17, సెప్టెంబర్ 2007, సోమవారం

రామ సేతువు - ఎన్డీటీవి చర్చ

రాముడు ఉన్నాడా, లేడా అనే విషయంపై కాంగ్రెసు ప్రభుత్వం ఛప్పన్నారు తప్పులు చేసి దిద్దుకొంటూండగా జరిగిన అనేకానేక చర్చల్లో ఎన్డీటీవీ వారి ఆదివారం నాటి చర్చ ఒకటి నేను చూసాను. బర్ఖా దత్ వియ్ ది పీపుల్ అనే ఈ చర్చా కార్యక్రమాన్ని చక్కగా మంచి సమయస్ఫూర్తితో చేస్తుంది. నిన్నటి రాత్రి జరిగిన చర్చలో కొన్ని విశేషాలు...

నేను టీవీ పెట్టేటప్పటికీ ఆ ప్రొఫెసరుగారు చెబుతున్నాడు.. "రాముడికీ, బ్రిడ్జికీ సంబంధం లేదు. రాజకీయాలకూ మతానికీ సంబంధం లేదు. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వపు తప్పు."

ఈలోగా ఆర్య ద్రావిడ తగువు చర్చకి వచ్చింది. 'రావణుడు బ్త్రాహ్మణుడు, రాముడు, వాల్మీకి బ్రాహ్మణులు కాదు అనే విషయం కరుణానిధికి తెలీదు. ఆయనకు చరిత్ర తెలీదు, కానీ మాట్లాడతాడు' అని సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు. దీనిపై ఆయనా, రాజా కాసేపు పోట్టాడుకున్నారు. ఇహ చూడక్కరలేదనుకుంటా అని అనుకుంటూ ఉన్నాను.. ఈలోగా బర్ఖా దత్ వాళ్ళకు అడ్డం పడిపోయి పోట్లాటను ఆపేసింది.

రాజకీయులు వాళ్ళ మార్కు రిమార్కులు, వాదనలూ చేసారు. వాళ్ళ వాదన చూసి ఆశాభంగం చెందేటంత ఆశలు నాకేమీ లేవు వాళ్ళమీద. కానీ ప్రొఫెసరు మాట్లాడిన విధానం చూసి మాత్రం కష్టమేసింది..

ఆయన "రామ సేతువు" కారణంగా ప్రాజెక్టు ఆగిపోవడానికి బద్ధ వ్యతిరేకి. అసలు రామసేతువును రామ సేతువు అని అనడానికి కూడా ఆయన ఇచ్చగించలేదు. పని గట్టుకుని యాడమ్స్ బ్రిడ్జి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, కష్టమూ వేసింది. రాముడు కట్టాడో లేదో పక్కన బెట్టండి. ఈ జాతి సహస్రాబ్దుల కిందటి నుండీ నమ్ముతూ వచ్చిన విషయం కదా అది; దాన్ని పక్కన బెట్టి ఈ కొత్త పేరు - "యాడమ్స్ బ్రిడ్జి" అని అనడమేంటి? అది ఎక్కడినుండి వచ్చిందో వెతకబోతే ఇదట దాని కథ. ఏఁవన్నా అర్థముందండీ? చారిత్రకుడు దేన్ని నమ్ముతున్నాడో చూసారా? నాకది చిన్న విషయంగా అనిపించలేదు. మనోడు చెబితే మౌఢ్యం, పైవోడి పైత్యం పరమౌషధమా వీళ్ళకి !? ఏంటో మన వాళ్ళు..

----------------------------

అక్కడితో ఈ జాబు ఉద్దేశ్యం నెరవేరింది. ఇక రామాయణంలో పిడకలవేట..

పై కార్యక్రమ నిర్వాహకురాలికి కొన్ని అభిప్రాయాలున్నాయి (ఉండొచ్చు, తప్పులేదు). ఆమె వాటినే చర్చాఫలితంగా చూపించదలచినట్టు అనిపించింది. దాని కోసం అవిరళ కృషి జరిపినట్టు కూడా అనిపించింది. ఈవిడ గారికి ఓ అలవాటుంది. ప్రశ్న అడుగుతుంది, చెప్పేవాడికి పూర్తిగా చెప్పే చాన్సివ్వదు. వాళ్ళు చెప్పేది తనకనుకూలంగా ఉంటే సరే, లేదో.. మాటమాటకీ అడ్డం పడిపోతుంటుంది.

ఇదివరలో ఆమె సహోద్యోగి -రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇప్పడు CNN IBN కి కర్త, కర్మ, క్రియ- కూడ ఇలాంటి వాడే. (వీళ్ళిద్దరికీ కామనుగా రెండు ఊతపదాలున్నాయి. అవి: "ఓకే, యు మేడ్ యువర్ పాయింట్", "ఓకే, ఫెయిరినఫ్". ఈ మాటలను వాళ్ళు వాడేటపుడు గమనించండి.. ఆ రెండింటికీ అర్థం ఒకటే స్ఫురిస్తుంది.. "ఇప్పటికే ఎక్కువగా వాగావు, ఇక మూసుకో" అని. అంత ఫోర్సుగా వాడతారు ఆ మాటలను!) . ఇకపోతే కరణ్ థాపర్.. ప్రశ్న అడుగుతాడు, కానీ జవాబు చెప్పే అవకాశమే ఇవ్వడు - పోలీసు, ఖైదీ సంభాషణ లాగా ఉంటుంది ఇంటర్వ్యూ.

వీళ్ళందరితో పోలిస్తే, మన టీవీ 9 రవిప్రకాష్ చాలా మెరుగు. ఇదివరలో జెమినీలో ఉండగా వారం వారం ఒకరిని ఇంటర్వ్యూ చేసేవాడు. వాళ్ళని చక్కగా మాట్టాడనిచ్చేవాడు. అడ్డం పడిపోయేవాడు కాదు.

--ఇవ్వాళ్టికింతే!

9 కామెంట్‌లు:

 1. నాకు అదే అర్ధం అవదు.. నాసా వాళ్ళు అంటే, వాళ్ళకి మొదటి మానవుడు ఆడం కాబట్టి వాళ్ళు అలా అనడంలో అర్ధం ఉంది.. కానీ మనకి అలా అనాల్సిన అవసరం ఏంటి..

  రిప్లయితొలగించండి
 2. నిజమే.... వార్తలకి, సంపాదకీయాకినికి తేడా తెలియని వారు మీడియాని నడుపుతున్నారు. ఇన్వెస్టిగేట్ జర్నలిజం పేరుతో ఇంటరాగేషన్‌లు ఛేయటం...చాలా అభ్యంతకరం.

  రిప్లయితొలగించండి
 3. నేను ఈ విషయం మీద ఎప్పుడో రాసిన టపా ఒకటుంది..."రామా సేతువు కట్టావా? " అని...

  చదవండి..

  http://sodhana.blogspot.com/2007/05/blog-post_9061.html

  రిప్లయితొలగించండి
 4. ఆ రెండు ఛానెళ్లు పక్కా ఎర్ర బాబులతో నిండిపోయాయి.
  ఆ సన్నాసి ప్రొఫెసర్ పేరు చెప్పండి.

  రిప్లయితొలగించండి
 5. @మేధ -భావదారిద్ర్యం, భావ దాస్యం... ఇంక వేరే కారణమేముంటుందో నాకు తోచడం లేదు!

  @రాజు సైకం -నిజమండి.

  @సుధాకర్ -చూసాను, బాగుంది.

  @లోగుట్టు -ఆయన చరిత్ర ప్రొఫెసరండి. ఢిల్లీలోనే పని చేస్తాడు, ఏ యూనివర్సిటీయో గుర్తు లేదు. (ఇలాంటి వాళ్ళు ఎక్కువగా జేఎన్యూలో ఉంటారు. ఈయనా అక్కడివాడేనేమో తెలీదు.) నేను టీవీ పెట్టేటప్పటికే పరిచయాలైపోయాయి. మధ్యలో పేరు చూపించినట్టున్నాడు గానీ గమనించలేదు.

  రిప్లయితొలగించండి
 6. చదువరి గారు,
  ఆ యూనివర్సిటీ కి డా||హనుమాన్ చౌదరి గారు పెట్టిన పేరు ఇక్కడ.

  http://www.drthchowdary.net/index.php?option=com_content&task=view&id=305&Itemid=57

  టీవీవాళ్లు కర్రావిరగనీరు , పామూ చావనీరు, పొరపాటున ఒక వ్యక్తి డామినేట్ చేస్తుంటే, పక్కదోవ పట్టించేసి, మూడు బేక్రులు తీసుకొని, ఒక అరగంట కాలహరణం జేసి చేతులు దులుపుకుంటారు. నిమిషానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టే పార్లమెంట్ లో మాట్లాడకుండా, పని జరగకుండా వాకౌట్లు చేసి రాజకీయ నాయకులు ఈ స్టూడియోల చుట్టూ ఎందుకు తిరుగుతారో నాకు అర్ధం కాదు.
  -

  రిప్లయితొలగించండి
 7. ఈ మధ్య కరణ్ థాపర్ సీతారాం ఏచూరిని చేసిన ఇంటర్వ్యూ అలాగే తగలడింది. ప్రతి ప్రశ్నకు ఆయనే multiple choice ఇచ్చి ఇందులోంచి మాత్రమే సమాధానం చెప్పాలి అంటాడు. అవతలి వాదనని విననే వినడు. పైగా కెమరా ఎప్పుడూ అవతలి వ్యక్తి భావావేషం మీదే వుంటుంది.
  అయితే అందరూ ఇదే వరస పాటిస్తున్నారన్నమాట!

  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 8. ఈ విషయం మీద పై లంకె చూడండి. మామూలుగా ఐతే కేంద్రం దిగొచ్చేది కాదేమో. కానీ బిజేపీ కేమైనా ఒరిగిపోతుందేమోనని భయం కొద్దీ దిగొచ్చారు. మన సెక్యులరిజం ఓట్ల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు