1, అక్టోబర్ 2007, సోమవారం

ప్రజల సొమ్ము, సబ్సిడీల పాలు

కిలో బియ్యం రెండు రూపాయలకే!
ఉచితంగా మూడు సెంట్ల భూమి!
ఉచిత కరెంటు
ఉచిత అది
ఉచిత ఇది
...

బహిరంగంగా చేస్తున్న ఓట్ల వేలం ఇది. వీళ్ళ సొమ్మేం బోయింది, వీళ్ళు మింగేసిన దాంటోంచి ఇవ్వడం లేదుగదా! మన జేబుల్లోంచి తీసేసుకున్నదే ఇస్తున్నారు. ప్రజల డబ్బులతోటి ప్రజల వోట్లను కొనాలను చూస్తున్నారు. కిలో బియ్యం మార్కెట్లో పాతిక రూపాయల దాకా ఉంది. మార్కెట్టు రేటుకు బియ్యాన్ని కొనుక్కొనే తాహతును ప్రజలకు సంపాదించి పెట్టాల్సింది పోయి, దాదాపు 20 రూపాయల సబ్సిడీ ఇస్తారట. సరే ప్రస్తుతానికి ఇచ్చారుపో.. ఎన్నాళ్ళకు ప్రజలకా తాహతు సంపాదించి పెడతారు? ఆ మాట చెప్పిన పాపాన పోలేదొక్కడు కూడా. దాదాపు పాతికేళ్ళుగా బియ్యంపై సబ్సిడీ ఇస్తూనే ఉన్నారు, ప్రజలికింతవరకు ఆ తాహతు చేకూరలేదు. ఈ సబ్సిడీ పథకం ప్రజలను జోకొట్టేందుకు పనికొచ్చేదే గానీ, దీర్ఘకాలిక ప్రయోజనం శూన్యం. ఏ సబ్సిడీకయినా "ఇదిగో ఫలానా సంత్సరానికల్లా ప్రజలకు ఈ సబ్సిడీ అవసరం లేకుండా చేస్తాం" లాంటి లక్ష్యాలంటూ ఉండాలి. లేకపోతే రిజర్వేషన్ల లాగా పరిమిత ప్రయోజనకరమో నిష్ప్రయోజనమో ఐపోతాయి.

అయితే ఈ వాగ్దానశూరులకు కొన్ని ప్రశ్నలు..
 1. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు?
 2. మీ పరిపాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఏ స్థాయికి తీసుకెళ్తారు? తలసరి ఆదాయ లక్ష్యం ఏమిటి?
 3. రాబోయే ఐదేళ్ళలో ఏయే పన్నులను ఏ లెక్ఖన పెంచబోతున్నారు? ఏ స్థాయిని దాటి పెంచరో కూడా చెప్పండి.
 4. సబ్సిడీలు పొందని ప్రజల కొనుగోలుశక్తిని ఎలా రక్షిస్తారు? ఆ శక్తిని ఏ స్థాయికి పెంచుతారు? ఎలా పెంచుతారు?
 5. ఊరికినే ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తారు సరే. ఆ స్థలాలకు అర్హత లేని మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకునే మార్గమేంటి? దానిపై మీ ప్రతిపాదన ఏమిటి? ఇప్పటి భూధరల మంటల్లో మధ్యతరగతి ఇంటి ఆశలు ఆహుతై పోతున్నాయి. మరి వారికెలాంటి రక్షణనిస్తారు?
 6. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తారు సరే.. బయట బజారులో బియ్యం రేటును ఎంతవరకు నియంత్రిస్తారు?
 7. రైతుకు కనీస ధరను ఎలా ఇస్తారు? ఎంత ఇస్తారు? పైవాటికి దీనికీ సమతుల్యతను ఎలా సాధిస్తారు?

కలరు టీవీలిస్తారా అని అడిగితే 'చూద్దాం బ్రదరూ' అని నవ్వాడట మన ఘన ప్రతిపక్ష 'నాయుడు'. ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగలు బట్టలారేసుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావన్న వ్యక్తి, ఇప్పుడా తీగలను పట్టుకుని ఉయ్యాలలూగమంటాడా!?

10 కామెంట్‌లు:

 1. మీరు ఏది చరిత్ర చదివారని చదివి ఇది రాస్తున్నాను. శాస్త్రి, విజయభారతి లాంటి వాళ్ల పుస్తకాల్లోంచి విషయాల్ని సేకరించి ఒక బ్లాగ్ తయారు చేస్తున్నాను. మీ సలహాని చెప్పండి.
  http://theuntoldhistory.blogspot.com

  రిప్లయితొలగించండి
 2. బాగా చెప్పారు చదువరి గారూ..!! ఇంకా జాలిపడవలసిన విషయం ఏమిటంటే, ఈ మధ్యనే పుట్టిన లోక్‌సత్తా పార్టీ కూడా ఇదే విధమైన హామీలకు దిగడం. వీటిని జయ ప్రకాశ్ గారు ఎలా సమర్థించుకొంటారో..?

  రిప్లయితొలగించండి
 3. మంచి విషయం. ఆలోచించాల్సిన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలు వీళ్ళకి ఎన్ని సార్లు బుద్ధిచెప్పినా ఈ రాజల్=కీయులకి గుణపాఠం వంటబట్టటం లేదు - తోలు కొంచెం మందం కాదా?
  చదువరి గారూ మీ ఈ టపా చదివాక ఒక ఆలోచన వస్తోంది - అమెరికాలో బ్లాగర్లు దేశ ఎన్నికల్లో ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు కొన్నేళ్ళుగా. మన సభ్య్లు ఎలాగా ఈ-తెలుగు అంటూ కలుస్తూనే ఉన్నారు .. బ్లాగర్ల తరపున ఒక రాజకీయ సమావేశం (ఈ-సమావేశం) ఏర్పాటు చేస్తే ఎలా వుంటుంది? ఈ-సమావేశం జరిగినా జరక్క పోయినా, ఈ ఎన్నికలకి ప్రజలు ఆలోచించాల్సిన ప్రశ్నల్ని మీ వంటి వారు లేవనెత్తి ఆసక్తి ఉన్నవారందరూ ఉత్సాహంగా బ్లాగితే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 4. నిజమే!
  వాళ్ళదేం పోయింది. ప్రజల డబ్బు. వాళ్ళ సొంత డబ్బేమైనా పెడుతున్నారా. ఒక వేళ ఇలాంటి పథకాలు మొదలుపెట్టినా ఎన్నికలు గెలవడం వరకే ఆ తర్వాత ఎన్ని కొనసాగుతాయి అనేది ప్రశ్న.

  కొత్తపాళీ గారన్నట్టు బ్లాగర్లు కొద్దో గొప్పో చైతన్యం తేగలరేమో! ప్రయత్నిద్దాం.

  రిప్లయితొలగించండి
 5. వ్యాఖ్యాతలందరికీ నెనర్లు. కొత్తపాళీ గారూ, ఈ-సమావేశం ఆలోచన బాగుంది. వచ్చే ఎన్నికల నాటికి మనం ప్రయత్నిద్దాం.
  రాజారావు గరూ, లోక్‌సత్తా కూడా సబ్సిడీలను ప్రకటించడం -హేతువు చూపించినప్పటికీ - నాకూ నిరాశ కలిగించింది.
  శ్రీధర్, చూసానండి. నెనర్లు
  రవీ, మీరు http://groups.google.com/group/telugublog
  గుంపుకు వెళితే అన్నీ తెలుస్తాయి.

  రిప్లయితొలగించండి
 6. చాలా మంచి విషయాలు ప్రస్తావించారు. వీళ్ళ సొంత ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. ప్రజలసొమ్మే కదా, ప్రజలే పోతారు. పైగా మేము కాబట్టి చేస్తున్నాము అని సొంత డబ్బా ఒకటి. వీరంతా రజకీయ దొంగలే... ప్రజలే జాగ్రత్తగా వుండాలి మరి.

  రిప్లయితొలగించండి
 7. మనం తప్పు పట్టాలసింది రాజకీయనాయుకలని కాదు..! అసలు ఈ రాజకీయనాయుకులు ఎక్కడి నుండి వచ్చారు..? ఆకాశం నుండి ఊడిపడలేదు కదా..? అంటే ఈ సంఘం నుండె వచ్చారు, అంటే ప్రజల్లోనుండి ఒకో రాజకీయనాయుకుడు పుడుతున్నాడు, మరి వారి ఆలోచనలు కూడ ప్రజలనుండే వచ్చినవి..సొ..ఈ రాజకీయనాయులంతా ప్రజల ప్రతిబింబాలే, ముందు ప్రజల మనష్తత్వాల్లో మార్పు రావాలి, ప్రతి మనిషికి తన వ్యక్తిగత ప్రయోజనం గురించే ఆలొచిస్తూ ఉన్నాడు, అతనికి తన చుట్టూ ఉన్న సమాజం గురించి కాని లేక తను చేసె ప్రతి చర్య తన చుట్టూ ఉన్న సంఘం మీద ప్రభావం చూపుతుంది అన్న స్పృహ లేనే లేదు..! సొ ఇదే ఈ రాజకీయనాయుకలకి ఒక అవకాశంగా ఉపయేగపడుతున్నది అంతె. ఇక్కడె గెలుపే ప్రదాన అంశం ఎవరికి పట్టింది జాతి బాగోగోలు ఏ ప్రజకి పట్టింది..?ఎవరేమి ఇస్తె వారికే ఓటు వేసె ప్రజలున్నప్పుడూ ఈ రాజకీయ నాయుకులు కూడ అలాగె వారికి తగ్గట్టే ప్రవర్తిస్తారు.

  రిప్లయితొలగించండి
 8. క్రొత్తగా రాజకీయాలను చూసేవారికి ఈ పద్దతులు వింతగానే వుంటాయి.బాగా ష్టడీ చెయ్యండి

  రిప్లయితొలగించండి
 9. అజిత్ కుమార్: తప్పకుండానండి. మీరన్నట్టే బాగా స్టడీ చేస్తాను.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు