నా అభిప్రాయమయితే సొంతంగా గెలిచే సత్తా ఇంకా ఎవరూ సాధించలేదు. మళ్ళీ మళ్ళీ హంగ్ ప్రభుత్వాలే. ఇలాంటి పరిస్థితులలో ఎవరొచ్చినా మార్పొస్తుందని అనుకోను.

  రిప్లయితొలగించండి
 4. అన్నట్టు చదువరి గారు, మీరు మీ వికీ లంకె మార్చాలి, సరిగా లేదు.

  రిప్లయితొలగించండి
 5. చదువరి మీ గురులఘువుల లే అవుటే బాగుంది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు